వెన్నెలకంటి సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెలకంటి సుబ్బారావు

వెన్నెలకంటి సుబ్బారావు (1784 నవంబర్ 28, - 1839 అక్టోబరు 1) ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్తగా ప్రఖ్యాతి పొందాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వెన్నెలకంటి సుబ్బారావు పూర్వీకులది నెల్లూరు ప్రాంతానికి చెందిన ఇందుకూరుపేట సముద్రతీరంలోని నిడిముసలి గ్రామం. 1784, నవంబర్ 28 న నేటి ప్రకాశం జిల్లాలోని ఓగూరు గ్రామంలో సుబ్బారావు జన్మించాడు. తల్లి వెంకమ్మ, తండ్రి జోగన్న. సుబ్బారావుకు తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో, మేనమామ తమ గ్రామమైన ఓగూరు తీసుకెళ్లి చదివించాడు. 1795లో మేనత్త కుమారుడు ఒంగోలు గోపాలకృష్ణయ్యతో కలసి బందరు పట్టణం చేరి, మరో మేనత్త కుమారుడు మంచెళ్ల పాపయ్య వద్ద సర్కారు లేఖలు రాసే పద్ధతులు నేర్చుకున్నాడు.[1]

వృత్తి

[మార్చు]

అప్పటికే బందరు ఇంగ్లీషువారి ఆధీనంలో ఉండేది. అక్కడ కలెక్టర్ వద్ద సుబ్బారావు గుమస్తాగా ఉద్యోగజీవితం ప్రారంభించాడు. 1797లో పాపయ్య కుమార్తెను వివాహం చేసుకున్నాక పాపయ్య మరణించాడు. తిరిగి సుబ్బారావు బూడిపాటి వెంకటాచలం వద్ద ఇంగ్లీషుభాషను నేర్చుకున్నాడు. తర్వాత గుంటూరు వెళ్లి పెరియతంబి పిళ్లై సహకారంతో పే-మాస్టర్ విల్సన్ వద్ద నెలకు ఒక వరహా జీతంతో సర్కారుజాబులు రాసేందుకు చేరాడు. అనంతరం అతను దుబాసీ (ద్విభాషి-ఇంటర్ప్రిటర్) గా మారాడు. ఆ ఘటన అతని జీవితాన్ని మలుపుతిప్పింది.

అప్పట్లో దత్తమండలాలుగా ఉన్న కడప-కర్నూలు-బళ్ళారి జిల్లాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోనూ, ఆ తర్వాత మంగళూరు కలెక్టర్ కచేరీలోనూ, 1806లో కసరా జిల్లాలోనూ దుబాసీగా పనిచేశాడు. మంగళూరులో రిజిస్ట్రార్ గా ఉన్న మెక్ రెల్ కు తెలుగుభాష నేర్పాడు. శ్రీరంగపట్టణంలోని జిల్లాకోర్టులో హెడ్ ఇంగ్లీషు రైటరుగా చేరి ఎంతో దీక్షాదక్షతలతో పనిచేసి మైసూరు మహారాజా సత్కారాలు పొందాడు. అనారోగ్య కారణాల రీత్యా నెల్లూరు చేరుకుని కలెక్టర్ ఫ్రేజర్ వద్ద ఉద్యోగంలో చేరి చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తిగా పేరొందాడు. 1815కే మాతృభాష తెలుగుతో పాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ (హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీం కోర్టులో 14 సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశాడు.

రచన రంగం

[మార్చు]

తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైనా సుబ్బారావు పంతులు వ్యాకరణ రచనలు, అనువాదాలు, స్వీయచరిత్ర రచన వంటివి సాగించాడు. ఆంగ్లభాషలో నిష్ణాతుడైన వెన్నెలకంటి సుబ్బారావు తన స్వీయచరిత్రను రాసుకున్నాడు. డైరీలు కూడా రాసుకోని సుబ్బారావు స్వీయచరిత్రలో వివరాలన్నీ పూసగుచ్చినట్టు తారీఖులతో సహా రాసుకోవడం విశేషం.120పేజీలు ఉన్న ఈ స్వీయచరిత్రను అతని కుమారుడు తిరువళ్ళూరు జిల్లా మున్సిఫ్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు 1873లో మద్రాసు ఫాస్టర్ ప్రెస్లో ముద్రించాడు. "ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు 1784-1839" గా సుబ్బారావు మరణానంతరం ప్రచురితమైన ఈ గ్రంథం అచ్చులోకి వచ్చిన తొలి తెలుగువాడి ఆత్మకథగానే కాక ఆంగ్లభాషలో ముద్రితమైన తొలి ఆత్మకథగానూ చారిత్రిక ప్రఖ్యాతి వహించిందని నెల్లూరు ప్రాంత చరిత్రను గురించి పరిశోధించిన ప్రముఖ చరిత్రకారుడు ఈతకోట సుబ్బారావు పేర్కొన్నారు.[2]

ఈ గ్రంథంలో కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) పాలన తొలినాళ్లలో సామాజిక, రాజకీయ స్థితిగతులు, ఆనాటి దక్షిణభారత దేశపరిస్థితులు వంటివి ఎన్నో తెలుస్తాయి. చారిత్రికంగా ప్రఖ్యాతి పొందిన ఈ ఆత్మకథను తెలుగులోకి అక్కిరాజు రమాపతిరావు అనువదించారు.

ఇతర రచనలు

[మార్చు]

1806 ప్రాంతాల్లో మంగళూరులో రిజిస్ట్రారుగా పనిచేసిన మెక్ రెల్ తో కలిసి కన్నడభాష వ్యాకరణం రచించారు. 1820ల్లో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో సభ్యత్వం స్వీకరించిన సుబ్బారావు చిన్నారులకు ఉపయోగపడే పలు వాచకాలను తెలుగులోకి అనువదించారు.

సమాజ సేవ

[మార్చు]

ఆనాటి కంపెనీ పాలనలో ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన సుబ్బారావు సమాజసేవలో కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ ప్రాంతంలో బాటసారులకు మజిలీ చేసే సౌకర్యాలు లేకపోవడం గమనించిన సుబ్బారావు సత్రం కట్టించారు. ఆ సత్రానికి తన భార్య కనకమ్మ పేరిట "కనకమ్మ సత్రం"గా నామకరణం చేశాడు. ఎన్నో ఏళ్ల పాటు దారినపోయే బాటసారులకు మజిలీగా ఉపయోగపడిన ఆ సత్రం అటువైపు నుంచి రహదారులు వేరేవైపుకు మారిపోగా వందల ఏళ్లకు నిరుపయోగమై శిథిలావస్థకు చేరుకుంది. ఆ స్థితిలో సత్రం ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో పాదయాత్రికుడు ప్రొఫెసర్ ఆదినారాయణ 2010 ఆ ప్రాంతాల్లో కనుగొన్నాడు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు గ్రంథాన్ని, ఆనాటి కంపెనీ కాలంలోని స్పష్టాస్పష్టమైన మాపులను ఆధారంగా తీసుకుని కాలగర్భంలో కలిసిపోయిన రాజమార్గాలను సాహిత్యాధారాలతో ఊహించి ఆ సత్రాన్ని కనుగొన్నాడు.[3]

వెన్నెలకంటి సుబ్బారావు ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించాడు. "కాశీయాత్ర చరిత్ర" గ్రంథకర్త, నాటి మద్రాసు సుప్రీంకోర్టులో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని పొందిన ఏనుగుల వీరాస్వామయ్యకు మద్రాసుకోర్టులో ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావే.[4]

మరణం

[మార్చు]

వెన్నెలకంటి సుబ్బారావు పంతులు 1839, అక్టోబరు 1 న మరణించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.53
  2. ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.54
  3. ప్రొ.ఆదినారాయణ రాసిన వెన్నెలకంటి సుబ్బారావు నిర్మించిన సత్రం పరిశోధనకు సంబంధించిన వ్యాసం, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక
  4. ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.56
  5. ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీలు.53,54

ఇవి కూడా చూడండి

[మార్చు]