Jump to content

సంభార్ ఉప్పు సరస్సు

వికీపీడియా నుండి

సంభార్ ఉప్పు సరస్సు, భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సు. ఇది రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా సంభార్ లేక్ టౌన్‌లో ఉంది. ఈ పట్టణం జైపూర్ నగరానికి నైరుతి దిశలో 80 కి.మీ., అజ్మీర్‌కు ఈశాన్యంగా 80 కి.మీ. దూరంలో ఉంది. ఈ సరస్సు చారిత్రక సంభార్ లేక్ టౌన్‌ను చుట్టుముట్టి ఉంది.

భౌగోళికం

[మార్చు]
2010లో వరల్డ్‌విండ్ నుండి తీసిన సంభార్ ఉప్పు సరస్సు ఉపగ్రహ చిత్రం.

ఈ సరస్సు లోకి మంథా, రూపన్‌గఢ్, ఖరీ, ఖండేలా, మెడ్తా, సమోద్ అనే ఆరు నదుల నుండి నీరు వస్తుంది. సరస్సు పరివాహక ప్రాంతం 5,700 చదరపు కిలోమీటర్లు. [1] సరస్సు ప్రాంతం విస్తృతమైన ఉప్పు చిత్తడి నేల. దీని లోతు పొడి కాలంలో 60 సెం.మీ., వర్షాకాలం ముగింపులో దాదాపు 3 మీటర్లు (10 ft) ఉంటుంది. దీని విస్తీర్ణం ఋతువును బట్టి 190 నుండి 230 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. సరస్సు దీర్ఘవృత్తాకారంలో, సుమారు 35.5 కి.మీ. పొడవుతో, 3 కి.మీ. - 11 కి.మీ. మధ్య వెడల్పుతో ఉంటుంది. ఇది నాగౌర్, జైపూర్ జిల్లాలలో విస్తరించి, అజ్మీర్ జిల్లా సరిహద్దులో ఉంది. సరస్సు చుట్టుకొలత 96 కి.మీ. దీన్ని ఆరావళి కొండలు చుట్టుముట్టి ఉన్నాయి.

సంభార్ సరస్సు బేసిన్ను 5.1 కి.మీ పొడవైన ఇసుకరాతి ఆనకట్ట ఉంది. ఉప్పునీరు నిర్దిష్ట సాంద్రతకు చేరుకున్న తర్వాత, ఆనకట్ట గేట్లను ఎత్తి, పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు నీటిని విడుదల చేస్తారు. ఆనకట్టకు తూర్పున, ఉప్పు బాష్పీభవన చెరువులు ఉన్నాయి. ఇక్కడ వెయ్యి సంవత్సరాలుగా ఉప్పు సాగు చేస్తున్నారు. ఈ తూర్పు ప్రాంతం 80 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉప్పు జలాశయాలు, కాలువలు, సన్నటి గట్లతో వేరు చేయబడిన ఉప్పు క్షేత్రాలు ఉన్నాయి. ఆనకట్టకు తూర్పున సాంభార్ లేక్ సిటీ నుండి సాల్ట్ వర్క్స్‌ వరకు బ్రిటిష్ వారు రైలుమార్గం నిర్మించారు.

మంథా, రూపన్‌గఢ్, ఖండేల్, కరియన్ నదుల నుండి సరస్సులోకి నీరు వస్తుంది. మంథా, రూపన్‌గఢ్‌లు ప్రధాన ప్రవాహాలు. మంథా ఉత్తరం నుండి దక్షిణానికి, రూపన్‌గఢ్ దక్షిణం నుండి ఉత్తరానికీ ప్రవహిస్తాయి.

ఉష్ణోగ్రత వేసవిలో 45oC చేరుకుంటుంది. శీతాకాలంలో ఇది 5oC కంటే తక్కువగా ఉంటుంది.

ఆర్థిక ప్రశస్తి

[మార్చు]

సంభార్ ఉప్పు సరస్సు భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు సరస్సు. ఇది రాజస్థాన్‌లో ఉప్పు ఉత్పత్తికి ప్రధాన వనరు. ఏటా 1,96,000 టన్నుల స్వచ్ఛమైన ఉప్పు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇది భారతదేశ ఉప్పు ఉత్పత్తిలో దాదాపు 9%. ఎక్కువగా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ - సంభార్ సాల్ట్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. ఇది హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సంస్థ.[2] తూర్పు సరస్సులో 3% SSL కు చెందుతుంది.

వేలకొద్దీ అక్రమ బోర్‌వెల్‌ల నుండి కూడా ఉప్పు ఉత్పత్తి అవుతోంది. వీళ్ళు SSL కంటే 10 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి సరస్సు జీవావరణాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.[3]

సరస్సు చుట్టూ 38 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సంభార్, గూడా, జబ్దినగర్, నవా, ఝక్, కోర్సినా, ఝపోక్, కాన్సెడ, కుని, త్యోడా, గోవింది, నందా, సినోడియా, అర్విక్ కి ధని, ఖనాడ్జా, ఖఖర్కి, కెర్వా కి ధని, రాజాస్, జలవాలీ కి ధనీ లు ముఖ్యమైనవి.

2014లో, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో సహా ఆరు ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ, ప్రపంచంలోనే అతిపెద్ద 4,000 మెగావాట్ల అల్ట్రా-మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. [4] కానీ ఆ తర్వాత పర్యావరణ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును గుజరాత్‌కు మార్చారు. [5]

పర్యావరణ ప్రశస్తి

[మార్చు]

సంభార్‌ను అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా, రామ్‌సర్ ప్రదేశంగా గుర్తించారు. ఎందుకంటే చిత్తడి నేల పదివేల గులాబీ ఫ్లెమింగోలు, ఉత్తర ఆసియా, సైబీరియాల నుండి వలస వచ్చే ఇతర పక్షులకూ కీలకమైన శీతాకాల వలస ప్రాంతం. సరస్సులో పెరిగే ప్రత్యేకమైన ఆల్గే, బాక్టీరియాలు సరస్సు లోని నీటికి అద్భుతమైన రంగులను కలిగిస్తాయి. ఇవి సరస్సు జీవావరణానికి మద్దతు ఇస్తాయి. ఇది వలస నీటి పక్షులకు ఆవాస స్థానం. సమీపంలోని అడవులలో ఇతర వన్యప్రాణులు ఉన్నాయి, ఇక్కడ నీల్గాయ్ జింకలు, నక్కలతో కలిసి స్వేచ్ఛగా నివసిస్తాయి.

నవంబర్ 2019లో సరస్సు ప్రాంతంలో దాదాపు 20,000 వలస పక్షులు అనుమానాస్పదంగా చనిపోయాయి.

చరిత్ర, పర్యాటకం

[మార్చు]

మహాభారత గాథలో రాక్షస రాజు వృషపర్వుని రాజ్యంలో భాగంగా సంభార్ సరస్సు ఉండేది. అతని గురువు శుక్రాచార్యుడు నివసించిన ప్రదేశంగా, అతని కుమార్తె దేవయాని, యయాతి ల వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని మహాభారతం పేర్కొంటుంది. సరస్సు సమీపంలో దేవయాని దేవాలయం ఉంది.

చౌహాన్ రాజపుత్రుల (పృథ్వీరాజ్ చౌహాన్) దేవత, శివుని భార్య అయిన శాకంభరి దేవి, వారి పూఅకు మెచ్చి, దట్టమైన అడవిని వెండి మైదానంగా మార్చింది. తదనంతరం, ఇది దురాశకు, కలహాలకూ దారితీస్తుందని భయపడిన స్థానికుల అభ్యర్థన మేరకు ఆమె, ఆ వెండి మైదానాన్ని సరస్సుగా మార్చింది. సరస్సు పేరైన సంభార్, శాకంభరి అనే పేరు నుండి వచ్చింది. [6] సరస్సు తీరాన ఉన్న శాకంభరీ దేవి ఆలయం ఉంది.

1884లో, సంభార్ సరస్సులో చేసిన చిన్న-స్థాయి త్రవ్వకాలలో భాగంగా ఈ ప్రాంతంలో పురాతన శిల్ప కళ కనుగొనబడింది. ఆ తవ్వకాల్లో మట్టి స్థూపంతోపాటు కొన్ని టెర్రకోట నిర్మాణాలు, నాణేలు, ముద్రలు లభించాయి. సాంబార్ శిల్ప కళలో బౌద్ధమత ప్రభావం కనిపిస్తుంది. తరువాత, 1934 ప్రాంతంలో, పెద్ద ఎత్తున క్రమబద్ధమైన, శాస్త్రీయ తవ్వకాలు జరిపారు. దీనిలో పెద్ద సంఖ్యలో టెర్రకోట బొమ్మలు, రాతి పాత్రలు, అలంకృత చక్రాలు లభించాయి. సంభార్ లో లభించిన ఈ శిల్పాలలో అనేకం ప్రస్తుతం జైపూర్ లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ఉన్నాయి.

సినిమాలు

[మార్చు]

రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఢిల్లీ-6 చిత్రం కోసం, ప్రొడక్షన్ డిజైనర్ సమీర్ చందా సంభార్ వద్ద పాత ఢిల్లీ కి చెందిన గళ్ళీలను పునఃసృష్టించారు. తర్వాత కొన్ని సన్నివేశాల కోసం, చారిత్రక జామా మసీదును బ్యాక్‌డ్రాప్‌గా సృష్టించాడు. అనేక ఇతర సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు.

రవాణా

[మార్చు]

సమీప విమానాశ్రయాలు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, కిషన్‌గఢ్ విమానాశ్రయం

ప్రజా రవాణా: సంభార్ లేక్ టౌన్ రైల్వే స్టేషన్, ఫూలేరా జంక్షన్ రైల్వే స్టేషన్, RSRTC [7] బస్ స్టాండ్ లు ఇక్కడీకి రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "River basins with Major and medium dams & barrages location map in India, WRIS". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 10 May 2014.
  2. Hindustan Salts Ltd.
  3. Narayanan, Dinesh (9 February 2016). "Private players illegally edge out government-owned Sambhar Salts in salt production". The Economic Times.
  4. Rajasthan to have world's largest solar power project
  5. Rajasthan mega solar project likely to be shifted to Gujarat
  6. "The Imperial Gazetteer of India VOL XXII". Oxford At The Clarendon Press. 1908.
  7. "RSRTC Ticket Booking". RSRTC Ticket Booking. Retrieved 14 December 2020.