Jump to content

రాడ్‌క్లిఫ్ అవార్డ్

వికీపీడియా నుండి

రాడ్‌క్లిఫ్‌ రేఖను 1947 ఆగస్టు 17న భారత దేశ విభజన అనంతరం భారత పాకిస్తాన్‌ల నడుమ సరిహద్దు రేఖగా ఏర్పరచారు. సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ నేతృత్వంలోని సరిహద్దుల కమిషన్‌ ఈ రేఖను నిర్ధారించింది. 8.8 కోట్ల మంది జనాభా ఉన్న 75000 చ.కి.మీ. భూ భాగాన్ని రెండు దేశాల మధ్య సమానంగా పంచే బాధ్యతను కమిషన్‌ తీసుకుంది.[1]

భారత విభజన

నేపథ్యం

[మార్చు]

భారత్‌లో బ్రిటిష్‌ రాజ్యం మరో నెల రోజుల్లో, అంటే 1947 ఆగస్టు 15న ముగుస్తుందని భారత స్వాతంత్ర్య చట్టం, 1947 ద్వారా బ్రిటిష్‌ పార్లమెంటు 1947 జూలై 15న పేర్కొంది. భారత దేశాన్ని రెండు భాగాలుగా విభజించాలని కూడా అది వివరించింది: ఇండియన్‌ యూనియన్‌, బ్రిటిషిండియాలోని ముస్లింలకు స్వస్థలంగా డొమీనియన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌.

పాకిస్తాన్‌ ముస్లింల రాజ్యంగా కొనసాగాలని, అదే సమయంలో భారత్‌ హిందూ మెజారిటీతో కూడిన లౌకిక రాజ్యంగా ఉండాలని ఉద్దేశించారు. ఉత్తరాదిన ఉన్న ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు పాకిస్తాన్‌గా రూపుదిద్దుకోవాల్సి ఉంది. బలూచిస్థాన్‌ (విభజనకు ముందు 91.8 శాతం ముస్లిం జనాభా), సింధ్‌ (72.7 శాతం ముస్లిం జనాభా) ప్రావిన్సులను పూర్తిగా పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే, ఈశాన్య బెంగాల్‌ (54.4 శాతం ముస్లింలు), వాయవ్యాన పంజాబ్‌ (55.7 శాతం) ప్రావిన్సుల్లో పూర్తిగా ముస్లిం మెజారిటీ లేకపోయింది.[2] దాంతో పంజాబ్‌ పశ్చిమ భాగం పశ్చిమ పంజాబ్‌గా మారింది. తూర్పు ప్రాంతం పంజాబ్‌ రాష్ట్రం పేరుతో భారత్‌లో అంతర్భాగమైంది. బెంగాల్‌ కూడా అదే మాదిరిగా తూర్పు బెంగాల్‌గా పాకిస్తాన్‌లో, పశ్చిమ బెంగాల్‌గా భారత్‌లో విలీనమైంది. స్వాతంత్ర్యానంతరం నార్త్‌వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్స్‌ (ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ. దీని సరిహద్దులు డ్యూరాండ్‌ రేఖను ఆనుకుని అంతకు ముందు వరకూ అఫ్గానిస్థాన్‌లో ఉండేవి) కూడా పాకిస్తాన్‌తో కలుస్తానంటూ ప్రజాభిప్రాయ సేకరణలో పేర్కొంది.[3]

ఇక పంజాబ్‌లో జనాభా విస్తృతి సంక్లిష్టంగా ఉంది. దాంతో దాన్ని హిందూ, ముస్లిం, సిక్కుల ప్రాంతాలుగా స్పష్టంగా విభజించలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా మహ్మదాలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూ, పటేల్ సారథ్యంలోని భారత జాతీయ కాంగ్రెస్‌, బ్రిటిష్‌ వారందరినీ సంతృప్తి పరిచే విభజన ప్రణాళిక కూడా ఏదీ లేకపోయింది. పైగా, ఎలాంటి విభజనను చేపట్టజూసినా అది రైలు, రోడ్డు, సమాచార సదుపాయాలు, సాగునీటి పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు వ్యక్తిగత భూములను కూడా నిలువుగా చీల్చేలా కన్పించింది.[4] అయితే, సమర్థంగా గీసే విభజన రేఖ ద్వారా రైతులను తమ సొంత వ్యవసాయ క్షేత్రాలతో విడదీయడం వంటివాటిని అతి పరిమితం చేయడంతో పాటు పునరావాసం కల్పించాల్సిన వారి సంఖ్యను కూడా కనీస స్థాయికి తగ్గించగల సావకాశం మాత్రం ఉండింది.

చివరికి సాకారమైన మేరకు, మొత్తం ఉపఖండంలో దాదాపు 1.4 కోట్ల మంది ప్రజలు సొంత ఇళ్లను వదులుకున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు, లారీలు, ఎడ్లబళ్లు, ఇంకా అత్యధికులు కాలి నడకన తమ సొంత వారితో కలిసి ఆవాసాన్ని వెదుక్కునేందుకు బయల్దేరారు.[5] వారిలో చాలామంది అవతలి పక్షం వారి చేతుల్లో హత్యకు గురయ్యారు. మరికొందరు ఆకలికి తాళలేక ప్రాణాలు విడిచారు. ఇంకా కొంతమంది కలరా విరేచనాల వంటి ప్రాణాంతక వ్యాధులకు బలయ్యారు. మొత్తంమీద శరణార్థులందరూ పౌష్ఠికాహార లోపంతో బాధపడ్డారు.[6] ఈ మొత్తం ప్రక్రియలో మరణించిన వారి సంఖ్య కనీసం 2 లక్షల (ఇది ఆ సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం పేర్కొన్న గణాంకాలు) నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా వేశారు. ఎలా చూసినా హీన పక్షం 10 లక్షల మంది అసువులు బాశారని అంతా అంగీకరించారు.[6]

ప్రక్రియ, కీలక వ్యక్తులు

[మార్చు]

భారత వైస్రాయిగా పనిచేసిన లార్డ్‌ వేవెల్‌, అంతకు ముందు 1947 ఫిబ్రవరిలో లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటెన్‌ అప్పటికే ఒక సరిహద్దు రేఖను సిద్ధం చేశారు. రెండు దేశాలకు ఏయే ప్రాంతాలను అప్పగించాలో ఇదమిత్థంగా నిర్ధారించేందుకు 1947 జూన్‌లో సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ను బెంగాల్‌, పంజాబ్‌ సరిహద్దు కమిషన్లు రెండింటికీ ఛైర్మన్‌గా బ్రిటన్‌ నియమించింది.

పంజాబ్‌లో ముస్లిం, ముస్లిమేతర మెజారిటీ ప్రాంతాలను వీలైనంత స్పష్టంగా విడదీస్తూ ఇరు ప్రాంతాల మధ్య సరిహద్దులను నిర్ధారించాల్సిందిగా కమిషన్‌కు సూచనలందాయి. అలా చేయడంలో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా నిర్దేశించారు.[7] ఆ ఇతర అంశాలను మాత్రం ఫలానా అని నిర్ధారించి చెప్పలేదు. తద్వారా ఈ విషయంలో రాడ్‌క్లిఫ్‌కు స్వేచ్ఛనిచ్చారు. కానీ సహజ సరిహద్దులు, సమాచార సౌకర్యాలు, నీటి వనరులు, సాగునీటి వ్యవస్థలు, సామాజిక-రాజకీయ పరిస్థితులు, అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా మాత్రం సూచించారు.[8] ప్రతి కమిషన్‌కూ నలుగురు ప్రతినిధులను కేటాయించారు. వారిలో ఇద్దరు భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి, మరో ఇద్దరు ముస్లిం లీగ్‌ నుంచి వచ్చారు. ఇరు వర్గాల ప్రయోజనాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన, అతి సున్నిత సంబంధాల దృష్ట్యా తుది నిర్ణయం మాత్రం విధిగా రాడ్‌క్లిఫే తీసుకోవాలని నిర్ణయమైంది.

జూలై 8న భారత్‌ వచ్చాక, రాడ్‌క్లిఫ్‌కు సరిహద్దు నిర్ణయానికి కేవలం 5 వారాలు మాత్రమే ఇచ్చారు. అతను వెంటనే తన కాలేజీ సహాధ్యాయి మౌంట్‌బాటెన్‌ను కలిశాడు. తర్వాత ఇద్దరూ లాహోర్‌, కలకత్తా వెళ్లి కమిషన్‌ సభ్యులను కలిశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి నెహ్రూను, ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు జిన్నాను కలుసుకున్నారు.[9] అంత తక్కువ కాలావధి ఇవ్వడాన్ని అతను అభ్యంతరపెట్టారు. కానీ ఆగస్టు 15న భారత్‌ నుంచి బ్రిటిష్‌ వారు వెళ్లిపోయే లోపే ఈ పని పూర్తవాలని ఇరు వర్గాలూ పట్టుబట్టాయి. దాంతో మరో అవకాశం లేకపోయింది. ఈ తక్కువ డెడ్‌లైన్‌ షరతు మీదే మౌంట్‌బాటెన్‌ భారత వైస్రాయి పదవిని అంగీకరించారు.[10] ఈ నిర్ణయాన్ని బ్రిటిష్‌ వారు వెళ్లిపోవడానికి కేవలం 2 రోజుల ముందే తీసుకున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల ఆగస్టు 17 దాకా, అంటే భారత్‌, పాకిస్తాన్‌లకు స్వాతంత్ర్యం ఇచ్చిన రెండు రోజుల దాకా దాన్ని బయట పెట్టలేదు.

ప్రక్రియలో సమస్యలు

[మార్చు]

సరిహద్దు నిర్ణయ ప్రక్రియలు

[మార్చు]

రాడ్‌క్లిఫ్‌, ఇతర కమిషనర్లంతా వృత్తిరీత్యా న్యాయవాదులు కావడంతో ఈ విషయంలో కావాల్సిన అనుభవమంతా వారికి ఉంది. కాకపోతే వారిలో ఎవరికీ ఇందుకు కావాల్సిన ప్రత్యేకమైన నైపుణ్యం మాత్రం లేదు. సరిహద్దుల నిర్ణయంలో అప్పటికే ఉన్న నియమ నిబంధనలు, లాంఛనాల గురించి తమకు సలహాలు, సూచనలు అందించేందుకు ఇతరత్రా సలహాదారులు కూడా వారికి అందుబాటులో లేరు. పైగా సర్వే, ప్రాంతీయ సమాచారాలు సేకరించేంత సమయం కూడా కమిషన్లకు అందుబాటులో లేదు. పైగా, నిపుణులను, ఐక్యరాజ్యసమితి వంటి సలహాదారులనూ వద్దనుకోవడం కూడా ఉద్దేశపూర్వకంగా, ఆలస్యాన్ని నివారించేందుకు తీసుకున్న నిర్ణయమే.[11] బ్రిటన్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ ప్రభుత్వం అప్పటికే యుద్ధ రుణాల్లో పీకల్లోతున కూరుకుపోయి ఉంది. దాంతో నానాటికీ అసిర్థపడుతున్న విశాల సామ్రాజ్యాన్ని ఒక్కతాటిపై నడిపే పరిస్థితుల్లో అది ఎంతమాత్రమూ లేదు.[12] పైగా, తన సొంత సామ్రాజ్యాన్ని పాలించేందుకు గానీ, అందులోని కొన్ని భాగాల నుంచి తన పాలనను చాలించుకునేందుకు గానీ బయటి శక్తుల సాయం తనకు ఏ మాత్రమూ అవసరం లేదని చూపించుకోవడం, దాంతోపాటు వీలనంత త్వరగా భారత్‌ను విడిచి వెళ్లిపోవడమనే బ్రిటిష్‌ ప్రభుత్వ తక్షణావసరాల కారణంగా ఐక్యరాజ్యసమితి వంటి బయటి సంస్థల నిపుణులకు సరిహద్దు నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం లేకపోయింది.[13]

రాజకీయ ప్రాతినిధ్యం

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌లకు దక్కిన సమాన రాజకీయ ప్రాతినిధ్యం వల్ల ప్రాంతీయ, సామాజిక సంతులనాన్ని సాధించామని పాలకులు భావించారు. కానీ, అది వారూహించని విధంగా ప్రతిష్టంభనకు దారితీసింది. పైగా వారి మధ్య సంబంధాలు అతి సున్నితంగా ఉన్నాయి. దాంతో వారు కనీసం పరస్పరం మాట్లాడుకోవడానికి కూడా సాహసించేవారు కాదు. పైగా అజెండాలు కూడా పూర్తి విరుద్ధంగా ఉండటంతో వారికి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా కన్పించేది కాదు. ఇంతకంటే ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, అంతకు కొద్ది వారాల క్రితమే లాహోర్‌లోని ఒక సిక్కు న్యాయమూర్తి భార్యాపిల్లలను రావల్పిండిలో ముస్లింలు అతి దారుణంగా హత్య చేశారు.[14]

నిజానికి సరిహద్దులకు ఇరువైపులా భారత్‌ వైపు ముస్లింలు, పాకిస్తాన్‌ భూభాగం వైపు హిందువుల సంఖ్యను వీలైనంత పరిమిత స్థాయికి కుదించడం మాత్రమే కమిషన్ల ముందున్న ఏకైక పెద్ద సమస్య కాదు. పంజాబ్‌ సరిహద్దు కమిషన్‌ సిక్కు సమాజానికి పుట్టిల్లు వంటి ప్రాంతానికి సరిగ్గా మధ్య నుంచి సరిహద్దును గీయాల్సి వచ్చింది.[15] ఈ సమాజానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనందుకు లార్డ్‌ ఇస్లీ ఎంతగానో బాధపడ్డారు. సిక్కులు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి సేవ చేసేందుకు భారత సైన్యానికి వేలాది సంఖ్యలో అద్భుతమైన సైనికులను అందించారు అన్నది అతను వాదన.[16] అయితే, తమ సమాజాన్ని ముస్లిం పాలిత దేశంలో కలిపే ఎలాంటి ప్రయత్నాలనైనా తీవ్రంగా ఎదుర్కొనేందుకు సిక్కులు కృతనిశ్చయంతో ఉన్నారు. పైగా, వారిలో చాలామంది తమను స్వతంత్ర దేశంగా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అందుకు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి మాత్రం లేదన్నది వాస్తవం.[17]

చివరగా, ఎలాంటి ప్రాతినిధ్యమూ లేని వర్గాలు కొన్నున్నాయి. కలకత్తాను ఎవరికి ఉంచాలన్నది బెంగాల్‌ సరిహద్దు కమిషన్‌ ప్రతినిధులకు ప్రధాన సమస్యగా మారింది. పైగా చిట్టగాంగ్ పర్వతాల్లోని బౌద్ధ తెగలకు అధికారిక ప్రాతినిధ్యమేదీ లేదు. దాంతో విభజన జరిగిన రెండు రోజుల తర్వాత దాకా వారికి తమ పరిస్థితిని గురించి సన్నద్ధం కావడానికి కావాల్సిన సమాచారం కూడా అందనే లేదు.[18]

పరిస్థితి అత్యంత తీవ్రతతో కూడినది, తక్షణం పరిష్కరించాల్సినదిగానూ గుర్తించిన రాడ్‌క్లిఫ్‌ అన్ని క్లిష్టమైన సమస్యలనూ స్వయంగా తనంత తానే చేతిలోకి తీసుకోవడం మొదలు పెట్టాడు. తొలుత ఇది చాలా అసాధ్యంగా తోచింది. కానీ రాడ్‌క్లిఫ్‌కు బహుశా తనపై తనకు ఎలాంటి అనుమానమూ లేనట్టు కన్పిస్తుంది. పరిస్థితులను మార్చాల్సిందిగా కోరుతూ అతను ఒక్కసారి కూడా ఎలాంటి అధికారిక ఫిర్యాదు గానీ, ప్రతిపాదన కానీ చేయలేదు.[1]

స్థానిక పరిజ్ఞానం

[మార్చు]

రాడ్‌క్లిఫ్‌ తన నియామకానికి ముందు భారత్‌ను ఒక్కసారి కూడా సందర్శించలేదు. కానీ ఈ పరిమితే ఇటు బ్రిటిష్‌ వారికి, అటు భారత్‌లోని ఇరు వర్గాల రాజకీయ నాయకులకూ ఒక పెద్ద సానుకూలతగా కన్పించడం విశేషం. బ్రిటిష్‌ వారి ప్రస్థానానికి తప్పించి భారత్‌లోని ఏ వర్గానికీ అతను పక్షపాత పూరితంగా వ్యవహరించబోరన్న నమ్మకం అందరికీ కుదిరింది.[1] అతను వ్యక్తిగత కార్యదర్శి క్రిస్టోఫర్‌ బీమంట్‌కు మాత్రమే పంజాబ్‌ జీవన విధానం, అక్కడి యంత్రాంగాన్ని గురించిన అవగాహన ఉంది. తన వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత ఉందని నిరూపించుకోవడానికి గాను కనీసం వైస్రాయ్‌ మైంట్‌బాటెన్‌ను కూడా కలవకుండా రాడ్‌క్లిఫ్‌ పూర్తి దూరం పాటించారు.[4]

అయితే, సంక్లిష్టతను, సమస్యను పూర్తిగా నివారించే తరహాలో సరిహద్దులను నిర్ణయించేందుకు ఆ ప్రాంతంపై ఎంతటి పరిజ్ఞానమున్నా సరిపోయేలా కన్పించలేదు. ఎందుకంటే అప్పటికే, వర్గపరమైన అల్లర్లు పంజాబ్‌, బెంగాల్‌ ప్రావిన్సుల్లో చెలరేగాయి. తద్వారా బ్రిటిష్‌వారు భారత్‌ నుంచి తక్షణం, అది కూడా గౌరవనీయమైన రీతిలో నిష్క్రమించే పరిస్థితులను మరింతగా సన్నగిల్లజేశాయి.[19] అయినా నిజానికి దక్షిణాసియాలో ఇలాంటి కల్లోల పరిస్థితులకు బీజాలు అంతకు ముందే పడ్డాయి. ఇక్కడ రెండు శతాబ్దాల పాటు సాగిన బ్రిటిష్‌ వారి పరోక్ష, ప్రత్యక్ష పాలనే అందుకు కారణంగా నిలిచింది. దేశ విభజన తాలూకు విషాదాలను ఏ శక్తీ నివారించలేకపోయిందని ఈ విషయంపై వచ్చిన అన్ని పుస్తకాలూ వివరించాయి.[20]

తొందరపాటు, నిర్లిప్తత

[మార్చు]

కమిషన్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే విభజనలో చాలా సమస్యలను నివారించేందుకు వీలుండేది. ఉదాహరణకు ఒకే గ్రామంలోని కొన్ని భాగాలను భారత్‌లో, మరిన్ని భాగాలను పాకిస్తాన్‌లో కలుపుతూ విభజన సాగింది. కానీ, రాడ్‌క్లిఫ్‌కు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇలా గ్రామాలను విభజించకుండా జాగ్రత్తలు తీసుకునే సావకాశం కూడా అతనుకు చిక్కలేదు. అతను నిర్ధారించిన సరిహద్దు కాస్తా సిక్కులు భారీ సంఖ్యలో ఉన్న ప్రాంతాల మధ్య నుంచి వెళ్లడానికి బదులుగా నేరుగా వాటి మీదుగా వెళ్లింది. పైగా, ఈ విభజన రేఖ ఒకే ఇంట్లో కొన్ని గదుల్ని భారత్‌కు, మరికొన్ని గదుల్ని పాకిస్తాన్‌కు కూడా కేటాయిస్తూ సాగిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి!

కానీ, ఈ యథాలాప విభజనను కూడా రాడ్‌క్లిఫ్‌ సమర్థించుకున్నారు. తానెన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ప్రజలు కష్టాలు పడటం మాత్రం ఎటూ తప్పదన్నది వాస్తవమన్నది అతను వాదన. కానీ ఈ ఆలోచన వెనక ఉన్న కారణమేమిటన్నది ఎప్పుడూ బయటికి తెలియలేదు. ఎందుకంటే, రాడ్‌క్లిఫ్‌ తాను భారత్‌ నుంచి వెళ్లే ముందు ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని పత్రాలనూ నాశనం చేసేశారు.[21] అతను స్వాతంత్ర్య దినం రోజునే భారత్‌ విడిచి వెళ్లిపోయారు. తాను నిర్ణయించిన సరిహద్దులను సాధికారికంగా ప్రకటించడానికి కూడా ముందే దేశాన్ని వదిలారు. అతనుే అంగీకరించినట్టుగా, భారత వాతావరణంలో ఇమడలేక, వీలైనంత త్వరగా దేశాన్ని వదిలేసే ఉద్దేశంతో రాడ్‌క్లిఫ్‌ ఈ పని చేశారు.[22]

పైగా సరిహద్దుల అమలు కూడా వాటిని నిర్ధారించినంత త్వరితంగానూ జరిగింది. 1947 ఆగస్టు 16న సాయంత్రం 5 గంటలకు భారత్‌, పాకిస్తాన్‌ ప్రతినిధులకు నిర్ణయ కాపీలను అధ్యయనం చేసేందుకు కేవలం 2 గంటల సమయం ఇచ్చారు. అనంతరం 17న రాడ్‌క్లిఫ్‌ అవార్డును ప్రచురించారు.[23]

గోపనీయత

[మార్చు]

వివాదాలు, ఆలస్యాలను నివారించేందుకు విభజనను రహస్యంగా జరిపారు. అంతిమ అవార్డులు ఆగస్టు 9, ఆగస్టు 12 తేదీల కల్లా సిద్ధమయ్యాయి. కానీ విభజన జరిగిన రెండు రోజుల తర్వాత గానీ వాటిని ప్రచురించలేదు. రీడ్‌ చెప్పిన ప్రకారం[24] పంజాబ్‌ అవార్డు వివరాలను నెహ్రూకు, పటేల్‌కు ముందుగానే గోప్యంగా ఆగస్టు 9, లేదా 10న వెల్లడించారని చెప్పేందుకు గట్టి రుజువులు కూడా కొన్ని ఉన్నాయి. అది మౌంట్‌బటెన్‌ ద్వారానో, లేదా రాడ్‌క్లిఫ్‌ భారత సహాయ కార్యదర్శి ద్వారానో జరిగిందంటారు. ఎలా జరిగిందన్నది పక్కన పెడితే, సట్లెజ్‌ కాలువను పాకిస్తాన్‌కు బదులుగా భారత భూభాగానికి మార్చేందుకు అందులో మౌనంగా కొన్ని మార్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో రెండు ముస్లిం ప్రాబల్య తహసీల్‌లున్నాయి. వాటిలో కలిపి దాదాపుగా 5 లక్షల జనాభా ఉంటుంది. ఈ మార్పుకు రెండు ప్రధాన కారణాలు కన్పిస్తాయి: (1) ఆ ప్రాంతంలో ఒక సైనిక ఆయుధ డిపో కూడా ఉంది. (2) అందులో ప్రధానంగా బికనేర్‌ సంస్థానానికి సాగునీరు అందించే కాలువ అదే ప్రాంతంలో ఉంది. బికనేర్‌ భారత్‌లో కలవడం అప్పటికే ఖాయమైంది.

అలాగే, చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాలను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు రాడ్‌క్లిఫ్‌ ఎలా అంగీకరించారన్నది కూడా ఇప్పటికీ రహస్యమే. పటేల్‌, నెహ్రులకు ఇది షాక్‌గా పరిణమించింది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో 98 శాతం మంది ముస్లిమేతరులే! కాబట్టి వాటిని తప్పకుండా భారత్‌లోనే కలుపుతారని వారు భావించారు. అలాగే, బెంగాల్‌లోని ముస్లిం ప్రాబల్య ముర్షీదాబాద్‌, మాల్డా జిల్లాలను బెంగాల్‌లోనే ఉంచే విషయాన్ని కూడా చివరిదాకా చాలా గోప్యంగా ఉంచారు. దాంతో అక్కడి ప్రాంతాల వారు ఆగస్టు 17న నివేదిక వెలుగు చూసేదాకా తమ ప్రాంతాల్లో నిత్యం పాకిస్తాన్‌ పతాకాలను ఎగరవేసే ఉంచారు![ఆధారం చూపాలి]

ఈ నిర్ణయాలు ఎలా జరిగాయన్న దాని వెనక నిజానిజాలు ఇక ఎప్పటికీ బహూశా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన నిర్ణయాలకు సంబంధించిన అన్ని రికార్డులనూ రాడ్‌క్లిఫ్‌ నాశనం చేసేశారు. ఇక మౌంట్‌బాటెన్‌ కూడా ఈ విషయాలు తనకేమీ తెలియదని చెప్పారు. పైగా విభజనకు సంబంధించి ఏ విషయంలోనూ తను ప్రత్యేకాసక్తితో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.

అమలు

[మార్చు]

విభజన అనంతరం సరిహద్దు రేఖల నిర్ణయాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత భారత, పాకిస్తాన్‌ ప్రభుత్వాలపై పడింది. ఆగస్టులో లాహోర్‌ సందర్శన తర్వాత, అక్కడి పరసరాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు వైస్రాయి మౌంట్‌బాటెన్‌ హడావుడిగా పంజాబ్‌ సరిహద్దు పరిరక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు. కానీ వేలాది మరణాలను నిరోధించేందుకు ఆ 50 వేల దళాలు ఏ మూలకూ చాలలేదు. ఎందుకంటే వారిలో 77 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. ఆ ప్రాంతపు పరిమాణంతో పోలిస్తే ఈ దళాలు చాలా తక్కువ స్థాయివి. చదరపు మైలు ప్రాంతానికి కనీసం ఒక సిపాయి లెక్కన కూడా లేవు. వేలు, లక్షలాదిగా భావి పాకిస్తాన్‌లో తల దాచుకునేందుకు పరుగులు తీస్తున్న శరణార్థులను కాపాడటం దేవుడెరుగు, అసలు స్థానిక నగరాల రక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం కూడా వాటికి తలకు మించిన భారమే అయింది.[25]

భారత్‌, పాకిస్తాన్‌ రెండూ గ్రామీణ ప్రాంతాల తిరుగుబాటుదారులకు మద్దతివ్వడం ద్వారా రాడ్‌క్లిఫ్‌ విభజన రేఖను వీలైనంతగా ఉల్లంఘించేందుకు ఏ మాత్రమూ సుముఖత చూపలేదు. అలాచేస్తే అంతర్జాతీయ వేదికపై తమకే అవమానమని, దాంతోపాటు బ్రిటిష్‌ ప్రభుత్వం, లేదా ఐరాస కల్పించుకోవాల్సిన పరిస్థితులను చేజేతులారా కొని తెచ్చుకోవడమే అవుతుందని అవి భావించాయి. (కానీ మాజీ సంస్థానమైన కాశ్మీర్‌ విషయంలో సంఘర్షణకు దిగకుండా ఆ రెండు దేశాలనూ ఈ భయాలు నివారించలేకపోయాయి. ఎందుకంటే కాశ్మీర్‌ రాడ్‌క్లిఫ్‌ ఒప్పందంలో భాగం కాదు). అంతిమంగా ఈ సరిహద్దు వివాదాలే భారత్‌, పాకిస్తాన్‌ మధ్య 1947, 1965, 1971ల్లో యుద్ధాలకు కూడా దారితీశాయి. పైగా తాజాగా 1998 మేలో కూడా ఇరు దేశాలూ అణ్వాయుధ పరీక్షలు జరిపేందుకు, 1999లో కార్గిల్‌ యుద్ధానికి కూడా అవే కారణమయ్యాయి.

రాడ్‌క్లిఫ్‌ రేఖ వెంబడి వివాదాలు

[మార్చు]

రాడ్‌క్లిఫ్‌ రేఖకు సంబంధించి రెండు పెద్ద వివాదాలు తలెత్తాయి. చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాలు, గురుదాస్‌పూర్‌ జిల్లా. చిన్న వివాదాలుగా మాల్డా, ఖుల్నా, ముర్షీదాబాద్‌ జిల్లాలు (బెంగాల్‌లో), కరీంగంజ్‌ సబ్‌ డివిజన్‌ (అస్సాంలో)లను పేర్కొనవచ్చు.[ఆధారం చూపాలి]

చిట్టగాంగ్‌ పర్వత ప్రాంతాలు

[మార్చు]

చిట్టగాంగ్‌ పర్వత ప్రాంతాలు ముస్లిం ప్రాబల్యం అసలే లేనివి. అక్కడ 97 శాతం ముస్లిమేతరులే (వారిలో అత్యధికులు బౌద్ధులు). కానీ దాన్ని పాకిస్తాన్‌కు కేటాయించారు. చిట్టగాంగ్‌ పర్వత ప్రాంత ప్రజా సంఘం (సీహెచ్‌టీపీఏ) బెంగాల్‌ సరిహద్దు కమిషన్‌కు ఈ విషయమై విజ్ఞాపన సమర్పించింది. చిట్టగాంగ్‌ పర్వత ప్రాంతాలను ప్రధానంగా ముస్లిమేతరులే ఆవాసంగా చేసుకున్నారని అందులో వివరించింది. కాబట్టి తమను భారత్‌లోనే ఉండనివ్వాలని వేడుకుంది.[ఆధారం చూపాలి] కానీ వారికి అధికారిక ప్రాతినిధ్యమేదీ లేని కారణంగా ఈ విషయంపై అధికారికంగా చర్చేమీ జరగలేదు. పైగా ఈ ప్రాంతాన్ని కచ్చితంగా భారత్‌లోనే కలుపుతారని అప్పటికే చాలామంది విశ్వసించారు.

1947 ఆగస్టు 15న తాము సరిహద్దులకు ఏ వైపుకు చెందామన్నది అక్కడి గిరిజనుల్లో చాలామందికి తెలియదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్‌ సరిహద్దు అవార్డు ప్రచురణల్లో చిట్టగాంగ్‌ పర్వత ప్రాంతాలు పాకిస్తాన్‌కు చెందుతాయని పేర్కొన్నారు. అందుకు వారు చెప్పిన కారణం ఏమిటంటే, ఆ ప్రాంతాలు భారత్‌కు దుర్గమంగా ఉంటాయి, పెద్ద రేవు పట్టణమైన చిట్టాగాంగ్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది)కు కాస్త ఉపశమనాన్ని అందుబాటులో ఉంచాలి. పైగా చిట్టాగాంగ్‌ చేరుకునేందుకు అది మాత్రమే ఏకైక మార్గమని వివరించారు.

ఈ అవార్డుకు అంగీకరించొద్దని రెండు రోజుల అనంతరం సీహెచ్‌టీపీఏ నిర్ణయించింది. తమ ప్రాంతాల్లో భారత పతాకాలను ఎగరవేశారు. ఈ సమస్యలను పాకిస్తాన్‌ సైన్యం తమదైన శైలిలో పరిష్కరించింది. అయినా ఈ సమస్య ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు.[26]

గురుదాస్‌పూర్‌ జిల్లా

[మార్చు]

షకార్‌గఢ్‌ సబ్‌ డివిజన్‌ను మినహాయించి గురుదాస్‌పూర్‌ జిల్లాను భారత్‌కు ఇచ్చారు. గురుదాస్‌పూర్‌ జిల్లాలో చారిత్రక దియోబంద్‌, బరేల్వీ వంటి ఇస్లామిక్‌ నగరాలున్నాయి. దాంతోపాటు అహ్మదీయ సామాజిక వర్గానికి చెందిన పలు సాంస్కృతిక కేంద్రాలకు కూడా ఇది నిలయం.[27] అహ్మదీయ సామాజిక వర్గాన్ని కూడా ముస్లింలుగానే పరిగణించారు కాబట్టి గురుదాస్‌పూర్‌ స్వల్పంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతం (50.6 శాతం మంది ముస్లింలు)గానే పరిగణన పొందింది. కానీ ముస్లింలు మత పెద్దలు అహ్మదీయ వర్గాన్ని ముస్లిమేతరులుగా అప్పటికే ప్రకటించారు. ఆ ప్రాంతంలో అహ్మదీయ వర్గీయులు భారీగా ఉన్నారు. వారి ఆధ్యాత్మిక కేంద్రమైన ఖదియాన్‌ కూడా గురుదాస్‌పూర్‌ జిల్లాలోనే ఉంది).[27] జిల్లాలో ముస్లిం, ముస్లిమేతర జనాభా శాతం వరుసగా 50.6, 49.4గా ఉంది. షకార్‌గఢ్‌, గురుదాస్‌పూర్‌ తహసీల్‌లలో 51 శాతం చొప్పున ముస్లింలున్నారు. బతాలా తహసీల్‌లో 53 శాతం ముస్లింలు; పఠాన్‌కోట్‌ తహసీల్‌లో 67 శాతం ముస్లిమేతరులు ఉన్నారు.[ఆధారం చూపాలి] కానీ చివరికి కేవలం షకార్‌గఢ్‌ తహసీల్‌ (దీన్ని మిగతా జిల్లా నుంచి రావి నది వేరు చేస్తుంది)ను మాత్రమే పాకిస్తాన్‌కు కేటాయించారు. మిగతా జిల్లా మొత్తాన్ని ముస్లిమేతరుల స్వల్ప మెజారిటీతో భారత్‌కు కట్టబెట్టారు.

ఈ నిర్ణయాన్ని లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ చెప్పిన మేరకే తీసుకున్నారని అప్పట్లో అంతా అనుకున్నారు. తద్వారా అప్పటి కాశ్మీర్‌ పాలకుడు భారత్‌లో కలవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల కాశ్మీర్‌ ప్రాంతం భారత్‌కే మరింతగా వీలుగా మారుతుంది. ఏదేమైనా పఠాన్‌కోట్‌ తహసీల్‌ మాత్రం భారత్‌కే రావడం ఖాయమైంది. కానీ దానికి సమీప తూర్పు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌, కాంగ్రా జిల్లాలతో నేరుగా రైలు, రోడ్డు సంబంధాలున్నాయి. ఇక్కడే మరో విషయం. బతాలా, గురుదాస్‌పూర్‌ జిల్లాలు సిక్కుల పవిత్ర నగరమైన అమృత్‌సర్‌కు కాస్త పరిరక్షణగా పని చేస్తాయి. లేదంటే ఆ నగరమంతా చుట్టూ పాకిస్తాన్‌ భూభాగంతోనే కూడుకుని ఉంటుంది. ఇక సరిహద్దు కమిషన్‌ ముందు మౌంట్‌బాటెన్‌, ఇతరులు చివరి విషయంగా చెప్పినది ఏమిటంటే, రావి నదికి తూర్పున ఉన్న ప్రాంతం మొత్తాన్నీ ఒక బ్లాకుగా పరిగణించారు. అందులో అమృత్‌సర్‌, గురుదాస్‌పూర్‌లోని అత్యధిక ప్రాంతం (షాకర్‌గఢ్‌ మినహా) ఉన్నాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కొద్దిగా ముస్లిమేతరుల మెజారిటీయే ఉంటుంది. పైగా, ఇలా చేయడం ద్వారా సిక్కుల జనాభాతో అత్యధికం (58 శాతం) తూర్పు పంజాబ్‌లోకే వస్తుంది. ఇందుకు వ్యతిరేకంగా చేస్తే ఈ జనాభా అంతా పాకిస్తాన్‌లోకే వెళ్లిపోతుంది. ఫలితంగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చే సిక్కు శరణార్థుల సంఖ్య ఆ మేరకు బాగా పెరిగిపోతుంది. నిజానికి దీన్ని సిక్కులను తృప్తి పరిచేందుకు జరిగిన ప్రయత్నంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే పశ్చిమ పంజాబ్లోని అత్యధిక సాగు భూమిని వారు కోల్పోయి ఉన్నారు. ఇందుకు బదులుగా ఫిరోజ్‌పూర్‌, జిరా తహసీల్‌లను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు రాడ్‌క్లిఫ్‌ ప్రయత్నించారు. కానీ బికనేర్‌ మహారాజు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే సట్లెజ్‌, బియాస్‌ నదుల సంగమం వద్ద కాలువ మొదలయ్యే హరికే హెడ్‌వర్క్‌ ఆ ఎడారి రాష్ట్రానికి ఏకైక సాగునీటి వనరు. అది ఫిరోజ్‌పూర్‌లోనే ఉంది. మాట వినకపోతే తన రాష్ట్రాన్ని పాకిస్తాన్‌తో కలుపుతానని అతను మౌంట్‌బాటెన్‌ను బెదిరించిన తర్వాత మాత్రమే అవార్డును చివరి నిమిషంలో మార్చి, ఫిరోజ్‌పూర్‌ జిల్లాను భారత్‌కు కేటాయించారు.[ఆధారం చూపాలి]

మాల్డా జిల్లా

[మార్చు]

రాడ్‌క్లిఫ్‌ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం బెంగాల్‌ నుంచి మాల్డా జిల్లా విభజన. ఈ జిల్లాలో మొత్తంగా చూస్తే ముస్లిం మెజారిటీ స్వల్పంగా ఉంది. కానీ దీనిలోనే అత్యధిక ప్రాంతాన్ని మాల్డా నగరంతో పాటుగా భారత్‌లో కలిపేశారు. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత కూడా 3 నుంచి 4 రోజుల పాటు ఈ జిల్లా తూర్పు పాకిస్తాన్‌ పాలన యంత్రంగం చేతిలోనే ఉంది. అవార్డును ప్రచురించిన తర్వాత మాత్రమే మాల్డాలో పాకిస్తాన్‌ పతాకాన్ని దించి భారత పతాకాన్ని ఎగరవేశారు.

ఖుల్నా, ముర్షీదాబాద్‌ జిల్లాలు

[మార్చు]

52 శాతం మంది హిందువులే ఉన్న ఖుల్నా జిల్లా మొత్తాన్నీ దానికంటే పిరమాణంలో చాలా చిన్నదైన ముర్షీదాబాద్‌ జిల్లాకు బదులుగా తూర్పు పాకిస్తాన్‌కు ఇచ్చేవారు. కానీ ముర్షీదాబాద్‌ జిల్లాలో 70 శాతం దాకా ముస్లింలే ఉన్నారు. అయినా అది భారత్‌కు వచ్చేసింది.

కరీంగంజ్‌

[మార్చు]

అస్సాంలోని సిల్హత్‌ జిల్లా ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా పాకిస్తాన్‌తో కలిసింది. కానీ కరీంగంజ్‌ సబ్‌ డివిజన్‌ను మాత్రం ముస్లిం ప్రాబల్య ప్రాంతమే అయినా సిల్హత్‌ నుంచి దాన్ని వేరు చేసి భారత్‌కు అప్పగించారు. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం కూడా కరీంగంజ్‌లో 52.3 శాతం ముస్లింలే ఉన్నారు.

వీటిని కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 పేజీ 482 చదవండి
  2. స్మిత, ఇండిపెండెన్స్‌ సెక్షన్‌, పేరా 7.
  3. నార్త్‌వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్సు, నార్త్‌వెస్ట్‌ ఫ్రాంటియర్‌ ప్రావిన్సు.ను చూడండి. కొలంబియా ఎన్‌సైక్లోపీడియా, 16వ ఎడిషన్‌, 2008. ఎన్‌సైక్లోపీడియా డాట్‌కామ్‌. 2009 సెప్టెంబర్‌ 10.
  4. 4.0 4.1 పేజీ 483 చదవండి.
  5. పేజీ 497 చదవండి: వారిలో కోటి మంది మధ్య పంజాబ్‌కు చెందినవారు. ఇది 200|mi|km దాదాపు 150|mi|km స్కాట్లండ్‌ పరిమాణానికి సమానంగా ఉంటుంది. అందులో దాదాపు 17 వేల పట్టణాలు, గ్రామాలుంటాయి. అక్కడి నుంచి 50 లక్షల మంది హిందూ ముస్లింలు పరస్పర వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. వారిలో చాలామంది ఎప్పటికీ తాము ఆశించిన గమ్యాలకు చేరనే లేదు.
  6. 6.0 6.1 పేజీ 499 చదవండి
  7. మాన్సెర్గీ
  8. పేజీ 483 చదవండి
  9. పేజీలు 482 -3 చదవండి
  10. పేజీ 418 చదవండి: నాటి ప్రధాని క్లెమెంట్‌ అట్లీకి అతనుిలా రాశారు, ఒక నిర్ధారిత తేదీన గానీ, లేదంటే అంతకంటే ముందు గానీ, ఆ తేదీ నాటికి ఒక రాజ్యాంగాన్ని అంగీకరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకేందుకు భారత్‌లోని వర్గాలు అంగీకరిస్తే... అక్కడ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని రద్దు పరుస్తూ సభలో మీరు ఒక ప్రకటన చేసేందుకు మీరు ప్రతిపాదించారని తెలియడం నాకు చాలా తేడాగా అన్పిస్తోంది.
  11. పేజీ 482 చదవండి: తప్పనిసరి లాంఛనాల అనంతరం జిన్నా ఐక్యరాజ్యసమితి జోక్యం కోరే ప్రయత్నాల సాయంతో మరింత సమయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రక్రియ మరీ ఏళ్లు కాకపోతే కనీసం నెలల పాటు ఆలస్యమవుతుంది. కాబట్టి రెండు సరిహద్దు కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. ఒక్కోదానికీ ఒకో స్వతంత్ర ఛైర్మన్‌, నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు, మరో ఇద్దరు కాంగ్రెస్‌ నామినేట్‌ చేసిన వారు, ఇంకో ఇద్దరు ముస్లిం లీగ్‌ నామినేట్‌ చేసిన వారి కలయికతో.
  12. మిశ్రా, పేరా 19: రెండో ప్రపంచ యుద్ధం ధాటికి ఇక కోలుకోలేనంతగా దెబ్బ తిన్న బ్రిటిష్‌ వారు, తామిక ఉపఖండాన్ని వదిలి వెళ్లక తప్పదని అర్థం చేసుకున్నారు. అది అప్పటికే 1940ల్లో తమ చేయి దాటిపోయిందని వారికి అర్థమైంది. కానీ యుద్ధం చివర్లో వచ్చిన బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లు అనూహ్యంగా లేబర్‌ పార్టీ చేతిలో చావుదెబ్బ తిన్నారు. దాంతో బ్రిటిష్‌ రాజకీయాల్లో కొత్త శకానికి తెర లేచింది. వాన్‌ తుంజెల్‌మన్‌ రాసిన విధంగా, 1946 కల్లా ఉపఖండం నానా గందరగోళంగా తయారైంది. బ్రిటిష్‌ పౌర, సైనికాధికారులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయట పడేందుకు ఇష్టపడసాగారు. పైగా వారి ఉనికి పట్ల భారతీయుల్లో కూడా నానాటికీ అసహ్యం పెరిగిపోసాగింది'.... ఇప్పుడిక తమ చట్టబద్ధతను కూడా పణంగా పెట్టే స్థాయిలో కేవలం పశుబలాన్ని నమ్ముకుని అక్కడింకా ఉండటం బ్రిటిష్‌ వారి శక్తికి మించిన కార్యంగా మారింది. పైగా, తుంజెల్‌మన్‌ ఇలా వివరించారు. రాచరికపు వైఫల్యానికి బదులుగా రాచరికపు శక్తికి సంబంధించిన భ్రమలను మాత్రమే నమ్మడానికి వారెంతగా సుముఖంగా ఉన్నా కూడా, యుద్ధ సంబంధిత రుణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన బ్రిటిష్‌ ప్రభుత్వం, నానాటికీ అస్థిరపడుతున్న తన సువిశాల సామ్రాజ్యాన్ని ఇంకెంతమాత్రమూ తన అధీనంలో ఉంచుకోలేని అశక్తతకు దిగజారింది. రాచరికపు విచ్ఛిన్నం అనివార్యంగానే కాదు, అత్యంత శీఘ్రంగా జరిగిపోవడం ఖాయంగా మారింది.
  13. చెస్టర్‌, సరిహద్దు కమిషన్‌ రూపురేఖలు, ప్రక్రియల విభాగం, పేరా 5.
  14. పేజీ3 483లో ఒకటో పేరా చదవండి 1
  15. జనాభా?
  16. పేజీ 485 చదవండి
  17. పేజీలు 484 -485 చదవండి: 1947 జూన్‌ 3న పథకాన్ని ప్రకటించిన తర్వాత ప్రధాన సిక్కు సంస్థ అయిన శిరోమణి అకాలీదళ్‌ ఒక సర్క్యులర్‌ పంచింది. పాకిస్థాన్‌ అంటే సిక్కు పంథ్‌ (సమాజానికి) పూర్తి మరణమే. కాబట్టి సిక్కులు చినాబ్‌, జమునా నదులు తమ సరిహద్దులుగా స్వతంత్ర సిక్కు దేశం కోసం కృతనిశ్చయంతో ఉన్నారు. తమ ఆదర్శాల కోసం అకాలీదళ్‌ పతాకం నీడ పోరాడాల్సిందిగా సిక్కులందరికీ పిలుపునిస్తున్నాం.
  18. పేజీ 481 చదవండి
  19. మిశ్రా, పేరా. 4
  20. మిశ్రా, పేరా. 5.
  21. హేవర్డ్‌, 45. చెస్టర్‌లో పేర్కొన్న మేరకు, మెథడాలజీ సెక్షన్‌, ఒకటో పేరా. 1
  22. పేజీ 484 చదవండి: కొన్నేళ్ల తర్వాత లియోనార్డ్‌ మోస్లేకు అతనుిలా చెప్పారు. అప్పటి వేడి భరించ శక్యం కానిది. ఎంతగా అంటే, మధ్యాహ్న సమయాల్లో అగ్నిగోళంలో ఉన్నట్టుగా అన్పిస్తుంది. నరకపు ముఖద్వారమేనేమో అన్పిస్తుంది. దాన్ని కొద్దిరోజులు అనుభవించిన తర్వాత నాకు ఆందోళనగా అన్పించింది. నేనసలు ఆ వాతావరణం నుంచి ప్రాణాలతో ఎలా బతికి వచ్చానా అన్పించింది. అసలు సరిహద్దు కమిషన్‌ ఛైర్మన్‌గా నేను సాధించిన అతి పెద్ద విజయం భౌతికపరమైనదేనని నా ఉద్దేశం. అది, ప్రాణాలను నిలబెట్టుకోవడం.
  23. పేజీ 494 చదవండి
  24. పేజీ 490
  25. పేజీలు 487 -488 చదవండి
  26. కలకత్తా పరిశోధన సమూహం
  27. 27.0 27.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-06. Retrieved 2011-03-10.

సూచనలు

[మార్చు]

మరింత చదవడానికి

[మార్చు]
  • భారత్‌: ఆరో సంపుటం: ద మౌంట్‌బాటెన్‌ వైస్రాయిలిటీా జూన్‌ 3 పథకం ప్రకటన, స్వీకరణ, 1947 మే 31 -జూలై 7. సమీక్షించినది జేఆర్‌ వుడ్‌.డివైడింగ్‌ ద జెవెల్‌: మౌంట్‌బాటెన్‌ అండ్‌ ద ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ టు ఇండియా అండ్‌ పాకిస్తాన్‌. పసిఫిక్‌ అఫైర్స్‌ , సంపుటి 58, సంఖ్య 4 (1985 -86 శీతాకాలం), పేజీలు 653 -662. జేఎస్‌టీఓఆర్‌
  • ఇ.బెర్గ్‌, హెచ్‌.వాన్‌ హౌటమ్‌. రౌటింగ్‌ బోర్డర్స్‌ బిట్విన్‌ టెరిటరీస్‌, డిస్‌కోర్సెస్‌, అండ్‌ ప్రాక్టీసెస్‌ (పేజీ 128).
  • ఎల్‌.కొలిన్స్‌ అండ్‌ డి.లాపియర్‌.(1975) ఫ్రీడం అట్‌ మిడ్‌నైట్‌.
  • ఎల్‌.కొలిన్స్‌ అండ్‌ డి.లాపియర్‌. మౌంట్‌బాటెన్‌ అండ్‌ ద పార్టిషన్‌ ఆఫ్‌ ఇండియా.
  • పి.మిశ్రా.ఎగ్జిట్‌ వూండ్స్‌. ద న్యూయార్కర్ ‌, 2007 ఆగస్టు 13. రిట్రీవ్డ్‌ ఫ్రమ్‌ లింక్‌.
  • పి.మూన్‌. ద ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌, 1942ా7: కాన్‌స్టిట్యూషనల్‌ రిలేషన్స్‌ బిట్విన్‌ బ్రిటన్‌ అండ్‌ ఇండియా: ఆరో సంపుటం: ద మౌంట్‌బాటెన్‌ వైస్రాయలిటీాఫార్ములేషన్‌ ఆఫ్‌ అ ప్లాన్‌, 1947 మార్చి 22 -మే 30. రివ్యూ డివైడింగ్‌ ద జెవెల్‌ అట్‌ జేఎస్‌టీఓఆర్‌
  • డి.మూన్‌ బ్లేక్‌, ఎస్‌.ఆష్టన్‌. ద ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌, 1942 -7: కాన్‌స్టిట్యూషనల్‌ రిలేషన్స్‌ బిట్విన్‌ బ్రిటన్‌ అండ్‌. రివ్యూ డివైడింగ్‌ ద జెవెల్‌ అట్‌ జేఎస్‌టీఓఆర్‌
  • ఎ.టుంజెల్‌మన్‌. ఇండియన్‌ సమ్మర్‌ . హెన్రీ హాల్ట్‌.
  • ఎస్‌.వోల్‌పెర్ట్‌(1989). అ న్యూ హిస్టరీ ఆఫ్‌ ఇండియా, మూడో ఎడిషన్‌. న్యూయార్క్ : ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం.

బాహ్య లింకులు

[మార్చు]