కోమండూరి రామాచారి

వికీపీడియా నుండి
(రామాచారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోమండూరి రామాచారి
జననం (1965-01-22) 1965 జనవరి 22 (వయసు 59)
పెద్దగొట్టిముక్కల గ్రామం, శివంపేట మండలం మెదక్ జిల్లా, తెలంగాణా
వృత్తిగాయకుడు, సంగీత ఉపాధ్యాయుడు
జీవిత భాగస్వామిసుజాత
పిల్లలుకొమాండూరి సాకేత్
కోమండూరి సాహితి (సోనీ)
తల్లిదండ్రులు
  • కృష్ణమాచారి[1] (తండ్రి)
  • యశోదమ్మ (తల్లి)

కోమండూరి రామాచారి, ఒక ప్రముఖ సంగీత అధ్యాపకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. హైదరాబాదులో అతను నిర్వహిస్తున్న లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ (ఎల్. ఎం. ఎ) ద్వారా ఎంతోమంది పిల్లలు సంగీతం నేర్చుకుని సినిమా రంగంలో ప్రవేశించారు. హేమచంద్ర, కారుణ్య లాంటి గాయకులు రామాచారి వద్ద సంగీతం నేర్చుకున్న వారే.[2] ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ పాటల కార్యక్రమం పాడుతా తీయగా మొట్టమొదటి సంచికలో ఇతను ద్వితీయ విజేతగా నిలిచాడు. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[3]

విశేషాలు[మార్చు]

ఇతను మెదక్ జిల్లా, శివంపేట మండలం, పెద్దగొట్టిముక్కల గ్రామంలో పుట్టాడు. ఇతని తండ్రి కోమండూరి కృష్ణమాచారి పురోహితుడు.తండ్రి కృష్ణమాచారికి సంగీతంలో ప్రవేశం ఉంది. హరికథలు చెప్పేవాడు. తల్లి యశోదమ్మ మంగళహారతులు పాటలు శ్రావ్యంగా పాడేది.[4] రామాచారికి సంగీతం పట్ల మక్కువ ఇతని తల్లిదండ్రుల వల్ల కలిగింది. రామాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ మేడ్చల్ లో చదువుకున్నాడు. ఇతను పదవ తరగతి చదివే సమయంలోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇంటర్మీడియట్ తరువాత సికిందరాబాదు లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరాడు. ఆకాశవాణి కళాకారిణి తురగా జానకీరాణి ఇతనిని రేడియోలో పాడటానికి ప్రోత్సహించింది. తర్వాత ఓరుగంటి లీలావతి వద్ద శాస్త్రీయ సంగీతం, పి.వి.సాయిబాబా వద్ద లలిత సంగీతం నేర్చుకున్నాడు. తర్వాత ఆఫీస్‌ బాయ్‌గా, ‘ఆంధ్ర లా టైమ్స్‌’ పత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా కొన్నాళ్ళు పనిచేసి తరువాత ఉపాధ్యాయుడిగా ఆల్‌సెయింట్‌ స్కూల్లో చేరాడు. అక్కడ పన్నెండు సంవత్సరాలు పనిచేశాడు. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, సంగీతం నేర్చుకుంటూ మరోవైపు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పాడేవాడు. వీటితో పాటు టిటిసి, బిఎ, బిఇడి (జనరల్‌ ఎడ్యుకేషన్‌) పూర్తి చేశాడు.

పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకి మాత్రమే లలిత సంగీతంలో శిక్షణ ఇచ్చి వాళ్ళు సంగీతాన్ని వృత్తిగా మలచుకునేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇతను 1998లో లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ ప్రారంభించాడు. ఈ సంగీత శిక్షణ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాడు. ఇతని దగ్గర శిష్యరికం చేసిన ఎందరో గాయనీ గాయకులు ప్రస్తుతం సినిమాలలోను, టి.వి.లలోను తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇతని వద్ద శిక్షణ పొందినవారిలో గీతామాధురి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణచైతన్య వంటివారు ఉన్నారు.[5]

ఇతను సంగీత శిక్షకుడిగానే కాక సంగీత దర్శకునిగా, గాయకుడిగా అనేక ప్రైవేటు ఆల్బమ్‌లలో, టి.వి.సీరియళ్ళలో, సినిమాలలో పనిచేశాడు. సినిమాలలో ఇతను "శ్రీరామ్‌ కౌశిక్" పేరుతో ప్రసిద్ధుడు. శ్వేతనాగు, శ్రీరామదాసు, బాల రామాయణం, సంబరం వంటి సినిమాలలో పాటలు పాడాడు. ప్రేమలేఖ రాశా సినిమాకు సంగీత దర్శకునిగా పని చేశాడు. సమాంతరరేఖలు, బుచ్చిబాబు, పరమానందయ్య శిష్యుల కథ వంటి సీరియల్స్‌లో కూడా పాటలు పాడాడు. ఇవికాక అనేక భక్తి గీతాల ఆల్బంలలో స్వరాలాపన చేశాడు.[6]

బయటి లింకులు[మార్చు]

  • లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ
  • Speakok (2017-06-24), LMA Ramachary biography | Music teacher Ramachary | Little Musicians Academy Ramachary Biography, retrieved 2018-10-15

మూలాలు[మార్చు]

  1. "About Ramachari founder of LMA on their website". littlemusiciansacademy.com. LMA. Archived from the original on 24 ఆగస్టు 2018. Retrieved 12 June 2017.
  2. ప్రేమ. "డైలాగ్ విత్ ప్రేమ". youtube.com. ఐడ్రీం మీడియా. Retrieved 11 June 2017.
  3. Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
  4. వాకా, మంజులారెడ్డి (8 September 2013). "సరిగమలకు విలువలను కలిపారు". సాక్షి ఫ్యామిలీ పేజి. Retrieved 14 June 2017.
  5. గుబ్బిట, దుర్గాప్రసాద్. "మ్యూజిక్ మాష్టారు -కొమాండూరి రామాచారి గారు". సరస భారతి, ఉయ్యూరు. గుబ్బిట దుర్గాప్రసాద్. Retrieved 14 June 2017.
  6. రామాచారి (సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్, సింగర్)[permanent dead link]