ఈగ
ఈగలు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Infraclass: | |
Superorder: | |
Order: | డిప్టెరా |
Suborders | |
Nematocera (includes Eudiptera) |
ఈగలు (ఆంగ్లం: Fly) ఒక చిన్న కీటకాలు. నిజమైన ఈగలు డిప్టెరా (గ్రీకు: di = రెండు, and pteron = రెక్కలు), క్రమానికి చెందిన కీటకాలు. వీని ముఖ్య లక్షణం ఒక జత రెక్కలు, ఒక జత హాల్టార్స్ ను కలిగి ఉండటం. ఇదే లక్షణం వీటిని తూనీగలు మొదలైన ఇతర ఎగిరే కీటకాల నుండి వేరుచేస్తాయి. కొన్ని నిజమైన ఈగలు రెక్కలు లేకుండా జీవించగలవు.
లక్షణాలు
[మార్చు]ఇది మానవ ఆవాసాలలో పెరుగుతూ ఉంటుంది. ఆహార పదార్థాలపై వాలడం ద్వారా అంటు వ్యాధులను వ్యాపిస్తాయి. నోటిలోని అవయువాలు ద్రవపదార్థ స్వాదనానికి అనుకూలంగా ఉంటాయి. లాలాజలంతో ఈగలు ఘన పదార్థాలను కూడా ద్రవపదార్థాలుగా మారుస్తాయి.
దీనికి ముళ్ళ వంటి పంకా ఉన్నందున పాలు, ఇతర పదార్థాలు ఉండే గ్లాసుల మీద కూడా వాలగలవు. దీని కాళ్ళపై సన్నని రోమాలుంటాయి. ఇవి కొంచెం తడిగా ఉండే ఆహార పదార్థాలపైనే వాలుతూనే ఉంటాయి.
ఆడ ఈగలు ఒక్కసారి వంద గుడ్లను పెడుతుంది. పన్నెండు గంటల్లోనే ఈ గ్రుడ్లు పొదగబడి కోశస్థ దశను చేరుకుంటుంది. ఈ కోశస్థను ప్యుపేరియం అంటారు. ఇది ఈగకు కవచంలా ఉంటుంది. దీని పగల గొట్టిన తర్వాతనే ఈగగా బయటకు వస్తుంది. రెండు వారాల వయస్సు నుంచే సంతానోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించే ఈగల ద్వారానే కలరా, జిగట విరేచనాలు వ్యాపిస్తాయి. ఈగలు సామాన్యముగా ఒక్కొక్క కానుపునకు 120 మొదలు 150 వరకు గ్రుడ్ల నొక ముద్దగా పెట్టును. అవి తెల్లగ నిననిగ లాడుచు, జిగురు జిగురుగా నుండును. ఈగ తన గ్రుడ్ల నెప్పుడును పేడ కుప్పలు మొదలగు క్రుళ్ళు పదార్థములు గల చోట్ల బెట్టును. వీలయినప్పుడు మన శరీరము మీది పుండ్లలో కూడా ఇది గ్రుడ్లను పెట్టును. కొన్ని ఈగలు చిన్న పిల్లల ముక్కుల లోను చెవుల లోకూడ గ్రుడ్లు పెట్టును. ఇవి యిక్కడ వేసవిలో 24 గంటలలోపలను శీత కాలములో రెండు మూడు దినముల లోపలను 12 కణుపులు గల తెల్లని పురుగులుగా పరిణమించును. ఈ పురుగులు తలవైపున సన్నముగను వెనుక వైపున లావుగను మొద్దుగను ఉండును. ముందు వైపున రెండు దట్టమైన పెదవులు గల ముట్టె యుండును. ఈ ముట్టె రెక్కల ఈగ.
చర్మము నలుపెక్కి గట్టిపడి గుల్లగా నేర్పడును. ఈ గూటిలో ఇవి నిరాహారముగా మూడు దినములుండిన తరువాత పటములో చూపిన ప్రకారము గూటిని పగల్చుకొని రెక్కలు గల ఈగలుగా వెలువడును. ఇట్లు గ్రుడ్ల నుండి ఈగ పుట్టుటకు సగటున 10 దినములు పట్టును. ఈ దేశములో సామాన్యముగా సంవత్సరము పొడుగున ఈగలు గ్రుడ్లు పెట్టు చుండును. మగ ఈగల కండ్లు రెండును దగ్గరా నుండును. ఆడు దాని కండ్ల నడుమ ఎడమ హెచ్చుగా నుండును.
ఈగలు ఆహార పదార్థాల రుచులను ఎలా తెలుసుకుంటాయి?
[మార్చు]ఇతర ప్రాణుల్లాగా ఆహారాన్ని తీసుకొనే నోటిలోని భాగాల ద్వారా మాత్రమే ఈగలు ఆయా పదార్థాల రుచులు తెలుసుకోవు. ఈగల విషయంలో రుచి గ్రాహకాలు వాటి దేహమంతా వ్యాపించి ఉండే అతి సన్నని వెంట్రుకలపై కూడా ఉంటాయి. ఈ రుచి గ్రాహకాలు ఈగల రెక్కలు, కాళ్లు, పాదాలు, దేహం వెనుక భాగాలపై కూడా పరుచుకొని ఉంటాయి. (ఇంద్రుడికి ఒళ్లంతా కళ్లు ఉన్నట్లు) అందువల్ల ఈగల శరీర భాగాలు ఏ దిశలో ఆహారపు పదార్థాలను స్పర్శించినా వాటికి ఆ పదార్థాలు రుచిగా ఉన్నాయా లేదా అనే విషయం తెలిసిపోతుంది. మనలాగే ఈగలకు ఆహార పదార్థాలు తీయగా ఉన్నాయో, లేదో అనే విషయం వాటి గ్రాహకాల ద్వారా తెలుసుకుంటాయి.
ఆహారం తినే విధానం
[మార్చు]మనమొక అయిదు నిమిషములు ఒక ఈగ చేయు పనులను పరీక్షించి నేర్చుకొనగల విషయము లనేకములు గలవు. పండ్లు, ఆవు పేడ మురుగు చుండు వాన కాలములో అవి మెండుగ నుండును. దీనికి ఒక గ్రామం గాని ఒక ఇల్లు గాని శుభ్రముగా నున్నదా యని తెలిసి కొన వలెనన్న అక్కడ నుండు ఈగల జనాభాను ఎత్తు కొనిన చాలును. ఈగలు ఎంత తక్కువగ నున్న అంత పరిశుభ్రత గలదని చెప్పవచ్చును.
ఈగలు నూతుల దగ్గరను, వంటి యింటి ప్రక్కలను, కాళ్ళు చేతులు కడుగు కొను చోట్ల బురబుర లాడు చుండు చల్లని నేలందును, ఇచ్చ వచ్చినట్లు ఆడి ఆడి తుదకు ఒక గడప మీదనో కిటికీ మీదనో వ్రాలును. ఇది ఇక్కడ ఏమి చేయునో చూడుము. ఇది తిరిగిన అన్ని చోట్లనుండి రెక్కలమీదను తలమీదను పెట్టుకొని మోయ గలిగినంత బరువును మోసికొని వచ్చింది. తెచ్చిన దానిని తినుటకై ఇది యిక్కడ చేరినది. ఇది తన నాలుగు ముందు కాళ్ల మీదను వంగి నిలుచుండి వెనుక ప్రక్కనుండు రెండు కాళ్ళతో రెక్కలను వీపును అనేక సార్లు మిక్కిలి శ్రద్ధ్యతో తుడుచును. ఇట్లు తుడిచి తుడిచి దీని వీపు మేద మోసికొని వచ్చిన సరకుల నన్నిటిని వెనుక కాళ్ళతో నెత్తి, దానిని తన ఆరుకాళ్లతో త్రొక్కి ముద్ద చేసి ముందరి రెండు కాళ్ళతో నోటిలో పెట్టుకొని మ్రింగి వేయును. ఇట్లే వెనుక ప్రక్క కాళ్ళ మీద నిలువబడి ముందరి కాళ్ళతో తల, మెడ మొదలగు ప్రదేశముల మీదనున్న సామా నంతయు దింపి చిన్న చిన్న ఉండలుగా జేసికొని మ్రింగును. ఈ ఉండలు సూక్ష్మజీవుల ముద్దలుగాని వేరుగావు. ఇవియే దీని కాహారము. శుభ్రము చేసికొనుటకు దులుపు కొనుచున్నదని వారు అను కొనవచ్చును. కాని ప్రయాణము చేసి వచ్చిన తరువాతను, అంతకు పూర్వమును, ఈ యీగ కాలి నొకదానిని సూక్ష్మ దర్శని అను యంత్రములో పెట్టి పరీక్షించిన యెడల రహస్యము తెలియగలదు.ఈ యంత్రము ఒక దానిని వేయి రెట్లు పెద్దదిగా కనబరచు శక్తి గలది. ఈగ నొక దానిని, నీ మనసొప్పిన యెడల, చంపి దాని పొట్ట లోని పదార్థమును సూక్ష్మ దర్శినిలో పెట్టి పరీక్షించిన అందులో పుట్టలు పుట్టలుగా నున్న సూక్ష్మ జీవులను చూచిన యెడల నీ యంశ మింకను దృఢము కాగలదు. లేదా మనము తినబోవు అన్నము మీద అది వాలి నప్పుడు ఏదేని ఒక అన్నపు మెతుకు మీద నల్లని చుక్క బొట్టు నొక దానిని పెట్టి పోవును. ఆబొట్టు నెత్తి సూక్ష్మ దర్శనితో పరీక్షించిన యెడల రకరకముల సూక్ష్మ జీవులు కనబడును. ఈ బొట్టే ఈగ విసర్జించు మలము. దానిని తెలిసియు తెలియకయు కూడా మనము తినుచున్నాము.[1]
మూలాలు
[మార్చు]- ↑ [అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది]
ఇతర లింకులు
[మార్చు]