Jump to content

రావెళ్ళ వెంకట రామారావు

వికీపీడియా నుండి
రావెళ్ళ వెంకట రామారావు

రావెళ్ళ వెంకట రామారావు (జనవరి 31, 1927 - డిసెంబర్ 10, 2013) తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు.

జననం

[మార్చు]

రావెళ్ల ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో 1927, జనవరి 31రైతు కుంటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పనిచేశారు.విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ పోరాట ఉద్యమం నిర్వహించారు. 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, బీడ్, ఢిల్లీ, ఖమ్మం తదితర జైళ్లలో గడిపి...జైళ్లలో దుస్థితిని మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం సౌకర్యాన్ని సాధించారు.ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి దశరథదేవ్, కే ఎన్ సింగ్, బర్మా, కెప్టెన్ మహ్మద్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్ 8వ తేదీన ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.నేలకొండపల్లి మండలం బోదులబండలో క్యాంపు నిర్వహిస్తుండగా ఓ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఓ తూటా రావెళ్ల శరీరంలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ శక్తినంతటినీ కూడగట్టుకుని ఆయన కాల్పులు సాగించడంతో సైనికులు పరారయ్యారు. అనంతరం కాలంలో జయశ్రీ అనే కలం పేరుతో 1947లో తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. పురాతన్‌, క్రిషిక్‌, తెలంగాణ్యుడు, ఆర్‌.వి.ఆర్‌. పేరుతో ఎన్నో రచనలు చేశారు. తన ఇంటినే ఓ కవితా కుటీరంగా మలుచుకున్నారు. ఆతరువాత గోకినేపల్లి కవిత కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించారు. రావెళ్ల పద్యరచనతో పాటు అనేక వ చన రచనలు సైతం చేశారు.తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడగలరు.దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడు. రావెళ్ల కవితా ఖండికల్లో అనంతల్పం, పల్లెభారతి, రాగజ్యోతుల్లాంటివి ముఖ్యమైనవిగా ఉన్నాయి.మధుర కవి, కర్శక కవి అనే బిరుదులను పొందారు. అలాగే గురజాడ సాహితీ అవార్డు, దాశరథీ సాహితీ పురస్కారం, జాషువా సాహితీ అవార్డులను అందుకున్నారు. ఆయనకు భార్య సుగుణమ్మ, నలుగురు కుమారులు ఉన్నారు.

మరణం

[మార్చు]

గ్రామీణ ప్రాంతంలో జీవించిన ప్రజా కవి. ముదిగొండ మండలం గోకినపల్లి లోని తన స్వగృహంలో 2013, డిసెంబర్ 10 న తనువుచాలించారు.[1]

రచనలు

[మార్చు]
  • పల్లెభారతి
  • జీవనరాగం
  • అనలతల్పం
  • రాగజ్యోతులు
  • చైతన్య స్రవంతి[2]

భావాలు అనుభవాలు

[మార్చు]
  • "కదనాన శత్రువుల కుత్తుకలనవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి..
వీరులకు కాణాచిరా.. తెలంగాణ ధీరులకు మొగసాలరా
  • "కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం..
రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం [3]
  • "భూగర్భమున నిధులు.. పొంగిపారెడి నదులు
శృంగార వనతతులు.. బంగారముల పంట
నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానమ్మురా...'[4]

మూలాలు

[మార్చు]
  1. http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-poet-ravella-venkat-rao-passes-away-87463
  2. వెంకట రామారావు, రావెళ్ళ. చైతన్య స్రవంతి.
  3. http://www.andhrajyothy.com/node/40767[permanent dead link]
  4. ఈనాడు ఖమ్మం 11.12.2013