సత్యదుర్గేశ్వర కవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి, చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1].

వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి[మార్చు]

ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. సత్యనారాయణశాస్త్రి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క స్కూలు ఫైనలు పరీక్ష పాసై ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మేనకోడలి కుమారుడు.

చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి[మార్చు]

ఇతడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండవ కుమారుడు. ఇతడు రాజమండ్రి సమీపంలో ఉన్న కడియంలో 1920 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించాడు. ఇతడు బాల్యం నుండే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఇతడు తన తండ్రి వద్ద వెంకయ్య వ్యాకరణం, బాలవ్యాకరణం, సిద్ధాంతకౌముదిలో పూర్వార్థం, మేఘసందేశం, నాటకాలు చదువుకున్నాడు. కడియంలోని సంస్కృత పాఠశాలలో పాలంకి గంగాధరశాస్త్రి వద్ద శబ్దమంజరి, రఘువంశం, కుమారసంభవాది గ్రంథాలను అధ్యయనం చేశాడు.

అవధాన ప్రస్థానము[మార్చు]

ఈ ఇద్దరు కవులూ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి నుండి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని పొంది "సత్యదుర్గేశ్వర కవులు" అనే పేరుతో జంటగా అవధానాలు చేయడం ఆరంభించారు. వీరు పెనుగొండ, ఆలమూరు, ఏలూరు, పెదపాడు, జగ్గయ్యపేట, నందిగామ, నేలకొండపల్లి, సూర్యాపేట, హైదరాబాదు, సికిందరాబాదు మొదలైన అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలలో పలు అష్టావధానాలు, శతావధానాలు చేసి ప్రసిద్ధి చెందారు. ఈ జంటకవులు చేసిన అవధానాలలో నిషిద్దాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరి, కావ్యపాఠము, ఆకాశపురాణము, ఆంధ్రీకరణము, క్యారమ్స్ ఆట మొదలైన అంశాలు ఉండేవి.

అవధానాల నుండి ఉదాహరణలు[మార్చు]

ఈ అవధానుల పూరణలు కొన్ని మచ్చుకు:

 • సమస్య : తన సుతు గూడి గర్భమును దాల్చెనదేమని చెప్పనక్కటా

పూరణ:

తన కిక వంశనాశనము తప్పనిదేమొ! యటంచు నెంచి పు
త్రుని మది నెంచె సత్యవతి; తోడన వ్యాసుడు వచ్చి నిల్వ దా
సిని నియమించె నంబికయు చెప్పినట్టుండగ నఁద్ది వ్యాసు, శం
తను సుతు గూడి గర్భమును దాల్చెనదేమని చెప్పనక్కటా

 • వర్ణన: కాఫీ

పూరణ:

వీడన్ జేయును బద్దకమ్మును మనఃప్రీతిన్ బొనర్చున్ బయిన్
బాడున్ జేయును దేహదార్ఢ్యమును జేవల్‌గుల్కు కంఠానకున్
గోడున్ గీడొనరించు నాఁకలికి నెగ్గున్ గూర్చు కాఫీని యె
వ్వాడున్ వర్ణన జేయలేఁడు నిజమీ వాక్యమ్ము లాలింపుడీ!

 • దత్తపది: మరపు - వెరపు - కరపు - చెరపు అనే పదాలతో

పూరణ:

మరపొకయింతలేక జనమాన్యధురీణుఁ డజాతశత్రుడే
వెరపున సర్వరాజ్యమును వీడి ప్రవాసమిహైక కోటికిన్
గరపిన మాడ్కిఁజేసి బహుకష్టములన్ విసువందకుండనే
చెరపును లేక రాజ్యరమ చెందెనో? ధర్మమనంగ నట్టిదే?

రచనలు[మార్చు]

ఈ కవులు జంటగా ఈ క్రింది గ్రంథాలను రచించారు.

 1. భావలహరి (ఖండకావ్యము)
 2. రమాదేవి (ఐదంకముల నాటకము)
 3. శాంతి సమరము (ఏకాంక నాటకము)
 4. రత్నేశ్వర ప్రసాదనము (ఆంధ్రీకరణము)
 5. ప్రణయ స్వైరిణి
 6. ఆంధ్ర ప్రతిష్ఠ[2](కావ్యము)
 7. అవిమారకము - నీతిగీత

సత్యనారాయణశాస్త్రి విడిగా ఈ క్రింది గ్రంథాలను వ్రాశాడు.

 1. స్వరాజ్య సమరము (నాటకము)
 2. మహాకవి కాళిదాసు (రెండు భాగములు విమర్శ)
 3. ఆత్మకథ (గాంధీజీ జీవిత చరిత్ర - సంస్కృతములో)
 4. నాటకరచన (పరిశోధన గ్రంథం)
 5. సంస్కృత కవులు (విమర్శ)
 6. భారతజ్యోతి (ఆంధ్రీకరణము)
 7. ఆంధ్ర సేనాని (రూపకము)
 8. వ్యాస మంజూష

ఇక దుర్గేశ్వరశాస్త్రి విడిగా

 1. ధరణికోట (నాటకము)
 2. వేంకటేశ్వర సర్వస్వము (అనువాదము)
 3. ప్రణయ కంకణము (అనువాదము)
 4. మణిమేఖల (అనువాదము)
 5. దుర్గాదాసు (అనువాదము)
 6. భారతేతిహాసము
 7. తిరుపతి వేంకట కవుల కవితా ప్రతిభ మొదలైన గ్రంథాలను రచించాడు.

మూలాలు[మార్చు]

 1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 293–297. {{cite book}}: |access-date= requires |url= (help)
 2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రతిష్ఠ పుస్తకప్రతి