రావణుడే రాముడైతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావణుడే రాముడైతే
(1979 తెలుగు సినిమా)
Ravanude Ramudaithe.jpg
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం ఎన్.ఆర్. అనురాధాదేవి
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
మాగంటి మురళీమోహన్,
మోహన్ బాబు,
జయచిత్ర,
లత,
సంగీతం జి.కె. వెంకటేష్
సంభాషణలు దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణం కె.ఎస్. మణి
కళ వాలి
కూర్పు కె. బాలు
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్[1]
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రావణుడే రాముడైతే 1979, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్[2] పతాకంపై ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, మాగంటి మురళీమోహన్, మోహన్ బాబు, జయచిత్ర, లత తదితరులు నటించగా, జి.కె. వెంకటేష్ సంగీతం అందించాడు.[4]

చిత్రకథ[మార్చు]

రౌడీగా పెరిగిన నాగరాజు దుర్మార్గులకు దుర్మార్గుడు, సన్మార్గులకు సన్మార్గుడు. అతడు తాయారును ప్రేమిస్తాడు. కానీ తాయారు తనని ప్రేమిస్తుందో లేదో తెలుసుకొనాలని ప్రయత్నించలేదు. రత్తాలు అనే యువతి నాగరాజుపై ఎన్నో ఆశలు పెంచుకుంది.

ఉద్యోగం దొరకక మురళి అనే యువకుడు ఆత్మహత్యకు పూనుకుంటే అతడిని నాగరాజు రక్షించి అతనికి జీవనోపాధి కల్పిస్తాడు. తాను ప్రేమించిన తాయారు మురళికి దగ్గరకావడం చూసి అతడిని తన్ని తరిమేస్తాడు నాగరాజు. తరువాత ఆవేశం చల్లారుతుంది. రత్తాలు మనసును అర్థం చేసుకుంటాడు.

ఒక జమీందారీ కుటుంబం వెంకటేశ్ అనే మాయావి మూలంగా చల్లాచదురవుతుంది. జమీందారు బలవన్మరణం చెందుతాడు. అతని భార్య చిన్న కొడుకు మురళిని తీసుకుని వెంకటేశ్ బారి నుండి తప్పించుకుని ఎక్కడో దూరంగా దారిద్ర్యంలో బతకాల్సి వస్తుంది. నాగరాజు నుండి గెంటివేయబడిన మురళి అనుకోకుండా వెంకటేశ్‌ను కలుస్తాడు. మురళి జమీందారు చిన్నకొడుకని తెలుసుకుని అతని ఆస్తిని పొందాలని పన్నాగాలు పన్నుతుంటాడు. తాయారు మనసు తెలుసుకున్న నాగరాజు మురళి, తాయారులను ఒకటి చేయాలని ఎంతో సౌమ్యంతో ప్రయత్నిస్తాడు. అయితే చెప్పుడు మాటలను విన్న మురళి తాయారును చేరదీయడానికి నిరాకరిస్తాడు. తాను జమీందారు పెద్దకొడుకని తెలుసుకున్న నాగరాజు వెంకటేశ్‌పై పగ తీర్చుకునేందుకు, మంచిగా చెబితే వినని మురళిని తన దారిలోకి తెచ్చుకునేందుకు తన పూర్వపు రౌడీతనాన్ని ప్రదర్శించి కథను సుఖాంతం చేస్తాడు[5].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, చిత్రానువాదం, సంభాషణలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • నిర్మాణం: ఎన్.ఆర్. అనురాధాదేవి
 • సంగీతం: జి.కె. వెంకటేష్
 • ఛాయాగ్రహణం: కె.ఎస్. మణి
 • కళ: వాలి
 • కూర్పు: కె. బాలు
 • నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్

నిర్మాణం[మార్చు]

జయా ఫిలింస్, శోభనాచల ఫిలింస్ పతాకాలపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభదశలో చిత్రాలను, శోభనాచల స్టూడియోను నిర్మించి నిర్మించిన 'మీర్జాపూర్ రాజు' రాజా వెంకట్రామ అప్పారావు బహద్దుర్ కుమార్తె నుంగునూరి రాజ్యలక్ష్మీ అనురాధాదేవి. ఈవిడ 1976లో చక్రధారి సినిమాతో నిర్మాతగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనురాధాదేవి అక్కినేనితో తీసిన రెండో చిత్రం, దాసరితో తీసిన మొదటి సినిమా 'రావణడే రాముడైతే'.

అభివృద్ధి[మార్చు]

1977లో శోభన్ బాబు హీరోగా తీసిన నిండు మనిషి పరాజయం పొందడంతో చిన్న బడ్జెట్ లో ఒక మంచి సందేశాత్మక సినిమా తీయాలి అని అనురాధాదేవి అనుకున్నారు. దాంతో దాసరి గారిని సంప్రదించగా ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే చిన్న సినిమాగా వద్దు అక్కినేని గారితో ఒక డిఫరెంట్ గా చేద్దాం అని చెప్పారు.

నటీనటుల ఎంపిక[మార్చు]

అక్కినేని హీరో కాబట్టి ఇతర తారాగణం కోసం వెదకడం జరిగింది. హీరోయిన్ పాత్రకోసం నిండు మనిషి సినిమాలో చేసిన జయచిత్ర ను ఎంపికచేశారు. మరో హీరోయిన్ పాత్రకోసం లత అనే అమ్మాయిని ఎంపికచేశారు. తను తమిళంలో బిజీగా ఉన్నా కూడా దాసరికి తెలిసినవారు కావడంతో తన డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమా చేసింది. ఇతర పాత్రల్లో మాగంటి మురళీమోహన్, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, మాడా, త్యాగరాజు కె.వి. చలం చేశారు.

చిత్రీకరణ[మార్చు]

చిత్ర షూటింగ్ జూలై 31, 1978లో అన్నపూర్ణ స్టూడియోలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతులమీదుగా ప్రారంభమైంది.

'రవివర్మకే అందని' అనే పాట చిత్రీకరణకు డ్రై ఐస్ కావాలసివచ్చింది. అది హైదరాబాద్ లో దొరక్కపోవడంతో బెంగళూర్ నుండి ఫ్లయిట్ లో తెప్పించేవారు. చిత్ర యూనిట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ బయట కుర్చీలపై కూర్చోనేవారు. ఆకాశంలో విమానాన్ని చూసి షూటింగ్ ప్రారంభించేవారు.

'ఉస్కో ఉస్కో పిల్లా... చూస్కో చూస్కో మళ్లా' అనే పాట చిత్రీకరణ సమయంలో పాటలోని పదాలను విన్న అక్కినేనిగారు పిల్లని ఉస్కో ఉస్కో అని కుక్కపిల్లలా పిలవడం ఏమిటి నాన్సెన్స్. పాట మార్చండి అని కోపంగా బయటికి వెళ్లిపోయారు. అప్పుడు దాసరి గారు తన వెళ్లి తన సమయస్ఫూర్తి, తెలివితేటలను ఉపయోగించి అడవి రాముడులో రామారావుగారితో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట తీశారుకదా.. దానికి మనం ఈ పాటతో కౌంటర్ ఇస్తున్నాం' అని చెప్పి నాగేశ్వరరావు గారిని ఒప్పించారు.

గీతాలు[మార్చు]

ఈ చిత్రానికి జి.కె. వెంకటేష్ సంగీతం అందించాడు. సి.నారాయణ రెడ్డి, వేటూరి రాసిన పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల పాడారు.[6][7]

 1. అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
 2. ఆకలెంతో దాహమెంతో అంతే అంతే మోహము వ్యామోహము - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
 3. ఉప్పుచేప పప్పుచారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- రచన: దాసం గోపాలకృష్ణ
 4. కనులలో నీ రూపం మనసులో నీ గీతం కదలాడే నేడే -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
 5. ప్రేమంటే తెలుసా నీకు తెలియందే ప్రేమించకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
 6. రవివర్మకే అందని ఒకే ఒక అందానివొ రవి చూడని - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- రచన: వేటూరి సుందరరామమూర్తి

విడుదల - స్పందన[మార్చు]

ఫిబ్రవరి 16, 1979 ఈ చిత్రం విడుదల అయింది. నాగేశ్వరరావు గారి గెటప్ కి, పాటల్లో ఆయన వేసిన స్టెప్స్ కి మంచి స్పందన వచ్చింది.

ఇతర విశేషాలు[మార్చు]

ఈ చిత్ర షూటింగ్ ప్రారంబోత్సవానికి ముఖ్యతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సిని పరిశ్రమ హైదరాబాద్ కి రావాలి అని అన్నారు. వెంటనే దాసరి గారు మీరు స్థలం ఇస్తే అందరం వచ్చేస్తాం అన్నారు. దానికి చెన్నారెడ్డి గారు తప్పకుండా ఇస్తాను. మీరు అర్జీ పెట్టండి అనడంతో దాసరిగారు 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి, తలో 200 రూపాయల చొప్పున డబ్బు చెల్లించి ప్రభుత్వానికి లెటర్ రాశారు. అలా ఆరోజు ఫిలింనగర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది.

మూలాలు[8][మార్చు]

 1. "Ravanude Ramudaithe? (Overview)". IMDb.
 2. "Ravanude Ramudaithe I have been working? (Banner)". Filmiclub.
 3. "Ravanude Ramudaithe? (Direction)". Know Your Films.
 4. "Ravanude Ramudaithe? (Cast & Crew)". gomolo.com.
 5. పి.ఎస్. (24 February 1979). "చిత్ర సమీక్ష - రావణుడే రాముడైతే". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 10 December 2017.
 6. http://www.allbestsongs.com/telugu_songs/weekSongs_2006.php
 7. "Ravanude Ramudaithe? (Songa)". Cineradham.
 8. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

వనరులు[మార్చు]

 • విశ్వవిజేత విజయగాధ, యు.వినాయకరావు, జయా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013.

బయటి లింకులు[మార్చు]