భారత చైనా సరిహద్దు వివాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశానికి చెందిన వివాదాస్పద భూభాగాలను చూపించే మ్యాప్

భారతదేశం, చైనా ల మధ్య రెండు పెద్ద భూభాగాల సార్వభౌమత్వం పైన, అనేక చిన్న చిన్న భూభాగాల పైనా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదమే భారత చైనా సరిహద్దు వివాదం. వివాదాస్పదమైన ఆ రెండు పెద్ద భూభాగాల్లో మొదటిది, అక్సాయ్ చిన్. ఇది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగమని భారతదేశం పేర్కొంటుంది. తన జిన్జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్, టిబెట్ అటానమస్ రీజియన్‌ లలో భాగమని చైనా వాదిస్తుంది. అక్సాయ్ చిన్ కాశ్మీరు, టిబెట్ ప్రాంతంలోని, జనావాసాలు అసలే లేని ఎత్తైన బంజరు భూమి. జిన్జియాంగ్-టిబెట్ హైవే ఈ ప్రాంతం గుండా పోతుంది. రెండవ వివాదాస్పద భూభాగం మెక్‌మహాన్ రేఖకు దక్షిణంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్. దీనిని గతంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు. 1914 లో బ్రిటిషు ఇండియా, టిబెట్ ల మధ్య కుదిరిన 1914 సిమ్లా ఒడంబడికలో మెక్‌మహాన్ రేఖ ఒక భాగం. ఈ ఒప్పందంలో చైనా భాగం కాదు [1] 2020 నాటి స్థితి ప్రకారం, మెక్ మహాన్ రేఖయే చట్టబద్దమైన తూర్పు సరిహద్దు అని భారతదేశం చెబుతోంది. సిమ్లా ఒప్పందంపై సంతకం చేసినప్పుడు టిబెట్ అసలు స్వతంత్రంగానే లేదని పేర్కొంటూ చైనా ఆ సరిహద్దును ఏనాడూ అంగీకరించలేదు.

1962 లో పై రెండు వివాదాస్పద ప్రాంతాలలో భారత చైనాల మధ్య యుద్ధం జరిగింది. చైనా దళాలు పశ్చిమాన లడఖ్‌లోని భారత సరిహద్దు పోస్టులపై దాడి చేసాయి. తూర్పున మెక్‌మహాన్ రేఖను దాటాయి. 1967 లో సిక్కిం ప్రాంతంలో స్వల్ప స్థాయిలో సరిహద్దు ఘర్షణలు జరిగాయి. 1987 లోను, 2013 లోనూ వాస్తవాధీన రేఖకు చెందిన రెండు విభిన్నమైన భావనల కారణంగా రేగబోయిన ఘర్షణలను విజయవంతంగా నివారించగలిగారు. భూటాన్, చైనాల సరిహద్దులో భూటాన్ నియంత్రణలో ఉన్న భూభాగంపై నెలకొన్న ఘర్షణ 2017 లో ఇరుదళాలకూ గాయాలైన తరువాత సమసింప జేసారు. [2] 2020 లో అనేక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల కారణంగా 2020 జూన్‌లో డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. [3]

వివాదాన్ని పరిష్కరించడంలో భాగంగా 1996 లో కుదిరిన ఒప్పందంలో "విశ్వాసం పెంపొందించే చర్యల"ను, వాస్తవాధీన రేఖనూ పొందుపరచారు. 2006 లో ఓ పక్క ఇరువైపులా సైనిక సమీకరణ జరుగుతూండగా[4], భారతదేశంలోని చైనా రాయబారి, అరుణాచల్ ప్రదేశ్ అంతా చైనా భూభాగమేనని చెప్పుకున్నాడు [5] ఆ సమయంలో, ఇరు దేశాలూ సిక్కిం రాష్ట్రపు ఉత్తర కొన వద్ద ఒక కిలోమీటరు చొప్పున చొరబాటు జరిపినట్లు పరస్పరం ఆరోపించుకున్నాయి. [6] సరిహద్దులో అదనపు సైనిక దళాలను మోహరిస్తామని 2009 లో భారత్ ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చైనా "వన్ ఇండియా" విధానాన్ని అంగీకరించాలని 2014 లో భారత్ ప్రతిపాదించింది. [7] [8]

నేపథ్యం[మార్చు]

అక్సాయ్ చిన్[మార్చు]

వివాదాస్పద సరిహద్దుకు పశ్చిమాన ఉన్న భాగం.

అక్సాయ్ చిన్ ఓ నిర్జన ప్రాంతం. ఇది అతి తక్కువ ఎత్తున ఉండే కరాకాష్ నది (సముద్ర మట్టం నుండి 4,300 మీటర్లు) నుండి అత్యధిక ఎత్తున ఉండే హిమానీనదాలతో కూడిన శిఖరాల వరకు (6,900 మీటర్లు) ఉంటుంది. ఇది సుమారు 37,244 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. వేసవికాలంలో ఇక్కడి వాణిజ్య రహదారిపై జింజియాంగ్, టిబెట్ల నుండి వెళ్ళే వర్తకులకు చెందిన యాక్ జంతువుల బిడారులు తప్పించి ఇక్కడ మరో మానవ సంచారం ఉండదు.

పశ్చిమ రంగంలో సరిహద్దులకు సంబంధించిన తొలి ఒప్పందాలలో ఒకటి, 1842 లో కుదిరింది. 1834 లో పంజాబ్ ప్రాంతానికి చెందిన సిక్కు సామ్రాజ్యం లడఖ్ను జమ్మూలో కలుపేసుకుంది. 1841 లో వారు టిబెట్‌పై దాడి చేశారు. చైనా దళాలు సిక్కు సైన్యాన్ని ఓడించి, లడఖ్ లో ప్రవేశించి, లేహ్ ను ముట్టడించాయి. సిక్కు దళాలు వారిని ప్రతిఘటించాక, 1842 సెప్టెంబరులో చైనా, సిక్కు సామ్రాజ్యాలకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సరిహద్దులలో పరస్పరం ఎటువంటి అతిక్రమణలు లేదా జోక్యాలు చేసుకోకూడదని ఈ ఒప్పందంలో రాసుకున్నారు. 1846 లో బ్రిటిషు వారి చేతిలో ఓడిన సిక్కులు లడఖ్ పై సార్వభౌమాధికారాన్ని బ్రిటిషు వారికి అప్పగించారు. దీంతో బ్రిటిషు సామ్రాజ్యానికీ, చైనాకూ మధ్య కొత్తగా ఏర్పడిన సరిహద్దు గురించి చర్చించడానికి చైనా అధికారులతో సమావేశమయ్యేందుకు బ్రిటిషువారు ప్రయత్నించారు. అయితే, సహజ భౌగోళికాంశాలు ఈసరికే సాంప్రదాయికంగా సరిహద్దుని నిర్వచిస్తున్నాయనీ, ఇప్పుడు దాన్ని ప్రత్యేకించి నిర్వచించనవసరం లేదనీ ఇరు పక్షాలూ భావించాయి. సరిహద్దుకు రెండు కొనల వద్ద ఉన్న పాంగాంగ్ సరస్సు, కారకోరం కనుమలు కొంతవరకూ బాగానే నిర్వచించబడినప్పటికీ, మధ్యలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతం మాత్రం అంతగా నిర్వచించబడలేదు. [9]

జాన్సన్ రేఖ[మార్చు]

మధ్య ఆసియా మ్యాపు (1878) ఖోటాన్ (కుడి ఎగువ మూలలో సమీపంలో) చూపిస్తుంది. బ్రిటిషు భారత సామ్రాజ్యం చెప్పే మునుపటి సరిహద్దు పర్పుల్, పింక్ రంగులో చూపిస్తోంది.షహీదుల్లా-కిలిక్, కిలియన్-సంజు కనుమలు సరిహద్దుకు స్పష్టంగా ఉత్తరాన ఉన్నాయి.
అక్సాయ్ చిన్ ప్రాంతంలోని సరిహద్దుపై భారత చైనా వాదనలను, మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ రేఖనూ, ఫారిన్ ఆఫీస్ రేఖనూ, అలాగే 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన ప్రాంతాలనూ ఈ మ్యాపు చూపిస్తుంది.

సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగి అయిన డబ్ల్యూహెచ్ జాన్సన్ 1865 లో "జాన్సన్ రేఖ" ను ప్రతిపాదించాడు. దాని ప్రకారం అక్సాయ్ చిన్ జమ్మూ కాశ్మీర్‌లో అంతర్భాగంగా ఉంటుంది. అది దుంగన్ తిరుగుబాటు జరుగుతున్న సమయం. అప్పటికింకా జిన్జియాంగ్‌ చైనా నియంత్రణలో లేదు. అంచేత ఈ రేఖను చైనీయులకు అసలు చూపించనే లేదు. జాన్సన్ ఈ రేఖను జమ్మూ కాశ్మీర్ మహారాజాకు సమర్పించాడు. దాంతో అతను 18,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తన రాజ్యం లోదే అని పేర్కొన్నాడు [10] మరింత ఉత్తరాన ఉన్న కున్ లూన్ పర్వతాలు, సంజు పాస్ వరకూ ఉన్న భూభాగం కూడా తనదే అని అతడన్నాడని కొన్ని వర్గాల కథనం. జమ్మూ కాశ్మీర్ మహారాజా, షహీదుల్లా (ఆధునిక జైదుల్లా / గ్జైదుల్లా ) వద్ద ఒక కోటను నిర్మించాడు. యాత్రికుల బిడారుల భద్రత కోసం కొన్ని సంవత్సరాల పాటు అక్కడ తన దళాలను ఉంచాడు. చాలా మూలాల్లో షహీదుల్లా, ఎగువ కరాకాష్ నదులను జిన్జియాంగ్ భూభాగం లోనే చూపించాయి (ఇక్కడున్న మ్యాప్ చూడండి). 1880 ల చివరలో ఈ ప్రాంతాన్ని అన్వేషించిన ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్, షహీదుల్లా వద్ద ఒక పాడుబడిన కోట మాత్రమే ఉందని, అక్కడ ఒక్క నివాస గృహం కూడా లేదనీ - ఇది కేవలం ఒక సౌకర్యవంతమైన దారి మజిలీ మాత్రమే ననీ, సంచార కిర్గిజ్ ల కొరకు అనుకూలమైన ప్రధాన కార్యాలయమనీ చెప్పాడు. [11] ఆ పాడుబడిన కోటను కొన్ని సంవత్సరాల క్రితం డోగ్రాలు నిర్మించారు. [12] 1878 లో చైనీయులు జిన్జియాంగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1890 నాటికే వారు షహీదుల్లాను ఆక్రమించుకున్నారు. ] 1892 నాటికి, చైనా కారకోరం కనుమ వద్ద సరిహద్దు గుర్తులను ఏర్పాటు చేసింది. [13]

1897 లో, బ్రిటిషు సైనిక అధికారి సర్ జాన్ అర్డాగ్, యార్కండ్ నదికి ఉత్తరాన కున్ లూన్ పర్వత శిఖరాల వెంట సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. ఆ సమయంలో చైనా బలహీనపడటంతో రష్యా విస్తరించే ప్రమాదం పట్ల బ్రిటన్ ఆందోళనగా ఉంది. అర్డాగ్, తన రేఖ రక్షణను మరింత సమర్థవంతంగా చేసుకోవచ్చని వాదించాడు. అర్డాగ్ రేఖ జాన్సన్ రేఖలో చేసిన మార్పే. దీనిని "జాన్సన్-అర్డాగ్ రేఖ" అని పిలుస్తారు.

మాకార్ట్నీ-మక్డోనాల్డ్ రేఖ[మార్చు]

1893 లో కష్గర్‌ లోని బ్రిటిషు కాన్సల్‌కు హంగ్ టా-చెన్ ఇచ్చిన మ్యాపు. ఇందులో సరిహద్దును సన్నని డాట్-డాష్ గీతతో గుర్తించారు. ఇది జాన్సన్ రేఖకు సరిపోలుతుంది : pp. 73, 78

1893 లో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న చైనా సీనియర్ అధికారి హంగ్ టా-చెన్, కష్గర్‌లోని బ్రిటిషు కాన్సుల్ జనరల్ జార్జ్ మాకార్ట్నీకి ఈ ప్రాంత పటాలను ఇచ్చాడు. ఇది స్థూలంగా సరిపోలుతోంది. 1899 లో, బ్రిటన్ సవరించిన సరిహద్దును ప్రతిపాదించింది. దీనికి మొదట మాకార్ట్నీ సూచించిన దాన్ని తీసుకోగా, తరువాత భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఎల్గిన్ అభివృద్ధి చేసిన దాన్ని తీసుకుంది. ఈ సరిహద్దు ప్రకారం, లక్తాంగ్ శ్రేణికి దక్షిణంగా ఉన్న లింగ్జీ టాంగ్ మైదానాలను భారతదేశం లోను, లక్సాంగ్ శ్రేణికి ఉత్తరాన ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా లోనూ చూపించింది. కారకోరం పర్వతాల వెంట నడిచే ఈ సరిహద్దును బ్రిటిషు అధికారులు ప్రతిపాదించడానికి, మద్దతు ఇవ్వడానికీ అనేక కారణాలూన్నాయి. కారకోరం పర్వతాలు సహజ సరిహద్దును ఏర్పరుస్తున్నాయి, ఇది బ్రిటిషు సరిహద్దులను సింధు నది పరీవాహక ప్రాంతం వరకూ నిర్వచిస్తుంది, తారిమ్ నది పరీవాహకప్రాంతం చైనా నియంత్రణలో ఉంచుతుంది. ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉండడం వలన రష్యా ఆసియా లోకి రావడానికి మరింత అడ్డంకి అవుతుంది. 1899 లో సర్ క్లాడ్ మెక్‌డొనాల్డ్ చైనా వారికి రాసిన నోట్‌లో బ్రిటిషు వారు ఈ రేఖను మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ రేఖ అని పిలిచారు. క్వింగ్ ప్రభుత్వం ఈ నోటుపై స్పందించలేదు. ఇది ఆమోదిత సరిహద్దు అని చైనా ఒప్పుకున్నట్లేనని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. [14] [15]

1899 నుండి 1945 వరకు[మార్చు]

బ్రిటిషు వారి భారతదేశ మ్యాపుల్లో జాన్సన్-అర్డాగ్, మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ రేఖలు రెంటినీ ఉపయోగించారు. [10] కనీసం 1908 వరకు, బ్రిటిషు వారు మాక్డోనాల్డ్ రేఖనే సరిహద్దుగా తీసుకున్నారు. కానీ 1911 లో, జిన్‌హాయి విప్లవం చైనాలో కేంద్ర శక్తి పతనానికి దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, బ్రిటిషు వారు జాన్సన్ రేఖను అధికారికంగా ఉపయోగించారు. అయితే వారు ఔట్‌పోస్టులను స్థాపించడానికి గానీ, భూమిపై వాస్తవ నియంత్రణను నిర్ధారించడానికి గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 1927 లో, బ్రిటిషు ఇండియా ప్రభుత్వం కారకోరం పరిధిలో మరింత దక్షిణంగా ఉన్న ప్రాంతంలో జాన్సన్ రేఖకు బదులు మరొక రేఖను తీసుకోవడంతో ఈ రేఖను మళ్లీ సర్దుబాటు చేసారు. అయితే, పటాలను నవీకరించలేదు. అప్పటికీ అవి జాన్సన్ రేఖనే చూపిస్తుండేవి. [13]

1917 లో చైనా ప్రభుత్వం ప్రచురించిన పోస్టల్ మ్యాప్ ఆఫ్ చైనా. అక్సాయ్ చిన్ లోని సరిహద్దు జాన్సన్ రేఖ ప్రకారం ఉంటుంది.

1917 నుండి 1933 వరకు, పెకింగ్‌లో చైనా ప్రభుత్వం ప్రచురించిన "పోస్టల్ అట్లాస్ ఆఫ్ చైనా", అక్సాయ్ చిన్‌లో సరిహద్దును కున్ లూన్ పర్వతాల వెంట నడిచే జాన్సన్ రేఖ ప్రకారమే చూపించింది. [15] 1925 లో ప్రచురితమైన "పెకింగ్ యూనివర్శిటీ అట్లాస్" కూడా అక్సాయ్ చిన్‌ను భారతదేశంలోనే చూపించింది. : 101  1940-1941లో జిన్జియాంగ్ యుద్దవీరుడు షెంగ్ షికాయ్ కోసం సోవియట్ అధికారులు అక్సాయ్ చిన్‌లో గాలిస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటిషు అధికారులు మళ్ళీ జాన్సన్ రేఖనే సమర్థించారు. [10] ] ఈ సమయానికి కూడా బ్రిటిషు వారు అక్సాయ్ చిన్‌పై అవుట్‌పోస్టులు నిర్మించడానికి గానీ అక్కడ నియంత్రణను ఏర్పాటు చేయడానికి గానీ ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు. చైనా, టిబెట్ ప్రభుత్వాలతో ఈ అంశం గురించి చర్చించనూ లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేనాటికి సరిహద్దును లిఖించలేదు. [13]

1947 నుండి[మార్చు]

1947 లో అక్సాయ్ చిన్ భారతదేశంలో భాగంగా ఉండేది. 1947 లో స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత ప్రభుత్వం పశ్చిమాన తన అధికారిక సరిహద్దును నిర్ణయించింది. అక్సాయ్ చిన్ కూడా భారత్‌లో భాగం గానే అందులో చూపింది. అది అర్డాగ్-జాన్సన్ రేఖను పోలి ఉండేది. కాని చైనా ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. సరిహద్దును నిర్వచించడానికి "ప్రధానంగా దీర్ఘకాలంగా వినియోగంలో ఉండడం, సాంప్రదాయికత"లే భారతదేశానికి ఉన్న ఆధారం. జాన్సన్ రేఖ మాదిరిగా కాకుండా, షహీదుల్లా, ఖోటాన్ సమీపంలో ఉన్న ఉత్తర ప్రాంతాలను భారతదేశం తనవిగా చెప్పలేదు. కారకోరం కనుమ నుండి (ఇది వివాదంలో లేదు), భారతీయ వాదనా రేఖ కారకోరం పర్వతాలకు ఈశాన్యంగా అక్సాయ్ చిన్ ఉప్పు క్షేత్రాలకు ఉత్తరాన విస్తరించి, కున్ లూన్ పర్వతాల వద్ద సరిహద్దును గుర్తిస్తుంది. కరాకాష్ నది, యార్కండ్‌ నది వాటర్‌షెడ్లలో కొంత భాగాన్ని కూడా కలిపి చూపిస్తుంది. అక్కడి నుండి, ఇది తూర్పున కున్ లూన్ పర్వతాల వెంట, నైఋతి దిశగా అక్సాయ్ చిన్ ఉప్పు క్షేత్రాల గుండా, కారకోరం పర్వతాల గుండా, పాంగోంగ్ సరస్సు వైపుకు వెళుతుంది.

1954 జూలై 1 న, ప్రధాని నెహ్రూ అన్ని పొలిమేరల్లోను ఖచ్చితమైన సరిహద్దులను చూపించడానికి భారతదేశ పటాలను సవరించాలని ఒక మెమో రాశాడు. అప్పటి వరకు, జాన్సన్ రేఖ ఆధారంగా అక్సాయ్ చిన్ రంగంలో సరిహద్దు "గుర్తించబడనిది" గా వర్ణించబడింది.

ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్[మార్చు]

కారకోరం కనుమకు పశ్చిమాన జాన్సన్ రేఖను వాడరు. ఇక్కడ పాకిస్తాన్ అధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ ను ఆనుకుని చైనా ఉంది. 1962 అక్టోబర్ 13 న, కారకోరం కనుమకు పశ్చిమాన ఉన్న సరిహద్దు విషయంపై చైనా, పాకిస్తాన్ లు చర్చలు ప్రారంభించాయి. 1963 లో, రెండు దేశాలు తమ సరిహద్దులను చాలావరకు మాకార్ట్నీ-మక్డోనాల్డ్ రేఖ ఆధారంగా పరిష్కరించుకున్నాయి. ఈ రేఖ 5,800 చ.కి.మీ./చైనాలో 5,180 చ.కి.మీ. ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్‌ను చైనాలో చూపించింది. ఒకవేళ కాశ్మీరు వివాదం పరిష్కారమైతే, ఈ విషయమై తిరిగి చర్చలు జరిపాలని ఒప్పందంలో రాసుకున్నప్పటికీ. పాకిస్తాన్, చైనాలకు ఉమ్మడిగా ఒక సరిహద్దు ఉందనే అంశాన్ని భారతదేశం అసలు గుర్తించనే లేదు. 1947 కి పూర్వం ఈ మార్గం, కాశ్మీరు, జమ్మూ రాష్ట్రాలలో భాగంగా పేర్కొంది. అయితే, ఆ ప్రాంతంలో భారతదేశం వాదిస్తున్న రేఖ కారకోరం పర్వతాలకు ఉత్తరాన జాన్సన్ రేఖ వెళ్ళినంత దూరం పోలేదు. ఈ సరిహద్దుల విషయమై చైనా భారతదేశాల మధ్య ఇప్పటికీ వివాదాలున్నాయి.

మెక్‌మహాన్ రేఖ[మార్చు]

ఎరుపు రంగుతో ఉన్న వివాదాస్పద ప్రాంతానికి ఉత్తర సరిహద్దు, మెక్‌మహాన్ రేఖ

మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం (1824–1826) ముగింపులో యాండాబో ఒప్పందం ద్వారా బ్రిటిషు ఇండియా, 1826 లో అస్సాంను స్వాధీనం చేసుకుంది. తరువాతి ఆంగ్లో-బర్మీస్ యుద్ధాల తరువాత, బర్మా మొత్తం బ్రిటిషు వారి చేతికి చిక్కింది. చైనా లోని యునాన్ ప్రావిన్స్‌తో బ్రిటిషు వారికి సరిహద్దు ఏర్పడింది.

1913-14లో, బ్రిటన్, చైనా, టిబెట్ ప్రతినిధులు భారతదేశంలోని సిమ్లాలో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యారు. టిబెట్ స్థితికీ, సరిహద్దులకూ సంబంధించి ఒక ఒప్పందాన్ని రూపొందించారు. తూర్పు రంగంలో టిబెట్‌కు, భారతదేశం మధ్య ప్రతిపాదిత సరిహద్దు అయిన మెక్‌మహాన్ రేఖను, బ్రిటిషు సంధానకర్త హెన్రీ మెక్‌మహాన్ ఈ ఒప్పందానికి అనుసంధానించబడిన పటంలో గీసాడు. ముగ్గురు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకం చేసారు. కాని ఆ తరువాత బీజింగ్, ప్రతిపాదిత చైనా-టిబెట్ సరిహద్దుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తుది, మరింత వివరణాత్మక పటంపై సంతకం చేయడానికి నిరాకరించింది. సంతకం చెయ్యనిదే చైనా ఈ ఒప్పందం ప్రసాదించే హక్కులను పొందలేదని పేర్కొంటూ ఒక నోట్‌ను ఆమోదించిన తరువాత, బ్రిటిషు టిబెటన్ సంధానకర్తలు సిమ్లా కన్వెన్షన్ పైన, మరింత వివరణాత్మక పటంపైనా ద్వైపాక్షిక ఒప్పందంగా సంతకం చేశారు. చైనా నిరాకరిస్తే టిబెటన్లతో ద్వైపాక్షికంగా సంతకం చేయవద్దని మెక్‌మహాన్‌కు ఆదేశాలున్నాయని నెవిల్ మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. కాని మెక్‌మహాన్ చైనా ప్రతినిధి లేకుండానే ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసాడు. ఆ ప్రకటనను రహస్యంగా ఉంచాడు.

భారతదేశ చారిత్రక సరిహద్దులు హిమాలయాలని, హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలు సాంప్రదాయకంగా భారతీయమేననీ, భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నాయనే వాదన, బ్రిటిషు ఇండియా, టిబెట్ లు అంగీకరించిన ఈ సరిహద్దుకు ఆధారమని వికె సింగ్ వాదించాడు. హిమాలయాల ఎత్తైన వాటర్ షెడ్ భారతదేశానికి, దాని ఉత్తర పొరుగు దేశాలకూ మధ్య సరిహద్దుగా ప్రతిపాదించబడింది. హిమాలయాలు భారత ఉపఖండంలోని పురాతన సరిహద్దులు అని, అందువల్ల బ్రిటిషు ఇండియాకు ఆ తరువాత భారత గణతంత్రానికీ ఆధునిక సరిహద్దులుగా ఉండాలనీ భారత ప్రభుత్వం అభిప్రాయపడింది . [16]

1907 లో ఇంగ్లండు రష్యాలకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని సిమ్లా ఒడంబడిక ఉల్లంఘించింది. మధ్యలో చైనా లేకుండా టిబెట్‌తో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోకూడదనేది 1907 ఒప్పందపు సారాంశం. అలాగే 1906 నాటి ఆంగ్లో చైనా ఒప్పందం ప్రకారం బ్రిటన్, టిబెట్‌ను ఆక్రమించుకోరాదు. [17] ఈ నేపథ్యంలో సిమ్లా ఒడంబడిక చట్టబద్ధతపై బ్రిటిషు వారికున్న సందేహాల కారణంగా వారు 1937 వరకూ మెక్‌మహాన్ రేఖను తమ మ్యాపుల్లో చూపించలేదు. 1938 అవరకు అసలు ఆ ఒడింబడిక వివరాలను కూడా ప్రచురించలేదు. 1913 లో టిబెట్ సంతకం చేసిన ఈ ఒడంబడికను తిరస్కరిస్తూ చైనా, 1914 నాటి టిబెట్ ప్రభుత్వం ఒక స్థానిక ప్రభుత్వమని, ఒప్పందం కుదుర్చుకునే అధికారం దానికి లేదనీ చెబుతూ సిమ్లా ఒడంబడిక, మెక్‌మహాన్ రేఖ రెండూ చట్టవిరుద్ధమైనవని చెప్పింది..[18]

1914 లో టిబెటన్ ప్రభుత్వం కొత్త సరిహద్దును అంగీకరించడమనేది, సిమ్లా సమావేశాన్ని చైనా అంగీకరించాలనే షరతుతో కూడుకున్నదని బ్రిటిషు రికార్డులు చూపిస్తున్నాయి. బ్రిటిషు వారు చైనా నుండి అంగీకారం పొందలేక పోయినందున, టిబెటన్లు మెక్‌మహాన్ రేఖ చెల్లదని భావించారు. [19] టిబెటన్ అధికారులు తవాంగ్ లో తమ పరిపాలన కొనసాగించారు. 1938 లో చర్చల సమయంలో ఆ భూభాగాన్ని అప్పగించడానికి నిరాకరించారు. తవాంగ్ "నిస్సందేహంగా బ్రిటిషు వారిదే" అని అస్సాం గవర్నరు నొక్కిచెప్పాడు. కానీ అది "టిబెట్ నియంత్రణలో ఉంది. తాము టిబెటన్లం కాదని అక్కడి ప్రజల్లో ఎవరికీ తెలియదు" అని పేర్కొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, భారతదేశపు తూర్పున జపనీస్ దళాల నుండి ఉన్న ముప్పు, చైనా విస్తరణవాదం నుండి పొంచి ఉన్న ముప్పుల కారణంగా బ్రిటిషు దళాలు అదనపు రక్షణ కోసం తవాంగ్‌ను ఆక్రమించాయి. [13]

సిక్కిం[మార్చు]

1967 నాటి చైనా-భారత సరిహద్దు వివాదం తరువాత భారతదేశం తమ సైనికుడి మృతదేహాన్ని అందుకుంటున్న దృశ్యం

1967 లో భారత, చైనాల మధ్య, అప్పట్లో అప్పటి భారత రక్షిత ప్రాంతంగా ఉన్న సిక్కిం సరిహద్దు వద్ద జరిగిన సైనిక ఘర్షణలే నాథూ లా, చో లా ఘర్షణలు. [20] [21]

1975 లో, సిక్కిం రాచరికం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. దీనిలో సిక్కిమీయులు భారతదేశంలో చేరడానికి అనుకూలంగా ఓటు వేశారు. [22] [23] ఆ సమయంలో చైనా నిరసన వ్యక్తం చేసి, అది చట్టవిరుద్ధమని తిరస్కరించింది. 2003 లో కుదిరిన చైనా-భారత మెమోరాండం ప్రకారం, సిక్కిం విలీనాన్ని చైనా అంగీకరించినట్లేనని భావించారు. [24] భారతదేశంలో భాగంగా సిక్కింను చూపించే మ్యాప్‌ను చైనా ప్రచురించింది. చైనా "సరిహద్దు దేశాలు, ప్రాంతాల" జాబితా నుండి చైనా విదేశాంగ శాఖ సిక్కింను తొలగించింది. అయితే, సిక్కిం-చైనా సరిహద్దుకు ఉత్తర కొసన ఉన్న "ది ఫింగర్" వివాదస్పదంగాను, సైనిక కార్యకలాపాల ప్రదేశంగానూ కొనసాగుతోంది. [6]

"ఇకపై సిక్కిం, చైనా భారతదేశాల మధ్య సమస్య కాదు" అని 2005 లో చైనా ప్రధాన మంత్రి వెన్ జియాబావో అన్నాడు. [25]

సరిహద్దు చర్చలు, వివాదాలు[మార్చు]

1947-1962[మార్చు]

1950 లలో చైనా, జిన్జియాంగ్, పశ్చిమ టిబెట్‌ లను కలుపుతూ 1200 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ఇందులో 179 కిలోమీటర్ల రోడ్డు జాన్సన్ రేఖకు దక్షిణంగా, భారతదేశం తనదని పేర్కొన్న అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా పోయింది. [13] చైనా వైపు నుండి అక్సాయ్ చిన్ కు సులభంగా చేరుకోవచ్చు. కాని కారకోరంకు దక్షిణాన ఉన్న భారతీయులకు, అక్సాయ్ చిన్‌కు వెళ్ళడంలో ఈ పర్వత శ్రేణి ఒక అడ్డంకి. 1957 వరకు చఒనా నిర్మించిన ఈ రహదారి ఉందనే సంగతే భారతీయులకు తెలియదు. 1958 లో చైనా ప్రచురించిన పటాలలో దీన్ని చూపించినప్పుడు ఈ రహదారి ఉనికి ధ్రువపడింది.

భారత వాదనను ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇలా చెప్పాడు: అక్సాయ్ చిన్ "శతాబ్దాలుగా భారతదేశపు లడఖ్ ప్రాంతంలో భాగం". ఈ ఉత్తర సరిహద్దు "కచ్చితమైనది, ఎవరితోనూ చర్చించే విషయమే కాదు" .

చైనా పశ్చిమ సరిహద్దును ఎప్పుడూ గీయలేదని, చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్‌ను చైనాలో ఉన్నట్లుగా చూపించిన మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ రేఖ ఒక్కటే ఇప్పటివరకు చైనా ప్రభుత్వానికి ప్రతిపాదించిన రేఖ అని, అక్సాయ్ చిన్ అప్పటికే చైనాలో భాగంగా ఉందనీ చైనా మంత్రి జౌ ఎన్‌లై వాదించాడు. ఏ చర్చలైనా యథాతథ స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని కూడా అతడు చెప్పాడు.

1960 లో, నెహ్రూ, జౌ ఎన్‌లై లమధ్య జరిగిన ఒప్పందం ఆధారంగా, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి భారత, చైనా అధికారులు చర్చలు జరిపారు. పశ్చిమ రంగంలో సరిహద్దును నిర్వచించే ప్రధాన వాటర్‌షెడ్‌పై భారత, చైనాలు విభేదించాయి. : 96  సరిహద్దులపై వాదనలకు సంబంధించి చైనా చేసే ప్రకటనల్లో మూలాలను తప్పుగా ఉటంకిస్తూంటాయి. [26]

1967 నాథూ లా, చో లా ఘర్షణలు[మార్చు]

నాథూ లా ఘర్షణలు 1967 సెప్టెంబరు 11 న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) నాథూ లా వద్ద భారతీయ పోస్టులపై దాడి చెయ్యడంతో మొదలై, 1967 సెప్టెంబరు 15 వరకు జరిగాయి. 1967 అక్టోబరులో, చో సై వద్ద మరో ముఖాముఖి పోరాటం జరిగింది. అది అదే రోజున ముగిసింది. [27]

స్వతంత్ర వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘర్షణలలో భారత దళాలు "నిర్ణయాత్మక వ్యూహాత్మక ప్రయోజనాన్ని" సాధించాయి. చైనా దళాలను ఓడించాయి. నాథూ లా వద్ద భారత దళాలు అనేక పిఎల్‌ఎ స్థావరాలను నాశనం చేసి. చైనా దళాలను వెనక్కి నెట్టాయి. [28]

1987 భారత చైనా తగువు[మార్చు]

1987 భారత చైనా తగువు చైనా సైన్యం, భారత సైన్యాల మధ్య జరిగిన మూడవ సైనిక వివాదం. ఇది సుమ్‌దొరాంగ్ చు లోయలో జరిగింది. నాథూ లా ఘర్షణలు ముగిసిన 20 సంవత్సరాల తరువాత ఇవి జరిగాయి [29]

1968–2017[మార్చు]

భారత చైనా సరిహద్దు -చుషుల్ (CIA, 1963)

1975 అక్టోబర్ 20 న అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్ లా వద్ద నలుగురు భారతీయ సైనికులు మరణించారు. [30] [31] భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం, అస్సాం రైఫిల్స్ కు చెందిన గస్తీ దళం లోని నాన్-కమిషన్డ్ ఆఫీసరు (ఎన్‌సిఓ), మరో నలుగురు సైనికులూ భారత భూభాగంలోనే ఉన్నప్పటికీ, సుమారు 40 మంది చైనా సైనికులు వారిపై మెరుపుదాడి చేసారు. ఈ ప్రాంతంలో భారత దళాలు అనేక సంవత్సరాలుగా గస్తీ తిరుగుతున్నాయి. అప్పటివరకూ ఏ సంఘటనా జరగలేదు. దళం లోని నలుగురు సభ్యులను చంపినట్లు దౌత్య మార్గాల ద్వారా ధ్రువీకరించుకునేంత వరకు భారత్, వారు తప్పిపోయినట్లుగా ప్రకటించింది. తరువాత వారి మృతదేహాలను చైనా వెనక్కి ఇచ్చింది. భారత ప్రభుత్వం చైనాకు తీవ్ర నిరసనను తెలియచేసింది. [32] 2013 ఏప్రిల్‌లో భారతదేశం తన సొంత అవగాహనను ఉటంకిస్తూ, [33] వాస్తవాధీన రేఖకు భారత్ వైపున 10 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డి వద్ద చైనా దళాలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించింది. ఆ తరువాత ఈ దూరాన్ని 19 కిలోమీటర్లుగా సవరించింది. భారతీయ మీడియా ప్రకారం, ఈ చొరబాటులో పాల్గొన్న దళాలకు సరఫరాలు చేయడానికి చైనా సైనిక హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. అయితే, చైనా అధికారులు ఎటువంటి సరిహద్దు ఉల్లంఘనలూ జరగలేదని ఖండించారు. ఇరు దేశాల సైనికులు ఒకరినొకరు ఎదుర్కొంటున్న సరిహద్దుల వద్ద కొద్దికాలం పాటు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాని మే ప్రారంభంలో ఇరుపక్షాలూ తమ సైనికులను వెనక్కి తీసుకోవడంతో ఉద్రిక్తత తగ్గింది. [34] 2014 సెప్టెంబరులో, లడఖ్‌లోని సరిహద్దు గ్రామమైన దెమ్‌చోక్ వద్ద భారతీయ కార్మికులు ఓ కాలువను నిర్మించడం ప్రారంభించినప్పుడు, చైనా పౌరులు తమ సైన్యం సహకారంతో నిరసన తెలిపారు.భారత, చైనా ల మధ్య వాస్తవాధీనరేఖ వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. దాదాపు మూడు వారాల తరువాత దళాలను ఉపసంహరించుకోవాలని ఇరువర్గాలు అంగీకరించడంతో ఇది ముగిసింది. [35] చైనా సైన్యం భారత భూభాగంలో 3 కిలోమీటర్ల లోపల శిబిరాన్ని ఏర్పాటు చేసిందని భారత సైన్యం పేర్కొంది. ప్రతి చొరబాటుతోనూ చైనా కొత్త భూభాగాన్ని పొందుతోందని బిబిసి వెబ్‌సైట్‌లోని ఒక కథనం పేర్కొంది.

పూర్వపు జమ్మూ కాశ్మీర్ సంస్థానపు వివాదాస్పద భూభాగం. పాకిస్తాన్ (ఆకుపచ్చ), భారతదేశం (నీలం), చైనా (పసుపు) ల అధీనంలో ఉన్న భాగాలు చూడవచ్చు

2015 సెప్టెంబరులో, ఉత్తర లడఖ్‌లోని బర్ట్సే ప్రాంతంలో చైనా, భారత దళాలు పరస్పరం ఎదుర్కొన్నాయి. ఇరుదేశాలూ పరస్పరం అంగీకరించిన గస్తీ రేఖకు దగ్గరగా చైనా నిర్మిస్తున్న వివాదాస్పదమైన వాచ్‌టవర్‌ను భారతీయ దళాలు కూల్చివేయడంతో ఈ ఘటన జరిగింది.

2017 డోక్లాం సైనిక ఉద్రిక్తతలు[మార్చు]

2017 జూన్‌లో, డోకా లా కనుమ సమీపంలో ఉన్న వివాదాస్పద భూభాగమైన డోక్లాంలో భారత, చైనాల మధ్య సైనిక వివాదం జరిగింది. 2017 జూన్ 16 న, చైనీయులు డోక్లాం ప్రాంతానికి భారీ రహదారి నిర్మాణ సామాగ్రిని తీసుకువచ్చారు. వివాదాస్పద ప్రాంతంలో రహదారిని నిర్మించడం ప్రారంభించారు. [36] ఇంతకుముందు చైనా, భారత దళాలున్న డోకా లా వద్ద, ఒక కచ్చా రహదారిని నిర్మించింది. అక్కడి నుండి జంపేరి రిడ్జ్ వద్ద ఉన్న రాయల్ భూటాన్ ఆర్మీ (ఆర్‌బిఎ) స్థావరం వరకూ వారు గస్తీ తిరిగేవారు. జూన్ 16 తరువాత, భారత, భూటాన్ లు వివాదాస్పద భూభాగమని గుర్తించిన డోకా లా క్రింద చైనీయులు ఒక రహదారిని నిర్మించడం ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభమైన రెండు రోజుల తరువాత, జూన్ 18 న, చైనా రహదారి నిర్మాణాన్ని భారత్ అడ్డుకుంది. విస్తృతమైన చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 1988, 1998 లో కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని భూటాన్ పేర్కొంది. [37] డోక్లాం ప్రాంతంలో 1959 మార్చికి ముందున్న స్థితిని కొనసాగించాలని ఆ ఒప్పందాలు పేర్కొన్నాయి. అన్ని దేశాలూ తమ తమ చర్యలను సమర్థించుకుంటూ సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖల నుండి వరుసగా ప్రకటనలు జారీ చేసాయి. 1890 మార్చి 17 న కోల్‌కతాలో సంతకం చేసిన 1890 ఆంగ్లో-చైనీస్ ఒప్పందంతో మొదలిడి, జరిగిన చర్చలన్నిటి లోనూ ఉన్న అస్పష్టతల కారణంగా, సరిహద్దు వివాదంపై తమ తమ వాదనలకు మద్దతుగా వేర్వేరు ఒప్పందాలను ఉటంకిస్తూ ఉన్నాయి. చొరబాటు తరువాత, జూన్ 28 న, చైనా సార్వభౌమ భూభాగంలో జరుగుతున్న రహదారి నిర్మాణాన్ని భారత్ నిలిపివేసిందని చైనా సైన్యం పేర్కొంది. [38] జూన్ 30 న, భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ, యథాతథ స్థితిని ఉల్లంఘిస్తూ చైనా చేపట్టిన రహదారి నిర్మాణం భారతదేశానికి భద్రతాపరమైన చిక్కులను కలిగిస్తుందని పేర్కొంది. [39] జూన్ 16 నాటి స్థితిని పునరుద్ధరించాలని చైనాను కోరుతూ జూలై 5 న భూటాన్, చైనాకు ఒక మెమో పంపింది. [40] జూలై, ఆగస్టు నెలల్లో డోక్లాం సమస్య పరిష్కారం కాలేదు. ఆగస్టు 28 న, డోక్లాం ప్రాంతంలో "త్వరితగతిన వెనక్కి పోవడానికి" ఇరు దేశాలూ అంగీకరించాయని భారతదేశం ఒక ప్రకటన విడుదల చేసింది.

2020 తగువులు[మార్చు]

2020 జూన్‌లో, భారత, చైనా దళాలు గల్వాన్ నది లోయలో ఘర్షణకు పాల్పడ్డాయి. ఇది 20 మంది భారతీయ సైనికుల మరణానికి దారితీసింది. 40 కి పైగా చైనా సైనికులు మరణించారని ప్రకటనలు వచ్చాయి. కాని చైనా అధికారులు ఆ వాదనలను ఖండించారు. [41] [42]

వివాద పరిష్కార విధానం[మార్చు]

ద్వైపాక్షిక ఒప్పందాలు[మార్చు]

సరిహద్దు వివాదాలను దౌత్యపరంగా పరిష్కరించడానికి తగినంత ద్వైపాక్షిక యంత్రాంగాలు ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నాడు. [43] [44] ఈ ఒప్పందాలు ఇవి:

ఇరుదేశాల సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం ఐదు ద్వైపాక్షిక ఒప్పందాలు

 • 1993: వాస్తవాధీన రేఖ వెంట శాంతిని నెలకొల్పాలని ఒప్పందం
 • 1996: వాస్తవాధీన రేఖ వెంట విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకోవాలి
 • 2005: వాస్తవాధీన రేఖ వెంట విశ్వాసాన్ని నెలకొల్పే చర్యలు తీసుకునే పద్ధతులపై ఒక ప్రోటోకోల్
 • 2012: భారత చైనా సరిహద్దు వెంట సంప్రదింపులు, సమన్వయం కోసం ఒక పద్ధతిని ఏర్పాటు చెయ్యడం
 • 2013: సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Hoffmann, India and the China Crisis (1990).
 2. Ramachandran, Sudha (July 15, 2020). "Beijing Asserts a More Aggressive Posture in Its Border Dispute with India". Jamestown Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-17.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. Goldman, Russell (17 June 2020). "India-China Border Dispute: A Conflict Explained". The New York Times. Retrieved 27 June 2020.
 4. Subir Bhaumik, "India to deploy 36,000 extra troops on Chinese border", BBC, 23 November 2010. Archived 2 జనవరి 2012 at the Wayback Machine
 5. "Arunachal Pradesh is our territory": Chinese envoy Rediff India Abroad, 14 November 2006. Archived 8 నవంబరు 2011 at the Wayback Machine
 6. 6.0 6.1 Sudha Ramachandran, "China toys with India's border", Asia Times Online, 27 June 2008. Archived 22 నవంబరు 2009 at the Stanford Web Archive
 7. 何, 宏儒 (2014-06-12). "外長會 印向陸提一個印度政策". 中央通訊社. 新德里. Archived from the original on 27 February 2017. Retrieved 2017-02-27.
 8. "印度外長敦促中國重申「一個印度」政策". BBC 中文网. Archived from the original on 27 February 2017. Retrieved 2017-02-27.
 9. Guruswamy, Mohan (2006). Emerging Trends in India-China Relations. India: Hope India Publications. p. 222. ISBN 978-81-7871-101-0. Archived from the original on 25 June 2016. Retrieved 27 October 2015.
 10. 10.0 10.1 10.2 Mohan Guruswamy, Mohan, "The Great India-China Game", Rediff, 23 June 2003. Archived 30 సెప్టెంబరు 2016 at the Wayback Machine.
 11. Younghusband, Francis E. (1896). The Heart of a Continent. John Murray, London. Facsimile reprint: (2005) Elbiron Classics, pp. 223–224.
 12. Grenard, Fernand (1904). Tibet: The Country and its Inhabitants. Fernand Grenard. Translated by A. Teixeira de Mattos. Originally published by Hutchison and Co., London. 1904. Reprint: Cosmo Publications. Delhi. 1974, pp. 28–30.
 13. 13.0 13.1 13.2 13.3 13.4 Calvin, James Barnard (April 1984). "The China-India Border War". Marine Corps Command and Staff College. Archived from the original on 11 November 2011.
 14. "India-China Border Dispute". GlobalSecurity.org. Archived from the original on 15 February 2015.
 15. 15.0 15.1 Verma, Virendra Sahai (2006). "Sino-Indian Border Dispute At Aksai Chin - A Middle Path For Resolution" (PDF). Journal of Development Alternatives and Area Studies. 25 (3): 6–8. ISSN 1651-9728. Archived from the original (PDF) on 19 అక్టోబరు 2013. Retrieved 4 అక్టోబరు 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "middlepath" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 16. V. K. Singh, Resolving the boundary dispute, india-seminar.com. Archived 18 అక్టోబరు 2006 at the Wayback Machine
 17. Karunakar Gupta. The McMahon Line 1911–45: The British Legacy, The China Quarterly, No. 47. (Jul. – Sep. 1971), pp. 521–545. మూస:JSTOR
 18. Maxwell, India's China War (1970)
 19. Tsering Shakya (1999). The Dragon in the Land of Snows: A History of Modern Tibet Since 1947. Columbia University Press. pp. 279–. ISBN 978-0-231-11814-9. Archived from the original on 30 March 2017. Retrieved 31 March 2017.
 20. Krishnan, Ananth (30 July 2017). "The last Sikkim stand-off: When India gave China a bloody nose in 1967". India Today. Archived from the original on 25 December 2018. Retrieved 27 May 2020.
 21. Rana, Sonal (7 September 2018). "Know about the Nathu La and Cho La clashes of 1967 that inspired Paltan". The Statesman.
 22. "Sikkim (Indien), 14. April 1975 : Abschaffung der Monarchie -- [in German]". www.sudd.ch. Archived from the original on 18 August 2017.
 23. "Sikkim Votes to End Monarchy, Merge With India". The New York Times. 16 April 1975. Archived from the original on 19 August 2017.
 24. D. S. Rajan, "China: An internal Account of Startling Inside Story of Sino-Indian Border Talks", South Asia Analysis Group, 10-June-2008. Archived 13 జూన్ 2010 at the Wayback Machine
 25. Scott, David (2011). Handbook of India's International Relations. Routledge. p. 80. ISBN 9781136811319.
 26. Fisher, Rose & Huttenback, Himalayan Battleground (1963).
 27. M.L.Sali (1998). India-China Border Dispute: A Case Study of the Eastern Sector. 236: APH Publishing. p. 313. ISBN 9788170249641.{{cite book}}: CS1 maint: location (link)
 28. Patranobis, Sutirtho (1 July 2017). "Lessons for India and China from 1967 Nathu La clash". Hindustan Times. Archived from the original on 6 November 2018. Retrieved 27 May 2020.
 29. 1987中印边境冲突:印军最后时刻撤销攻击令 (1987 Sino-Indian skirmish military conflicts) Archived 11 నవంబరు 2009 at the Wayback Machine
 30. https://www.thehindu.com/news/national/forgotten-in-fog-of-war-the-last-firing-on-the-india-china-border/article31827344.ece
 31. https://theprint.in/india/1975-arunachal-ambush-the-last-time-indian-soldiers-died-in-clash-with-china-at-lac/442674/
 32. "Spokesman's Statement" (PDF). Press Information Bureau of India - Archive. 1 November 1975. Retrieved 23 June 2020.
 33. "China's Ladakh Incursion Well-planned". Archived from the original on 19 August 2017.
 34. "India and China 'pull back troops' in disputed border area". BBC News. 2013-05-06. Archived from the original on 13 May 2015. Retrieved 14 September 2015.
 35. Hari Kumar (26 September 2014). "India and China Step Back From Standoff in Kashmir". New York Times. Archived from the original on 20 July 2016.
 36. Manoj Joshi, Doklam: To Start at the Very Beginning Archived 30 అక్టోబరు 2017 at the Wayback Machine
 37. Manoj Joshi, Doklam, Gipmochi, Gyemochen: It’s Hard Making Cartographic Sense of a Geopolitical Quagmire Archived 4 ఆగస్టు 2017 at the Wayback Machine
 38. HT Correspondent Blow by blow: A timeline of India, China face-off over Doklam Archived 7 నవంబరు 2017 at the Wayback Machine
 39. A Staff Writer Doklam standoff ends: A timeline of events over the past 2 months Archived 2 నవంబరు 2017 at the Wayback Machine
 40. Shishir Gupta, Bhutan issues demarche to Beijing, protests over India-China border row Archived 2 నవంబరు 2017 at the Wayback Machine
 41. Gettleman, Jeffrey; Kumar, Hari; Yasir, Sameer (2020-06-16). "3 Indian Soldiers Killed in First Deadly Clash on Chinese Border in Decades". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2020-06-16.
 42. https://zeenews.india.com/india/over-40-chinese-troops-killed-in-galwan-valley-violent-clash-sources-2291138.html
 43. Gill, Prabhjote (29 May 2020). "India says there are five treaties to push the Chinese army behind the Line of Actual Control⁠ – while experts tell Modi to remain cautious". Business Insider. Retrieved 3 June 2020.
 44. Chaudhury, Dipanjan Roy (29 May 2020). "India-China activate 5 pacts to defuse LAC tensions". The Economic Times. Retrieved 3 June 2020.

ఇతర పఠనాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]