వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 43వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. బావా ఎప్పుడు వచ్చితీవు.., చెల్లియో చెల్లకో.., జెండాపై కపిరాజు.. వంటి పద్యాల ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.


దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు. ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.


వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి