రెజాంగ్ లా
రెజాంగ్ లా | |
---|---|
रेजांग ला | |
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,500 m (18,045 ft) |
ప్రదేశం | లడఖ్, భారతదేశం |
శ్రేణి | హిమాలయాలు, లడఖ్ పర్వత శ్రేణి |
Coordinates | 33°24′50″N 78°52′29″E / 33.41389°N 78.87472°E |
రెజాంగ్ లా, వాస్తవాధీన రేఖపై లడఖ్‌కూ, చైనా ఆక్రమణలో ఉన్న స్పంగ్గూర్ సరస్సు బేసిన్‌కూ మధ్య ఉన్న కనుమ. ఇది సముద్ర మట్టం నుండి 5,500 మీటర్ల ఎత్తున ఉంది. స్పంగ్గూర్ సరస్సులోకి ప్రవహించే రెజాంగ్ లుంగ్పా వాగు ఇక్కడే పుడుతుంది. ఇది 1960 సరిహద్దు చర్చల సందర్భంగా చైనా తమకు 'సాంప్రదాయికంగా వస్తున్న సరిహద్దు' అని పేర్కొన్న రిడ్జ్ లైనుపై స్పంగూర్ గ్యాప్‌కు దక్షిణాన 11 మైళ్ళ దూరంలో ఈ కనుమ ఉంది.
రెచిన్ లా (లేదా రెకిన్ లా ) అనేది 33°25′N 78°51′E / 33.42°N 78.85°E వద్ద ఉన్న మరొక కనుమ.ఇది కూడా వాస్తవాధీన రేఖ పైననే, రెజాంగ్ లాకు ఈశాన్యంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కనుమ వద్ద కూడా ఒక వాగు పుడుతోంది. ఈ కనుమకు రెండు వైపులా (భారత చైనా) భూభాగాల నుండి కనుమకు రోడ్లున్నాయి. [1]
వాస్తవాధీన రేఖ రెజాంగ్ లా, రెచిన్ లా కనుమల గుండానే వెళ్తుంది. భారతదేశం క్లెయిమ్ చేస్తున్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ స్పంగ్గూర్ త్సోకు ఉత్తరాన ఉంది. చైనా క్లెయిమ్ చేసే సరిహద్దు రేఖ స్పంగ్గూర్ గ్యాప్‌కు దక్షిణంగా వెళుతుంది. వాయవ్యంలో పాంగోంగ్ సరస్సు ఉత్తరపు ఒడ్డున ఉన్న ఫింగర్ 4 ప్రాంతం నుండి ఆగ్నేయంలో పాంగోంగ్ సరస్సు దక్షిణపు ఒడ్డున ఉన్న హెల్మెట్ టాప్ కొండ, బ్లాక్ టాప్ హిల్, గురుంగ్ హిల్, స్పంగ్గూర్ గ్యాప్, మాగర్ హిల్, ముఖ్‌పారి హిల్, రెజాంగ్ లా (స్పంగ్గూర్ గ్యాప్ నుండి 17 కి.మీ.), రెచిన్ లా (స్పంగ్గూర్ గ్యాప్ నుండి 24 కి.మీ.) ల గుండా వాస్తవాధీన రేఖ సాగుతుంది. . [1]
చుషుల్ గ్రామం, అక్కడున్న భారత సైనిక పోస్టు రెజాంగ్ లాకు వాయవ్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.. చుషుల్ నుండి వెళ్ళే రహదారి పశ్చిమాన లేహ్ నగరానికి వెళుతుంది.
సైనిక చర్యలు
[మార్చు]1962 రెజాంగ్ లా యుద్ధం
[మార్చు]1962 లో జరిగిన భారత చైనా యుద్ధ సమయంలో, 13 కుమావున్ దళపు చివరి స్టాండ్ యొక్క ప్రదేశం రెజాంగ్ లా. ఈ దళానికి మేజర్ షైతాన్ సింగ్ నాయకత్వం వహించాడు. ఇక్కడ అతను చూపిన పరాక్రమానికి గాను మరణానంతరం పరమ వీర చక్ర గెలుచుకున్నాడు. [2] [3] [4] భారతీయ దృక్కోణంలో, రెజాంగ్ లా వద్ద ఉన్న భౌగోళిక అంశం కారణంగా ఆర్టిలరీ ఆపరేషన్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో భారతీయ పదాతిదళం ఫిరంగి కవచం లేకుండానే పోరాడవలసి వచ్చింది.
1962 నవంబరు 18 న జరిగిన ఈ చర్యలో మొత్తం 120 మంది సైనికులలో (అహిర్‌లు) 114 మంది మరణించారు. ఈ సైనికుల్లో చాలామంది రేవారీ ప్రాంతానికి చెందినవారు. అక్కడ వారికి ఒక స్మారక చిహ్నం నిర్మించారు. ఈ యుద్ధంలో 1,300 మంది చైనా సైనికులు మరణించారని ఆ స్మారకంపై పేర్కొన్నారు. [5]
2020 సరిహద్దు ప్రతిష్టంభన
[మార్చు]2020 వేసవిలో ఏర్పడి సరిహద్దు ప్రతిష్టంభనలో, పాంగోంగ్ త్సోకు దక్షిణాన, రెజాంగ్ లా రెచిన్ లా లతో సహా వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశం సైనిక దళాలను మోహరించింది. ఇక్కడి నుండి వారికి స్పంగ్గూర్ఈ గ్యాప్ వద్ద మోహరించిన చైనా దళాలను పైనుంచి చూసే వీలు కలిగించింది. [6]
యుద్ధ స్మారకాలు (అహిర్ ధామ్)
[మార్చు]చుషుల్ వద్ద రెజాంగ్ లా యుద్ధ స్మారకం
[మార్చు]రెజాంగ్ లా యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం చుషుల్ వద్ద యుద్ధ స్మారకాన్ని నిర్మించారు.[7][8] ఈ స్మారకంపై చెక్కిన పంక్తుల్లో 1834 నుండి 1838 వరకు భారత సుప్రీం కౌన్సిల్ సభ్యుడు లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే రాసిన కవిత, హోరాటియస్ నుండి ఉటంకించారు.[9] దాని తెలుగు స్వేచ్ఛానువాదం ఇది:
ఏది గొప్ప మరణం..
తన పితరుల చితాభస్మం కోసం,
తన దేవుళ్ళ పవిత్ర మందిరాల కోసం
భయానకమైన అవరోధాలకు ఎదురొడ్డి
ప్రాణాలర్పించడం కంటే గొప్ప మరణం ఏముంది
1962 నవంబరు 18 న
చివరి రౌండు దాకా, చివరి మనిషి దాకా
చైనీస్ మూకలతో పోరాడిన
రెజాంగ్-లా హీరోలు
13 కుమావున్‌కు చెందిన 114 మంది అమరవీరుల
పవిత్ర జ్ఞాపక చిహ్నంగా
13 వ బెటాలియన్ కుమావున్ రెజిమెంట్ లోని
ర్యాంకులన్నీ కలిసి నిర్మించినది
మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో తన పుస్తకం "పరమ్ వీర్, అవర్ హీరోస్ ఇన్ బ్యాటిల్"లో ఇలా రాసాడు:
తరువాత తిరిగి రెజాంగ్ లా వెళ్ళినప్పుడు, తమ ఆయుధాలను చేతుల్లో పట్టుకునే మరణించిన జవాన్లు కందకాలలో కనిపించారు ... ఈ కంపెనీ లోని ప్రతి ఒక్క వ్యక్తీ అనేక తూటా గాయాలతో గానీ, స్ప్లింటర్ల గాయాలతో గానీ తన కందకంలో చనిపోయి కనిపించాడు. ఒక సైనికుడు, చేతిలో 2 అంగుళాల మోర్టారు బాంబు పట్టుకుని మరణించాడు. చైనీయుల బుల్లెట్ తగిలి చనిపోయిన మెడికల్ ఆర్డర్లీ చేతిలో సిరంజీ, కట్టూ అలాగే ఉన్నాయి ... వీళ్ళ వద్ద ఉన్న వెయ్యి మోర్టారు బాంబులలో, ఏడే మిగిలాయి -మిగతావన్నీ కాల్చేసారు. మిగిలిన ఆ ఏడు కూడా కాల్చడానికి సిద్ధంగానే ఉన్నాయి.
జనరల్ టి.ఎన్ రైనా ఇలా శ్లాఘించాడు:[10]
అనేక భారీ అవరోధాలను ఎదుర్కొంటూ కూడా, సైనికులు చివరి బుల్లెట్ వరకు, చివరి మనిషి వరకూ పోరాడిన ఇలాంటి ఘటనలు ప్రపంచ సైనిక చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. ఖచ్చితంగా, రెజాంగ్ లా యుద్ధం అటువంటి మెరిసే ఉదాహరణ.
రేవారిలో రెజాంగ్ లా వార్ మెమోరియల్
[మార్చు]ఈ ప్రాంతానికి చెందిన సైనికుల జ్ఞాపకార్థం హర్యానాలోని అహిర్‌వాల్ ప్రాంతంలో స్మారక చిహ్నం నిర్మించాలని జనరల్ కెఎస్ తిమయ్య ఆకాంక్షించారు. రాబోయే తరాలు, వారి పూర్వీకుల అపారమైన ధైర్య శౌర్యాల నుండి ప్రేరణ పొందాలని ఆయన భావించాడు. తత్ఫలితంగా, రెజాంగ్ లా శౌర్య సమితి, రేవారీ పట్టణంలో రెజాంగ్ లా పార్కు లోపల యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. సమితి ఇక్కడ ఏటా స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 India sits on Black Top with Helmet under its boots, The Print, 9 September 2020.
- ↑ Press Information Bureau, Government of India (7 January 2007). "Remembering Rezang La heroes". Sainik samachar.
- ↑ Col Dilbag Dabas (Retd) (15 December 2018). "Heroes of Rezang La 1962". The Tribune.
- ↑ Mohan Guruswamy (20 November 2012). "Don't forget the heroes of Rezang La". The Hindu.
- ↑ Shekhar Gupta (30 October 2012). "'Nobody believed we had killed so many Chinese at Rezang La. Our commander called me crazy and warned that I could be court-martialled'". The Indian Express.
- ↑ Manu Pubby, Chushul tense: Chinese troops within firing range of Indian soldiers, The Economic Times, 1 September 2020.
- ↑ "Photograph of the memorial". bharat-rakshak.com. Archived from the original on 28 January 2014.
- ↑ "War Memorial of 13 Kumaon". Bharat Rakshak. Archived from the original on 2 February 2014.
- ↑ Thomas Babbington Macaulay. "Lays of Ancient Rome". Gutenberg.org. Retrieved 2016-04-08.
- ↑ Atul Yadav, Injustice to Ahir martyrs of 1962 war, Tribune India, 18 November 1999.