వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 30వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింగళి నాగేంద్రరావు (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత, పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. సి.ఐ.డి, శ్రీ కృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, మహాకవి కాళిదాసు, పెళ్ళినాటి ప్రమాణాలు, మాయా బజార్, మిస్సమ్మ, చంద్రహారం, పాతాళ భైరవి, గుణసుందరి కథ, వింధ్యరాణి, శ్రీకృష్ణ లీలలు, అప్పు చేసి పప్పు కూడు వంటి చిత్రాలకు రచయిత పింగళి.


ఆయన 1901 డిసెంబర్ 29న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. పింగళికి రెండేళ్ళ వయసులో బందరుకు వారి కుటుంబం బందరుకు వలస వెళ్ళారు. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.


1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్ లోని రైల్వే వర్క్‌షాపులో అప్రెంటీస్ గా చేరాడు. ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావు గారి జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాల ఫలితంగా 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది. ఉత్తరదేశం పర్యటించి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. అసలే బ్రహ్మచారి, అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమంవారు అనుమతించలేదు. నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్న కాంగ్రెసు సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు... పింగళి నాటకాలు ఇటీవల పింగళీయం పేరుతో వెలువఢ్డాయి.

పూర్తి వ్యాసము, పాతవి