Jump to content

హరగోవింద్ ఖొరానా

వికీపీడియా నుండి
(హరగోవింద ఖురానా నుండి దారిమార్పు చెందింది)
హరగోవింద్ ఖొరానా
హరగోవింద్ ఖొరానా
జననం(1922-01-09)1922 జనవరి 9
రాయ్ పూర్ పంజాబ్
మరణం2011 నవంబరు 9(2011-11-09) (వయసు: 89)
అమెరికా
నివాసంIndia
జాతీయతఅమెరికా
రంగములుMolecular Biology
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలు
ప్రసిద్ధిFirst to demonstrate the role of Nucleotides in protein synthesis
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1968), Gairdner Foundation International Award, Louisa Gross Horwitz Prize, Albert Lasker Award for Basic Medical Research, పద్మ విభూషణ్ పురస్కారం

హరగోవింద్ ఖొరానా (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది).

విద్య

[మార్చు]

తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానములో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో దయానంద్ ఆర్య విద్యా (DAV) ఉన్నత పాఠశాలలో చదివాడు. పంజాబ్ విశ్వవిద్యాలయము, లాహోర్ ( ప్రస్తుతం పాకిస్తాన్ ) 1943 లో B.Sc, 1945లో M.Sc పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వవిద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి Ph.D పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించాడు.

పరిశోధనలు

[మార్చు]

1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలములో చేరాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీవిరమణ చేశాడు. తర్వాత గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగించాడు.[1] జన్యు స్మృతి (Genetic code) అనేది ఒక నిర్దిష్ట ప్రోటీన్ ను ఒక జీవకణం ఎలా తయారు చేయాలో జీవ కణానికి చెప్పే జన్యువులో ఉన్న సూచనలను తెలియజేస్తుంది.

1950లో శాస్త్రవేత్తలు జన్యు సమాచారం డి.ఎన్.ఏ.(DNA) నుండి ఆర్.ఎన్.ఏ. (RNA) కు తర్వాత ప్రొటీన్ నిర్మాణానికి బదిలీ అవుతుందని కనుగొన్నారు. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణానికి బిల్డింగ్ బ్లాక్స్. అవి జతగూడి ప్రోటీన్ అణువులను ఏర్పరుస్తాయి. డి.ఎన్.ఏ. లో మూడు న్యూక్లియోటైడుల వరుసక్రమం ప్రోటీన్ లోని ఒక అమైనో ఆమ్లాన్ని సూచిస్తుంది. దీనిని కోడాన్ (codon) అంటారు. ఖొరానా న్యూక్లియోటైడుల ఖచ్చితమైన వరుస క్రమాన్ని నిర్ధారించారు. ఆయన వివిధ ఎంజైములను ఉపయోగించి వివిధ రైబోన్యూక్లిక్ ఆమ్లాల గొలుసులను క్రమపద్ధతిలో రూపొందించారు. ఈ ఎంజైములను ఉపయోగించి ప్రొటీన్లను ఉత్పత్తి చేశారు. ఈ ప్రొటీన్ల యొక్క అమైనో ఆమ్లాల సీక్వెన్సులు జన్యు స్మృతి (Genetic code) ని విశదీకరించటానికి ఉపయోగ పడ్డాయి. ఏ వరుస క్రమంలో న్యూక్లియోటైడ్ లను అమరిస్తే ఏ ప్రత్యేక అమైనో ఆమ్లాలు ఏర్పడతాయో ఖొరానా, మార్షల్ నిరేన్ బర్గ్ లు వివరించారు. ఖొరానా కొన్ని కోడాన్లు ప్రొటీన్ల తయారీని ప్రారంభించడానికి లేదా ఆపటానికి కణాన్ని ప్రేరేపిస్తాయని నిర్ధారించారు ( start codons and stop codons).

జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యంగా సంక్రమించే జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జన్యువు (synthetic gene) ను సృష్టించడానికి ఖొరానా, ఆయన బృందం ప్రయత్నాలు మొదలు పెట్టింది. 1970 లో వారు ప్రయోగశాలలో ఈస్ట్ జన్యువును సంశ్లేషించటం ద్వారా తొలి కృత్రిమ జన్యువును ఆవిష్కరించారు. తర్వాత ఎష్చీరియా కోలి బ్యాక్టీరియా యొక్క పనిచేసే జన్యువు (functional gene) ను జీవకణం వెలుపల 1976 లో నిర్మించారు. ఆ జన్యువును బ్యాక్టీరియాలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.

ఖొరానా జ్యూరిచ్ లో ఉండగా 1959 లో ఆయన కార్బోడిమైడ్స్ (carbodiimides) పై ఆయన చేసిన పరిశోధన న్యూక్లియోటైడ్ కోఎంజైమ్స్ సంశ్లేషణకు, ఆలిగో న్యూక్లియోటైడ్స్ సంశ్లేషణకు ఉపయోగపడింది‌. 1960 లో ఖొరానా జీర్ణ క్రియలో ఉపయోగపడే కో ఎంజైమ్ ఎ ను సంశ్లేషించారు. ఆయన 1980 లలో దృష్టి ప్రక్రియలో పాల్గొనే రొడాప్సిన్ (rhodopsin) యొక్క జన్యువు నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. ఖొరానా పరిశోధనలు పోలిమరేజ్ చైన్ రియాక్షన్ (polymerase chain reaction) ప్రక్రియ ఆవిష్కరణకు దారి చూపాయి.

నోబెల్ పురస్కారము

[మార్చు]

జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్"ను సృష్టించగలిగాడు. ఈ ఆవిష్కరణ Genetic Engineering అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.

ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది. 1968 లో వైద్యశాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది.

పరివారము

[మార్చు]

[[]]లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె మరియూ డేవ్ రాయ్. ఆయన 1966 లో అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.

అవార్డులు

[మార్చు]

ప్రత్యేక గౌరవం

[మార్చు]

ఖొరానా 96 వ జయంతి సందర్భంగా గూగుల్ 2018 జనవరి 9న ఒక డూడుల్ తో ఆయనను గౌరవించింది.

మరణము

[మార్చు]

ఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ఖొరానా వెబ్ పుట:http://web.mit.edu/chemistry/www/faculty/khorana.html
  2. Mitchell, Bob (2011-11-11). "Biochemist Har Gobind Khorana, whose UW work earned the Nobel Prize, dies". News. Retrieved 2023-09-05.