సేవ్ ఇండియన్ ఫ్యామిలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రకం భారతదేశానికి చెందిన పురుషుల హక్కుల సంస్థ
స్థాపన 2005
స్థలం భారతదేశం లోని అన్ని ప్రదేశాలు
నిర్వాహకులు
రంగం పురుషుల హక్కులు, గృహహింస
వెబ్ సైటు saveindianfamily.in

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఆంగ్లం: Save Indian Family లేదా SIF) పురుషుల సంక్షేమానికై కృషి చేసే ఉద్యమం నుండి అవతరించిన ఒక లాభాపేక్షలేని, ప్రభుత్వేతర సంస్థ. భర్త పట్ల క్రౌర్యాన్ని, స్త్రీ సంరక్షక చట్టాల దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తూ, భార్యాబాధితులకు చట్టపరమైన సలహాలను/సూచనలను అందించే ఒకానొక స్వచ్ఛంద సేవా సంస్థ.[1]

వాస్తవ జీవితంలో ఈ సంస్థ నుండి 1,00,000 మంది కంటే ఎక్కువ సభ్యులు, అంతర్జాలంలో 10,000 మంది సభ్యులు చట్టపరమైన తీవ్రవాదం (భర్త పట్ల క్రౌర్యం) పై అలుపెరుగని పోరు సలుపుతోన్నారని ఈ సంస్థ గర్వంగా ప్రకటించుకొంటుంది. ఈ సంస్థలోని సభ్యులందరూ స్త్రీ పక్షపాత ధోరణిలో కల వివిధ స్త్రీ/కుటుంబ పరిరక్షక చట్టాల (ఐపిసి 498ఏ, వరకట్న వేధింపులు, వరకట్న నిరోధక చట్టాలు, గృహ హింస నిరోధక చట్టాలు, భరణం, వైవాహిక చట్టాలు, శిశు సంరక్షణ, మానభంగం, కార్యాలయాలలో లైంగిక వేధింపులు) దుర్వినియోగానికి బలైనవారే. ఈ సంస్థలో సభ్యులైన వయోవృద్ధులు, విదేశాలలో స్థిరపడిన భారతీయులు, స్త్రీలు కూడా భారతీయ చట్ట వ్యవస్థలోని లొసుగుల వలన దుర్వినియోగానికి ఎంత అవకాశమున్నదో, ఎంత స్థాయిలో అన్యాయం జరుగుతోందో, వీటి వలన ఎలాంటి దుష్ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తోందో అవగాహన పెంపొందిస్తూ, ప్రచారం చేస్తూ ఉంటారు.

చరిత్ర[మార్చు]

10 మార్చి 2005న భారతదేశంలో దుర్వినియోగానికి గురైన పురుషులు కొందరు చేతులు కలిపి సేవ్ ఇండియన్ ఫ్యామిలీని స్థాపించారు. ఇది ఒక యాహూ గ్రూప్ గా ప్రారంభమైనది. వేగంగా విస్తరించిన సేవ్ ఇండియా ఫ్యామిలీ లో 10,000 మంది సభ్యులు చేరారు. రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా సేవ్ ఇండియా ఫ్యామీలీ తన సేవలను విస్తరించినది. కాలం మారుతోన్న కొద్దీ, SIF, దాని ప్రాథమిక లక్ష్యాలు, భావజాలం కూడా బలపడుతూ వచ్చినవి. సభ్యసమాజంలో పాతుకుపోయిన పురుషద్వేషం వలన దెబ్బతిన్న, వేధింపులకు గురి అయిన, అణగారిన పురుషులకు/వారి కుటుంబాలకు బాసటగా నిలిచినది. ఈ పురుషద్వేషమే అనేక పురుష-వ్యతిరేక చట్టాలకు బీజమైనదని, భారతదేశం లింగ ఆధారిత నేర సంఘంగా ముద్ర వేయబడినది అని SIF గ్రహించినది. SIF వలన చాలా మంది పురుషులు స్వాంతనను/శాంతిసౌభాగ్యాలను అందుకొన్నారు. లింగ వివక్ష గల సమాజంలో, చట్ట/న్యాయవ్యవస్థలలో ఎలా నిలద్రొక్కుకోవాలో కొన్ని లక్షల మంది పురుషులకు శిక్షణనిస్తూ, సలహాలను సూచనలను ఇస్తూ దూసుకెళ్ళినది. ప్రతి తొమ్మిది నిముషాలకు ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడుతోన్నాడన్న నగ్నసత్యాన్ని SIF ఎలుగెత్తి చాటినా కూడా అది అరణ్యరోదనగానే మిగిలిపోయినది. అనేక ప్రభుత్వ సంస్థలకు, కమిటీలకు, కుటుంబ సంక్షేమాన్ని కోరే SIF ఈ సమాజంలో ఎవరి హక్కులైనా విస్మరించబడినట్లయితే, అవి పురుషులవే అని, ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించాలని తెలియజేసినది. SIF ఉచిత సహాయ సముదాయాలను, వారాంతపు సమావేశాలను, ఆన్లైన్ ఫోరంలను, బ్లాగులను, హెల్ప్ లైన్ లను, ఇతర ప్రభుత్వేతర సంస్థలను నిర్వహిస్తూ అనేక భారతీయ కుటుంబాలను రక్షిస్తూ ఉంటుంది.

వివిధ నేపథ్యాలు గల SIF సభ్యులే దానిని నడిపిస్తారు.

లక్ష్యాలు[మార్చు]

 • వైవాహిక, కుటుంబ సామరస్యాన్ని పెంపొందించటం
 • భారతీయ వైవాహిక/కుటుంబ వ్యవస్థలకు ఎటువంటి దుష్ఫలితాలు కలగకుండా వరకట్న రహిత సంఘాన్ని సృష్టించటం కోసం శ్రమించటం
 • వరకట్న వ్యతిరేక చట్టాల దుర్వినియోగాన్ని నివారించేందుకు వేదిక సృష్టించటం
 • ప్రస్తుత వరకట్న/గృహహింస చట్టాలపై; కుటుంబ సభ్యుల (భర్త, భార్య, పిల్లలు, చుట్టపక్కాల)పై అవి చూపే దుష్పరిణామాలపై అవగాహన కలిగించటం
 • ఈ చట్టాల దుర్వినియోగం వలన కేసులలో ఇరుక్కుపోయిన అమాయకులకు మనోనిబ్బరాన్ని, చట్టపరమైన సలహాలను/సూచనలను, స్వాంతనను అందించటం. బడుగు బలహీనవర్గాలకు చట్టపరంగా జరుగవలసినవి చూడటం
 • Single Parenting (తల్లిదండ్రులలో కేవలం ఏ ఒక్కరో మాత్రమే శిశుసంరక్షణ చేపట్టటం), సహజీవనం వంటి సాంఘిక పరిణామాలను నీరుగార్చటం; శిశు అభివృద్ధికి, కుటుంబ సమగ్రత కోసం కృషి చేయటం.
 • సంఘంలో వయోవృద్ధుల భావజాలాన్ని పరిరక్షించటం; వారి గౌరవాన్ని కాపాడటం; వరకట్న వేధింపు చట్టాల దుర్వినియోగం ద్వారా వారి భంగపాటుకు అడ్డుకట్ట వేయటం
 • తప్పుడు ఫిర్యాదుల/విచారణ లేకనే అరెస్టుల నిరోధకాలను ప్రోత్సహించటం. వైవాహిక బంధాలలో దురుద్దేశ్యపూర్వక నేరారోపణలను నిరుత్సాహపరచటం
 • జాతి, వయసు, మతం, లింగాలకు అతీతంగా, సంఘంలోని అన్ని వర్గాల వారు న్యాయం పొందటంలో సమాన హక్కులు కలిగిఉండేలా, ప్రస్తుత చట్టాలలో/న్యాయ విచారణలలో సవరణలు, సంస్కరణల కోసం కృషి సల్పటం. లింగవివక్షను తగ్గించటం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించటం.
 • న్యాయస్తానంలో విచారణలు త్వరితం చేయటానికి తోడ్పడటం
 • భారతీయ రాజ్యాంగం ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను చర్చించటం. సంబంధిత సంఘాలకు/అధికారాలకు వీటి గురించి తెలిజజేయటం
 • భారతీయ సంఘ శ్రేయస్సును కోరుతూ ఇటువంటి లక్ష్యాలే కల ఇతర వర్గాలు, సంఘాల, స్త్రీ సంరక్షక సంస్లలు, ప్రభుత్వ సంస్థలు, చట్టపరమైన అధికారాలతో చేతులు కలపటం

డిమాండ్లు[మార్చు]

 • పురుషుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ను ఏర్పరచాలి
 • కుటుంబ సామరస్యం కోసం లింగ వివక్ష లేని చట్టాలను తీసుకురావాలి
 • 498ఏ చట్టం bailable (జామీను ఇవ్వదగినది), non-cognizable (నేరము కానిది), compoundable (రాజీ కుదుర్చుకోదగినది)గా మార్చాలి
 • వరకట్న వ్యతిరేక చట్టాలు దుర్వినియోగం చేసినచో, తప్పుడు కేసులు పెట్టినవారిని శిక్షించాలి
 • గృహహింస చట్టం లింగ పక్షపాతంగా ఉండకూడదు. (ఇతర దేశాలలో ఈ చట్టం లింగ పక్షపాతాలు లేకుండా ఉన్నది)
 • కార్యాలయాలలో వేధింపు చట్టాలకు కూడా లింగ పక్షపాతాలు ఉండకూడదు.
 • దురుద్దేశ్యపూర్వకంగా ఒకే వ్యక్తిపై పలు వేధింపు చట్టాల క్రింద వేసిన కేసులు కొట్టివేయాలి. చట్టపరమైన వనరులు దీని వలన అనవసర శ్రమకు లోనౌతున్నాయి
 • సరైన విద్యతో స్త్రీ సాధికారత, స్వాతంత్ర్యం రావాలి
 • కులమతాలకు అతీతమైన చట్టాలు, లింగానికి కూడా అతీతం కావాలి
 • భ్రూణ హత్య, బాల్య దుర్వినియోగం, బాల కార్మిక వ్యవస్థలను తుడిచిపెట్టటానికి తగిన చర్యలు తీసుకొనటం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వెబ్ సైటు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-04-01.