Jump to content

నవరాత్రి

వికీపీడియా నుండి
శారద నవరాత్రి
శారద నవరాత్రి
దుర్గాదేవి ద్వారా చెడుపై మంచి జరగటానికి నవరాత్రి ఉత్సవం జరుపుకుంటున్న చిత్రం
యితర పేర్లునవరాత్రి, నవరాత్రులు
జరుపుకొనేవారుహిందూ
ప్రారంభంఆశ్వయుజమాసము శుక్ల పక్షం ప్రథమ (రోజు)
ముగింపుఆశ్వయుజమాసము శుక్ల పక్షం నవమి (రోజు)
ఉత్సవాలు10 రొజులు (9 రాత్రులు)
వేడుకలువేదిక ఏర్పాటు, ప్రార్థనలు, నాటకాలు, నాటకాలు, ఉపవాసం, పూజ , మూర్తి నిమజ్జనం, భోగి మంటలు, ప్రార్థనలు దుర్గా, పార్వతీ దేవికి సమర్పించబడతాయి.
సంబంధిత పండుగవిజయదశమి, దశమి
ఆవృత్తిసంవత్సరానికి ఒకసారి

నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.[1]

ప్రాముఖ్యత

[మార్చు]

వసంతకాలం, శరదృతువుల మొదలు, వాతావరణపరంగా, సౌరప్రభావపరంగా చాలా ముఖ్యమైన సంధి కాలం. దేవీ మాతను పూజించడానికి ఈ రెండు కాలాలూ చాలా పవిత్రమైన అవకాశాలుగా భావిస్తారు. పండుగ తేదీలను, చంద్ర పంచాంగం ప్రకారం నిర్ణయిస్తారు.

హిందూ మతంలో విశ్వాసకులు ఒక సర్వశక్తిమంతమైన దేవత/దేవుడిని నమ్ముతారు, కానీ, పూజించే విషయానికి సంబంధించినంత వరకూ, ఆమె/అతడిని అనేక రకాలుగా వ్యక్తీకరించబడిన రూపంలో పూజించవచ్చు, ఈ అనేక రూపాలు దేశమంతా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి. నవరాత్రి దుర్గా దేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దుర్గాదేవి, శక్తి ఆకృతిలో వ్యక్తీకరించబడిన దేవత (శక్తి లేదా బలము). దసహరా అంటే 'పది రోజులు', ఇది వాడుక భాషలో దసరా అవుతుంది. నవరాత్రి పండుగ లేదా 'తొమ్మిది రాత్రుల పండుగ, చివరి దినాన, అంటే విజయదశమి రోజున పరాకాష్ఠకు చేరుకుని 'పది రోజుల పండుగ' అవుతుంది. ఈ పదిదినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాత అనేక రూపాలను ఆరాధనతో, భక్తితో పూజిస్తారు.

సంప్రదాయాలు, ఆచారాలు

[మార్చు]
తమిళ్నాడు కోయంబతూర్ లో భజన
వెస్ట్ బెంగాల్ లో భక్తులు నవ రాత్రి, దుర్గ పూజ సంబరాల్లో దీపాలు వెలిగిస్తారు

వేదిక ఏర్పాటు, ప్రార్థనలు, నాటకాలు, నాటకాలు, ఉపవాసం, పూజ , మూర్తి నిమజ్జనం, భోగి మంటలు, ప్రార్థనలు దుర్గా, పార్వతీ దేవికి సమర్పించబడతాయి.[2]

నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి, పౌష్య/మాఘ నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి: వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి: ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు: అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి: పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు. పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి: గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.

వసంత నవరాత్రి

[మార్చు]

ఈ పండుగను వసంత ఋతువులో (వేసవి కాలపు మొదలు) జరుపుకుంటారు (మార్చి-ఏప్రిల్). ఈ పండుగను చైత్ర నవరాత్రులుగా కూడా గుర్తిస్తారు, ఎందుకంటే, ఇది చంద్రుని మాసమయిన చైత్రములో వస్తుంది.

వసంత నవరాత్రులకు సంబంధించిన మూలం వెనుక కథ

[మార్చు]

ఒకానొకప్పుడు, మహారాజైన ధ్రువసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు,, మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు. మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.

విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు. అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ, అతని మంత్రి అతనికి ఋషి వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.

యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం). యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను, ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.

వారణాసి రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.

యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.

అప్పుడు సుదర్శనుడు, తన భార్య, మామతో కలిసి దేవిని స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.

యువరాజు సుదర్శనుడు, శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు, శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.

సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.

శరద్ నవరాత్రి

[మార్చు]

చంద్రమాసమయిన అశ్వయుజ/అశ్విన మాసం ప్రకాశవంతమయిన సగంలోని మొదటి రోజున మొదలయి, చివరి రోజున అంతమవుతుంది.

ధౌమ్య వాచనుడి ప్రకారం, 'నవరాత్రి పండుగ అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలో ప్రతిపాదం అను క్రమంలో, నవమి పూర్తయ్యేదాకా జరుపుకుంటారు'.

దేవీ రూపాలు

[మార్చు]
"దుర్గ యొక్క తొమ్మిది రూపాలు " బెనారెస్, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రదర్శన

నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి.[2]

  • దుర్గ, దుర్గమమైన దేవత
  • భద్రకాళి
  • అంబ లేదా జగదాంబ, విశ్వానికి మాత
  • అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లి (పూర్ణ: వైయక్తికంగా ఉపయోగిస్తారు)
  • సర్వమంగళ, అందరికీ (సర్వ) మంచి (మంగళ) చేకూర్చే తల్లి
  • భైరవి
  • చంద్రిక లేదా చండి
  • లలిత
  • భవాని
  • మూకాంబిక

ఆచారకర్మలు

[మార్చు]
తమిళ నాడు నవరాత్రి సమయంలో దుర్గ యొక్క అనేక రూపాల యొక్క ప్రదర్శన
ఆహ్మేదాబాద్ నవరాత్రి సమయంలో గర్భ నృత్యం

చంద్రమాసమయిన అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలోని మొదటి రోజున (ప్రతిపాదం) నవరాత్రులు మొదలవుతాయి. అక్టోబరు మాసం మొదలయినపుడు ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు ఈ పండుగను జరుపుకుంటారు; చంద్ర పంచాంగం ప్రకారం తేదీలను నిర్ణయించినా కూడా ఈ పండుగను ఒక రోజు అటూ ఇటూగా జరుపుకోవచ్చు.

నవరాత్రులను వివిధ పధ్ధతులతో దేశమంతా ఉత్సవంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మూడు నవరాత్రులనూ అత్యంత ఆదరణతో, తొమ్మిది రోజులూ ఉపవాసం ఉంటూ, దేవీ మాతను వివిధ రూపాలలో పూజిస్తూ జరుపుకుంటారు. చైత్ర మాసంలో జరుపుకునే నవరాత్రి శ్రీ రామ నవమితోనూ, శరద్ నవరాత్రి దుర్గా పూజతోనూ, దసరాతోనూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ దసరా ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి చాలా ప్రఖ్యాతి గాంచింది.

తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజగా జరుపుకునే ఉత్సవంలో, చివరి నాలుగు రోజులూ ప్రత్యేకమైన నాటకీయ రూపం సంతరించుకుంటాయి. రాష్ట్రంలో ఇది అన్నింటికన్న పెద్ద ఉత్సవం. అద్భుతమైన కళానైపుణ్యంతో, అలంకరించబడిన బంక మన్నుతో చేయబడిన నిలువెత్తు దుర్గాదేవి విగ్రహాలు, ఆమె మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో గుళ్ళలోనూ ఇతర ప్రదేశాలలోనూ ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహాలకు అయిదు రోజులు పూజలు నిర్వహించి, అయిదో రోజున నదిలో నిమజ్జనం చేస్తారు.

పశ్చిమ భారతదేశంలో, ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రంలో, నవరాత్రి ప్రఖ్యాతి గాంచిన గార్బా, డాండియా-రాస్ నృత్యాలతో వేడుకగా జరుపుకుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా, గుజరాత్‌లో గుజరాత్ ప్రభుత్వం "నవరాత్రి పండుగ ఉత్సవాలను" నవరాత్రి పండుగ తొమ్మిది రోజులలో క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో పాలు పంచుకోవడానికి గుజరాత్ నలుమూలల నుండి, ఇంకా విదేశాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు. ఇది భారతదేశమంతా కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా, యుకె,యుఎస్ లతో సహా అన్ని దేశాలలో కూడా ఇది చాలా జనాకర్షకమైన ఉత్సవం.

గోవాలో, జాత్ర నవరాత్రి అపుడు మొదలవుతుంది, అంత్రుజ్ (పోండా) మొత్తం కూడా చాలా వైభవంగా అలంకరిస్తారు. సరస్వత్ ఆలయాలను అందంగా అలంకరించి, విగ్రహాలను పూజకు బయటకు తీస్తారు. విగ్రహాలకు దుస్తులు తొడిగి పూలు, గంధం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. భక్తులు నవరాత్రి పండుగలో ప్రత్యేక దర్శనానికి వస్తారు, భక్తుడు ఎక్కువగా ఎదురు చూసేది కౌల్ ప్రసాదము, అది దేవుళ్ళు దేవతల నుండి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తారు. దేవీ విగ్రహాలను పూలతో ప్రకాశవంతమైన రంగులతో అలంకరిస్తారు, భక్తులు లేదా పూజారులు పూలను మార్చే పని కూడా చేయకుండా పూజిస్తారు. ఉత్సవపు రాత్రి పూర్తి అయినపుడు, పూలను ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు.

దక్షిణ భారతదేశంలో, వేదికలు నిర్మించి, విగ్రహాలను వాటి పై ఉంచుతారు. దీనిని గోలు అంటారు. భారతదేశంలోని, మహారాష్ట్రలోని, నావి ముంబైలోని, నేరుల్‌లోని ఒక గృహంలో తమిళనాడు రీతిలో ప్రదర్శించిన ఉదాహరణాత్మకమైన గోలు చిత్రాలను ఈ ప్రక్కన చూడండి.

కేరళలో, మూడు రోజులు: నవరాత్రి అష్టమి, నవమి, విజయ దశమి రోజులను సరస్వతీ పూజగా జరుపుకుంటారు అందులో, పుస్తకాలకు పూజ నిర్వహిస్తారు. పుస్తకాలను పూజ కోసం అష్టమి రోజున తమ సొంత ఇళ్ళలోనూ, సంప్రదాయికమైన చంటిపిల్లల బడులలోనూ, ఆలయాలలోనూ ఉంచుతారు. సరస్వతిని పూజించాక, విజయ దశమి రోజున పుస్తకాలను సంప్రదాయబధ్ధంగా చదవడానికీ, రాయడానికీ బయటికి తీస్తారు. విజయదశమి ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు, దానిని విద్యారంభం అంటారు. కేరళలో ఈ రోజు కొన్ని వేలమంది చంటిపిల్లలను అక్షరాల ప్రపంచంలోకి ఆవాహన చేస్తారు.

మూడు వివిధ అంశాల మహోన్నతమైన దేవినీ లేదా దేవతలనూ ఆరాధించడానికి నవరాత్రిని మూడు రోజుల సమూహంగా విభజిస్తారు.

మొదటి మూడు రోజులు

[మార్చు]

దేవిని మనలో ఉన్న అశుధ్ధాలను నాశనం చేయడం కోసం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు, ఆ శక్తిని దుర్గ అనీ, కాళి అనీ గుర్తిస్తారు.[2]

రెండవ మూడు రోజులు

[మార్చు]

మాతను ఆధ్యాత్మిక సంపదను ఒసగే లక్ష్మీ మాతగా ఆరాధిస్తారు. లక్ష్మీ మాత సంపదకు దేవత, ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు.[2]

చివరి మూడు రోజులు

[మార్చు]

చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు. జీవితంలో అన్ని రంగాలలోనూ విజయం సాధించడానికి, ఆస్తికులు మూడు రకాల దైవిక స్త్రీత్వం ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు, అందుకే తొమ్మిది రాత్రుల పూజ చేస్తారు.[2]

సంప్రదాయబధ్ధంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి చేస్తారు, అది బెంగాల్‌లో చాలా ముఖ్యమైన రోజు.

దక్షిణ భారతదేశంలోని కొన్ని భాగాలలో, సరస్వతి పూజ తొమ్మిదవ రోజు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని చాలా భాగాలలో మహానవమి (తొమ్మిదవ) రోజున ఆయుధపూజ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, అన్నిరకాల పరికరాలు, ఉపకరాలు, యంత్రాలు, స్వయంచాలిత ఉపకరాలను అలంకరించి, దేవీ పూజతో పాటు వాటిని కూడా పూజిస్తారు. మరుసటి రోజు నుండి పని తిరిగి తాజాగా మొదలవుతుంది, అంటే పదవరోజు, దానిని 'విజయదశమి'గా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని చాలా మంది అధ్యాపకులు/విద్యాలయాలు ఆరు సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకు పాథాలు నేర్పే పాఠశాలలలో ఆ రోజు నుండి పిల్లలకు పాఠాలు నేర్పడం మొదలెడతారు.

ఉత్తర భారతదేశంలో రామ్‌లీల పరాకాష్ఠను దసరా సమయంలో, రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను, 'విజయదశమి' రోజున చెడు శక్తుల పై మంచి (రాముడు) సాధించిన విజయానికి సూచకంగా, వేడుకగా తగలబెట్టి ఉత్సవంగా జరుపుకుంటారు.

నవరాత్రి సమయంలో, కొంతమంది దుర్గామాత భక్తులు ఉపవాసాలు ఉండి, ఆరోగ్యము, సంపదలను సంరక్షించమని ప్రార్థనలు జరుపుతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి, అంతఃశోధనకు, ప్రక్షాళనకు నవరాత్రిని సంప్రదాయికంగా చాలా శుభప్రథమైన, ఆధ్యాత్మికమైన సమయంగా భావిస్తారు.

మతపరమైన ఈ ఆచారం పాటించే సమయంలో, ఒక శుధ్ధి చేయబడిన ప్రదేశంలో ఒక కుండను (ఘటస్థాపన) ఉంచుతారు. ఆ కుండలో తొమ్మిది రోజులు ఒక దీపం వెలిగించి ఉంచుతారు. కుండ విశ్వానికి ప్రతీక. నిరంతరంగా వెలిగే దీపం మనం పూజించే దేదీప్యమానమైన ఆదిశక్తి అయిన దుర్గా దేవిని పూజించడానికి మాధ్యమం. నవరాత్రి సమయంలో శ్రీ దుర్గాదేవి శక్తి వాతావరణంలో చాలా సక్రియాత్మకంగా ఉంటుంది.

చాలా పెద్ద సంఖ్యలో భారతీయ సముదాయాలు నవరాత్రి పండుగను జరుపుకుంటాయి. దేవీ మాత తొమ్మిది రూపాలలో కనిపిస్తుందని నమ్ముతారు, అందుకని ప్రతి రూపాన్ని ఒక్కో రోజు పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాలు దేవి మనల్ని ప్రభావితం చేసే వివిధ గుణాలను ప్రతిబింబిస్తాయి. దేవి మాహాత్మ్యము, దుష్టశక్తుల ప్రభావం నుండి దేవిని రక్షణ కోరడం కోసం ఉద్దేశించిన ఇతర స్తోత్రాలతో దేవిని స్తుతిస్తారు.

ఎనిమిదవ రోజు లేదా తొమ్మిదవ రోజు, రజస్వల కాని బాలికలకు కన్యపూజను వేడుకగా నిర్వహిస్తారు.

  • గర్భ (నృత్యం)

మూలాలు

[మార్చు]
  1. "Navaratri - Magazine Web Edition October/November/December 2008 - Publications - Hinduism Today Magazine". web.archive.org. 2020-02-28. Archived from the original on 2020-02-28. Retrieved 2021-10-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "navartri naivedyam: నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం.. ప్రత్యేకత ఇదే - navaratri festival 2019: nine types of naivedyam for goddess durge during nine days | Samayam Telugu". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నవరాత్రి&oldid=3611377" నుండి వెలికితీశారు