గంగదేవిపల్లి
?గంగదేవిపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°00′N 79°30′E / 18°N 79.5°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | వరంగల్ |
జనాభా | 1,277 |
గంగదేవిపల్లి, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం ఒకప్పుడు మచ్చాపూర్ గ్రామ పంచాయతి పరిధిలో ఉండేది.1994, సెప్టెంబరులో మచ్చాపూర్ నుంచి విడదీసి దీనిని ప్రత్యేక గ్రామ పంచాయతిగా ప్రకటించారు.[1] ఆనాటి నుంచి గ్రామస్థులంతా సంఘటితమై సమష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయనారంభించారు. దాని ఫలితమే 2007లో ఈ గ్రామం నిర్మల్ జాతీయ పురస్కారం అవార్డు పొందినది. 1995, 2001లలో జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలలో సర్పంచుతో సహా వార్డు సభ్యులందరూ మహిళలే కావడం ప్రత్యేకత. ఇటీవలి కాలంలో అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి అనేక రాజకీయ పార్టీల అధినేతలు ఈ ఆదర్శ గ్రామాన్ని పర్యటించించడంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఈ గ్రామం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.
గ్రామం స్వరూపం, జనాభా
[మార్చు]గంగదేవిపల్లె గ్రామం జిల్లా కేంద్రమైన వరంగల్‌కు 12 కి.మీ. దూరంలో ఉంది. వూరి జనాభా 1277..
గ్రామ పాలన
[మార్చు]గ్రామ పంచాయతి ద్వారా గ్రామ పాలన నిర్వహించబడుతుంది.రెవెన్యూ హోదా లేని గ్రామ పంచాయితీ. 1994 సెప్టెంబరులో గంగదేవిపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతిగా ప్రకటించారు. అంతకు క్రితం ఇది మచ్చాపూర్ గ్రామ పంచాయతి పరిధిలో శివారు గ్రామంగా ఉండేది. 1995లో తొలిసారిగా మళ్ళీ ఐదేళ్ళ కాలపరిమితి ముగిశాక 2001లో రెండో సారి నిర్వహించిన గ్రామ పంచాయతి ఎన్నికలలో సర్పంచుతో సహా వార్డు సభ్యులందరూ మహిళలే ఎన్నిక కావడం ఈ గ్రామపు ప్రత్యేకత. 2006లో జరిగిన పంచాయతి ఎన్నికలలో రాజమౌళి సర్పంచుగా ఎన్నికైనాడు.
అభివృద్ధి కృషి
[మార్చు]గంగదేవి పల్లె గ్రామస్థులు స్వయంకృషితో సాధించిన ప్రగతి, విజయాలు పలువురి మన్ననలు పొందాయి. 100% అక్షరాస్యత, 100% మధ్య నిషేధం, ఇంటింటికి 100% పారిశుద్య సదుపాయం, గ్రామంలో 100% కుటుంబాలలో కుటుంబ నియంత్రణ ఆ గ్రామం సాధించిన ప్రగతి సూచికలు. స్వయంకృషి, సామూహిక ప్రయత్నం ద్వారా సమస్యలను అధిగమించవచ్చునని, గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుకోవచ్చునని ఈ గ్రామస్థులు నిరూపించారు. వూరిలో ప్రవేశించగానే ఇరువైపులా కనిపించే బోర్డులు వారి క్రమశిక్షణను, కట్టుబాటును చాటి చెబుతాయి.
మధ్యం నిషిద్ధం, అంతా అక్షరాస్యులే, రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు గంగదేవిపల్లి ఘనతను చాటుతాయి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత వంటి విషయాలు గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపాయి. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారేది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించింది . సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాని పల్లి గ్రామం కూడా గంగదేవిపల్లి ఆదర్శంగా తీసుకొని అన్ని కమిటీలు వేసుకోవాలి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్న ఆల్ పార్టీ సమావేశాలు నిర్వహించి పోసాని పల్లి అభివృద్ధి బాటలో నడవాలి గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థాపక సభ్యులు సిపిఐ ఎం పార్టీ కొమరవెల్లి మండల కమిటీ సభ్యులు, తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం సిద్దిపేట జిల్లా నాయకులు ఎర్ర బోయిన స్వామి ప్రస్తావించారు
గ్రామ కమిటీల పనితీరు
[మార్చు]గ్రామం దైనందిక పాలనలో కమిటీలు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. 1996 నుంచి డీ-ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికీ 20లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు. 1994కు ముందు గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతీ 10 మంది నిరక్షస్యురాలకు ఒక వాలంటీర్ నియమించారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించింది. బాల కార్మిక వ్యవస్థ లేదు. బడి ఈడు పిల్లలంతా చదువుకోవాల్సిందే.గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి రూ.2,200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, 'గ్రామాభివృద్ధి కమిటీ'... ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతీ ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్నా అభివృద్ధి నిర్ణయాల్లో అందరిదీ ఒకటే మాట. గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా పోలీసు రాలేదు. కొట్లాట కేసు కూడా నమోదు కాలేదు.
మొత్తం గ్రామంలో 13 కమిటీలున్నాయి. గ్రామాన్ని 18 భాగాలుగా విభజించారు. ఒక్కో కమిటీలో 11 నుండి 25 వరకు సభ్యులుంటారు. ప్రతి ఇంటి నుండి ఏదో ఒక కమిటీలో ప్రతినిధులున్నారు.[2]
- మద్యపాన నిషేధ కమిటీ - గ్రామంలో మద్యం వినియోగం కాకుండాను, ప్రక్క గ్రామాలనుండి అక్రమంగా తరలి రాకుండాను.
- మంచినీటి నిర్వహణ కమిటీ - ఇంటింటికీ నీటి సరఫరా, కుళాయిల చుట్టూ పారిశుధ్యం. లోఢీ సంస్థ సాయంతో మంచి నీటి ట్యాంకులు, టాటా కంపెనీ సాయంతో ఫ్లోరైడ్ రహిత నీటి ప్రాజెక్టు రూపొందించుకొన్నారు .[3] రూపాయికి 20 లీటర్లు నీరు అందిస్తారు. ప్రక్క గ్రామాలవారు అందుకు రెండు రూపాయలు ఇవ్వాలి. ఈ కమిటీ ఆదాయం ఇతర అభివృద్ధి పనులకు కూడా కీలకం.
- విద్యా కమిటీ - పాఠశాల నిర్వహణ, మరమ్మతులు వగైరా.
- గంగా డిష్ కమిటీ - కేబుల్ కనెక్షన్ పని- ఒక్కమారు 2,200 చెల్లిస్తే నిరంతరాయంగా కేబుల్ ప్రసారాలు. నెలసరి ఛార్జీలు లేవు.
- ఆరోగ్య కమిటీ - ఆరోగ్య పరిరక్షణ, సీజన్లలో వచ్చే వ్యాధుల గురించి ముందు జాగ్రత్త, కుటుంబ నియంత్రణ
- తల్లుల కమిటీ - అంగన్ వాడీకి అనుబంధంగా - గర్భిణీ, బాలింతల అవసరాలను చూస్తారు.
- రికవరీ కమిటీ - వ్యవసాయ ఋణాలను బ్యాంకులకు సక్రమంగా చెల్లించే పని అజమాయిషీ.
- గ్రామాభివృద్ధి కమిటీ - అన్ని అభివృద్ధి కార్యక్రమాలు.
నాయకత్వం
[మార్చు]గంగదేవిపల్లె పురోగతిలో కూసం రాజమౌళి (ప్రస్తుత సర్పంచ్), గోనె చేరాలు, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, కూసం నారాయణ, పెళ్ళి రాజయ్య వంటి వారు ప్రముఖమైన స్థానం వహించారు. తన అనుభవాన్ని రాజమౌళి ఇలా చెప్పాడు - "మొదట్లో ప్రజలందరినీ ఒకే త్రాటిపైకి తేవడం కాస్త కష్టమయ్యింది. అలాగని మేము ప్రయత్నాలు ఆపలేదు. అభివృద్ధి ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడానికి ప్రయత్నించాం. కొన్నాళ్ళకి వారిలోనూ చైతన్యం వచ్చింది. ప్రతి పనికీ స్వచ్ఛందంగా ముందుకు రాసాగారు. ప్రతీ నిర్ణయానికీ వోటింగ్ పెడతాం. మెజారిటీ సభ్యుల అభిప్రాయమే అంతిమ తీర్పు. ప్రజలందరూ ఏదో ఒక కమిటీలో సభ్యులు. కనుక ఏ పని మొదలు పెట్టినా ఇది నాది అనే బాధ్యతతో పని చేస్తారు. ఈ విజయాలన్నీ ఏ ఒక్కరో సాధించినవి కావు. ఈ ఘనత గ్రామ ప్రజలందరిదీను"[2]
1995 నుండి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవాలే. 1995 నుండి పదేళ్ళపాటు వార్డు మెంబరు నుండి సర్పంచ్ వరకూ అందరూ మహిళలే ఎన్నికయ్యారు. వూళ్ళో మొత్తం 14 పొదుపు సంఘాలున్నాయి. ప్రతీ ఇంటి నుండి ఒక మహిళయినా ఏదో ఒక సంఘంలో సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరి.
గుర్తింపు
[మార్చు]- గంగదేవిపల్లి 2007లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ ఎంపిక చేసింది. గ్రామీణ భారత అధ్యయనం, పరిశోధనా అకాడమీ ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ముఖ్య సలహాదారు.
- గంగదేవిపల్లి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందుకుంది.
- వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది.
- గ్రామంలోని కుటుంబాలన్నీ చిన్న మొత్తాల పొదుపులో చేరినందుకు 1999లో కలెక్టర్ ప్రత్యేక అవార్డు అందించారు.
- కెనడా, బంగ్లాదేశ్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు వచ్చి గంగదేవిపల్లి గ్రామస్వరాజ్యాన్ని అధ్యయనం చేశాయి. తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్ బృందాలూ వచ్చాయి. ఇతర జిల్లాల బృందాలకు లెక్కేలేదు. జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే.[4]
- "దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఇలాంటి గ్రామం ఒకటి ఉండాలి" - అని 2005లో గ్రామాణికి వచ్చిన పంచాయితీ కమిషనర్ చెల్లప్ప ప్రశంసించాడు.[2]
- ఆంధ్రా బ్యాంక్ వారు ఈ గ్రామాన్ని "పట్టాభి ఆదర్శ గ్రామం అభివృద్ధి ప్రణాళిక" క్రింద దత్తత తీసుకొన్నారు [5]
- "ఈనాడు"లో వ్యాసాన్ని ఆ రచయితలు ఇలా ముగించారు - " మధ్య నిషేధం తొలి అడుగు... తాగునీటి సమస్య పరిష్కారం మరో ముందడుగు. ... క్రమ శిక్షణ .. కట్టుబాట్లు ... దిద్దుబాట్లు ... ప్రగతి రథ చక్రాలు. ప్రజలే సారధులు. అభివృద్ధి ఫలాలకు వారసులు. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న ఇలాంటి పట్టుగొమ్మలు అందుకోసం కలలు గన్న మహాత్మునికే కాదు. మనందరికీ గర్వ కారణమే, స్ఫూర్తి దాయకమే" [2]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఇట్ల శాంతి ఎన్నికైనారు. ఈ గ్రామానికి2013 అక్టోబరు 31 నాడు, 20 దేశాల ప్రజలు వచ్చి గ్రామాభివృద్ధిని చూసి ప్రశంసించి వెళ్ళారు. (ఈనాడు, వరంగల్లు, 1-11-2013)
మూలాలు
[మార్చు]- ↑ వార్త దినపత్రిక, పేజీ 5, తేది 02-10-2008.
- ↑ 2.0 2.1 2.2 2.3 ఈనాడు ఆదివారం 14-10-2007 వ్యాసం "పల్లె పల్లవించె" - సి.హెచ్.నాగేశ్వరరావు, పి.బాపనయ్య, కృష్ణమూర్తి
- ↑ WATER WORLD[permanent dead link] Tata Projects and the Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry (Fapcci) installed a de-fluorination plant with a capacity of 24,000 litres in the Gangadevipalli village in Warangal district. - The plant provides drinking water with fluoride content well within permissible limits and uses reverse osmosis, membranes and filters to remove harmful fluorides. Groundwater contaminated by fluorides affect several districts, including Warangal, in Andhra Pradesh. Inaugurated on 5 October 2004, the plant will produce an average of 20 litres per house for the village of 1,180 residents. The villagers formed a "women's committee" and decided that a household will pay a monthly fee of US$ 0.65 for 20/litres per day to maintain the plant. Additional water production will be sold to neighbouring villages and the profits will be saved in the village development fund. Fapcci will install another plant in the most fluoride-affected village of Nalgonda district.
- ↑ (ఈనాడు 2.10.2008)
- ↑ హిందూ పత్రికలో వ్యాసం Archived 2009-08-14 at the Wayback Machine - Andhra Bank has adopted Gangadevipalli village in the mandal as part of its `Pattabhi model village development plan' ... The bank would implement its credit plan and provide financial assistance for both farm and non-farm activities. - "Our aim is to ensure all-round and comprehensive development of the village. The bank will also take over the existing debts with private money lenders and thus liberate the farmers from the distress," he said amidst cheers from the crowds. Participating as the chief guest, district Collector K. Damayanthi lauded the efforts of the villagers who had to their credit many milestones. .. Village sarpanch K. Rajamouli said the villagers never differed in their opinion on any issue. They all stood united to secure the development and better standard of living. The village has many distinctions such as cent per cent literacy, cent per cent tax collection, committees to govern sanitation, drinking water supply and others. Mr. Ramakrishnan and Ms. K. Damayanthi were impressed by the work done by the villagers and appreciated their initiative in avoiding the election by choosing the candidates unanimously in local body elections.