Jump to content

సూర్యదేవర సంజీవదేవ్

వికీపీడియా నుండి
(సంజీవదేవ్ నుండి దారిమార్పు చెందింది)
సూర్యదేవర సంజీవదేవ్
తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి
జననంసూర్యదేవర సంజీవదేవ్
జూలై 3, 1914
గుంటూరు జిల్లా , దుగ్గిరాల మండలం తుమ్మ పూడి గ్రామం
మరణంఆగష్టు 25, 1999
ప్రసిద్ధితత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి
మతంహిందువు
భార్య / భర్తసులోచన దేవి
పిల్లలుఇద్దరు కుమారులు జోగేంద్ర దేవ్, మహేంద్ర దేవ్
తండ్రిరామదేవరాయలు
తల్లివెంకాయమ్మ

సూర్యదేవర సంజీవ దేవ్ (1914 - 1999) తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలితకళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దర్శనకారుడు.

జీవిత చిత్రణ

[మార్చు]

సూర్యదేవర సంజీవదేవ్ గారు 1914 జులై 3 న తేదీన గుంటూరు జిల్లా , దుగ్గిరాల మండలం తుమ్మ పూడి గ్రామంలో వెంకాయమ్మ,గారు,రామదేవరాయలు దంపతులకు జన్మించాడు. తల్లిచిన్నప్పుడే చనిపోయింది. సంజీవదేవ్ జమీందారీ కుటుంబంలో పుట్టినా సామాన్య జీవిత మే గడిపాడు. కొంతకాలం కృష్ణాజిల్లా లోని కోనాయ పాలెం లోని మాతామహుల ఇంట్లో పెరిగారు తర్వాత తుమ్మ పూడి లో పెదనాన్న చిన వెంకట కృష్ణయ్యగారి వద్ద పెరిగాడు. ఇంట్లోనే స్వయంగా విద్యనభ్యసించాడు.

హిమాలయాల పట్ల ప్రేమ పెంచుకొని ఇంట్లో చెప్పకుండా 26 ఏళ్ళ వయస్సులో ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు. హిమాలయాలలో కొంత కాలమున్నారు. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. 30 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాడు

హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపానీస్ నేర్చుకున్నాడు. ఎస్పరాంటో అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. జయదేవుని గీత గోవిందంతో ప్రారంభించి కాళిదాసు రచనలన్నిటిని చదివేశాడు. లక్నోలో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. లక్నోలో సంజీవ్ దేవ్ గారికి విశ్వ కవి ' రవీంద్రుని' కలిసే భాగ్యం కలిగింది. బెంగాలీ సాహిత్యం,చిత్రకళపై పట్టున్న సంజీవ్ దేవ్ రవీంద్రనాద్ టాగోరుతో బెంగాలీలో మాట్లాడటమే కాకుండా రవీంద్రుని రెండు బెంగాలీ కవితల్ని చదివి వినిపించారు. "కవిగా జీవించగలిగేతేనే చాలదు. మనిషిగా జీవించ గలిగితేనే కవిగా జీవించినట్టు" అన్న గురుదేవులు రవీంద్రుని మాటలను మహోపదేశంగా స్వీకరించి ఆచరణలో ఆచరించి చూపాడు

1954లో వీరి వివాహం గుంటూరు జిల్లా దోనేపూడి గ్రామానికి చేందిన సులోచన దేవితో జరిగింది.

సూర్యదేవర సంజీవదేవ్ 1999 ఆగస్టు 25న మరణించాడు. సంజీవదేవ్‌ స్వస్థలం తుమ్మపూడిలోని నివాసం రసరేఖ లో సంజీవ దేవ్ కు తోడు నీడగా, నిత్యం ఆయన్ని దర్శించే ఆయన స్నేహితులకు అతిథి సత్కారాలను అందిస్తూ ఆయన కృషిలో భాగస్వామి అయిన శ్రీమతి సులోచనా దేవి గారు 2017 డిసెంబర్ 18న మరణించింది..[1]

చిత్రకళ గురించిన వ్యాఖ్యలు

[మార్చు]

సంజీవదేవ్ చిత్రకళ,ఫొటోగ్రఫీ లో పేరుపొందాడు. నికొలస్ రోరిక్, అసిత్ కుమార్ హల్దార్ వంటి అంతర్జాతీయంగా పేరుపొందిన అనేకమంది కళాకారులు ఆయనకు మిత్రులయ్యారు.

“శబ్దానికంతకూ నిశ్శబ్దం మూలమైనట్టే,రంగులన్నిటికీ తెలుపే మూలమైనట్టు, కళ ‌అంతటికీ ప్రకృతి మూలమైంది. భవం అంతకూ భావం మూలమైంది. అయినప్పటికీ ప్రకృతిని అనుకరించడం ఉత్తమ కళ కాదు.భావం (Being) ప్రతిబింబం ఆదర్శమైన భావం ( Becoming) కాదు. ప్రకృతి శిల్పి అస్తవ్యస్త ప్రకృతిని అద్భుత రూపాల సృష్టిలోకి మార్చేరూపాంతరీకుడు. ఉత్తుంగ శైల శృంగాలు,లోతైన పచ్చని లోయలు, ప్రవహించే సెలయేళ్ళు, మేఘాచ్ఛన్నమైన పగళ్ళువర్షపు రాత్రులు, శారద ప్రభాతాలు, గ్రీష్మ సంధ్యలు ఇవన్నీ కూడా రేఖల లయతోనూ రంగుల రాగాల తోనూ స్పందిస్తుంటాయి " అని తన స్వీయ చరిత్రలో చెప్తాడు.

"ఫొటోగ్రఫీని ప్రధానంగా రెండు భాగాలుగా చేయొచ్చు. ఒకటి డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ,రెండు పిక్చోరియల్ ఫొటోగ్రఫీ.మొదటి దానిలో వాస్తవవాదం ప్రధానమైతే,రెండవ దానిలో కల్పన ప్రధానం. డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీలో కుక్కనుఫోటో తీస్తే అది కుక్కగా నే వుండాలి .‌కానీ.పిక్చోరియల్ ఫోటో గ్రఫీలో మాత్రం కుక్క కుక్కగా గోచరించకపోయినా ఫర్వాలేదు దాని వెలుగు నీడలు మొదలైన చిత్ర ధర్మాలుంటే చాలు అని కుక్కను బొమ్మలో చూపాలను కోవడం పిక్చోరియల్ ఫోటోగ్రఫీ అవుతుందని" తన స్వీయ చరిత్ర (పే 265) లో రాసుకున్నాడు.

రచనలు

[మార్చు]

సంజీవదేవ్ సాహిత్యం పట్ల ఆసక్తి,అవగాహన కలిగించింది చిన్నప్పటి ఆయన హిందీ మేస్టారు. తెలుగు సాహిత్యం పట్ల జిజ్ఞాసను పెంచింది మాత్రం తల్లా వజ్ఝల శివశంకర శాస్త్రి. దిలీప్ కుమార్ రాయ్ బెంగాలీ పుస్తకం "అనామీ ' సంజీవదేవ్ పై బాగా ప్రభావం చూపింది.

సంజీవదేవ్ 'రసరేఖ' పుస్తకాన్ని రచించాడు. తమ ఇంటికి 'రసరేఖ' అని పేరు పెట్టాడు. పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసాడు. ఇతను చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవాడు. చదివేవాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. నార్ల వెంకటేశ్వర రావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, త్రిపురనేని గోపిచంద్, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు ఎందరో ప్రముఖులు వచ్చేవారు.

'విద్యార్థి' అనే మాసపత్రిక 1963 అక్టోబరు సంచికలో సంజీవదేవ్ 'కీర్తి-తృష్ణ' అనే వ్యాసాన్ని రాసాడు. అందులో- 'కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడా ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే ఉంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు' అని రాసాడు.

1963లో 'ఆంధ్రజ్యోతి'లో ప్రతి ఆదివారం 'తెగిన జ్ఞాపకాలు' అని తమ జీవిత చరిత్రను రాసాడు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్ సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను  'తుమ్మపూడి' అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించింది. [2]

  • తెగిన జ్ఞాపకాలు. ఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది. ఈ సంకలనంలో మొత్తం 70‌ వ్యాసాలున్నాయివీటిలో తుమ్మపూడి ఈతకల్లు నుంచి ఆంధ్రా ప్యారిస్ ( తుమ్మపూడికి సమీపంలో వుండే 'తెనాలి 'పట్టణం) వరకు కంచర గాడిద ప్రయాణం నుంచి హిమాలయాల దర్శనం, ప్రాపంచిక, పారలౌకికాల మధ్యసంఘర్షణలు, కన్నీరు పన్నీరుల తారతమ్యం, కులూ లోయలోని అపర‌ ద్రౌపదులు కళా‌స్రష్టకు,కళాద్రష్టకు మధ్యగలభేదాలు, ఆదర్శాలు, ఆచరణల మధ్యఅంతరాలు, అడివి బాపిరాజుతో పరిచయం, హిమాలయాల్లో దిగంబరుల జీవితం, సంజీవదేవ్ బాల్యం, చిన్ననాటి నుండి 1951 వరకు ఆయన జ్ఞాపకాలు తదితర విశేషాలున్నాయి
  • రసరేఖలు.
  • కాంతిమయి
  • దీప్తి ధార.
  • రూపారూపాలు
  • సమీక్షా రేఖలు.
  • రూపా దర్శని
  • లేఖా సాహిత్యం
  • బయో సింఫోనీ (ఆంగ్లంలో) మొదలైనవి ఉన్నాయి.
  • భారతీయ చిత్రకళ - సి.శివరామమూర్తి ఆంగ్ల రచనకు సంజీవదేవ్ అనువాదం.[3]
  • తుమ్మపూడి (స్వీయచరిత్ర)

కలం స్నేహం

[మార్చు]

ఇతని కలం స్నేహం అపరితమైనది. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికాలోని ఆల్డస్ హక్స్‌లీ నుంచి అమెరికాలో స్థిరపడిన చిత్రకారుడు రామారావు వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. జిడ్డు కృష్ణమూర్తి నుంచి బుచ్చిబాబు, గోపీచంద్ ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. రాహుల్ సాంకృత్యయన్ నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ రవీంద్రనాధ టాగోర్ నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. ప్రపంచంలో అన్ని మూలలనుంచీ ఆయనకు ఉత్తరాలు వచ్చేవి. ఆయన వాటికి బదులు రాసేవారు. "సంజీవదేవ్ లేఖలు " పేరిట ఆయన ఉత్తరాలు ఓ పుస్తకంగా వచ్చాయి.

పురస్కారాలు

[మార్చు]
  • 1980 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ పురస్కారం
  • 1995 లో ఎన్.టి. రామారావు గారిచే హంస అవార్డ్ పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. "రసరేఖ నిడుకుంది". సాక్షీ. 19 December 2017. Retrieved 31 August 2021.
  2. సిబిరావు (2015-12-03). "తుమ్మపూడి కంటి వెలుగు చంద్రమౌళి". సారంగ. Retrieved 2022-01-21.
  3. శివరామమూర్తి, పి.; ఎస్, సంజీవదేవ్. భారతీయ చిత్రకళ. న్యూఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. Retrieved 9 December 2014.

బయటి లంకెలు

[మార్చు]