వినూమన్కడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినూ మన్కడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మూల్వంత్‌రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్
పుట్టిన తేదీ(1917-04-12)1917 ఏప్రిల్ 12
జామ్‌నగర్
మరణించిన తేదీ1978 ఆగస్టు 21(1978-08-21) (వయసు 61)
ముంబై
మారుపేరువినూ
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 30)1946 జూన్ 22 - ఇంగ్లాండు తో
చివరి టెస్టు1959 ఫిబ్రవరి 11 - వెస్ట్ ఇండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1935–1936వెస్ట్రన్ ఇండియా
1936–1942నవ్‌నగర్
1936–1946హిందూస్
1943–1944మహారాష్ట్ర
1944–1951గుజరాత్
1948–1949బెంగాల్
1950–1951సౌరాష్ట్ర
1951–1956బాంబే
1956–1962రాజస్థాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 44 233
చేసిన పరుగులు 2,109 11,591
బ్యాటింగు సగటు 31.47 34.70
100లు/50లు 5/6 26/52
అత్యధిక స్కోరు 231 231
వేసిన బంతులు 14,686 50,122
వికెట్లు 162 782
బౌలింగు సగటు 32.32 24.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 8 38
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 9
అత్యుత్తమ బౌలింగు 8/52 8/35
క్యాచ్‌లు/స్టంపింగులు 33/– 190/–
మూలం: Cricinfo, 2009 జూన్ 24

వినూమన్కడ్ (ఏప్రిల్ 12, 1917 - ఆగష్టు 21, 1978) భారత మాజీ క్రికెట్ ఆటగాడు.

వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ ఏప్రిల్ 12, 1917లో జన్మించాడు. భారతదేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.

ఉత్తమ ప్రదర్శన[మార్చు]

మన్కడ్ యొక్క ఉత్తమ ప్రతిభ గురించి 1952 సం.లో ఇంగ్లాండుతో జరిగిన లార్డ్స్ టెస్ట్ సంఘటన చెప్పుకోవాలి. ఆ టెస్ట్ మొదటి ఇన్నింగ్సులో మన్కడ్ 72 పరుగులు చేసి, 73 ఓవర్లు బౌలింగ్ వేసి 196 పరుగులక్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్సులో 184 పరుగులు చేసి 378 పరుగులు చేసిన భారత జట్టులో టాప్‌స్కోరర్ గా నిల్చాడు. ఈ టెస్టులో ఇంగ్లాండు గెల్చిననూ అతని ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఒకే టెస్టులో 100 పరుగులు, 5 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతకు ముందు 30 సం.లలో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.

అతని పాత్రను మెచ్చుకోదగిన మరో సఘటన అదే సం.లో జరిగిన మద్రాసు టెస్ట్. ఇంగ్లాండుతో జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 8 వికెట్లు (55 పరుగులు ఇచ్చి), రెండో ఇన్నింగ్సులో 4 వికెట్లు (53 పరుగులకు) సాధించి భారత జట్టు గెలవడాన్కి దోహదంచేశాడు. భారత్ కు అదే తొలి టెస్టు విజయం కావడం, అందులో అతని సహకారం ఉండటం విశేషం.

ప్రపంచ రికార్డు భాగస్వామ్యం[మార్చు]

1956లో న్యూజీలాండ్తో చెన్నై (పూర్వపు మద్రాసు) లో జరిగిన టెస్టులో అతని ఇన్నింగ్స్ జీవితంలోనే అత్యుత్తమమైనది. పంకజ్ రాయ్తో కల్సి ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి వికెట్ కు 413 పరుగుల భాగస్వామ్యం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 2008, ఫిబ్రవరి 29 నాడు దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు 415 పరుగులు జోడించేవరకు తొలి వికెట్ కు ప్రపంచ రికార్డుగా కొనసాగింది. అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు.

టెస్ట్ నాయకత్వం[మార్చు]

మన్కడ్ మొత్తం ఆరు టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించి అందులో 5 టెస్టులను డ్రాగా ముగించగా మరో టెస్ట్‌లో పరాజయం లభించింది

మన్కడింగ్[మార్చు]

1947/48లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండో టెస్టులో మన్కడ్, బిల్ బ్రౌన్‌ను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేయడంతో వివాదం రేగింది. మన్కడ్ తన బౌలింగ్ రనప్ తీసుకుంటూ బంతిని వేయబోయే ముందు, కాస్త ఆగి, బ్రౌన్ తన క్రీజులో లేకపోవడంతో, వికెట్‌లను పడేసాడు.[1] ఆ పర్యటనలో అంతకుముందు ఆస్ట్రేలియన్ XIతో జరిగిన ఆటలో కూడా అతను బ్రౌన్‌ను అలాగే ఔట్ చేసాడు. కానీ బ్రౌన్‌ను అలా ఔట్‌ చేయడం ఈసారి ఆస్ట్రేలియా మీడియాకు కోపం తెప్పించింది. ఈ విధంగా నాన్ స్ట్రైకింగు వైపు ఉన్న ఆటగాణ్ణి ఇలా రనౌట్ చెయ్యడాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా "మన్‌కడింగ్" అని అంటున్నారు.[2] ఈ చర్య క్రికెట్ చట్టాలను ఉల్లంఘించనప్పటికీ, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైనదిగా కొంతమంది భావించారు.


అయితే, ప్రఖ్యాత క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ తన ఆత్మకథలో మన్కడ్ చర్యను సమర్థిస్తూ ఇలా రాసాడు:

[పత్రికలు] అతని క్రీడాస్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించాయో నాకు ఎంతకీ అర్థం కాలేదు. బౌలరు డెలివరీ వేసేవరకూ నాన్-స్ట్రైకరు అతని క్రీజులోనే ఉండాలని క్రికెట్ చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. లేకపోతే, బౌలరు అతన్ని రనౌట్ చేసే నిబంధన ఎందుకు ఉందసలు? చాలా దూరం లేదా చాలా ముందుగానే పరుగు తీయడం ద్వారా, నాన్-స్ట్రైకరు చాలా స్పష్టంగా అన్యాయమైన ప్రయోజనాన్ని పొందుతున్నాడు.

ఇది సంపూర్ణంగా చట్టబద్ధమే ఐనప్పటికీ, సంప్రదాయం ప్రకారం, బౌలరు బ్యాట్స్‌మన్‌ను ఆ పద్ధతిలో అవుట్ చేయడానికి ముందు కనీసం హెచ్చరించాలని కొందరు వాదిస్తారు. మన్కడ్ కూడా బ్రౌన్‌ని ఇలా ఔట్ చేయడానికి ముందు, అంతకు ముందు జరిగిన గేమ్‌లో స్వయంగా హెచ్చరించాడు.[3] కోర్ట్నీ వాల్ష్ కూడా 1987 ప్రపంచ కప్‌లో, అలా ముందే పరుగుతీసే ప్రయత్నం చేసిన సలీమ్ జాఫర్‌ను ఔట్ చెయ్యకుండా, హెచ్చరిక చేసాడు.

మన్కడింగు పూర్తిగా చట్టబద్ధమే అని మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ అన్నాడు. క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకం అనే ధోరణిలో దానికి మన్కడింగ్ అని పేరు పెట్టడం సరికాదన్నాడు. తప్పేదేమైనా ఉంటే అది బ్రౌన్‌ది. మన్కడ్‌ది కాదు అని గవాస్కర్ అన్నాడు. ఐసిసి, ఈ విధంగా రనౌట్ చెయ్యడం తప్పని చెప్పనప్పటికీ దాన్ని క్రీడాస్ఫూర్తి లేని అంశంగా చట్టాల్లో నిర్వచించింది. అయితే 2022 లో చట్టాలను మార్చి, మన్కడింగ్ అనేది పూర్తి చట్టబద్ధమైన రనౌటేనని తేల్చి చెప్పింది.[4]

నిష్క్రమణ[మార్చు]

సుమారు 13 సం.లు భారత జట్టుకు తన సేవలందించి 1959లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. 1978, ఆగష్టు 21 న ఇతను మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "The man behind the 'Mankad'". Daily News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  2. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 131–132. ISBN 978-1-84607-880-4.
  3. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 131–132. ISBN 978-1-84607-880-4.
  4. "ఉమ్మిపై నిషేధం శాశ్వతం". ఈనాడు. Archived from the original on 2022-09-21. Retrieved 2023-09-11.