Jump to content

ఆలేరు

వికీపీడియా నుండి

ఆలేరు, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా మారింది.[2] ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4603 ఇళ్లతో, 18054 జనాభాతో 2942 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8996, ఆడవారి సంఖ్య 9058. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2800 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 746. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576537[4].పిన్ కోడ్: 508101.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆలేటికథ:ఆలేరు నల్లగొండ జిల్లాలోని ఒక మండలం.ఒక నదీలోయ నాగరికత నింపుకున్న పల్లెదీవి.ఎక్కడ తడిమినా ఊటలూరే చారిత్రక సంపదలు,నీటిచెలిమలు.లెక్కకు మిక్కిలి కాలువలు.ఊరు చుట్టూ వాగుల వడ్డాణం.చరిత్రలో పేర్కొనబడుతున్న షోడశజనపదాల్లో అస్మక (అశ్మక,అస్సక,అసక,అళక పేర్లతో)జనపదం ఒకటి.ఆ అస్మకజనపదం తెలంగాణాలోనిదే.తెలంగాణాలోని వివిధ ప్రాంతాలలో నాగులు, యక్షులు, అశ్మకులు, మహిషకులు,తెలుగులు వంటి జాతులు నివసించాయి.రామాయణంలో ప్రస్తావించబడిన మహిషకుల రాజ్యం నల్లగొండ,మెదక్ జిల్లాల్లో వుండేది. పురాణాలవల్ల మగధనేలిన మహాపద్మనందుడు అశ్మకను ఆక్రమించినట్లు, కళింగను (హాతిగుంఫశాసనం)జయించినట్లు తెలుస్తున్నది. మౌర్యులు (చంద్రగుప్తుడు,అశోకుడు), శాతవాహనులు, ఇక్ష్వాకులు,విష్ణుకుండినులు,రాష్ట్రకూటులు,పశ్చిమ, కళ్యాణిచాళుక్యులు, కందూరిచోడులు,కాకతీయులు, పద్మనాయకులు, బహమనీలు,కుతుబ్షాహీలు,నిజాంరాజులు తెలంగాణా నేలిన అందరి పాలనలో ఆలేరు ఉంది.

ఆలేటి ఉనికి

[మార్చు]
పాశుపతానికి చెందిన ఒక వీరశైవాచార్యుడు

భౌగోళికంగా ఆలేరు 17.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం,79.05 డిగ్రీల తూర్పు రేఖాంశాలపై ఉంది. సముద్రమట్టానికి 361 అడుగుల ఎత్తున ఉంది.ఈ గ్రామంలో నుండి (163) 202 జాతీయరహదారి వెళుతుంది.ఈ ఊరు చుట్టూ వున్న వూర్లన్ని ఎత్తుమీదున్నవే.చిన్న చిన్న రాతిబోళ్ళు 30,40 అడుగుల నుండి 100 అడుగుల (గొలను కొండగుట్ట) గుట్టలు చుట్టూరా విస్తరించి ఉన్నాయి.నిజానికి ఈ వూరిది నల్లరేగడి నేల.ఒకప్పుడు వూరి పైనుండి పారిన వాగుల వరదల్లో మట్టి పొరలు కొట్టుకుపోయి వూరిలోని ఈశాన్యప్రాంతమంత చౌడుభూములైనయి. కాలువగట్టు పొలాలు ఇసికపాలెక్కువున్న పొలాలు.వూరికి నైరుతిదిక్కున నల్లరేగడి చెలకలున్నాయి.ఆలేరు వాగుకు తూర్పున ఎర్రనేల లున్నాయి.ఈ వూరిలో జొన్నలు,సజ్జలు,తైదలు (రాగులు),మొక్కజొన్నలే కాక రాజనాలు, మైలసన్నలు, సాంబలు,గొట్టొడ్లు, వాసనవడ్లు,చిట్టిముత్యాలువంటి రకరకాల వరిధాన్యం పండించేవారు. మిరప, ధనియాలు, పొగాకు, ప్రత్తి, కందులు, పెసర్లు, బొబ్బెర్లు, సెనగలు, ఆముదాలు, కుసుమలు, వేరుసెనగ, నువ్వులు (పొద్దుతిరుగుడు కొత్తగాచేరిన పంట) తప్పనిసరిగా పండించేవారు. కూరగాయలకు కొదువలేని ఊరు.చేన్లల్ల దోసకాయలు, బుడమకాయలు, ఆనపకాయలు, బీర,బెండ, వంకాయ, టమాట పండించేవారు.వూరిలో తీగెపారే ఆకుకూరలు,కూరగాయల పందిళ్ళు లేని ఇల్లే వుండేది కాదు. రెండు చేదలకే నీళ్ళందే చేదబావులుండేవి.దరిబావులు,ఒరలబావులు మోటలతో తెల్లవారుజామున పాటలుపాడేయి.పర్రెకాలువల నీళ్ళు పంట పొలాలకు ఆదరువులై వుండేయి.

ఆలేరు పేరు కథ

[మార్చు]
వీరగల్లులలో ప్రత్యేకం

ఈ వూరిలో పెద్దపులులనే తరిమేటన్ని ఆవుల మందలుండేవని అందువల్లే ఆవులున్న ఈ ఊరు ఆవులూరు లేదా ఆవులేరుగా,రాను రాను ఆలేరుగా పిలువబడ్డది. కాదు ఆరు ఏరులు పారే ఊరే ఆలేరుగా పేరుపొందిందని కొందరివాదం.దానికి బలం కల్పించే కైఫీయతు ఏమిటంటే ఒకరాజు (?) రంగనాయకుని విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకపోతున్నపుడు విగ్రహమున్న బండి ఇక్కడి నదిపాయలో దిగబడిపోయి కదలలేదట.అపుడు రంగనాయకదేవుడే రాజుకు కలలో కనిపించి ‘శ్రీరంగపట్నంలో సప్తకావేరులున్నట్టు ఇక్కడ ఏడుపాయలు ప్రవహిస్తున్నందున ఇక్కడే తనవిగ్రహాన్ని ప్రతిష్టించి దేవాలయం నిర్మించమన్నా’డట. ఈకథను రంగనాయకుని గుడిపూజారి కీ.శే.కొండమయ్య భార్య చెప్పింది.అందువల్ల ఆలేరులో ఏడుప్రవాహాలుండడం వల్ల ఏరులఊరు ఆలేరు అయిందంటారు కొందరు.ఈ దేవాలయంలో 16 వ శతాబ్దంలో రంగనాయకుడు ప్రతిష్టించబడితే సా.శ.1034 నాటి సైదాపురం శాసనంలో పేర్కొన్న ఆలేరు కా పేరట్లా వచ్చే అవకాశమే లేదు.A Lair అంటే Chambers’ Dictionary ఇచ్చే అర్ధం 1.ఒక దాచుకునేస్థలం అంటే గుహ లేదా అడవిజంతువుల విశ్రాంతి ప్రదేశం,2.జంతువుల సురక్షిత ప్రదేశం... ఆలేరు పేరును అలయార్ అని తెలుగులో,ఆంగ్లంలో Alair గా కార్యాలయాల శిలాఫలకాల మీద చెక్కిన తమిళశిల్పి రాతలకు ఒక పండితుని వ్యాఖ్యానం.రెండువేల ఏండ్ల కిందటి వూరికి ఈ ఇంగ్లీష్ పేరెట్లా వస్తుంది? రాదు.ఆవులేరు ఆలేరుగా మారడమే పరిణామపద్ధతి.కళ్యాణిచాళుక్యుల ఏలుబడిలో ఆలేరు ఒకకంపణం.కంపణం అంటే ఒక దేశవిభాగం.కన్నడభాషలో కంపణమంటే మండలం లేదా విషయం అని అర్థం. (ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం- కుందూరి ఈశ్వరదత్తు.. పే.41) ఆలేరుకు 6 కి.మీ.ల దూరంలోవున్న కొలనుపాక పశ్చిమ చాళుక్య చక్రవర్తులకు కొంతకాలం రాజధాని, మరికొంతకాలం ఉపరాజధానిగా ఉంది.సైన్యాన్ని ఆయత్తపరిచే నెలవీడు,ఉపాయనవీడు (Preparatory camp)గా వుండేది.10 వ శతాబ్దంలో కొలనుపాక-7000ల గ్రామాలకు రాజధాని. (కొందరు ఏడువేల ఆదాయపరిమితిగల ప్రాంతం అని వివరించారు.) ఆ కాలాన ఆలేరు కంపణంగా వుండేది.కంపణం అంటే 40 నుండి 60 గ్రామాలకు కేంద్రంగా వున్న పాలకప్రాంతం.చాళుక్యచక్రవర్తి జగదేకమల్లుని కాలాన కొల్లిపాక-7000 విభాగంలో ఆలేరు-40 కంపణంగా వుండేది.ఒక ప్రాంతీయాధికారి ఇక్కడ పాలకుడుగా వుండి కంపణంలోని గ్రామాలను ఏలుతుండేవాడు.ఆలేరు-40 కంపణంలో గ్రామాలు పడమరన భువనగిరిదాకా, దక్షిణాన పులిగిళ్ళ, సుంకిశాలదాకా,తూర్పున వెల్మజాలదాకా,ఉత్తరాన కొన్నె మొదలైన గ్రామాలదాకా విస్తరించి వున్నట్లు తెలుస్తున్నది.

దేవాలయాలు

[మార్చు]

ఆలేరు శివాలయం : ఇది ఒక పురాతన దేవాలయం. ఇక్కడ అర్చకులు వేదాటి సత్య నారాయణ. ఇక్కడ శ్రావణ పౌర్ణమి నాడు సంతోషి మాత దేవాలయంలో సంతోషి మాత జాతర నిర్వహించబడును. ఇక్కడ సంతోషి మాత ఉపాసకులు రామన్న

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 14, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 8 ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల జనగాలో ఉంది. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ యాదగిరిగుట్టలోను, మేనేజిమెంటు కళాశాల జనగామలోనూ ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉంది.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఆలేరులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో12 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, నలుగురు నాటు వైద్యులు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోయడం నిషిద్ధం.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఆలేరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్ సరఫరా

[మార్చు]

తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

భూమి వినియోగం

[మార్చు]

ఆలేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 86 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 86 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 130 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 114 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 794 హెక్టార్లు
  • బంజరు భూమి: 1131 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 601 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2284 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 242 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఆలేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 242 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఆలేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, కంది

ఆలేరు చరిత్ర శాసనం

[మార్చు]
ఆలేరునదిలో భైరవుడు

ఆలేరులోని రెడ్డి కాలువ ఒడ్డున ఆలేరు శాసనం బయల్పడింది.నల్లగొండ జిల్లా శాసనసంపుటి-1లో 42 వది ఆలేరు శాసనం.ఆలేరు నుండి కొలనుపాక దారిలో (గ్రామ పంచాయితీ కార్యాలయం) రెడ్డికాలువ ఒడ్డున లభించిన శాసనంలో శాసనకాలం తెలియదు.విశ్వావసు సం. ( 1125 లేదా 1126?) జయంతిపురం రాజధానిగా పాలిస్తున్న త్రిభువన మల్లదేవుని కాలం నాటిది.ఈ శాసనంలో ఆలేరు-40 కంపణం సవదొరెగా సోమనాయకుడు పేర్కొనబడ్డాడు. వేమిరెడి, బూదిరెడి పేర్లు కూడా రాయబడివున్నాయి.

ఆలేరు శాసనపాఠం

[మార్చు]

శాసనం 1వ వైపు ........... సమస్త భు... వనాశ్రయ శ్రీ ప్రిథ్వీ వ ల్లభ మహా రా జాధి రాజప రమేశ్వర ప రమ భట్టా రక సత్యాశ్ర యకుళ తిళ కం చాళుక్యా భరణం శ్రీ మ త్రిభువన మ ల్ల దేవర వి జయ రాజ్యము త్త రోత్తరాభి వృద్ధి ప్రవర్ధ మానమాచం 2వ వైపు ద్రార్కతారం జ యంతీపుర ద నెలెవీడి నొ ళుసుఖ సంకథా వినోదదిం రాజ్యం గెయ్యుత్తరమిరె శ్రీమచ్చాళు క్య విక్రమ వర్షద 50 నెయ విశ్వావసు సం వ త్సరద బహుళ 1 సోమవారదం దు ఆలేఱ న ల్వత్తఱ సవదొ రె సోమనాయ క్కం వేమిరడి బూదిరడి యు అవన 3,4 వైపుల రాతలు జీర్ణమై వున్నాయి ( Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.42, p:115-117) ఆలేరు-40 కంపణానికి సవదొరెగా సోమనాయకుడు పేర్కొనబడ్డాడు.సవదొరె అంటే రాజరక్షకుడు.సవదొరె పిలుపే కాలక్రమాన ‘చౌదరి’గా పరిణమించినట్లున్నది.మావూరిలో చౌదరుల కుటుంబాలు 12 వుండేయి. మరొక శాసనాధారముః ఆలేటిశాసనం కంటే 90 ఏండ్లకు ముందుగానే ఆలేరు గురించి సైదాపురం (సా.శ.1034 జూన్ 4వ తేది ) శాసనంలో ఆలేరు-40, ఆలేరుకంపణంగా పేర్కొనబడింది. ఆలేరును పేర్కొన్న సైదాపురం శాసనం (యాదగిరిగుట్ట దగ్గర)... ఆ శాసనంలో.... 1వ వైపు స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీ పృ థ్వీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమభట్టారకం సత్యాశ్రయ కుళతిలకం చా ళుక్యాభరణం శ్రీ మజ్జగదే క మల్లదేవర్ సక వర్ష956 నెయ భాను సంవత్సర జేష్ట ద పుణ్నమి బృహస్పతి వారదన్డు పొట్టళకెఱె య నెలవీడి నొళ్సోమగ్రహణ మ హా పర్వనిమిత్తదిం వైద్యరత్నాకరం ప్రా ణాచార్య నగ్గళయ్యన భిన్నప దొళ్బ కొల్లిపాకె-7000 దొళగణ ఆలే ఱు-40 ఱ బళియ ముప్పనపళ్ళి యొళ గ్గళెయ్యన మాడిసిద బుద్ధసేనజినా లయక్క మిక్కుఱికి యొళె మాడిసిద వైద్యర త్నాకర జినాలయక్కం ముచ్చనపళ్ళియ గావు ణ్ణం నరవైద్య నగ్గళయ్యన మాడిత మయా ర్దె యొళాయెరడు బసదియ భోగక్కం ఖ ణ్డ స్ఫుటిత నవసుధాకమార్దిగళం జా కబ్బెయ రెకబ్బెయ బసదియ ప్రతిబద్ధ కజ్జికాస్థానమాగె దేవభోగం తత్ప్ర తిబద్ధం బుద్ధిపాకె వాళిగె స బెతం బిట్ట ముప్పనపళి యొళ్దులల్లెవపం హి.. 2వ వైపు ..నిర్దే హాయస (తాం హితాయ విదుషాం..) తాత్మానామారోగ్యాయన్రుణాం సుఖాయ సుహృదాతు. ష్టై గురూణాంసదారక్షాయై జినశాసనస్యభిష జాం శాస్త్ర్రక్రియా సంశయాష్ట్యైద్యుచ్చే్దాయచ ప ద్మ భూస్సహజవైద్య్తరత్నాకరః.... ఆయుర్వేద విదాంయేశాస్త్ర కర్మక్రమేప్రౌఢాశ్రీ జగదేకమల్లయః న్రుపతేర్యే శాస్త్రపారంగతాస్తేషాం సంసది శస్త్ర శాస్త్రకుశల శ్రీ వైద్యరత్నాకరః జేతా నా బల రగ్గళ బు ధనిధి శ్శస్త్రేణ శాస్త్రే ణావా.... యద్యత్ర శస్త్రాదిషుకర్మ కరోతి లోకత్వంతు ప్రపేత్పినరవై ద్యక మగ్గళార్యః దివ్యం తథాపది ద తదాపి సుఖం విధాతుం సింహస్యత స్యచ (జయసింహ) పి పరైర్భిషగ్భిర్వ్యాధి ప్రకర్షె తదు క్షం నిరూహ దక్షం కథయంతి దిక్షు ఉమాతంత్రమాద్యం ల... సంగ్రహ పరిచ్ఛేద క్రియాకౌశలోద్దామ ప్రథిత శస్త్ర శా స్త్రవిషయ ప్రాగణ్యమనూర్జితప్రదం కమ్మిగ చక్రవర్తి జయసింగం మె ....................... ...................... 3వ వైపు ప్రదియెళర సంగె (పణ్డరాగరకుడువ) జయ సింగం దా గద్యాణ...బసది రక్కెబా డరకవొన్డు రాటాణ మెరడు కరెయ నేల ..కిసుకాడు మాగెమత్తర్నూఱు పూ దోంట మొన్దు నివేశనం పత్తు (ఘర)ద్రమ్మ మొన్దుగావుంణ్డన మాన్యద పాఱగా గెఱకిదమామియోళ్పన్నెరడఱ కొల గావుణ్డన....ట్టర... డుకొ... ణ్దదోయ పిరియ కెయ్యమద్మణ్ఱమ మ్మడియ బిట్టద తెంకణ మద్దిన ధు వియ్గెం చికబెయోళ్ ఊ...కాల్గ............. ళొళ్గెల్ల......... ణాముఱు పూణం ...........ల్గళ ప్రతిబద్ధ .....గిళాల గెయ్దు ద్రమ్మం షుర ద్రమ్మని మొన్దు వణ..కొణు సోయారమియ్దొన్డు తాళబసమొన్దు పా లె త్పెం.. తొఱెయద డయొళద్యాం పడువణ ....ణుస యగామెమెం యాగె పడువలు మూడలు నన్దనవన మెన్యెయ తొణక్కం మత్తాన్నార్వల్వ త్త... మూడగణద్దెమె బెట్టదసా మా మాన్య దకెయ బోఱయ్యదె....పిదగణ బెట్టద ......కెయ్యత్త మూనూఱయ్యత్తు ఆయూ రసీమె దిశాగదొళ బియ కన్దుకూర కతన క ఱెయ దశాన ప కాణొండు మూఱుపల్లె ఆగ్నేయ దొళ్దు సనకుందెయ న మావరిష్ణ గండద కల్లోన్దుళుం గెయతాం నడకల్లోన్దు తెంకల్వ యెంబూ.. వీరెమొళె.. .....కల్లదిన్దునొ తెమొళ్వెలంగ కుళెయొ న్దు పడువణదె...యొ... న్దువాయ వ్యదొళె అవికుంటెయ మాకె..ప్పణుసె యకం.... ఈ శాసనంలో సా.శ. 1034 జూన్ 4వ తేదీన పొత్తలకెఱె ( పటాన్ చెరువు) వద్ద శిబిరంలో వున్న కొలనుపాక-7000నాడు మహారాజు జగదేకమల్ల-1 చంద్రగ్రహణ సందర్భంగా వైద్యరత్నాకర, ప్రాణాచార్య,శస్త్రశాస్త్రకుశల శ్రీ అగ్గలయ్య కోరిక మేరకు ఆలేరు-40 కంపణంలోని ముచ్చనపల్లి వద్ద నిర్మించిన బుద్ధసేనజినాలయానికి,ఇక్కుర్తిలోని వైద్యరత్నాకర జినాలయానికి కానుక ఇచ్చినట్లు తెలుపబడింది.ఇంకా మా గ్రామం చుట్టు వున్న గ్రామాలు కాలువల వివరాలు చెప్పబడివున్నాయి. ( Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.5, p:7-10) మరొక సైదాపురం శాసనం Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.6, p:11-12 లోని 12 వ పంక్తిలో కూడా ఆలేరు కంపణం ప్రస్తావించబడ్డది. కళ్యాణపురనివేశితుడు త్రిభువనమల్లదేవచక్రవర్తి రాజ్యకాలంలో వేసిన సా.శ.1106 ఏప్రిల్ 6 నాటి కొలనుపాక శాసనంలో కొలనుపాకలో వుండి పరిపాలిస్తున్న మహామండలేశ్వరుడు పారమారజగద్దేవుడు భువనగిరికోట దండనాయకుడు బమ్మదేవుడు (ధక్కన కుమారుడు)నిర్మించిన భువనగిరిలోని సోమేశ్వరతీర్థానికి అంగరంగభోగాలకు,అనుబంధంగా వున్న మఠంలోని విద్యార్థుల స్వాధ్యాయానికి ఆలేరు-40 కంపణంలోని గోష్టీపాళు గ్రామాన్ని సర్వమాన్యంగా దానంగా యిచ్చినట్టు ‘ఆలేటి కంపణక మధ్యే గోష్టీపాళు నామ గ్రామ మనంగుళి ప్రేక్షణీయం పరిహృత సర్వర్కర బాధం దేవభోగకృత ధారాపూర్వకం’ అని తెలుపబడివుంది. ( Inscriptions of A.P. Nalgonda Dist. Vol. I, No.26, p:69-72) గోష్టీపాళు అంటే ఆవులపల్లె అని అర్థమని,ఆవులఊరు,ఆవులయేరు,ఆలేరుకు సంస్కృతీకరణమే ‘గోష్టీపాళెం’అయివుండొచ్చని చారిత్రకపరిశోధకుడు విరువంటి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

అది కాక ఆలేరుకు 3కి.మీ.ల పైన పడమటిదిక్కున ఉల్లిపాటిగడ్డగా పిలువబడే పాతఊరు ఆనవాలుంది.దీనికి ఉత్తరాన పారుతున్న వాగును గొల్లోనిఒర్రె అని పిలుస్తారు.ఈ ప్రదేశంలోని భూములను ‘గొల్లోనిమాన్యం’అని కూడా పిలుస్తారు ప్రజలు.దొరుకుతున్న ఇటుకలు,పెంకులు,రోళ్ళు,పనిముట్ల ఆధారంగా పూర్వం ఇక్కడ పెద్దగ్రామం వుండేదని తెలుస్తున్నది.ఈ వూరే ‘గొల్లగూడెం’ అయ్యే అవకాశం ఎక్కువ.గొల్లగూడెమే గోష్టీపాళెం కావచ్చు.అపుడు త్రిభువనమల్లుని శాసనంలో పేర్కినబడ్డది ఈవూరే అవుతుంది. తేది,సంవత్సరం లేని 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్యుని (సా.శ. 1076-1126) చందుపట్ల దాన శాసనంలో భువనగిరి,చందుపట్ల,వీరవల్లి,పులిగిళ్ళ మొదలైనవి ఆలేరు-40 కంపణంలోని గ్రామాలుగా పేర్కొనబడ్డాయి.

ఆలేటి ఏటిపుట్టుక: ఎగువమానేరు రిజర్వాయరు (కరీంనగర్)నుండి మల్కపూర్,నష్కల్,భూంపల్లి,మిరుదొడ్డి, అందె,ఆకారం,తీగుడి,జగదేవపూర్లో మెదక్ దాటిన ఏరు గంధమల్ల,బేగంపేట,రేణికుంట,రఘునాథపురం దాటి కుర్రారం నుండి వచ్చిన వాగు దూదివెంకటాపురం ఏట్లో కలిసి కొలనుపాకకు పశ్చిమదిశలో,దక్షిణదిశలో పారి ఆలేరువాగులో కలుస్తుంది.

దిగువమానేరు రిజర్వాయరు (కరీంనగర్) నుండి మొదలైన వాగొకటి రామెంచ దగ్గర చీలి రెండు దిక్కులకు వెళ్ళింది.ఒకటి వర్కోల్ వైపు,మరొకటి రామెంచ వైపు.ఒకపాయ వర్కోల్ నుండి కోహెడ (మ్రోయు తుమ్మెదవాగు), శనిగరం చెరువు, బసవాపూర్,నంగునూరు,ధూళిమిట్ట,బైరాంపల్లి, ఆకునూరు (దాటినంక మరొకపాయ),చేర్యాల,బచ్చన్నపేట నుండి కొలిపాకకు ఉత్తరం,తూర్పుదిశల్లోపారి ఆలేరుకు ఈశాన్యాన రెండుపాయలు కలిసిపోయి ఆలేరువాగుగా రూపొందుతుంది. ఆలేరు పేరు మీదనే ఆలేరువాగు కాపేరొచ్చింది.మేం పెద్దవాగనే పిలుస్తుంటాం.మావాగు ఆలేరువాగుకు భిక్కేరు అనే మరో పేరుంది.బౌద్ధ భిక్షువులు ఈ వాగు వెంటనే పయనించారని,విహారాలు నిర్మించారని వాగొడ్డున అక్కడక్కడ బయట పడుతున్న బౌద్ధం ఆనవాళ్ళు సాక్ష్య మిస్తున్నాయి.భిక్కేరొడ్డున చాడ (ఆత్మకూరు మండలం)లో ఇటీవల సా.శ.2వ శతాబ్దం నాటి బౌద్ధస్తూపం అవశేషాలు,బుద్ధుని విగ్రహం లభించాయి.ఈ ప్రాంతంలో మహాయానం,వజ్రయానం వర్ధిల్లిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి.ఈ వాగు వెంట ఒక్క బౌద్ధమే కాదు,జైనం కూడా విశేషంగా వ్యాప్తిచెందింది.

ఆలేరువాగు మూసీనదికి ఉపనది.ఈ వాగు మెదక్,నల్లగొండ జిల్లాల గుండా 118 కి.మీ.లు ప్రవహించి మూసీనదిలో కలుస్తున్నది.ప్రస్తుతమున్న ఆలేటివాగు ఒకప్పుడు ఆలేరుకు 3 కి.మీ.ల కవతల నుండి పారినట్టుగా ఇక్కడి భూమి లోని ఇసుకపొరలు సాక్ష్యమిస్తున్నాయి.అందువల్ల ఆలేరుకు కొలనుపాకకు ఇప్పుడున్న వాగు అడ్డుగా లేకుండెడిదని చెప్పవచ్చు.

ఆలేరుకు పడమట ఇంకా రెండు వాగులు (వరదప్రవాహాలు) ఉన్నాయి.

ఒకటి: గొల్లోనిఒర్రె.గొల్లోనిమాన్యం నుండి పారే ఈ ఒర్రెకే గొల్లోని ఒర్రె,రత్నాలవాగు అని పేర్లున్నవి.కాని మా విరువంటి గోపాలకృష్ణ సార్ అది రత్నాలవాగు కాదు రాటనాలవాగంటాడు.నిలువురాతిస్తంభాల గాడుల్లో పొందించిన గడకర్రలతో నీళ్ళు తోడే నీటియంత్రాలను రాటనాలంటారు.అట్లాంటి రాతిస్తంభాలు కొలనుపాక గొల్లమఠం ముందర,మాసాయిపేట గుమ్మటాల దగ్గర ఉన్నాయి.

రెండవ వాగు: ఈదులవాగు.ఇది చాలా చిన్నవాగు.రత్నాలవాగుకు పైన 1 కి.మీ.దూరంలో ప్రవహించే వాగు. యాదగిరిగుట్ట దగ్గరి గ్రామాలు పెద్దకందుకూరు వాగునీళ్ళు,సైదాపురం,మల్లాపురం చెరువులు అలుగుపారిన నీళ్ళు బైరోనిఒర్రె నుండి ఆలేరు నానుకుని పారే రత్నాలవాగు,ఈదులవాగులలో పడి ఇక్కుర్తికే చేరుతాయి.

ఆలేటి బాట: పూర్వం హైదరాబాదు నుండి వరంగల్ వరకు ఒక ప్రాచీనమార్గం వుండేది.ఆ మార్గం ఆలేరు గుండానే సాగి విజయవాడకు చేరి బంగళాఖాతం నంటుతున్నది.ఈ మార్గంలోనే బౌద్ధభిక్షుకులు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. సార్థవాహులు కూడా ఈ బాటలోనే బంగళాఖాతం చేరి,అక్కడ నుండి విదేశాలకు నౌకాయానం చేసేవారట.సుత్తనిపాతంలో శ్రమణకులమార్గం ఆలేరుగుండానే సాగిందని రాసున్నదని మా చారిత్రక మార్గదర్శి విరువంటిగోపాలకృష్ణ గారన్నారు. (సుత్తనిపాతంగాథలుః9711,1010,1013-సార్థవాహులు,రచనఃమోతీచంద్.,పేజినెం.54)పూర్వ ప్రధాననగరాలైన అనుమకొండ, కొల్లిపాక,కోడూరు,అయిజ,మగతల,మస్కిలను కలుపుతు (ఇప్పటి వరంగల్,హైదరాబాదు,మహబూబ్ నగర్,రాయచూరులను కలిపే)ముఖ్యమైన బాట ఉండేది.దీనిని పూర్వం దండుబాటగా పిలిచే వారు.చాళుక్యుల కాలంలో కర్ణాటకలోని కొప్పం, రాయచూరు,ఆంధ్ర ప్రదేశ్ లోని కొలనుపాకకు ప్రయాణించే ప్రధానరహదారికి అడ్డంగా పోయే ఒక దండుబాట ఉండేది.అట్లే ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ నుండి కొలనుపాక గుండా శ్రీశైలానికి పోయే ప్రధాన రహదారి వుండేది. సుత్తనిపాతంలో ప్రస్తావించిన బౌద్ధశ్రమణకులు సముద్రతీరం వరకు వెళ్ళడానికి నడిచిన దారి ఇప్పటి జాతీయరహదారేనని చరిత్రకారుల అభిప్రాయం.అంటే ఆలేరు నుండే వారు వెళ్ళివుంటారు. (కొలనుపాక చరిత్ర – శాసనాలు...రచనః విరువంటి గోపాలకృష్ణ)

ఆలేటి పాటిగడ్డకు 3 కి.మీ.ల దూరంలో దాతారుగూడెంలో గవ్వల రామస్వామి బాయి దగ్గర బురుజుగడ్డ ఉంది.అది కొలనుపాక సైన్యాలు నడిచిన దండుబాట.కొలనుపాక రాజ్యానికి జాతీయరహదారి.అక్కడ కాపలా దార్లు వుండేవారు.ఇట్లాంటిదే రాజపేట మండలంలోని పారుపల్లిలో కూడా ఉంది.

ఆలేటికి పూర్వ చారిత్రకసాక్ష్యాలు: ఆలేరువాగు ఒకప్పుడు ఆలేరుకు దాదాపు 3కి.మీ.ల పైనుండి ప్రవహించి వుంటుందని నా అభిప్రాయం.ప్రస్తుతమున్న గ్రామానికి 3 కి.మీ. దూరంలో (రఘునాథపురం..రాజపేటదారిలో) బొబ్బిలిమడుగు దగ్గర గొల్లోనిమాన్యంలో ‘ఉల్లి’ పాటిగడ్డ అని పిలిచే ‘ఊరి’ పాటిగడ్డ,పాతఊరు శిథిలాలున్నాయి.అక్కడ వ్యవసాయం చేస్తున్నవారికి మధ్యశిలాయుగపు,నవీనశిలాయుగపు గొడ్డళ్ళు,సుత్తెలు వంటి రాతి పని ముట్లు,మట్టిపూసలు,పెద్దసైజు (14.9 అం.)కొలతల ఇటుకలు,మందపాటి పెంకలు దొరుకుతున్నాయి.అక్కడ ప్రస్తుతం పారుతున్న వరదకాలువలతో ఏర్పడ్డ గొల్లోనిఒర్రె (గొల్లోనిమాన్యంలో పారుతున్నందున పొందిన పేరు)అనబడే రత్నాలవాగు ఈవల దక్షిణదిశకు ఒడ్డున రోళ్ళు కనిపిస్తున్నాయి.రెండు,మూడడుగుల లోతులో ఇంఢ్లనిర్మాణం చేసిన జాడలు కనిపిస్తున్నాయి.

అవతలిఒడ్డున ఏముకుంట (నేమికుంట?)దగ్గర రోళ్ళగడ్డ అని పిలువ బడేచోట కూడా రోళ్ళు,శిలాయుగపు రాతి పనిముట్లు దొరుకుతున్నాయి.కొలనుపాకకు నైరుతి దిక్కున అక్కడ నుండి పారుతున్న ఆలేరువాగుకు వరదలొచ్చి నపుడు వాగు చీది,పల్లానికి జారి,ఇపుడున్న గుండ్లగూడెం గట్టుకు తట్టుకుని నిలిచి సాగిపోయింది.వాగుతో పాటు ఊరు ఇపుడున్న చోటికి తరలి వచ్చింది.నిదర్శనంగా వూళ్ళో మూడు ఆంజనేయుళ్ళున్నారు.గాఁవ్ జలే హనుమాన్ బాహర్ అనే జనోక్తి ప్రకారం ఆలేరు కనీసం 3 చోట్లకు మారిందని అర్థం.అంతేకాదు వూరిలో ఎక్కడ త్రవ్వినా అడుగున ఎక్కువగా ఇసుకపొరలు బయట పడుతుంటాయి. ఆలేరు నీటిపుట్ట: వూరికి ఉత్తరాన ఒకప్పటి పెద్దవాగు (ఆలేరువాగు) ప్రవాహమార్గంలో ఊటపర్రెలు పదిదాకా ఏర్పడివున్నాయి. అవే..... 1.ఏముకుంటపర్రె (వూరికి వాయవ్యాన 3కి.మీ. దూరంలో ఏముకుంట దగ్గర) 2.ఒంటిపర్రె (వూరికి వాయవ్యాన 2కి.మీ. దూరంలో బైరకుంట దగ్గర) 3.రామసముద్రం పర్రె 4.రెడ్డిపర్రె 5.ఇటుకరాళ్ళపర్రె 6.పెద్ద పర్రె ( ముడిగెల నుండి పెద్ద కాలువ) సాయిగూడెం కాలువ 7.కొలిపాకపర్రె 8.తుంగ చంద్రమ్మపర్రె 9.లచ్చిందేవి పర్రె 10.లోట్లపర్రె ( మంతపురికి కాలువ) 11.తలపర్రె లేదా ఇక్కుర్తి పర్రె ( తాటి ప్రమాణం లోతుండేదట) ( ఇక్కుర్తికి కాలువ) 12.బైరోని బొంద ఇవిగాక మాకు వర్షపునీటిని నిలువచేసుకునే కుంటలు 1.ఏముకుంట 2.బైరకుంట 3.చింతకుంట ( పాత బీరప్ప గుడి దగ్గర) 4.పోచమ్మకుంట 5.నాగుల కుంట (?) 6.బొబ్బిలి మడుగు (బండ్రు బీరప్ప కొట్టం దగ్గర) 7.కొచ్చెరువు ( ఇప్పటి జూనియర్ కాలేజి దగ్గర) వుండేవి.

ఇవి ఒకప్పటి ఆలేరువాగు మార్గంలో భూగర్భజలాల నిల్వలు. మా చిన్నపుడు చేయిపెట్టి తోడితే చాలు పర్రెలో నీటిజలలు పొంగుకొని వచ్చేవి. ఈ పర్రెల ఆధారంగానే నాకీ అభిప్రాయం కలిగింది.పర్రెలన్ని మావూరి నిండా పంటకాలువలై, తాగునీటి కాలవలై మాకు నీటికరువు లేకుండా చేసాయి. బావుల్లో 4,5 చేదలకే నీళ్ళందేవి. ఈ పర్రెలనుండే 1.రామసముద్రం కాలువ ( చాకర్ల కాలువ) 2.రెడ్డికాలువ (కుమ్మరిండ్ల దగ్గరి కాలువ) 3.పర్రెకాలువ 4.పెద్దకాలువ 5.కొత్తకాలువ 6.శాయిగూడెం కాలువ 7.మైలోని కాలువ 8.చంద్రమ్మ కాలువ 9.సోమరాజుబాయి కాలువ 10.గోనె కాలువ (ఏముకుంటలోనికి వచ్చేది) 11.మంతపురల్లరస కాలువ (లోట్లపర్రె నుండి)

కాకతీయులు ఈ వాగునీటిని కాలువల ద్వారా పంటపొలాలకు అందించి రైతుల వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. కాకతీయుల శాసనాల్లో మూసేటి కాలువ,ఆలేటి కాలువ,బొమ్మకంటి కాలువ,కూచినేని కాలువల ప్రస్తావన ఉంది. ఆలేటివాగు నుండి తీసిన కాలువే ఆలేటి కాలువ.కొలనుపాక రెవెన్యూరికార్డులో ఆలేటికాలువ ప్రస్తావించ బడింది.సా.శ.1074 నాటి కొలనుపాక శాసనంలో అసగరస అను మాండలీకుడు సూరయ్య అనే బ్రాహ్మణునికి అరసర కాలువ ప్రక్కన కొంతభూమిని దానం చేసాడు.ఈ కాలువ మంతపురల్లరస కాలువగా పేర్కొనబడింది.ఈ కాలువే ఆలేరు నుండి మంతపురికి పోయే ఊటకాలువగా గుర్తించబడ్డది.ఇపుడు ఈవూరి పర్రెలు,కాలువల ఆనవాళ్ళు కొన్నే మిగిలివున్నాయి. కొన్ని కనిపించకుండా పోయాయి.కుంటల్లో ఏముకుంట,బైరకుంటలే బతికి ఉన్నాయి.ఏముకుంట నేమికుంటనా?కావొచ్చు.మా అమ్మ చిన్నపుడు చెప్పిన కథ నిజమే అయితే ఈ కుంట నేమికుంట కావచ్చు.ఏముకుంట ప్రాంతంలో గిన్నెదేవర (జినదేవర లేదా జైనదేవుడు)బంగారుగుడి వుండేదట.దాన్ని సుదర్శనచక్రం వంటిది కాపాడుతుండేదట.ఒక మాంత్రికుడు (కాలాముఖ శైవులా?)ఛండాల (వామాచార, కౌలాచార)పూజలతో గుడిని అపవిత్రం చేసి బంగారం దోచుకుని గుడిని తగులపెట్టాడట.అపుడు కొందరు గుడిలోని వజ్రాల విగ్రహాలను తీసుకుని మాయావి మంత్రాలకందకుండా ఏరు (మంత్ర ప్రభావం ఏరు దాటదట)దాటించి దాచిపెట్టారట. సా.శ.1008,1040లలో రాజేంద్రచోళుడు,రాజరాజేంద్రచోళుడు కొలనుపాకను ధ్వంసం చేసి,తగులబెట్టించినట్టు చరిత్ర చెపుతున్నది.జైనదేవాలయాలను,బసదులను కూల్చాడని తెలుస్తున్నది.దారిలోవున్న ఆలేరు కూడా ధ్వంసం చెయ్యబడి వుంటుంది.బహుశః యుద్ధంలో తగుల బడినపుడు లేదా కూల్చబడినపుడు ఏముకుంట ప్రాంతంలోని గిన్నెదేవర (జినదేవుడి)గుడి మూలవిరాట్టులను కొలనుపాకకు తరలించి దాచివుంటారేమో.ఎందుకంటే ఆలేరు కూడా కొలనుపాక లేదా పంచక్రోశిపట్టణం లేదా రంభాపురి లేదా బింబావతిపట్టణం లోనిదే. (లేదా కుశస్థలి అని అభిప్రాయపడ్డారు...గజపతిరాయ్ వర్మ,తాడేపల్లిగూడెం,చారిత్రకపరిశోధకుడు,‘నరసురలు’పత్రికాధిపతి,వారిది నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకా అమీనాబాద్) ఆ వెయ్యేండ్ల కింద జరిగిన సంఘటనే కథగా మారిందేమొ.జైనదేవాలయాలను పడగొట్టించి హిందూదేవాలయాలుగా మార్చి కట్టుకొన్నవెన్నో సంఘటనలు చరిత్రలో ఉన్నాయి.కొలనుపాకలోని జైనదేవాలయం చెప్పుకుంటున్నట్టుగా సా.శ.4వ శతాబ్దిదేం కాదు.అట్లాంటి శాసనాధారాలేమి లభించలేదు.జినదేవరగుడిని ఎన్నోసార్లు జీర్ణోద్ధరణ చేసినట్టనిపిస్తుంది.ఆ గుడి బయట ఎన్నో జైనవిగ్రహాలు దొరికాయని గ్రామస్థులు చెప్పారు.ఆ ఆలయం గోడల్లోనే జైనశాసనస్తంభాలు లభించాయి. ఎవరుకూడా శాసనాలను అట్లా గోడల్లోపెట్టి కట్టరు.ఒక్క జైనాలయంలోనే కాదు,కొలనుపాకలోని కులమఠాల గోడల్లో,కప్పుల్లో, వీరనారాయణుని గుడి కప్పులో ప్రాకారపు గోడల్లో జైనశాసనాలెన్నో అగుపిస్తున్నాయి.అంటే మత ద్వేషంతో జైనాలయాల్ని, బసదుల్ని కూల్చి అవే రాళ్ళను వాడుకున్నారని పిస్తుంది.

మరోకథేమిటంటే కొలనుపాకలో ఎక్కడో బంగారుపందిరి లేదా మంటపం వున్నదని తరాలనుండి వినికిడి.దీనికి ఆ బంగారుగుడి కథకు సాపత్యం ఉంది. ఒకపుడు ఈ మా వూళ్ళో మహాకాళి దేవాలయం వుండేదట.అది ఏ వరదమేటల్లో మునిగివున్నదో.ఇపుడది అలభ్యం.ఈ వూళ్ళో మూడు ఆంజనేయుని గుళ్ళున్నాయి.ఒకటి హరిజనవాడదారిలో ఒకప్పటి పర్రె (కొత్త)కాలువ ఒడ్డున ఉంది.పాతగుడి ఆనవాలుగా ఒక ఆలయస్తంభం మిగిలివుంది.దాని మీది శిల్పాలు చిత్రంగా ఉన్నాయి.ఒకవైపు కూర్చుని చేతులు జోడించిన బొమ్మ,అభిముఖంగా మరోకవైపు నిలుచుని చేతులు జోడించిన మరొక బొమ్మ చెక్కబడివున్నాయి.రెండో హనుమంతుడు నడూర్లో బొడ్రాయి దగ్గర శివాలయంలో వినాయకునితో పాటు ఉంది.మూడో ఆంజనేయుడి గురించి ఎవరింట్లోనో వున్నట్టు చెపుతారు కాని జాడ దొరకలేదు.మావూళ్ళోని రంగనాయకుని గుడి, 16వ శతాబ్దం నాటిదని ప్రతీతి. గుడిలో రంగనాయకుని విగ్రహశిల్పం అద్భుతకళాఖండం.ఇంతటి విగ్రహం శ్రీరంగపట్నం తర్వాత మరెక్కడాలేదని అంటారు.ప్రతి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమికు తీర్థం సాగేది.తర్వాత గోదాకళ్యాణం జరిగేది.గుడిమాన్యం ఆదాయంతో దేవునికి నిత్య భోగాలుండేవని అంటారు.ఇపుడా మాన్యం లేదు.ఆలయం పునరుద్ధరణ చేసినపుడు పాత ఆలయస్తంభాల్ని,విగ్రహాల్ని ఎక్కడో పారేసారు.పాతగుడిలోని అర్ధమంటపం,ఆలయం పైకప్పు పైన మా చిన్నపుడు వున్న మునుల (జైనులు?)శిల్పాలు ఇపుడు లేవు.ఇప్పుడున్న గుడిగోడల్లో చాళుక్యుల శిల్పకళా స్తంభాలు రెండు,మూడు అగుపిస్తున్నాయి.గుడిలోపల ఒకటి, గుడిబయట మరొకటి వీరగల్లులున్నాయి.ఒకప్పటి జైనబసదిని వైష్ణవాలయంగా మార్చి వేసినట్లు చెప్తారు చారిత్రకపరిశోధకులు.అక్కడికి దగ్గరలో చండికాలయం ఉంది.ఆ గుడిని కూడా పునరుద్ధరణలో మార్చివేసారు.గుడిలో చండికాంబ,శివలింగం,వినాయకుడు, సూర్యవిగ్రహా లున్నాయి.ఒకప్పుడు ఇక్కడ త్రికూటాలయం వుండేదేమో.గుడి ముందర నగ్నరూపంలో మహిషాసుర మర్దని, భైరవుడు,1అడుగు ఎత్తున్న హనుమంతుడు,చిన్నవైన లింగాలున్నాయి.మేం చిన్ననాడు చూసిన అర్ధమంటపం ఇపుడులేదు. అక్కడికి చేరువలో బొడ్రాయి దగ్గర మరొక శివాలయం ఉంది.దేవాలయంలోని శివలింగం తెల్లనిరంగులో ఉంది.గుడిఎదుటవున్న వినాయకునిశిల్పం శైలిచూస్తే చాళుక్యులనాటిదనిపిస్తున్నది.

ఒకప్పుడు వూరిలో వుండే పోచమ్మకుంటకు పడమట వున్న పోచమ్మ దేవాలయంలో మూడు దుర్గవిగ్రహాలున్నాయి. మరొక విగ్రహం శిథిలమై విరిగివుంది.గుడిబయట పోతరాజుగా పూజలందుకుంటున్న వీరగల్లు ఉంది.గుడిలో వున్న మరొక శిల్పం అది జైనమునిదా లేక శైవాచార్యునిదా (ఎవరో సిద్ధునిది కావొచ్చని పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారన్నారు)నిర్ధారణకు అందడం లేదు.

రైలుకట్ట వెంట మాలోల్ల పోచమ్మ,కిష్టారెడ్డిచెలకలో మాదిగల (మాతంగి)పోచమ్మలున్నారు.అందులో వున్నవి దుర్గల శిల్పాలే.రైలుకట్టకు దగ్గరలో గౌరిదేవమ్మ గుడివుంది.అది 60 ఏళ్ళ కిందటిదే నంటారు.రైలుకట్టకు అవతలివైపు రైల్వేస్టేషన్ దగ్గరలో వున్న శివాలయం రాజరాజేశ్వరునిది.150ఏళ్ళ కింద నిర్మించబడ్డదట.రైల్వేఅధికారి తాతయ్యమాస్టరు ఈ శివాల యాన్ని నిర్మించాడట.ఆలేరులో రైల్వేస్టేషన్ కు ఎదురుగా ధర్మశాల వుండేదట.ధర్మశాల బాయి కూడా వుండేది.

ఇప్పటి పోలీస్ స్టేషన్ కు దగ్గరగా పురాతనకాలం నాటి మసీదుంది. మసీదుకు 150 యేళ్ళ వయసు. ఎదురుగా దర్గా ఉంది. అది సయ్యద్ ఇస్మాయిల్ షా ఖాద్రి సమాధిగా ప్రసిద్ధం. ఖాద్రి బాగ్దాద్ కు చెందిన అఫ్జల్ బియాబాని మనవడు. హైదరాబాదులో పెళ్ళి చేసుకుని ఖాజీపేటకు వెళ్తున్నపుడు కలరావ్యాధిబారిన పడి వంగపల్లి ప్రాంతంలో అంతిమఘడియల్లో వున్నపుడు ఆలేరుకు చేర్చేసరికి మరణించాడని, ఆయన స్మృత్యర్థం నిర్మించినదే ఆలేరుదర్గా అనిచెప్తారు. ఇది 200ల యేళ్ళ కిందిది. ఇక్కడి మతపెద్దల కలలో కనిపించి ఖాద్రి ఆదేశించినవిధంగా ప్రతిసంవత్సరం రజ్జబ్ 2వ తేదీన ఉర్సు చేస్తుంటారు. వందేళ్ళ కిందటి నుండి శేషగిరిరావు,వెంకటరావుగారలు ప్రతి సంవత్సరం ఉర్సు కొరకు బస్తా బియ్యం ఇస్తుండేవారు. ఈ దర్గాకు ఖాదింలుగా (ఖిద్మత్ దార్..ముతావలి) సయ్యద్ మహమూద్ అలీ. సయ్యద్ బిక్కం సాహెబ్ (హసన్ అలి అన్న కొడుకు), సయ్యదలీ, మహమూద్ అలీలు ఉన్నారు. ఆలేరులోని రామసముద్రం సమీపంలో మదార్ సాహేబ్ దర్గా ఉంది, 2009లో వెలసిన దర్గాకు ప్రతి శుక్రవారం దర్గాకు వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి, ప్రార్థనలు చేస్తుంటారు.[5]

తాటివనానికి వెళ్ళే రామసముద్రం తొవ్వలో కాటమయ్యగుడి ఉంది. అందులో సురమాంబాదేవి ఉంది. అక్కడే వున్న రైస్ మిల్లు గోడకు దగ్గరగా ఒక బావి (కోనేరు)వుండేది.పూడ్చేసారు.దానికి పైన కొద్ది దూరంలో భూదేవమ్మ గుడి వుండేదట. రైసుమిల్లులోని బావిలో మట్టిఒరలు బయట పడ్డాయని మానాన్నవాళ్ళు చెప్తుండేవారు.ఆ మిల్లుకిందకు పోయినవి తుంగచంద్రమ్మపర్రె,పర్రెకాలువలు.మట్టిఒరలు ఈ ప్రాంతంలో కొలనుపాకకు తూర్పున,షారాజిపేట అడ్లూరి చెరువులో, మావూరి రైసుమిల్లులో లభించాయని జనం ఉవాచ.

సోమరాజుబాయి: ఆలేరువాగుకు తూర్పు ఒడ్డున సాయిగూడెం దగ్గరగా సోమరాజుబాయి అనే చిన్నపల్లె ఉంది.అక్కడ వూరికి పడమట చిన్నదిబ్బ మీద నాగవిగ్రహాలు,జైనముని విగ్రహం,పాదాలున్నాయి.అక్కడికి దగ్గరలో పూర్తిగా చెక్కని సూర్య విగ్రహముంది.దేవాలయ శిథిలాలున్నాయి. నాగలికి తగిలినపుడల్లా దొరికిన విగ్రహాలను తీసి అక్కడి పెద్దబాయిలో వేసారట.

ముడిగెల: మావూరికి ఉత్తరాన కొలనుపాకదారిలో పెద్దవాగు ఒడ్డున ‘ముడిగెల’ (మునికెరె అంటే మునులచెరువు?)అనే పేరున్న ప్రదేశం ఉంది.కాని,AP Archeology A Review-1982-2001లోని 1990-91 ephigraphical survey నివేదికలో జైనదేవాలయస్తంభం మీద లభించిన శాసనంలో బలాత్కారగణముఖ్యుడు మహదేవచంద్రభట్టరు సమక్షంలో ‘ముడుగునూరు’ జైనబసదికి మహాప్రధాని,దండనాయకుడు మాయిదేవుడు భూదానం చేసినట్లు పేర్కొనబడ్డది.ఈ ప్రాంతంలో ముడుగునూరు వంటి పేరుగల వూర్లు లేవు.కనుక ముడిగెలే ముడుగునూరు అయివుండవచ్చు.ముడిగెలలో ఆలేరువాగు ఒడ్డున కలశం చెక్కిన దేవాలయం శేరడు (ద్వారబంధస్తంభం), చాలా అరుదుగా వుండే బెల్లంబొంద లేదా కోనేరు అని పిలువబడే కనీలతోకట్టిన చతురస్రాకారపుబావి ఉంది.సర్వాలంకారశోభితయైన మహిషాసురమర్దిని,వినాయకుని విగ్రహాలున్నాయి. అక్కడికి దగ్గరలో ఆంజనేయునివిగ్రహం ఉంది. ఆ పొలాల్లో ఎన్నో శిల్పాలు దొరికాయట. పొలం పనులకు అడ్డంగా వున్నాయని విగ్రహాలను ఆ బావిలో పడేసినట్లు స్థానికరైతులు చెప్పారు. వాగునుండి ఇసుక తోడుకపోయిన వ్యాపారులే నాగవిగ్రహాలు, ఆసనస్థితిలో వున్నస్త్రీమూర్తి విగ్రహం వంటి ఎన్నో శిల్పాలను తరలించారని అక్కడి పొలాలరైతులు చెప్పగా విన్నాం. ఒకే ఒక చేతులువిరిగిన విష్ణుమూర్తివిగ్రహాన్ని తీసుకెళ్ళి ఏముకుంటలో తమపొలంలో నిలుపుకున్నారు కీ.శే. బొట్లనర్సయ్య గారు. వీటన్నిటిని క్రోడీకరిస్తే ఈప్రాంతంలో జైనబసదివుండేదని తెలుస్తున్నది.అందువల్ల శాసనంలో పేర్కొనబడ్డ ముడుగునూరే ‘ముడిగెల’అవుతుంది.

33 అమ్మదేవతల గుళ్ళు

[మార్చు]
మావూరి పోచమ్మతల్లి

1. (ఊర)పోచమ్మ (పోచమ్మకుంట) 2.మాలపోచమ్మ 3.మాదిగల పోచమ్మ 4.గడిమైసమ్మ 5.పెద్దమ్మ ( పెద్దమ్మ కాలువ ఒడ్డు) 6.పర్రెమైసమ్మ 7.వనం మైసమ్మ 8.ముత్యాలమ్మ 9.గుండెలమ్మ 10. పబ్బల పోచమ్మ 11. బంగారి మైసమ్మ 12. మడి పోచమ్మ 13. మద్దిరమ్మ ( మద్దిరామమ్మ) 14. చింతకుంట్ల మైసమ్మ 15.ముక్కిడి పోచమ్మ (పాత బీరప్పగుడి దగ్గర) 16.పర్రె మైసమ్మ ( సోమిశెట్టి వారి పొలంలో) 17.ఉప్పల మైసమ్మ ( ముడిగెల) 18. మాతమ్మ (మాతంగిని దేవి) 19.చాకలి పోషమ్మ (పొలిచింత మైసమ్మ) 20.ఈల (నీల) గౌరమ్మ (CPM ఆఫీసు దగ్గర) 21,గుండెలమ్మ ( పసుల రోగాలు మాన్పే దేవత) 22. వనంల శ్రీదేవి 23. వనం మైసమ్మ 24.వనం ఎల్లమ్మ 25.ఉప్పలమ్మ (ఉప్పలమ్మగడ్డ) 26. సరుదుల (సరిహద్దుల) మైసమ్మ ( కొలనుపాక మార్గంలో) 27.అక్క మాంకాళమ్మ 28.బుగ్గ పోచమ్మ 29.మంద మాసానమ్మ 30. గాదర్ల మైసమ్మ 31.కానుగుల మైసమ్మ (ఇక్కుర్తి పర్రె దగ్గర) 32. సురభమ్మ ( కాటమయ్య గుడిలో) 33. నల్ల పోషమ్మ (ఆ గుడిలో 3 అమ్మదేవతల విగ్రహాలుండేవట) ఆలేరు, రామసముద్రం,శాయిగూడెం,మందనపల్లి,బహదూర్ పేట,మంతపురి,ఇక్కుర్తి అనే 7గ్రామాల పొలిమేరల కూడలిదేవత...నల్లపోషమ్మ. (వూరి పొలిమేరలో బంగారు మైసమ్మ కూడలిదేవత.)

ఈ అమ్మదేవతలు కాక కాటమయ్య (శ్రీకంఠ మహేశ్వరుడు),పోతలింగం (గుండెలమ్మ గుడి దగ్గర),భైరవుడు (బొడ్రాయి దగ్గర),వనభైరవుడు (?), బీరప్పలు వంటి వాళ్ళు అయ్య దేవుళ్ళు.మరో భైరవుని బొమ్మ బస్సులవంతెన దారిలో మండల కార్యాలయం వైపు ఆలేరువాగులో కుడిదిక్కున పెద్ద రాతి బండ మీద గంటుబొమ్మ లెక్క చెక్కి ఉంది.

ఇండ్లల్లో బాలమ్మ,బంగారు మైసమ్మ,ఇడుపుల మైసమ్మ,ఇంటింటి ఎల్లమ్మలు దేవతలుగా కొలువబడుతున్నారు.ఈ దేవతల పేర్లు,జాడలు చెప్పింది చాగంటి (కుమ్మరి)లింగమ్మ,మల్లెల బీరప్ప (ప్రఖ్యాత ఒగ్గు కథకుడు), మంగళి పోషయ్య. మావూరి బీరప్పగుడి గొల్లోని ఒర్రె ఒడ్డున ఉంది.ఇందులో గొల్ల, కుర్మలు పూజించే లింగాలలో కొన్ని ఆదిమానవుల రాతి పనిముట్లు.ఎక్కువగా రాతిగొడ్డండ్లు ఉన్నాయి.ఈ ప్రాంతంలో దాదాపు అన్ని బీరప్పగుళ్ళలో నవీన శిలాయుగానికి చెందిన ఆదిమానవుల రాతి పనిముట్లు లింగాలుగా పూజ లందుకుంటున్నాయి.ఇవికాక శిథిలాలయాల ఆనవాళ్ళు చాలానే ఉన్నాయి.

ఆలేరు మధిర గ్రామం:సాయిగూడెం: ఆలేరుకు తల్లిఊరు సాయిగూడెమని చెప్తారు.అసలు ఆలేరు లేనేలేదు, రైల్వేలైనొచ్చినాక ఏర్పడ్డదని అనే పెద్దలున్నారు. మరి ఈ చరిత్రంత ఎక్కడిది.చోళుల దాడిలో నేలమట్టమయి నపుడో,ఆలేటివాగు వరదల్లో మునిగినపుడో ఆలేరు గ్రామం ప్రజలక్కడికి వలసపోయివుంటారు. సాయిగూడెమంటే సాహిణిగూడెం (అశ్వసైన్యాల గుడారం)అని,ఈవూరికి 4 కి.మీ.దూరంలోనే వున్న బంటుగూడెం అంటే పదాతిదళాల (కాల్బంట్ల) గుడారం అని ఈ ప్రాంత గ్రామనామాల మీద పరిశోధన చేస్తున్న విరువంటి గోపాలకృష్ణ చెప్పారు.

సాయిగూడెంలో పురాతన రామాలయం వున్న పరుపుబండ ఉంది.దాన్ని రామునిబండ అని పిలుస్తారు ప్రజలు. దీనికే యోగాచలమని నామాంతర ముంది.ఇక్కడ పురాతనమైన శివాలయముంది.ఈ ఆలయాల ముందర పెద్దనీటి గుం (కుం)డం ఉంది.ఈ గుండంలో తూర్పున మెట్టువంటిచోట కదిలే శివలింగం ఉంది.గుడి చుట్టు పెద్ద ప్రాకారముంది. ఇట్లాంటి ప్రాకారాలు దుద్దెడ,ఆలేరు వంటి చోట్ల వుండేవి.ఈ దేవాలయంలో వున్న గరుత్మంతుడు, హనుమంతుని విగ్రహాలు పెద్దవి.16 వ శతాబ్దానికి చెందిన శిల్పాలవి.దేవాలయానికి దూరంగా చెలకలో గుడికి చెందిన రాతిరథచక్రాలు పడివుండేవి.ప్రతి చైత్రపూర్ణిమకు జరిగే ‘బండమీది దోపు’ అని పిలిచే రాములవారి కళ్యాణం పెద్దజాతరగా వుండేది.ఇపుడు లఘురూపంలోకి వచ్చింది.ఒకప్పుడు రాములవారి కళ్యాణానికి నిజాంరాజు ఏనుగు అంబారీలో తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపేవారట.ఆ ఏనుగు ఈ గుండంలో పడి చనిపోవడంతో నిజాం నజరానాలు పోయాయి.జాతర వేడుక తగ్గిపోయింది.గుడి ముందరి చెలకలో తలలు తెగిన జైనవిగ్రహాలు వుండేవట.పూర్వమిక్కడ జైనబసదేమైనా వుండేదేమొ.సాయిగూడెంలో ఒక మట్టికోట (గడి?) ఆనవాళ్ళు న్నాయి. గ్రామంలో రామాలయం,శివాలయా లున్నాయి.ఇవి గాక అమ్మదేవతల గుళ్ళున్నాయి. సాయిగూడెం ఒకప్పుడు ఖాల్సా గ్రామం.మా అయ్యలకాలంలో ఆలేరు పరిపాలనంతా ఈ వూరినుండే సాగుతుండేది. పటేండ్లు,పట్వారీలు ఇక్కడివారే.కట్టెగుమ్ములరెడ్లకు మాలీపటేల్ గిరి,గుంటుకరెడ్లకు పోలీసుపటేల్ గిరి,ఆకవరం వారికి కరణంగిరి వుండేయి.వసూలైన రకం (రెవెన్యూ) భువనగిరితహశీలుకు పొయ్యేది.పనివాండ్లు కూడా ఇక్కడివారే.ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులుండేవారు.వైష్ణవ పండితులుండేవారు.

సాయిగూడెం ఆదిమానవుల నిలయం కూడా.వూరికి దక్షిణాన వున్న నల్లగుట్ట ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసం.రాతిపనిముట్ల పరిశ్రమ కేంద్రం.ఇక్కడ అనేకంగా మధ్యశిలాయుగంనాటివి,కొత్తరాతియుగంనాటివి పనిముట్లు లభించాయి.చుట్టు పొలాలు కావడం వల్ల ఆనవాళ్ళు చెరిగిపోయాయి, పోతున్నాయి.నల్లగుట్ట ఎత్తు తక్కువగా ఉంది.గుట్ట మధ్య చిన్న సొరికె,ఆ సొరికెలో (మల్లన్నదేవుని గుహ అంటారు)నలుగురైదుగురు తలదాచుకునే చోటుంది.గుట్ట అంచున మోగే రాయి ( Ringing stone) ఉంది.దాని మీద రాయితో కొడితే ఖంగుమని నాదం వినిపిస్తుంది.అక్కడికి తూర్పున శాసనశిలలు తయారుచేసిన ఆనవాలుగా ఒక శాసనరాతిస్తంభం విరిగిపడివుంది.ఈ చుట్టుపక్కల ఆదిమానవుల సమాధుల చుట్టు పాతిన చుట్టురాళ్ళు (Rock boulders) ఇక్కడివే కావొచ్చు.ఒకప్పుడు ఎత్తుగావుండే ఈ ప్రదేశం ఆలేటివాగు వరదల్లో సగానికి మునిగిపోయింది.ఇసుక నిండిన పొలాలే దానికి సాక్ష్యం.నల్లగుట్ట దగ్గర పాతఊరు ఆనవాళ్ళున్నాయి.దిబ్బకు ఆంజనేయుని విగ్రహం గుర్తుగా మిగిలిపోయివుంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • బండ్రు నర్సింహులు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నాయకుడు.
  • పంచాంగకర్త సుబ్రహ్మణ్య సిద్ధాంతి: జటిల గణిత సాధ్యమైన పంచాంగణనము బహుప్రాచీన కాలము నుండి వారి వారి సంప్రదాయములను అనుసరించి చేయబడుచున్నవి.కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యక్ష గోచారములు కూడా తప్పిపోవు ప్రమాదములు మనము చూచుచున్నాము.ఇట్టి దోషములు తప్పిదములు రాకుండా ఉండాలని కంచి పరమాచార్యుల వారు సుమారు 110 సంవత్సరముల నుండి జ్యోతిష పంచాంగ పండిత సదస్సులను భారతదేశములోని ప్రముఖులైన జ్యోతిష, పంచాంగ, ఖగోళ, తర్క, మీమాంస, వ్యాకరణ, సంస్కృత, స్కంధత్రయ, మతత్రయ పండితులను, ధర్మశాస్త్ర పండితులను పిలచి శ్రీమఠమున నిర్వహించడము అవిచ్ఛినన్నముగా జరుగుతున్నది.అట్టి సభయందు ఆలేరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి ప్రతి సంవత్సరము గణిస్తూ వెలువరిస్తున్న శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగల, మౌఢ్య, పుష్కర, సంక్రమణ, గ్రహసంచార, గ్రహణ నిర్ణయములన్నియూ సశాస్త్రీయముగా ధర్మబద్ధముగా ఉన్నాయని పై సదస్సు అమోదించటం జరిగింది. శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగములో గోదావరి పుష్కరములపై ప్రత్యేక వివరణ, పుష్కర మాహత్మ్యం, నదీస్నాన సంకల్పం, అర్గ్యప్రధాన వివరములు సశాస్త్రీయముగా ఇవ్వబడినవి.అధికమాస విశిష్టత పై ప్రత్యేక వ్యాసం ఇవ్వబడింది.ప్రతేకముగా వివాహది ముహర్తముల విషయములలో ధర్మ శాస్త్ర వివరములు, పంచక రహితాది వివరములు, పుష్కర, వర్గోత్తమాంశ, శుభాంశలతో శుభముహూర్తములు, ప్రతిదిన గ్రహచక్రములు, ప్రతిదిన శ్రాద్ధ తిథి వివరములు, సంపూర్ణముగా సర్వులకూ అర్థమగు రీతిలో ఇవ్వడము జరిగింది దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి 19 సంవత్సరములకే పంచాంగ గణన చేసి అత్యధిక పిన్నవయస్సులో పంచాంగకర్తగా ప్రముఖులతో (జగద్గురు శ్రీశ్రీశ్రీ కంచి స్వామి, మాజీ సిక్కిం గవర్నర్ రామారావవు, సి.నా.రే.) సన్మానము పొందుట, జ్యోతిష కేసరి బిరుదు పొందుట జరిగింది. నల్లగొండ, రంగారెడ్డి వైదిక, అర్చక బ్రాహ్మణ సంఘములకు ఆస్థాన సిద్ధాంతిగా వ్యవహరించుట, 157 దేశములకు ప్రాంతీయ కాలసవరణలతో పంచాంగాన్ని తయారు చేయుట, సైంటిఫిక్ జ్యోతిషం అనే అంశము మీద పరిశోధన చేస్తున్నారు

భారతీయ సనాతన ధర్మము అందరికీ అదర్షప్రాయమైనది.అట్టి సనాతన ధర్మానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ హిదూ సంస్కృతీ సంప్రదాయములను పాటిచాలనే ఆలోచనతో ఈ ఉగాది తెలుగు క్యాలెండర్ రూపొందించడం జరిగింది.ఈ కాలనిర్ణయం తెలుగు మాసములతో అనేక వివరణలతో ఇవ్వడం జరిగింది.దీని రూపకర్త యగు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి అనేక వివరణములు, రాశి ఫలితములు, సంవత్సర ఫలితములు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. "ఆంగ్లవత్సరాది వద్దు - తెలుగు వత్సరాదియే ముద్దు" ఉమ్మడి దేశముల సఖ్యతకై ఆంగ్లవత్సరాదిని గుర్తిద్దాం.మన భారతీయ ఉన్నత్తత్వమును తెలుపుటకు తెలుగువత్సరాదిని ఆచరిద్దాం.

అవార్డులు

[మార్చు]

ఆలేరు పోలీసు స్టేషన్‌: దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరచిన పోలీసు స్టేషన్ల టాప్ 75 జాబితాలో ఆలేరు పోలీసు స్టేషన్‌కు 5వ‌ స్థానం వచ్చింది. పోలీసు స్టేష‌న్ల పనితీరు, మౌలిక స‌దుపాయాల ఆధారంగా, పౌరుల అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాలో (ర్యాంకుల‌లో) ఆలేరు  పోలీసు స్టేషన్ 5వ‌ స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో ఆలేరు పోలీసు స్టేష‌న్ అత్యుత్త‌మ స్టేష‌న్‌గా నిలిచింది.[6]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
  3. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (18 February 2019). "మత సామరస్యానికి ప్రతీక మదార్ సాహేబ్ దర్గా". Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.
  6. telugu, NT News (2022-04-29). "దేశంలోనే అత్యుత్త‌మ ఐదో పోలీసు స్టేష‌న్‌గా 'ఆలేరు' పీఎస్". Namasthe Telangana. Archived from the original on 2022-04-30. Retrieved 2022-04-30.

వెలుపలి లంకెలు

[మార్చు]

మహబూబాబాదు జిల్లా, నెల్లికుదురు మండలంలోని ఇదే పేరున్న మరొక గ్రామం కోసం ఆలేరు (నెల్లికుదురు) చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలేరు&oldid=4330577" నుండి వెలికితీశారు