భోగాది దుర్గాప్రసాద్
ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. |
భోగాది దుర్గాప్రసాద్ (1935-1972) గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్"కు చెందిన ముఖ్య నాయకులు . ప్రస్తుత భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి రాజకీయ గురువులు.[1]
ప్రాథమిక జీవితం
[మార్చు]దుర్గాప్రసాద్ గారు 1935 జూన్ 15 వ తేదీన పూర్వ మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంలో భాగమైన కృష్ణా జిల్లా, అవనిగడ్డ తాలూకా పర్రచివర గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన భోగాది సుబ్బారావు, మణిక్యమ్మ దంపతులకు జన్మించారు. వీరికి 3 అన్నలు, ఒక సోదరి ఉన్నారు.
దుర్గాప్రసాద్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం పర్రచివర గ్రామంలో, మాధ్యమిక విద్య నాగాయలంకలో సాగింది. బందరు (ప్రస్తుతం మచిలీపట్నం) లోని ప్రముఖ జాతీయకళాశాల లో ఇంటర్మీడియట్, బి.ఏ పూర్తి చేశారు.
ఆర్.ఎస్.ఎస్ జీవితం
[మార్చు]దుర్గాప్రసాద్ గారు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి, చిన్నతనంలోనే భారత, రామాయణ గ్రంథాలను అధ్యయనం చేశారు, బందరులో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్ తో పరిచయం ఏర్పడింది, ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవక్ గా సంఘ్ శాఖకు వెళ్లేవారు. ఆర్.ఎస్.ఎస్ లో ఎదుగుతున్న క్రమంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత తన జీవితాన్ని సంఘ కార్యానికి అర్పించారు.
1955లో ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా నెల్లూరు జిల్లాలో సంఘ్ కార్యకలాపాలు విస్తరణకు వెళ్లిన వీరు ప్రముఖ ఆర్.ఎస్.ఎస్ నాయకులు, నెల్లూరు, రాయలసీమ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరిస్తున్న సోమేపల్లి సోమయ్య గారితో కలిసి పనిచేయడం ప్రారంభించి నెల్లూరు జిల్లాలో సంఘానికి బలమైన పూనాదులు వేశారు.1955-65 వరకు నెల్లూరు ప్రచారక్ గా వందలాది యువకులను స్వయం సేవకులుగా తీర్చిదిద్దారు.
నెల్లూరులో ప్రచారక్ బాధ్యతలు నిర్వర్తించిన తరువాత1965- 1972 వరకు విజయవాడ విభాగ్ ప్రచారక్ గా నియమితులయ్యారు. ఆరోజుల్లో విజయవాడ విభాగ్ లో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు (తరువాతి కాలంలో ప్రకాశం జిల్లాగా మార్పు చెందింది), నెల్లూరు జిల్లాలు ఉండేవి. విజయవాడ విభాగ్ ప్రచారక్ గా పనిచేస్తున్న సమయంలో సంఘ్ పెద్దల సూచనల మేరకు భారతీయ జనసంఘ్ పార్టీ విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.
జై ఆంధ్ర ఉద్యమం, మరణం
[మార్చు]1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమం లాగే ముల్కి విధానాన్ని వ్యతిరేకిస్తూ1972లో అప్పటి కాంగ్రెస్ రాజకీయ కురువృద్ధుడు కాకని వెంకటరత్నం గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో కలిపి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేపట్టిన ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ తరుపున పాల్గొన్నారు, ఉద్యమ సమయంలోనే విజయవాడలో ఆందోళనలో పాల్గొని పోలీసుల కాల్పుల్లో గాయపడిన వీరిని ముందుగా స్థానిక ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నే 1972 డిసెంబరు 26 మరణించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పర్రచివరలో జరిగాయి.
వెంకయ్య నాయుడు :
1963 లో దుర్గాప్రసాద్ గారు నెల్లూరు ప్రచారక్ గా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు గారు వి.ఆర్.హై స్కూల్లో చదివేవారు, కబడ్డీ, ఖోఖో ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉన్న నాయుడు గారికి ఆటల ద్వారానే ఆర్.ఎస్.ఎస్ సంఘంతో పరిచయం జరిగింది. ఆరోజుల్లో సంఘ్ శాఖ నెల్లూరు లోని పొగతోటలో జరిగేది. దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శాఖలో చేరిన నాయుడు గారు అనతి కాలం లోనే సంఘ్ కార్యక్రమాల్లో ఆయనకి ప్రియమైన శిష్యుడిగా మారిపోయారు. బాలుడైన నాయుడు గారిలో క్రమశిక్షణ అలవరచడమే కాకుండా, ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారు. తరువాతి కాలంలో దుర్గాప్రసాద్ గారు విజయవాడకు మరీనా వారి అనుబంధం కొనసాగుతూనే వచ్చింది. ఈరోజు వెంకయ్య నాయుడు గారు రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిగా ఎదగడానికి ఆనాడు దుర్గాప్రసాద్ గారు వేసిన పూనాదులే కారణం.[2]
వ్యక్తిత్వం
[మార్చు]దుర్గాప్రసాద్ గారు సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికి సంఘ్ ప్రచారక్ గా సమాజ నిర్మాణానికి కృషి చేసేందుకు నడుంబిగించి వేలాది మంది యువకులను ఆర్.ఎస్.ఎస్ వైపు నడిపించి క్రియాశీలక కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. కులాలకు అతీతంగా వ్యవహరిస్తూ అందరితో ఇట్టే కలిసి పోయేవారు. సంఘంలో ఉన్న నిరు పేద స్వయం సేవకుల బాధ్యతలు స్వీకరించి తన సొంత ఖర్చుతో చదివించారు.
దుర్గాప్రసాద్ గారి ఆదర్శమైన వ్యక్తిత్వం, మిత్రుత్వం, కార్యదీక్ష, విలక్షణమైన నాయకత్వ లక్షణాలు అందరిని కట్టిపడేసేవి.
సంఘ్ కార్యకలాపాలు కోసం అవివాహితుడిగా జీవించిన దుర్గాప్రసాద్ గారు ఈనాటికి తెలుగు రాష్ట్రాల సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]దివిసీమ గాంధీగా తెలుగు ప్రజానీకానికి సుపరిచితులైన గాంధేయవాది, కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు మండలి వెంకట కృష్ణారావు గారు వీరికి మేనమామ[4], వారి కుమారుడు మండలి బుద్ధప్రసాద్ గారు బావమరిది.
మూలాలు
[మార్చు]- ↑ India, The Hans (2014-12-01). "Time to promote Indian culture: Venkaiah". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
- ↑ "Venkaiah Naidu Remembered These Two Gurus On Gurupurnima Day - Tupaki English". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
3. https://dvachowdary25.blogspot.com/2021/12/1935-1972.html?m=1