Jump to content

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

వికీపీడియా నుండి
(రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ నుండి దారిమార్పు చెందింది)
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
తిరుపతిఅన్నమాచార్య ప్రాజెక్టు నందలి రాళ్ళపల్లి ఫోటో
జననం(1893-01-23)1893 జనవరి 23
రాళ్ళపల్లె గ్రామం, అనంతపురం జిల్లా
మరణం1979 మార్చి 11(1979-03-11) (వయసు 86)
వృత్తిరచయిత, విమర్శకుడు, అధ్యాపకుడు
తల్లిదండ్రులు
  • కర్నమడకల కృష్ణమాచార్యులు (తండ్రి)
  • అలమేలు మంగమ్మ (తల్లి)

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ (జనవరి 23, 1893 - మార్చి 11, 1979) అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంథాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.

బాల్యం

[మార్చు]

జీవనకాలం: జనవరి 23, 1893 - మార్చి 11, 1979. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: అనంతపురం జిల్లా, కంబదూరు మండలం రాళ్లపల్లె గ్రామం. తండ్రి వద్దనే సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించి, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.

సంగీత సాహిత్యాలు

[మార్చు]

చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలు, ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. రాళళ

సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియోకు ఆకాశవాణియని పేరు పెట్టినది ఆయనే.

రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.

సత్కారాలు

[మార్చు]

మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో గాన కళాసింధు బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది. ఆయన 1979, మార్చి 11న పరమపదించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.

ప్రాచుర్యం, వారసత్వం

[మార్చు]

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సంప్రదాయ పాండిత్యానికి, సాహిత్య విమర్శకు గొప్ప పేరొందిన పండితుడు. విశ్వవిద్యాలయాలు వ్యవస్థీకృతమైన దశలో డిగ్రీలు లేని పాండిత్యాన్ని అంగీకరించడం, ఆచార్యత్వాన్ని ఇవ్వడం చేయని విధానాల వల్ల రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వలె క్షుణ్ణంగా సంప్రదాయ విమర్శ సాహిత్యాన్ని వివేచన చేయగల సమర్థుల సేవలు వినియోగించుకోకపోవడంతో వారి పాండిత్యం నుంచి విశ్వవిద్యాలయ పరిశోధన వ్యవస్థలు ప్రయోజనం పొందలేకపోయాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం, సంప్రదాయిక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి ఇటువంటి పండితులు విశ్వవిద్యాలయాల్లో కొలువు కాకపోవడం వల్లనే వచ్చిందని సాహిత్య పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు పేర్కొన్నాడు.[1]

బాహ్య లింకులు

[మార్చు]

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ - జీవిత చరిత్ర

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చేకూరి, రామారావు; ఎన్., గోపి (March 2017). "తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్వ్యూ". ఈమాట. Retrieved 2 April 2018. అప్పటికి తెలుగు దేశంలో పండితులుగా ఉన్నవాళ్ళు చేస్తున్న సాహిత్యవిమర్శ అప్పటి సంప్రదాయాల్లో క్షుణ్ణంగా ఉండేది అని నేను నమ్ముతున్నాను. అయితే దాని ప్రయోజనాలు విశ్వవిద్యాలయాలు పొందలేదు. ఎంచేత పొందలేదంటే డిగ్రీలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనే పద్ధతి ఉంది కాబట్టి....రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు, వేదం వేంకటరాయశాస్త్రిగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు కూడా అంతే. వాళ్ల పాండిత్య ప్రయోజనం మనం పొందలేకపోయాం.