కె.వి.నారాయణస్వామి
కె.వి.నారాయణస్వామి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | కెవిఎన్ |
జననం | పాలఘాట్, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా (ప్రస్తుతం కేరళ) | 1923 నవంబరు 15
మరణం | 2002 ఏప్రిల్ 1 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 78)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వెబ్‌సైటు | www.narada.org |
పాలఘాట్ కొల్లెంగోడ్ విశనాథన్ నారాయణస్వామి (15 నవంబర్ 1923 – 1 ఏప్రిల్ 2002) ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు. కళావిమర్శకుడు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత వి.కె.నారాయణ మేనన్ ఇతడిని కర్ణాటక సంగీతంలో "సిసలైన యోధుని"గా అభివర్ణించాడు. [1]
ప్రారంభ జీవితం
[మార్చు]ఇతడు కొల్లెంగోడ్ విశ్వనాథయ్యర్, ముత్తులక్ష్మి అమ్మాళ్ దంపతులకు కేరళలోని పాలఘాట్‌లో 1923, నవంబరు 15న జన్మించాడు. ఇతని జన్మనామం రామనారాయణన్ కానీ నారాయణస్వామి అని స్థిరపడిపోయింది. ఇతను సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఇతని ముత్తాత తిరువాన్కూర్ సంస్థానం మహారాజా అయిల్యం తిరుణాళ్ వద్ద ఆస్థాన విద్వాంసుడు. ఇతని అష్టపదులు పేరుగడించాయి. విశ్వం భాగవతార్ కుమారుడు నారాయణ భాగవతార్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు. అతని కుమారుడు, కె.వి.నారాయణ స్వామి తండ్రి విశ్వనాథయ్యర్ వయొలిన్ విద్వాంసుడు. అతడు "ఫిడేల్ విశ్వనాథయ్యర్"గా పిలువబడ్డాడు. కె.వి.నారాయణస్వామి సంగీతంలో ప్రాథమిక పాఠాలను తన తండ్రి, తాతల వద్ద నేర్చుకున్నాడు. పాలఘాట్ లో ఐదవ తరగతి వరకు చదివిన తర్వాత ఇతడు కోయంబత్తూరుకు తరలి వెళ్ళాడు. అక్కడ ఇతడు నాటకాలలో నటించాడు. కన్నప్ప నయనార్ చిత్రంలో బాల కన్నప్పగా నటించాడు[2]
ఇతడు పాలఘాట్ మణి అయ్యర్ వద్ద మృదంగంలో శిక్షణ తీసుకున్నాడు. తరువాత ఇతడు సి.ఎస్.కృష్ణ అయ్యర్, పాప వెంకటరామయ్యల వద్ద సంగీతం నేర్చుకున్నాడు. 1942లో అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్ద 1942నుండి 1967 వరకూ గురుకులవాసం చేశాడు.[3]
వృత్తి
[మార్చు]1954లో మద్రాసు సంగీత అకాడమీలో జరిగిన సంగీత కచేరీ ఇతని జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. అతని గురువు అరియకుడి రామానుజ అయ్యంగార్ అనివార్య కారణాలవల్ల కచేరీకి హాజరు కాలేక పోయినందువల్ల ఇతనికి ఆ కచేరీ చేయడానికి అవకాశం లభించింది. పాలఘాట్ మణి అయ్యర్, పాపా వెంకటరామయ్యల వాద్య సహకారంతో ఆ కచేరీ అతని సంగీత ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇతడు పళని సుబ్రమణియం పిళ్ళై, పాలఘాట్ ఆర్.రఘు, మావెలిక్కర వేలుకుట్టి నాయర్, ఉమయల్పురం కె.శివరామన్ వంటి హేమాహేమీలను ఢీ కొన్నాడు. [4]పాలఘాట్ ఆర్.రఘు, వయోలిన్ విద్వాంసుడు టి.ఎన్.కృష్ణన్, ఇతడు సంగీత వేదికలపై తరచూ కనపడేవారు.
ఇతడు 1964లో ఇతడు కొత్త ఢిల్లీలో జరిగిన ప్రాక్ పశ్చిమ సంగీత సమావేశాలలో పాల్గొన్నాడు. 1965లో స్కాట్లాండులో జరిగిన ఎడిన్‌బరో ఉత్సవాలకు హాజరయ్యాడు.[5]
ఇతడు అమెరికా కనెటికట్‌లోని వెస్లియన్ విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్‌గా 1965-67 సంవత్సరాలలో ఉన్నాడు. ఆ సమయంలో ఇతడు అమెరికా నలుమూలలా సంగీత కచేరీలు చేశాడు. 1967లో ఇతడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్ లతో కలిసి లాస్ ఏంజెల్స్ లో జరిగిన "హాలీవుడ్ బౌల్ మ్యూజిక్ ఫెస్టవల్"కు హాజరయ్యాడు. 1974లో ఇతడు నృత్యకళాకారిణి బాలసరస్వతి, సితార్ విద్వాంసుడు నిఖిల్ బెనర్జీతో కలిసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కిలీకి పాఠాలు చెప్పడానికి వెళ్ళాడు. అమెరికన్ సొసైటీ ఆర్ ఈస్ట్రన్ ఆర్ట్స్ ఆహ్వానం మేరకు ఇతడు ఉత్తర అమెరికా, ఐరోపా (బెర్లిన్ మ్యూజిక్ ఫెస్టివల్ 1976), ఆస్ట్రేలియా(అడిలాయిడ్ ఆర్ట్స్ ఫెస్టివల్ 1988) ఖండాలు సందర్శించాడు. ఇతడు 1962లో మద్రాసు సంగీత కళాశాలలో లెక్చరర్‌గా చేరి 1982లో ప్రొఫెసర్‌గా పదవీవిరమణ చేశాడు.1984లో ఇతనికి శాన్‌డిగో విశ్వవిద్యాలయం ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ ఇచ్చింది. ఈ వేతనం పొందిన మొట్టమొదటి భారతీయ సంగీతకళాకారుడు ఇతడే.[3]
సంగీత శైలి, పాటల జాబితా
[మార్చు]ఇతడు తన గురువు అరియకుడి రామానుజ అయ్యంగార్ బాణీలో పాడినా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవరచుకున్నాడు. ఇతడు అన్నిరకాల కీర్తనలను, పలుభాషలలో ఆలపించాడు. వీటిలో వివిధ సమయాలలో వివిధ వాగ్గేయకారులు స్వరపరచిన అన్ని పాటలు ఉన్నాయి.[6] శ్రీరాగంలోఎందరో మహానుభావులు,కాంభోజి రాగంలో శ్రీ సుబ్రహ్మణ్య నమస్తే, భైరవి రాగంలో బాల గోపాల, ఖరహరప్రియ రాగంలో సతతం తావక, నాటకురంజి రాగంలో పాహి జననీ, దేవగాంధారి రాగంలో ఎన్నెరమమ్, లతాంగి రాగంలో పివర వరం తరుం, శ్రీరంజని రాగంలో కనవేణ్డమో యమున కళ్యాణి రాగంలో కృష్ణ నీ బేగనె బారో మొదలైనవి ఇతడు పాడిన పాటలలో కొన్ని.[7]
శిష్యులు
[మార్చు]ఇతని శిష్యులలో పద్మా నారాయణస్వామి, శశాంక్ సుబ్రహ్మణ్యం, అశ్వత్థ నారాయణన్, కె.వి.అనంతన్, హెమ్మిగె వి.శ్రీవత్సన్, పద్మా శాండిల్యన్, పద్మశ్రీ వీరరాఘవన్, హెమ్మిగె ఎస్.ప్రశాంత్, పట్టాభిరామ పండిత్, సతీష్ రావు, ఎం.ఆర్.సుబ్రమణ్యం, టి.ఎస్.రంగనాథ, మణిపల్లవం కె.సారంగన్, బాలాజీ ప్రసాద్ కృష్ణమూర్తి, రవి శ్రీనివాసన్, బి.రామన్, రామానుజన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్ మొదలైనవారు ఉన్నారు.[8] Also French Algerian Toufiq Touzene AKA Tulsi Ram.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1948లో ఇతడు పాలఘాట్ మణి అయ్యర్ బంధువు అన్నపూర్ణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముక్త, లలిత, రమ అనే కుమార్తెలు, విశ్వనాథన్ అన్న కుమారుడు జన్మించారు. 1962లో ఇతని భార్య అన్నపూర్ణి మరణించింది.[9] 1965లో ఇతడు తన శిష్యురాలు పద్మను వివాహం చేచుకున్నాడు. వారికి అనూరాధ అనే కుమార్తె జన్మించింది.[10]
పురస్కారాలు
[మార్చు]- 1976లో భారత ప్రభుత్వం వారి పద్మశ్రీ పురస్కారం.
- 1976లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1984-85 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్‌డిగో వారి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్
- 1986లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి.[11]
- 1989లో ది ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారిచే సంగీత కళాశిఖామణి.
మరణం
[మార్చు]ఇతడు 2002, ఏప్రిల్ 1వ తేదీన తన 73యేళ్ళ వయసులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Dr.Narayana Menon, An Essay on Shri K.V.Narayanaswamy, 1986
- ↑ Neelam, K.V.Narayanaswamy:Foremost Disciple of Ariyakudi, pp.25–31, 2001
- ↑ 3.0 3.1 Hemmige.V.Srivatsan, Palghat K.V.Narayanaswamy:Quiet flows a river of music, Sruti Magazine, Issue 27/28, December 1986
- ↑ Neelam, K.V.Narayanaswamy:Foremost Disciple of Ariyakudi, pp.34–41, 2001
- ↑ Neelam, K.V.Narayanaswamy:Foremost Disciple of Ariyakudi, pp.54–56, 2001
- ↑ Hemmige.V.Srivatsan, "The Master's Concert Repertoire", Sruti Magazine, pp.25–28, Issue 212, May 2002
- ↑ N.Pattabhi Raman, "A True Nada Brahmam", Sruti Magazine, pp.49–51, Issue 212, May 2002
- ↑ G.S.Satya, "KVN & Carnatic Music in the US", Sruti Magazine, p33, Issue 212, May 2002
- ↑ Hemmige.V.Srivatsan, Palghat K.V.Narayanaswamy:Quiet flows a river of music, Sruti Magazine, Issue 27/28, December 1986
- ↑ Neelam, K.V.Narayanaswamy:Foremost Disciple of Ariyakudi, pp.32–33, 2001
- ↑ Neelam, K.V.Narayanaswamy:Foremost Disciple of Ariyakudi, pp.63–65, 2001