వాసవదత్తా పరిణయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసవదత్తా పరిణయము
కృతికర్త: వక్కలంక వీరభద్రకవి
అంకితం: పిఠాపురం మహారాజా రావు పెదమాధవరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: పద్య కావ్యం
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: వివేకవర్ధినీ ముద్రణాలయము, రాజమండ్రి
విడుదల: 1897


వాసవదత్తా పరిణయము[1] అనే ఈ కావ్యాన్ని వక్కలంక వీరభద్రకవి సుమారు సా.శ. 1704 ప్రాంతంలో వ్రాశాడు. ఐదు ఆశ్వాసాలున్న ఈ ప్రౌఢకావ్యానికి సంస్కృత మూలము భాషలోని వాసవదత్తా అనే గద్యకావ్యము. దానిని సుబంధుడు అనే కవి వ్రాశాడు. సంస్కృతకావ్యానికి ఇది స్వేచ్ఛానువాదము. వీరభద్రకవి మూలకథను కొంత అనుసరించి, కొంత అతిక్రమించి, కొంత కుంచించి, కొంత సృష్టించి వాసవదత్తా పరిణయమును రసవంతమైన కావ్యముగా తీర్చిదిద్దాడు. వైదర్భీరీతిలో రచింపబడిన ఈ కావ్యాన్ని కవి తన సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యం 1897లో వీరభద్రకవి వంశీకుడైన వక్కలంక భీమశంకరం రాజమండ్రిలోని వివేకవర్ధినీ ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.

ఇతివృత్తము

[మార్చు]

చింతామణి అనే రాజు యొక్క కుమారుడు కందర్పకేతుడు పాటలీపుత్రానికి అధిపతి. అతడు కలలో సాక్షాత్కరించిన ఒక సుందరిని వలచి, విరహతప్తుడై రాచకార్యాలను విడిచి, సఖుడైన మకరందునితో కలసి వింధ్యాటవికి వెళతాడు. అక్కడ రేవానది దగ్గర ఒక శమీవృక్షము వద్ద విశ్రమించి ఉండగా వారికి శుకశారికల సంభాషణ వినిపిస్తుంది. అక్కడ ఒక చిలుక రెండు గోరింకలు ఉన్నాయి. చిలుక తాను చూచివచ్చిన వింతలను ఒక గోరింకకు తెలుపుతూ, కుసుమపురగాధను ఈ క్రింది విధంగా వివరిస్తుంది.

కుసుమపురానికి శృంగార శేఖరుడు అనేవాడు రాజు. అతని భార్య రాజ్యలక్ష్మి. ఇంద్రుని వరప్రసాదముతో వారికి ఒక కుమార్తె కలుగగా శృంగార శేఖరుడు ఆమెకు వాసవదత్త అని నామకరణం చేస్తాడు. యౌవనవతి అయిన వాసవదత్తకు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ ఆమె ఎవ్వరినీ వరించలేదు. వాసవదత్తకు కలలో పాటలీపుత్రాధిపతి అయిన కందర్పకేతుడు కనిపించగా, ఆమె అతనియందే వలపు నిలిపి విరహ తాపాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ సమయంలో 'తమాలిక' అనే శారిక వాసవదత్తను ఊరడించి, తాను కందర్పకేతుని దగ్గరకు వెడతానని పలుకుతుంది. వాసవదత్త మహదానందంతో ఒక ప్రేమలేఖ వ్రాసి 'తమాలిక'కు ఇస్తుంది. ఆ తమాలికయే తనతో వచ్చిన గోరింక అని చిలుక మొదటి గోరింకకు తెలుపుతుంది.

తమాలిక అనే పేరుకల రెండవ శారిక కందర్పకేతుని గుర్తించి అతని వద్దకు వచ్చి వాసవదత్త ఇచ్చిన ప్రేమలేఖను అందిస్తుంది. తరువాత ఆ గోరింక వాసవదత్త విరహాన్ని అభివర్ణిస్తుంది. కందర్పకేతుడు సంతోషించి మకరంద, శారికా సమేతుడై వాసవదత్త అంతఃపురానికి వెళ్లి వాసవదత్తను చూచి తన స్వప్నసుందరిగా గుర్తిస్తాడు. పరస్పరం అనురాగ వీక్షణాలను కురిపించుకుంటూ వాసవదత్తా కందర్పకేతులు ఇద్దరూ మైమరచి పోతారు. వాసవదత్తను పుష్పకేతుడనే రాజుకు ఇచ్చి వివాహము చేయబోతున్నారన్న వార్త విని కందర్పకేతుడు వాసవదత్తను తీసుకుని పాటలీపుత్రానికి వెళ్తూ రాత్రి వింధ్యాటవిలో విశ్రమిస్తాడు. మరుసటి రోజు ఉదయం కందర్పకేతుడు మేల్కొనే సరికి వాసవదత్త కనిపించదు. అతడెంతగానో దుఃఖిస్తూ, వెదకి వెదకి సముద్రములో ప్రాణత్యాగం చేసుకోబోగా "త్వరలోనే వాసవదత్తను కలుసుకొందువ"ని అశరీరవాణి పలుకుతుంది. కందర్పకేతుడు తీర్థాటనం చేసి చివరకు వింధ్యాటవిలో శిలావిగ్రహంగా మారిన వాసవదత్తను చూచి నివ్వెరపోయి చేతితో తాకగా విగ్రహం సజీవ వాసవదత్తగా మారుతుంది. కందర్పకేతునకు వాసవదత్త క్రింది విధంగా తన కథ తెలుపుతుంది.

వింధ్యాటవిలో కందర్పకేతుడు నిద్రపోతుండగా మేల్కొనిన వాసవదత్త పతికి ఫలాలు సమకూర్చే ఉద్దేశముతో అడవిలోనికి వెళ్ళి రెండు కిరాతసేనల మధ్య చిక్కుకుంటుంది. అది ఒక ముని ఆశ్రమం. వాసవదత్తను స్వాధీనం చేసుకోవడానికి రెండు సేనలు అక్కడ యుద్ధంచేసి ఆశ్రమ ప్రాంతాన్ని బీభత్సం చేస్తాయి. ముని వచ్చి చూచి ఆ మారణహోమానికి కారణమైన వాసవదత్తను శిలగా మారిపొమ్మని శాపమిస్తాడు. తరువాత జాలిపడి భర్త హస్తస్పర్శతో శాపవిమోచనమవుతుందని చెప్తాడు. కాబట్టి కందర్పకేతుని వల్ల వాసవదత్త యథారూపం పొందింది.

ఇది ఇట్లుండగా కుసుమపురంలో శృంగార శేఖరుడు వాసవదత్తను వెదకడానికి చారులను పంపి విషయము తెలుసుకొని, వారిరువురిని పిలిపించి కందర్పకేతునకు, వాసవదత్తకు వివాహం జరిపిస్తాడు.

వర్ణనలు

[మార్చు]

ఈ కావ్యంలో దండి 'కావ్యాదర్శము' లో పేర్కొన్న ఆష్టాదశ వర్ణనలేకాక, అప్పకవి చెప్పిన ఇరువది రెండు వర్ణనలలో కొన్ని, 'అలంకార శేఖరము'లో పేర్కొన్న ముప్పదిరెండు వర్ణనలలో కొన్ని, కాదంబరి, వసుచరిత్రలను ఆదర్శముగా తీసుకొని మరికొన్ని వర్ణనలు వక్కలంక వీరభద్రకవి చేశాడు. ఆ వర్ణనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1) పాటలీపుత్ర నగర వర్ణన, 2) కుసుమపుర నగర వర్ణన, 3) లవణ సముద్ర వర్ణన, 4) వింధ్యశైల వర్ణన, 5) వసంత ఋతు వర్ణన, 6) గ్రీష్మ ఋతు వర్ణన, 7) వర్ష ఋతు వర్ణన, 8) చంద్రోదయ వర్ణన, 9) సూర్యోదయ వర్ణన, 10) ఉద్యానవన వర్ణన, 11) జలక్రీడ వర్ణన, 12) మధుపాన వర్ణన, 13) రతోత్సవ వర్ణన, 14) విప్రలంబ వర్ణన, 15) వివాహ వర్ణన, 16) కుమారోదయ వర్ణన, 17) మంత్రాలోచన వర్ణన, 18) ద్యూత వర్ణన, 19) ప్రయాణ వర్ణన, 20) యుద్ధ వర్ణన, 21) నాయకాభ్యుదయ వర్ణన, 22) కన్యాంగ సౌందర్య వర్ణన, 23) దౌహృద వర్ణన, 24) రాజ వర్ణన, 25) రాజ్ఞీ వర్ణన, 26) నదీ వర్ణన, 27) సరోవర వర్ణన, 28) వనీ వర్ణన, 29) హయ వర్ణన, 30) స్వయంవర వర్ణన, 31) పుష్పాచయ వర్ణన, 32) సూతికాగృహ వర్ణన, 33) బాలెంత వర్ణన, 34) మన్మథపూజ వర్ణన, 35) పుష్పదోహద వర్ణన.

అలంకారములు

[మార్చు]

ఈ కావ్యములో వీరభద్రకవి అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు విరివిగా వాడాడు. పరిసంఖ్యాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, శ్లేషాలంకారము, ఉపమాలంకారము, సూక్ష్మాలంకారము, సందేహాలంకారము, యమకాలంకారము మొదలైనవి ఈ కావ్యములో చూడవచ్చు.

రసము

[మార్చు]

ఈ కావ్యములో శృంగారము అంగిరసము. వీర, రౌద్ర, భయానకము మొదలైనవి అంగరసములు. పది రకములైన మన్మథావస్థలు ఈ కావ్యములో వర్ణించబడ్డవి. అవి వరుసగా దర్శనము, మనస్సంగమము, సంకల్పము, జాగరము, కృశత్వము, అరతి, హ్రీత్యాగము, ఉన్మాదము, మరణవ్యవసాయము, మూర్చ.

కొన్ని పద్యాలు

[మార్చు]

చ|| అజనిజ సృష్టి కాదియయి, హవ్యముగైకొని సోమయాజియై
    గజిబిజి రేయునుం బగలుఁ గల్పనచేయుచు శబ్ద హేతువై
    త్రిజగదణుత్వ సిద్ది ప్రకృతిత్వము గైకొని పోల్చు నా పృష
    ధ్వజుఁడణుఁడష్టమూర్తి ప్రమదం బొసఁగున్ గృతకర్తకీయెడన్

చ|| తరుణి యొకర్తి ఱేని తమిఁదప్పక జూచి తదీయ రూపమో
    వరిని లిఖించి తన్నచట వ్రాయగఁ దద్విభుఁ డండజేర న
    గ్గురుకుచ నేర్పుతో నృపునకుస్సుమచాపము చేత వ్రాసె న
    ద్దీర యది యెంత ప్రౌఢసుదతీమణియో పరికించి చూడగన్

మూలాలు

[మార్చు]
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973