Jump to content

వేగిరాజు కృష్ణంరాజు

వికీపీడియా నుండి
వైద్య రారాజు

వేగిరాజు కృష్ణంరాజు
జననం(1910-12-07)1910 డిసెంబరు 7
మర్రిపూడి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
మరణం1955 ఫిబ్రవరి 05
జాతీయతభారతీయుడు
పౌరసత్వంబ్రిటిష్ ఇండియా, భారతదేశం
వృత్తిప్రకృతి వైద్యుడు
క్రియాశీల సంవత్సరాలు1934-1955
గుర్తించదగిన సేవలు
శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమం, భీమవరం
సన్మానాలువైద్య రారాజు బిరుదు

వేగిరాజు కృష్ణంరాజు ప్రకృతివైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా హైస్కూలు విద్యను విడిచిపెట్టిన కృష్ణంరాజు మొదట వ్యాయామ విద్య, యుద్ధకళలు, తర్వాత ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం నేర్చుకున్నాడు.

స్వగ్రామమైన మర్రిపూడిలో మొదటి ప్రకృతి ఆశ్రమం ఏర్పాటుచేసిన ఇతను తర్వాత బాపట్ల, ఒంగోలు, భీమవరం వంటి ప్రాంతాల్లో ప్రకృతి ఆశ్రమాలను ఏర్పాటుచేశాడు. భీమవరంలో ఏర్పాటుచేసిన శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమాన్ని ఆదర్శవంతమైన ఆశ్రమంగా రూపొందించి దాన్ని నిర్వహించాడు. భీమవరంలోనే ప్రకృతి వైద్య కళాశాల ఏర్పాటుచేసి నిర్వహించాడు.

మహాత్మా గాంధీ, వినోభా భావే వంటి జాతీయ నాయకులకు ప్రకృతి చికిత్స చేసి, నేర్పించి పేరు ప్రఖ్యాతులు పొందాడు. వైద్య రారాజు అన్న బిరుదాన్ని పొందాడు. 45 ఏళ్ళ వయసులోనే కృష్ణంరాజు మరణించడంతో వారసులు ప్రకృతి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వేగిరాజు కృష్ణంరాజు ఈనాటి బాపట్ల జిల్లాలోని మర్రిపూడి గ్రామంలో 1910 డిసెంబరు 7న జన్మించాడు. తల్లిదండ్రులు సుబ్బాయమ్మ, సుబ్బరాజులకు అతను ద్వితీయ సంతానం. వీరిది సంపన్న కుటుంబం. కృష్ణంరాజు ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. అతను హైస్కూలులో ఉండగా మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమం కోసం ఆంగ్లవిద్యను విడిచిపెట్టమని పిలుపునివ్వడంతో ఆ పిలుపును అందుకుని కృష్ణంరాజు చదువు మానేశాడు.[1]

ఆ తర్వాత కృష్ణంరాజు వ్యాయామవిద్య నేర్చుకోవడం ప్రారంభించి క్రమేపీ అందులో మంచి నైపుణ్యం సంపాదించాడు. కర్రసాము, కత్తిసాము, గరిడీలు, కుస్తీలు వంటి వివిధ వ్యాయామవిద్యలు, యుద్ధకళలు నేర్చుకుని ఆంధ్ర ప్రాంతంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో గెలుపొంది గుంటూరు జిల్లాలో వరుసగా మూడు సంవత్సరాలు రోలింగ్ షీల్డులు అందుకున్నాడు. మదించిన ఎలుగుబంటిని సైతం ప్రదర్శనల్లో ఒంటిచేత్తో ఎదుర్కొనేవాడని చరిత్రకారుడు గాదం గోపాలస్వామి రాశాడు. అంతేకాకుండా, గుంటూరు జిల్లాలో యువతకు వ్యాయమవిద్యలు, యుద్ధకళల్లో శిక్షణనిచ్చేవాడు.[1]

వ్యాయామవిద్య తర్వాత కృష్ణంరాజు దృష్టి ఆయుర్వేదంపైకి మళ్ళింది. అప్పలాచార్యులు అనే ఆయుర్వేద వైద్యుని శిష్యునిగా చేరి కృష్ణంరాజు చరక సంహిత, పాలకవ్య హస్త ఆయుర్వేదము, వాగ్భటుడు రాసిన అష్టాంగ సంగ్రహము వంటి రచనలను అధ్యయనం చేశాడు.[1]

వృత్తి జీవితం

[మార్చు]

ప్రకృతి వైద్యంలోకి

[మార్చు]

కృష్ణంరాజు వైద్యవిద్య పూర్తిచేసుకున్నాకా 1934లో స్వగ్రామమైన మర్రిపూడిలోనే తనతో పాటు చదువుకున్న ప్రకృతి శర్మతో కలసి ప్రకృతి ఆశ్రమాన్ని స్థాపించాడు. వ్యాధిగ్రస్తులకు ప్రకృతివైద్య విధానం అనుసరించి నయంచేస్తూ పేరు సంపాదించుకోవడంతో సమీపంలోని బాపట్ల, ఒంగోలు పట్టణాల్లో సంపన్నులైన ఆర్యవైశ్య వ్యాపారలు కృష్ణంరాజు ప్రకృతి ఆశ్రమాలు ఏర్పాటుచేయడానికి ఆర్థికంగా సాయం చేశారు. ఈ ఆశ్రమాలను నడపడానికి తన సాటి ప్రకృతి వైద్యులతో కలసి కృష్ణంరాజు పనిచేశాడు.[1]

భీమవరం ప్రకృతి ఆశ్రమం ఏర్పాటు

[మార్చు]

కృష్ణంరాజు బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో ప్రకృతి ఆశ్రమాలు ఏర్పాటుచేసి, నిర్వహిస్తున్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్యులు జిల్లా డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న అల్లూరి రామకృష్ణంరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు కలిదిండి గంగరాజు తమ జిల్లాలో ప్రకృతి ఆశ్రమం ఏర్పాటుచేయడానికి ముందుకువచ్చారు. వీరి ఆర్థిక సహాయం, నైతిక మద్దతుతో కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో 1937లో ప్రకృతి ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఏడాది వ్యవధిలోనే అల్లూరి రామకృష్ణంరాజు హత్యకు గురికావడంతో ప్రకృతి ఆశ్రమానికి ఆయన పేరు మీదుగా శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమంగా పేరు మార్చారు.[1]

ఈ ఆశ్రమం మధ్యలో కేశవరం (గణపవరం) తరలివెళ్ళాల్సి వచ్చినా 1944లో తిరిగి భీమవరంలోని గోస్తనీ కాలువ సమీపంలో 25 ఎకరాల ప్రదేశంలోకి సుస్థిరంగా తీసుకువచ్చి విస్తారంగా నిర్మించారు. శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమాన్ని చాలా అందంగా, ఆదర్శవంతమైన ఆశ్రమంగా కృష్ణంరాజు రూపొందించాడు.[2] వినోభా భావే వంటి జాతీయ నాయకులు మొదలుకొని అనేకమంది నాయకులు, ప్రముఖులు ఆశ్రమాన్ని సందర్శించి, ఇక్కడ తమ ప్రకృతి చికిత్స స్వీకరించారు.[1] జయపూర్ మహారాజు విక్రమదేవ వర్మ ఆధ్వర్యంలో 1945 డిసెంబరు 31న కృష్ణంరాజు శ్రీరామకృష్ణ ప్రకృతి ఆశ్రమం వార్షికోత్సవాన్ని భీమవరంలో ఘనంగా నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆంధ్రదేశ ప్రకృతివైద్య మహాసభ ఏర్పాటుచేసి దానికి అధ్యక్షునిగా కృష్ణంరాజును నిర్ణయించారు.[3]

జాతీయ స్థాయి ప్రాచుర్యం

[మార్చు]

కృష్ణంరాజుని మహాత్మా గాంధీ తనకు ప్రకృతి వైద్యం గురించిన అంశాలు నేర్పమని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న కృష్ణంరాజు వార్ధాలోని తన సేవాగ్రామ్ ఆశ్రమానికి వెళ్ళి కొంతకాలం పాటు నివసించి గాంధీతో ప్రకృతి వైద్యవిధానం, మూలికా వైద్యాల గురించి చర్చించి, వివిధ అంశాలు నేర్పాడు. తిరిగి వచ్చాకా అతనితో మరణించేవరకూ గాంధీ ప్రకృతి వైద్యం తాలూకు అంశాలపై తరచుగా ఉత్తర ప్రత్యుత్తరాల్లో సంభాషించేవాడు.[1] అతను 1948-50 మధ్యకాలంలో మూడుసార్లు అఖిలభారత ప్రకృతి వైద్య పరిషత్ సమావేశాలకు జాతీయస్థాయిలో అధ్యక్షునిగా వ్యవహరించాడు. జయపూర్ మహారాజు విక్రమదేవ వర్మ ఇతన్ని సత్కరించి "వైద్య రారాజు" అన్న బిరుదు ప్రదానం చేశాడు.[1]

1951లో కృష్ణంరాజుకు జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడితోనూ, అతని ప్రకృతి ఆశ్రమానికి ఉన్న మంచిపేరుతోనూ గాంధీ స్మారకనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని సంపాదించి భీమవరంలో ప్రకృతి వైద్యకళాశాల నెలకొల్పాడు. తెలుగు ప్రాంతం నుంచే కాక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రకృతి కళాశాలలో చేరిన విద్యార్థులకు కృష్ణంరాజు, ఇతర ఉపాధ్యాయులు ప్రకృతి వైద్య శిక్షణ ఇచ్చారు.[1]

మరణం

[మార్చు]

1955 ఫిబ్రవరి 5న తన 45వ ఏట కృష్ణంరాజు మరణించాడు. అతని మరణానంతరం అతని వారసులు ప్రకృతి ఆశ్రమ నిర్వహణ స్వీకరించి పనిచేస్తున్నారు. 2010లో కృష్ణంరాజు శతజయంతి సందర్భంగా భీమవరంలో అతని కాంస్య విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 గాదం, గోపాలస్వామి (2016). పశ్చిమ గోదావరి జిల్లా సాంస్కృతీ సౌరభాలు. అత్తిలి: శ్రీసత్య పబ్లికేషన్స్. pp. 30–32.
  2. "శ్రీరామకృష్ణ ప్రకృతి చికిత్సాలయ వార్షికోత్సవము - భీమవరము, ఆంధ్రదేశపు ప్రకృతి వైద్యమహాసభ" (PDF). ప్రకృతి. 1946 (4): 138.
  3. "శ్రీరామకృష్ణ ప్రకృతి చికిత్సాలయ వార్షికోత్సవము - భీమవరము, ఆంధ్రదేశపు ప్రకృతి వైద్యమహాసభ" (PDF). ప్రకృతి. 1946 (2): 49.