జైన్ యార్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవాబ్

జైన్ యార్ జంగ్
జననం
సయ్యద్ జైనుద్దీన్ హుస్సేన్ ఖాన్

1889
మరణం1961
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థనిజాం కళాశాల (హైదరాబాదు)
క్రిస్టల్ కళాశాల (లండన్)
వృత్తిఆర్కిటెక్ట్
పురస్కారాలుపద్మభూషణ్ (1956)
భవనాలు
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులతో జైన్ యార్ జంగ్ (మొదటి వరుస, కుడి నుండి ఆరవ వ్యక్తి)

జైన్ యార్ జంగ్ (1889–1961) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాస్తుశిల్పి.[1][2] హైదరాబాద్ రాష్ట్రానికి చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు.[3]

జీవిత విషయాలు[మార్చు]

హైదరాబాద్ సంస్థానంలో నవాబు ఇమాదుల్ ముల్క్ 33 సంవత్సరాలపాటు రాష్ట్ర విద్యాశాఖాధికారిగా పనిచేశాడు. ఇతడు 1886లో నిజాం కళాశాలను స్థాపించాడు. ఇమాదుల్ ముల్క్ కుమార్తె కుమారుడే ఈ జైన్ యార్ జంగ్.

జైన్ యార్ జంగ్ 1889లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన జంగ్, లండన్ లోని క్రిస్టల్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాదుకు వచ్చిన తరువాత పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంటు ఇంజనీరుగా చేరాడు.

ఆర్కిటెక్ట్‌గా[మార్చు]

జైన్ యార్ జంగ్ ఉస్మాన్ సాగర్, బాద్షాహి మసీదు, హిమాయత్ సాగర్ మొదలైనవాటికి ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లైన నవాబ్ జైన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రజాలను నిజాం రాజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన భవనాల అధ్యయన యాత్రకు పంపాడు. ఈజిప్టులో ప్రముఖ బెల్జియన్ ఆర్కిటెక్ట్, ఎర్నెస్ట్ జాస్పర్‌ను కలుసుకోని హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ రూపకల్పన కోసం అతని సలహాలను తీసుకున్నారు.[4] జాస్పర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో పనిచేశారు.[5]

డివిజినల్ ఇంజనీర్ గా, రాజభవనాల పరిరక్షణాధికారిగా, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల డీన్ గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనరుగా, పబ్లిక్ వర్క్స్ శాఖామంత్రిగా అనేక ఉన్నత పదవులు నిర్వర్తించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించాడు. ఆర్ట్స్ కళాశాల భవనం, సైన్సు కళాశాలల భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు.

ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం భవనాల రిపేర్, తాజమహల్ పరిరక్షణ, లాహోర్ లోని ప్రసిద్ధమైన బాద్షాహీ మసీదు రిపేర్ పనులకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇంజనీర్ల బృందంలో జంగ్ సభ్యుడిగా ఉన్నాడు. సిక్కుల గురుద్వార, లండన్ లోని నిజామీ మసీదు, ఢిల్లీ యూనివర్సిటీ కళాశాల భవనాలు, వికారాబాద్ టి.బి. శానిటోరియం భవనాల నిర్మాణాల ప్లానుల్లో సహకారం అందించాడు.

హైదరాబాద్ ప్రభుత్వమే తొలిసారిగా దేశంలో నీటి పారుదలకోసం ప్రత్యేకశాఖను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టుల పనులు జంగ్ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యాయి. హైదరాబాద్ – మద్రాస్ ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన తుంగభద్ర ప్రాజెక్టు విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య తగాదా ఏర్పడినప్పుడు సాంకేతిక నైపుణ్యంతో ఈ సమస్యను పరిష్కారానికి జంగ్ కృషిచేశాడు. 19౩8లో భారతదేశ రోడ్డు కాంగ్రెస్ సభ్యులు హైదరాబాదులోని విశాలమైన రోడ్లు చూసి ఇలాంటివి ఏ రాష్టంలో లేవంటూ జంగ్ ను ప్రశంసించారు. 1954లో భారత ఇంజనీర్ల సంస్థకు ఆయన అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. లండన్ లో జరిగిన కామన్వెల్త్ స్టాండర్డ్ కాన్ఫరెన్స్ కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

జంగ్ మొదటిసారి 1944లో మంత్రి అయ్యాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947లో హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపడానికి జైన్ యార్ జంగ్ ని నిజాం రాజు తన దూతగా పంపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం నాటి సంబంధాలను, స్వతంత్ర భారత ప్రభుత్వంలో కొనసాగేటట్లు నిజాం, కేంద్రప్రభుత్వాల మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం కుదరడానికి జంగ్ కృషిచేసాడు. పోలీసు చర్య తరువాత రాష్ట్రమంత్రి అయి, మొదటి సాధారణ ఎన్నికలవరకు ఆ పదవిలో కొనసాగాడు.

బిరుదులు, పురస్కారాలు[మార్చు]

  • హైదరాబాద్ నిజాం రాజు జైన్ యార్ జంగ్ కు నవాబ్ అనే బిరుదును అందించాడు.
  • 1956లో పద్మభూషణ్ అందుకున్నాడు.[5]

మరణం[మార్చు]

జైన్ యార్ జంగ్ 1961లో మరణించాడు. నిజాం రాజు జంగ్ ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించాడు. జంగ్ కుమారుడు సాదత్ ఆలీఖాన్ ఇరాక్లో భారత రాయబారిగా పనిచేసాడు.

మూలాలు[మార్చు]

  1. Akbar, Syed (23 April 2017). "OU architect was Nizam's emissary before merger". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-25.
  2. "Arts College: a historic masterpiece". The Hindu (in Indian English). 2012-10-08. ISSN 0971-751X. Retrieved 2021-10-25.
  3. Lang, Jon T. (2002). A Concise History of Modern Architecture in India (in ఇంగ్లీష్). Orient Blackswan. p. 26. ISBN 9788178240176.
  4. "On the heritage trail". The New Indian Express. 7 October 2013. Retrieved 2021-10-25.
  5. 5.0 5.1 Nanisetti, Serish (2017-04-08). "Arts College building, a hand-me-down architectural gem". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-25.