వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు | |
---|---|
జననం | 1761, ఏప్రిల్ 27 |
మరణం | 1817, ఆగష్టు 17 |
క్రియాశీలక సంవత్సరాలు | 1783 - 1816 A.D |
ప్రసిద్ధి | అమరావతి ప్రభువు |
తల్లిదండ్రులు | జగ్గ భూపతి, అచ్చమాంబ |
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ( 1761 ఏప్రిల్ 27 - 1817 ఆగష్టు 17) అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, గుంటూరు ప్రాంతం పరిపాలించిన కమ్మ రాజు. వాసిరెడ్డి నాయక రాజులలో ప్రసిద్ధి పొందిన ప్రభువు. అమరావతి సంస్థాన పాలకుడు. కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించాడు.
జననం
[మార్చు]వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1761, ఏప్రిల్ 27 న జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించాడు.
చరిత్ర
[మార్చు]సా.శ. 1413 నుండి తీరాంధ్రదేశంలోని ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. ఈ వంశం వారందరికి చాళుక్య నారాయణ అనే బిరుదును బట్టి వీరు చాళుక్య వంశానికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి రాజధాని. కమ్మ కులానికి చెందిన వాసిరెడ్డి వంశం వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగా ఉన్నారు..
రాజ్యాభిషేకం
[మార్చు]వేంకటాద్రి నాయుడు సా.శ. 1783 లో పరిపాలన చేపట్టారు. ఇతని పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉన్నాయి. అయితే 1214 ఫసలీ ప్రకారం వాటిలో 22 గ్రామాలు ఇతరులకు విక్రయించినట్లు ఉంది. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధాని. ఇతను నిజాం సుల్తాన్ నుండి 'మన్నె సుల్తాన్, మనసబ్ దార్ ' అనే బిరుదులు పొందాడు.[1]
సా.శ. 1791-92లో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామాలలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరం తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు ఏడు సంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణాలు ప్రజల కొరకు వినియోగించుటకు బ్రిటీషు ప్రభుత్వానికి తెలియచేశాడు. మచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయం మరుగున పడింది[1].
అమరావతి
[మార్చు]వేంకటాద్రి నాయుని సైన్యంలో మూడు వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. సామంతులు, జమిందారుల తిరుబాటు చేస్తారన్న సాకుతో వారి సైనిక బలం తగ్గించటానికి బ్రిటీషు ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన వేంకటాద్రి నాయుడు గుంటూరు మండలంలోని ధరణికోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణం, రాజ భవనాలు కట్టించి రాజధానిని 1796 లో చింతపల్లి నుండి తరలించారు. 1797లో అమరావతి పట్టణం దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధాలుగా పొగిడాడు[2].
వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనాలు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానాలు జరుగుతుండేవి.
పిండారీల అణిచివేత
[మార్చు]1816లో పిండారీ దండులను సమర్థవంతంగా ఎదుర్కొని తన ప్రాంతాలలో అడుగు పెట్టనివ్వని పాలకుడు వేంకటాద్రినాయుడు.[3] వేంకటాద్రి పాలనలో పిండారిలతో పాటు స్థానికంగా చెంచులు దారిదోపిడులు చేయుచూ సామాన్య ప్రజలను బాధించేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధించాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది. ఆ తరువాత దీనికి పశ్చాత్తాపం చెంది తన శేషజీవితం అమరేశ్వరుని చెంత గడిపాడు.[1]
దేవాలయాల నిర్మాణం
[మార్చు]కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 దేవాలయాలు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. అమరావతి లోని అమరేశ్వర దేవాలయం పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు. ఇది 15 మీటర్లు (49 అడుగులు) వెడల్పు, 46.7 మీటర్లు (153 అడుగులు) ఏత్తు కలిగి దేశంలో ఉన్న రాజ గోపురాలలో ద్వితీయ స్థానంలో ఉంది.1803 లో బాపట్ల లోని భావన్నారాయణ స్వామి ఆలయానికి భూదానం చేసాడు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించాడు. గుంటూరు రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసలిలో ఉంది[1].
అతను చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించాడు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించాడు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశాడు. వేంకటాద్రి నాయుడితో పాటుగా అతని మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు సా.శ.1802, మరికొన్ని సా.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.[4] 1806 లో వీరు ఒకసారి బంగారంతోనూ, రెండు సార్లు వెండితోనూ తులాభారం తూగి పండితులకు పంచిపెట్టాడు. 66 గ్రామాలలో బ్రాహ్మణ అగ్రహారాలు ఏర్పాటు చేసాడు. ఇవి కాకుండా మరో 30 గ్రామాలలో నాయుడు చేసిన దానాల గురించి లోకల్ రికార్డులలో ఉన్నాయి[1].
నూతన జనవాసాల నిర్మాణం
[మార్చు]అతని తండ్రి జగ్గ భూపతి పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు.తల్లి అచ్చమాంబ పేరు తో అచ్చంపేట అనే గ్రామాన్ని నిర్మించాడు. తన పేరుతో రాజాపేట, నాయుడి పేట నిర్మించాడు[1],
మరణం
[మార్చు]వేంకటాద్రి నాయుడు తన శేషజీవితం అమరేశ్వరుని పాదాలకాడ గడిపాడు. అతను 1817, ఆగష్టు 17 న మరణించాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఇద్దరికి సంతానం కలుగనందున జగన్నాధబాబు, రామనాధబాబు అనే ఇద్దరిని దత్తుతీసుకున్నాడు. ఇతని తదనంతరం జగన్నాధ బాబు పాలనలోకి వచ్చాడు.
గుర్తింపు
[మార్చు]- ధరణికోట - అమరావతి లో 1968 లో స్థాపించిన కళాశాలకు 'రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుని కళాశాల ' గా పేరు పెట్టారు
- ముదిగొండ శివప్రసాదు నాయుడుపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశాడు.నాయుడు వంశీయులు రాజావాసిరెడ్డి ఫౌండేషన్ ఏర్పరచి సాహిత్య సేవ గావిస్తున్నారు.
- 2021 లో నవలా రచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి రాసిన చారిత్రాత్మక, ఉద్యమ నవల పొత్తికి రాజా వాసిరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం అందించారు.
వనరులు
[మార్చు]- శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు (Sri Raja Vasireddy Venkadadri Nayudu by K. Lakshminarayana 1963, Ponnuru.)
- http://www.vasireddy.us/history.asp Archived 2009-01-30 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మవారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లికేషన్. pp. 158–160.
- ↑ Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115
- ↑ The Journal of Asian Studies: Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159
- ↑ లక్ష్మీనారాయణ, కొడాలి (1967). చారిత్రిక శ్రీశైలము (ప్రథమ ప్రచురణ ed.).