వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 38వ వారం
1955, జూలై 27న సిడ్నీలో జన్మించిన అలాన్ బోర్డర్ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. తన క్రీడాజీవితంలో 156 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 11,174 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. (టెస్ట్ సంఖ్యలో స్టీవ్ వా, పరుగులలో బ్రియాన్ లారాలు తని రికార్డును తరువాత అధికమించారు). 27 టెస్ట్ సెంచరీలు, 6524 వన్డే పరుగులు సాధించి అందులోనూ అధికుడు అనిపించుకున్నాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేసి 1993 వరకు సుమారు 16 సంవత్సరాలు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినాడు.
16 సంవత్సరాల ప్రాయంలో సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో ఎడమచేతి స్పిన్నర్‌గా ప్రవేశించాడు. బ్యాటింగ్‌లో 9 వ స్థానంలో వచ్చేవాడు. 1972-73లో సంయుక్త పాఠశాలల జట్టులోకి ఎంపైకైనాడు. 1975-76లో బోర్డర్ 600 పైగా పరుగులు సాధించడమే కాకుండా వరుసగా రెండు శతకాలు కూడా చేసి NSW టీంలోకి ఆహ్వానించబడ్డాడు. 1977 జనవరిలో బోర్డర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో క్వీన్స్‌లాండ్ పై ఆడి 36 పరుగులు చేసి, 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.
1977లో ప్రపంచ సీరీస్ క్రికెట్ ఒప్పందం వలన పలు క్రికెటర్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు మరియు టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో బోర్డర్ 1978-79 సీరీస్‌లో రంగప్రవేశం చేసి పెర్త్ లో పశ్చిమ ఆస్ట్రేలియాపై ఆడుతూ 135 పరుగులు, విక్టోరియాపై 114 పరుగులు సాధించాడు. ఆ తరువాత ఇంగ్లాడుపై 1979 డిసెంబర్ లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టునుంచి తొలిగించబడ్డాడు. తరువాత పాకిస్తాన్ తో జరిగిన సీరీస్‌కు మళ్ళీ పిలుపు అందింది. మెల్బోర్న్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి సెంచరీని పూర్తిచేశాడు. దాంతో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్లకు 305 పరుగులకు చేరింది. 382 పరుగులు చేస్తే గెలిచే మ్యాచ్‌లో చివరి 7 వికెట్లు 5 పరుగుల తేడాతో పడిపోవడంతో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి