శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°36′N 83°54′E / 18.6°N 83.9°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం |
దేవనాగరి : | श्री मुखलिम्गेश्वर देवालय |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | శ్రీకాకుళం జిల్లా |
ప్రదేశం: | శ్రీముఖలింగం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీముఖలింగేశ్వరస్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి, అష్ట తీర్థ మహా రాజయోగములు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | చాణుక్య శిల్పకళ |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 3 |
శిలాశాసనం: | ఉన్నవి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.573-1058 |
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది.[1] ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
చరిత్ర
[మార్చు]ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.
ఆలయ విశేషాలు
[మార్చు]"శ్రీముఖలింగం" పేరులోనే చక్కని అర్ధం ఉంది. "శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఈ దేవాలయం లోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేసారు. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్ధంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరముల క్రిందట పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళాసంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు సా.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.[2]
స్థల పురాణం
[మార్చు]ఒకప్పుడు హిమాలయాలమీద గొప్ప వైష్ణవయాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి " సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి" అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి "నీతో ఉంటే నేనైనా ఉండాలి...లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు" అని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.[3]
మధుకేశ్వరాలయం
[మార్చు]ఇక్కడ ముఖలింగాలయాన్ని "మధుకేశ్వరాలయం" అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు.
ఆలయంలో శిల్పకళ
[మార్చు]ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.
ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖ లింగంలో అష్టగణపతులున్నారు. వ్యాసమహర్షి భారతముతోపాటు పంచమవేద గ్రంథాలు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్టు దీనితోపాటు శక్తిగణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి (నాట్య), సిద్ధి గణపతులు దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది.
చరిత్ర
[మార్చు]ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని సా.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.
ఉత్సవాలు
[మార్చు]ఇచట మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి మూడురోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్ధ స్నానముతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు.
పూజలు-సేవలు
[మార్చు]మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. సుదూర గ్రామాలు, పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందురోజే శ్రీముఖలింగం చేరుకొని తొమ్మిది రోజులూ దేవుని దర్శించుకుని తిరునాళ్ళలో పాల్గొంటారు.
6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయాలు
[మార్చు]శ్రీముఖ లింగంలో ఆలయాలు 6,4,8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, నాలుగో శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటినుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.
స్వప్నేశ్వర లింగం
[మార్చు]ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ ముఖలింగేశ్వరశతకం
[మార్చు]శ్రీ ముఖలింగేశ్వరం అనే ‘’శివ మహిమ’’ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు మొసలికంటి వెంకట రమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్యసాయం తో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురింఛి తిరుమలేశునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని చాటారు.
ఈ క్షేత్ర మహాత్మ్యం రాసిన కవి చిన్నతనం లో చాలాసార్లు ఈక్షేత్ర దర్శనం చేశారు .1988 తన దగ్గర బంధువులతో దర్శించినపుడు అర్చకస్వామి తమ్మా తిరుపతి రావు ‘’ఈ క్షేత్రం గురించి మీరేదైనా రాయరాదా?”’అని ప్రేరణకలిగిస్తే అది స్వామి ప్రేరణ అనిపించి మనసులో సీసపద్యం లోని ఎత్తుగీతి చివరి రెడుపాదాలు –‘’ముక్తి దాయక సర్వేశ భక్తవరద –అంగ భవ భంగ శ్రీ ముఖ లింగవాస ‘’ మకుటంగా భాసించింది.అనేక విషయాలు సేకరించి ,శివలీలలు కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించి ,పురాణ గాథలను లఘు టీకా తో సహా సంపూర్ణం చేశారు ఇలాంటి ప్రయత్నం శతక వాజ్మయం లో అంతవరకూ రాలేదని కవి చెప్పారు చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన తనను అక్కగారినీ అనురాగం పంచి పెద్ద చేసిన పినతండ్రి మొసలికంటి వెంకటసన్యాసయ్య గారిని స్మరించారు .విజయనగర మహారాజ కళాశాలవిశ్రాంత అధ్యక్షులు మానాప్రగడ శేషసాయి ‘’రసతరంగం ‘’అనీ ,అరసవల్లి సూర్య దేవాలయ ఆగమపాఠశాల సంస్కృత అధ్యాపకులు ఆరవెల్లి లక్ష్మీ నారాయణా చార్యులు మున్నుడిలో ‘’ఇక్కడి లింగ౦ ఇప్పచెట్టు అంటే ‘’మధూకం ‘’మూలం నుండి ఉద్భవి౦చి నందున ‘’మధు కేశ్వరలింగం అనటం సార్ధకం .దారురూపంగా స్వామి దర్శనమివ్వటం ఆశ్చర్యం ‘’అన్నారు .పూరీలోజగన్నాథస్వామి అన్నబలరాముడు సోదరిసుభద్ర లతో దారు శిల్పాలుగా దర్శనమిస్తారనిమనకు తెలుసు ఇక్కడ శివుడు అరుదైన దారు లింగంగా ఉద్భవించాడు .ఇదీ ఈక్షేత్ర విశేషం ..శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల విశ్రాంత ఆంద్ర భాష ఉపన్యాసకులు గెడ్డావు సత్యం ‘’ధారాళంగా సీసపద్య రచన జరిగింది .వివిధ క్షేత్రాలలో వివిధనామాలతో వెలయు భవుని వర్ణన భవ నాశకంగా ఉన్నది .చదివి శివుని కారుణ్యా మృతం ‘’పొందుతారు ‘’అని ఆశీస్సులదించారు .
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీముఖలింగం". web.archive.org. 2016-03-05. Archived from the original on 2016-03-05. Retrieved 2022-10-24.
- ↑ "తెలుగుదనం.కో.ఇన్ [telugudanam.co.in] - ఉత్తరాంధ్ర విశ్వేశ్వరుడు". web.archive.org. 2016-03-11. Archived from the original on 2016-03-11. Retrieved 2022-10-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "తెలుగు ఒన్ లో ఆలయ కథ". Archived from the original on 2015-03-22. Retrieved 2015-03-25.