సోమరాజు రామానుజరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. ఆయన చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు ఆయన తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. కొవ్వలి, జంపన వంటివారి కోవలో సోమరాజు రమాపతిరావు తెలుగునాట నవలలకు ప్రాచుర్యం కల్పించిన రచయితగా నిలుస్తున్నాడు.

సోమరాజు రామానుజరావు
200px
జననంజూన్ 18, 1896
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం
మరణంనవంబర్ 14, 1934
ప్రసిద్ధిబహునాటక రచయిత, స్వాతంత్ర సమరయోధుడు

జీవిత విశేషాలు[మార్చు]

రామానుజరావు 1896 జూన్18న జన్మించాడు. చూడమాంబ, కోదండరామయ్యలు ఇతని తల్లిదండ్రులు[1]. భద్రాచలం,దుమ్ముగూడెం లలో విద్యాభ్యాసం జరిగింది.బాలగంగాధర్ తిలక్,గోపాల కృష్ణ గోఖలే వంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకున్నాడు. దుమ్ముగూడెంలో శ్రీ వేంకటేశ్వర గ్రంథమండలి పేరుతో ఒక ప్రెస్‌ను నెలకొల్పి 1921 నాటికి 21 పుస్తకాలు ప్రచురించారు. దేశభక్తి వస్తువుగా తిలకు రాయబారం, ప్రచంఢ బొబ్బిలి, స్వారాజ్య రథము నాటకాలను వెలువరించారు. 1922 జూన్ 26వ తేదీన జీవో నెంబర్ 466 ద్వారా బ్రిటీష్ ప్రభు త్వం స్వరాజ్య రథమును నిషేధించింది. రామానుజరావు మీద నిర్బంధం ప్రయోగించింది. అప్పటికి ఆయనకు ప్ళ్ళై రెండేళ్లే. భార్యను ఆమె తల్లి గారి ఇల్లు పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఉంచి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిన రామానుజరావు రంగూన్ చేరుకొని అక్కడి నుంచి తెలుగు పత్రిక నడిపారు. అక్కడే 1934 నవంబర్ 14న మరణించారు. ఆయన స్థాపించి న దుమ్ముగూడెంలోని గ్రంథాలయం 1953 వరదల్లో కొట్టుకుపోయింది. ఆయన స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన తోలుబొమ్మలు 1970లో లంకపల్లిలో అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. ఆయన మనుమడు ఇందుర్తి రామానుజరావు ఇంట్లో సోమరాజు రామానుజరావు ఫోటో లభించింది.

దుమ్ముగూడెంలో స్వాతంత్య్రోద్యమ కార్యకలాపాలు మహాత్మాగాంధీ కంటే ముందే ప్రారంభమయ్యాయి. 1917లో కోట్ల సన్యాసి నాయుడు అక్కడ పరమార్థ ప్రదాయని గ్రంథ నిలయం స్థాపించాడు. సుజన వినోదిని నాట్యమండలి, బాల వినోదిని నాట్యమండలి, మనోరంజని నాట్యమండలి, రాఘవకళాసమితి అనే నాటక సమాజాలు రామానుజరావు స్ఫూర్తితో స్వాతంత్య్రోద్యమ నాటకాలు ప్రదర్శించేవి. దుమ్ముగూడెంకు చెందిన కట్టా గంగయ్య, అంకాల శేషగిరిరావు, బైరెడ్డి పాపరావు, జాక అప్ప న్న, భద్రి రాములు, శివరెడ్డి సీతయ్య, పోలాసు భద్రగిరి, మాటూరి సాంబశివరావు, కురుచేటి శ్రీరామమూర్తి, జలుమూరి అప్పలరాజు, మద్దినేని కామేశ్వరరావు, దువ్వి సూర్యానారాయణ వంటి కళాకారులు రామానుజరావు అడుగుజాడల్లో నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో బాలుని పాత్రలు వేసే బైరెడ్డి ముసలి నాయుడు 2002లో వ్యాసరచయితతో ఈ విషయాలన్నీ చెప్పాడు.

స్వరాజ్య రథము నాటక రచన, ప్రచురణ 1921 మార్చి డిసెంబరుల మధ్య జరిగి ఉండాలి. ఈ నాటకానికి ముందు ఇదే రచయిత రాసిన తిలకు రాయబారము నాటకము 1921 మార్చిలో వెలువడింది. 1921 డిసెంబరు 6తేదీన స్వరాజ్య రథము పుస్తక ప్రతి పరిశీలన కోసం గుంటూరు కలెక్టరు కార్యాలయానికి అందింది. కాబట్టి ఈ మధ్యకాలంలోనే స్వరాజ్యరథము వెలుగులోనికి వచ్చిందని భావించవచ్చు. తిలకు రాయబారము నాటకాన్ని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన ఎస్. వెంకటేశ్వర అండ్ కంపెనీ ప్రచురించింది. తిలకు రాయబారము నాటకము బహుళ ప్రజాదరణ పొంది ప్రతులన్నీ అయిపోవడంతో వెంటనే తిలకు రాయబారమునకు మరో నాలుగు అంకాలు ప్రతిజ్ఞాశౌకతాలీయము, పాంచాల పరాభవము, రామరాజ్యస్థాపనము, రథయాత్ర అనే అంకాలు జోడించి ఐదు అంకాలతో సమగ్రమైన స్వరాజ్య రథము నాటకాన్ని రూపొందించాడు రచయిత.

తిలకు రాయబారము నాటకాన్ని ప్రచురించిన దుమ్ముగూడెం వెంకటేశ్వర అండ్ కంపెనీ తదుపరి ఆర్నెల్లకే వెలువడిన స్వరాజ్య రథము నాటకాన్ని ప్రచురించలేదు. హేత్వంతరముచే నీ గ్రంథము వేంకటేశ్వర గ్రంథమండలిచే ప్రకటించబడక అభినవ నాటక మాలికలో ప్రచురితమైనదిఅని రచయిత నాటకం ముందుమాటలో పేర్కొన్నాడు. హేత్వంతరాలంటే ఆ రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వ నిర్బంధాలే. ...ఈ నాటకమును నేను వ్రాసిన స్వరూపమునకును, ముద్రింపబడిన స్వరూపమునకు పోలిక మెక్కడను లేదు. నా వ్రాతప్రతిని ముద్రించుటకు ముద్రాలయము వారు సర్కారు శాసన నిర్బంధమున వెనుదీయుట చేత దీనిని స్వరూపము తొడ బయటకు తీసికొని వచ్చితిని. నాటకమును ప్రదర్శించువారు కోరినచో వ్రాతప్రతిని పెంపెదను... అని రచయిత ముందుమాటలో పేర్కొన్న దాన్ని బట్టి రాతప్రతి సెన్సారై ముద్రణకు నోచుకున్నదని తెలుస్తున్నది.

అయినప్పటికి భయపడకుండా ధైర్యంగా తాను రాసింది యథాతథంగా ప్రదర్శించే వారుంటే రాతప్రతిని పంపిస్తాననడం సోమరాజు రామానుజరావు నిబద్ధతకు తార్కాణం. నిజానికి గుంటూరులోని చంద్రికా ప్రెస్ దేశభక్తి రచనలకు ఆ రోజుల్లో పేరెన్నికగన్నదే. అయితే ఈ ప్రెస్‌తో స్వాతంత్య్రోద్యమ కారులతో సత్సంబంధాలుండడం అప్పటికే చంద్రికా ప్రెస్‌లో ముద్రించిన దేశభక్తి రచనలు నిషేధానికి గురికావడం వల్ల స్వరాజ్య రథము ముద్రణ నాటికి చంద్రికా ప్రెస్‌పై బ్రిటి ష్ ప్రభుత్వ నిఘా, నిర్బంధం పెరిగి ఉంటుంది. అయితే తన నాటక ప్రచురణకు గుంటూరు తిలకు నాటకసమాజము వారు ధన సహాయము చేసినట్లు సోమరాజు రామానుజరావు చెప్పుకున్నారు.

రచనా రంగం[మార్చు]

నాటకాలు[మార్చు]

సోమరాజు రామానుజరావు నాటకకర్తగా అనేక నాటకాలు రచించారు. ఆయన రాసిన నాటకాలు ఇవి:

 • లక్ష్మణ మూర్ఛ[2]: రామాయణంలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆయన ప్రాణాలు దక్కించేందుకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. ఆ పనికి అమితాదరం పొందిన రాముడు హనుమను కౌగలించుకుంటాడు. అపురూపమైన ఈ ఘట్టాన్ని రాముడి వద్దకు హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం నుంచి మొదలుకొని ఐదు అంకాల నాటకంగా రచించారు కవి. ఈ గ్రంథం 1933లో ప్రచురణ పొందింది.
 • అదృష్ట విజయము[3]: రామానుజరావు రచించిన ఈ నాటకానికి ప్రపంచ ప్రసిద్ధమైన అరేబియన్ నైట్స్ గ్రంథంలోని కథ మూలం. ఈ అరేబియన్ నైట్స్ కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అత్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు. వాటిలోని ఆలీబాబా నలభై దొంగలు ఈ కథకు మూలం. రహస్యంగా దొంగలు దాచిన నిధిని కనిపెట్టిన ఓ నిరుపేద జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ముఖ్య కథాంశం. పారశీక ఇతివృత్తాన్ని రచయిత భారతీయ నేపథ్యంలోకి మలిచారు.
 • రంగూన్ రౌడీ: వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా రచించిన నాటకమిది.[4] అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం సినిమాగా కూడా రూపొందించారు.
 • కాలకేతనము[5]: కాలకేతుదనే రాజు కథను ఈ నాటకంగా మలిచారు. ఇది జానపద ఇతివృత్తంగల నాటకం.
 • గృహలక్ష్మి: హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం-గృహలక్ష్మి. దీని కథా రచయిత సోమరాజు రామానుజరావు. రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.
 • స్వరాజ్య రథము: సోమరాజు రామానుజరావు వ్రాసిన ఐదు అంకాల నాటకం ఇది. ఆంగ్లేయుల దురంతాలకు తల్లడిల్లిన భరతమాత తనను కాపాడుమని ఇంధ్రసభలో వేడుకొంటుంది. తిలక్ గాంధీగా అవతరించి, ప్రజలను చైతన్యపరచి స్వరాజ్య రథాన్ని ముందుకు నడిపించి స్వాతంత్య్రాన్ని సాధించడం ఈ నాటకంలోని ఇతివృత్తం. వందలాది ప్రదర్శనలకు నోచుకొన్న ఈ నాటకం బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధించబడింది.
 • పార్వతీ గర్వభంగము[6]: ఈ నాటకానికే గంగావతరణమని మరో పేరు. ఈ నాటకాన్ని ఆయన రంగూనులోని ఆంధ్ర జాతీయ నాటక సభ కోసం రచించారు. జానపదుల నోళ్లలో నానుతూన్న గంగా గౌరీ సంవాదం, పౌరాణికంగా వర్ణితమైన గంగావతరణం సమన్వయం చేసి రచించిన నాటకమిది.
 • భోజ కాళిదాసు[7]: భోజరాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్నట్టుగా, వారిద్దరి మధ్యా జరిగిన సరస, సాహిత్యపరమైన వివిధ కథలు చాటువులుగా ప్రచారంలో ఉన్నాయి. రకరకాలైన శ్లోకాలు కాళిదాసు చెప్పినట్టుగానూ దానికి భోజరాజు కారణమైనట్టుగానూ ఉన్నాయి. వీటిలో చాలా భాగం చమత్కారయుతంగానూ, సాహిత్యంలోని సూక్ష్మ విశేషాలు తెలిపేవిగానూ ఉంటాయి. వీటన్నిటినీ స్వీకరించి రచయిత గ్రంథాన్ని రచించారు.
 • సతీ సక్కుబాయి[8]: సక్కుబాయి ప్రముఖ భక్తురాలు. ఆమె కథ చాలా ప్రాచుర్యం పొందింది. అత్తగారి ఆరళ్ళు భరించి, కృష్ణునిపై భక్తిని పెంచుకున్న ఆమెకు అత్తగారు చేయలేని పనిని అప్పగించినప్పుడు కృష్ణుడే కాపాడాడని ప్రతీతి. ఆమె కథను మహిళాభ్యుదయంతో ముడిపెట్టి ఈ నాటకాన్ని రచించారు.
 • ధరణికోట[9]: రెడ్డిరాజుల పరిపాలననూ,అందులోనూ ముఖ్యంగా వారు పోరిన ఓ సంగ్రామాన్ని కథావస్తువుగా స్వీకరించి ఈ నాటకం రచించారు.
 • భీష్మ బ్రహ్మాచారి [10]: మహాభారతంలోని భీష్ముడి గురించిన నాటకం
 • వీరాభిమన్యు [11]
 • దోమాడ యుధ్దము [12]
 • సంగీత సావిత్రి [13]
 • దానవీర కర్ణ [14]
 • తాజ్‌మహల్, దానవీరశూర కర్ణ, సతీ అనసూయ తదితర నాటకాలు అనేకం రచించారు.

నవలలు[మార్చు]

ఇతడు నాటకాలే కాకుండా నవలలు 20కిపైగా రచించాడు. నవలా ప్రక్రియను తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చినవారిలో సోమరాజు రామానుజరావు ముఖ్యుడు, ఈ విషయంలో ఇతను కొవ్వలి, జంపన వంటివారి కోవలోకి చెందుతాడని అక్కిరాజు రమాపతిరావు భావించాడు.[15]

వాటిలో కొన్ని[1]:

 1. మంజుమతి (1914)
 2. జగన్మోహిని (1915) - సుబోధినీ గ్రంథమాల, నెల్లూరు వారు ప్రచురించారు.
 3. విషవాహిని (1916) - ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, నిడదవోలు వారు ప్రచురించారు.
 4. హైమవతి (1916) - ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, నిడదవోలు వారు ప్రచురించారు.
 5. దోమాడ యుద్ధము (1921)
 6. శిశుహత్య
 7. వనదుర్గము
 8. జపమాలిక
 9. తపోవనము
 10. రక్తజ్వాల
 11. కరుణ

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 సంగిశెట్టి, శ్రీనివాస్ (13 November 2017). "తొలితరం నవలాకారుడు సోమరాజు రామానుజరావు". మనతెలంగాణ. మూలం నుండి 16 నవంబర్ 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 14 November 2017.
 2. భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణ మూర్ఛ నాటకం.
 3. భారత డిజిటల్ లైబ్రరీలో అదృష్ట విజయము నాటకం.
 4. భారత డిజిటల్ లైబ్రరీలో రంగూన్ రౌడీ నాటకం.
 5. భారత డిజిటల్ లైబ్రరీలో కాలకేతనము నాటకం.
 6. భారత డిజిటల్ లైబ్రరీలో పార్వతీ గర్వభంగము పుస్తకం.
 7. భారత డిజిటల్ లైబ్రరీలో భోజ కాళిదాసు నాటకం.
 8. భారత డిజిటల్ లైబ్రరీలో సతీ సక్కుబాయి నాటకం.
 9. భారత డిజిటల్ లైబ్రరీలో ధరణికోట నాటకం.
 10. భారత డిజిటల్ లైబ్రరీలో భీష్మబ్రహ్మాచారి నాటకం.
 11. భారత డిజిటల్ లైబ్రరీలో వీరాభిమన్యు నాటకం.
 12. భారత డిజిటల్ లైబ్రరీలో దోమాడయుధ్దము పుస్తకం
 13. భారత డిజిటల్ లైబ్రరీలో సంగీత సావిత్రి నాటకం
 14. భారత డిజిటల్ లైబ్రరీలో దానవీర కర్ణ నాటకం
 15. అక్కిరాజు, రమాపతి రావు (1975). తెలుగు నవల. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. p. 26. Retrieved 1 June 2018.

ఇవి కూడా చూడండి[మార్చు]