నవాబ్ కపూర్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవాబ్ కపూర్ సింగ్ (1697–1753) సిక్ఖు చరిత్రలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరు, ఆయన నాయకత్వంలో సిక్ఖు సమూహం సిక్ఖు మత చరిత్రలోకెల్లా అత్యంత చీకటి కాలాన్ని దాటింది. సిక్ఖు సమాఖ్య, దల్ ఖల్సాలను వ్యవస్థాపించి, నిర్వహించాడు.[1] క్రమేణా ఆ దాల్ ఖల్సాలే మిస్ల్ లు అనే పరిపాలన విభాగాలుగా మారి పంజాబ్ ప్రాంతాలపై పట్టు సాధించి తర్వాతికాలంలోని సిక్ఖు సామ్రాజ్యానికి పునాదులు వేశాయి. సిక్ఖులు ఆయనను అత్యద్భుతమైన నాయకునిగానూ, సైన్యాధ్యక్షునిగానూ భావిస్తారు. ఖల్సా రాజ్యాన్ని స్థాపించిన బందా సింగ్ బహదూర్ ను చంపేశాకా జరిగిన అణచివేత కాలాన్ని సమర్థంగా ఎదుర్కొని సిక్ఖులను పంజాబ్ లోకెల్లా బలమైన సైనిక, రాజకీయ శక్తిగా మలచిన నాయకుడు నవాబ్ కపూర్ సింగ్. 1733లో పంజాబ్ గవర్నర్ సిక్ఖులకు నవాబ్ పదవిని, రాచ పదవిని ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు ఖల్సా కపూర్ సింగ్ కు ఇచ్చేందుకు అంగీకరించింది. అలా ఆయనకు ఒక జాగీర్ లభించింది. [2] దాంతో ఆయన నవాబ్ కపూర్ సింగ్ గా సుప్రసిద్ధులయ్యారు.

జీవిత చరిత్ర[మార్చు]

తొలినాళ్ళు[మార్చు]

1697లో నవాబ్ కపూర్ సింగ్ షేఖ్‌పురా, పంజాబ్, పాకిస్తాన్ సమీపంలోని గ్రామంలో జన్మించారు. నవాబ్ కపూర్ సింగ్ తండ్రి చౌదరీ దలీప్ సింగ్ ఆయనకు యుద్ధ కళలు నేర్పారు.[3] భాయ్ తారా సింగ్ ని 1726లో చంపేశాకా కపూర్ సింగ్ ఖల్సా పంత్ వైపుకు ఆకర్షితులయ్యారు.[4]

ఖల్సాలో చేరిక, ముఘల్ ప్రభుత్వాన్ని లూటీ[మార్చు]

భాయ్ తారా సింగ్ పట్ల భక్తి కలిగిన కపూర్ సింగ్ ఆయన మరణానికి స్పందించి ఖల్సాలో చేరారు. అప్పటికే సిక్ఖులపైనా, పంజాబ్ ప్రాంత ప్రజలపైనా ప్రభుత్వం తీవ్ర అణచివేత విధానాలు పాటిస్తోంది. ఖల్సా ఆ ప్రాంతపు ప్రజలపై జరుగుతున్న అణచివేతకు ప్రతిస్పందించడంపై ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము, ఆయుధాలు లాక్కుని పరిపాలన బలహీనపరచాలని, నిత్యం సాగే దాడుల నుంచి కాపాడేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు.[3] ఈ ప్రయత్నం కోసం ప్రణాళిక రచన చేసి అమలు చేయడానికి కపూర్ సింగ్ ను నియమించారు.

ముల్తాన్ నుంచి లాహోర్ ఖజానాకు ధనాన్ని తీసుకువెళ్తున్నారన్న సమాచారం అందుకుని కపూర్ సింగ్ నాయకత్వంలోని ఖల్సా దాడి చేసి డబ్బు, ఆయుధాలు, రక్షకుల గుర్రాలను లూటీ చేసింది.[3] కసూర్ నుంచి లాహోర్ కు వెళ్తున్న కసూర్ ఎస్టేట్ ఖజానా నుంచి లక్ష రూపాయలు దాడిచేసి తీసుకున్నారు.[5] ఆపైన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వస్తున్న వ్యాపారుల బిడారు పట్టుకుని అనేక ఆయుధాలు, గుర్రాలు తీసుకున్నారు.

ఖల్సాపై అణచివేత తొలగింపు, కపూర్ సింగ్ కు నవాబుగిరీ[మార్చు]

ఢిల్లీ చక్రవర్తి దర్బారు సహా ముఘల్ పాలకులు, సైన్యాధ్యక్షులు అంతా సిక్ఖులను అణచివేత పద్ధతిలో ఓడించడం సాధ్యంకాదని నిర్ణయించుకుని మరో వ్యూహం పన్నారు. లాహోర్ గవర్నర్ జకారియా ఖాన్ ఢిల్లీకి వెళ్ళగా సిక్ఖులను మిత్రుల్ని చేసుకోవాలని, వారి సహకారంతోనే పరిపాలించాలని నిర్ణయించుకున్నారు. తదనుగుణంగా 1733లో ఢిల్లీ పాలకులు ఖల్సాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.[6] సిక్ఖులు స్వంత ఆస్తిని కలిగివుండేందుకు, ప్రభుత్వ హింస లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించారు.[7] ఖల్సా పంత్ తో సహకరించి, ప్రజామోదాన్ని సంపాదించాలని, ప్రభుత్వం నవాబు పదవిని, జాగీరును సుప్రసిద్ధుడైన లాహోరు సిక్ఖు సుబేగ్ సింగ్ కు ఇస్తామని ముందుకువచ్చారు.[8] ఖల్సా స్వేచ్ఛగా పరిపాలించాలని కోరుకుంది తప్ప ప్రభుత్వానికి అధీనమైన స్థితిలో ఉండాలని కాదు. ఐతే తర్వాత తేరుకుని ఖల్సాను విస్తరించే కొద్దికాలాన్ని పొందే వ్యూహంతో ఈ అవకాశాన్ని స్వీకరించారు, కపూర్ సింగ్ కు నవాబ్ బిరుదాన్ని ఇచ్చారు, ఐతే ఐదు ఖల్సాల పాదాలను ఆ నవాబు గిరీ తాకించాకే కపూర్ సింగ్ స్వీకరించేలా చేశారు.[9] కపూర్ సింగ్ అలా నవాబ్ కపూర్ సింగ్ అయ్యారు. ప్రజలకు గురుమత్ ను బోధించడం, తమను తాము బలపరుచుకోవడం వంటివి చేసేలా సిక్ఖులను సిద్ధపరిచారు. కపూర్ సింగ్ ఈ శాంతి కొద్దికాలం మాత్రమే ఉంటుందని అర్థం చేసుకున్నారు. వారి గురుద్వారాలకు స్వేచ్ఛగా వెళ్ళమని, గ్రామాల్లోని తమ బంధువులను కలుసుకొమ్మని వారికి బోధించారు.[7]

దాల్ ఖల్సా స్థాపన[మార్చు]

కపూర్ సింగ్ నాయకత్వంలో ఖల్సాలో సంస్కరణలు చేస్తూ రెండు విభాగాలుగా విభజించారు. దాని ప్రకారం యుక్త వయస్కులు తరుణ దాల్ లో భాగంగా ఉంటారు, ఇది ప్రధాన పోరాట బలగం అవుతుంది, నలభై సంవత్సరాలకు పైగా వయసున్నవారు బుధ దాల్ లో భాగమై గురుద్వారాల నిర్వహణ, గురుమత్ ప్రవచనాల్లో నిమగ్నమవుతారు.[10] బుధ దాల్ బాధ్యతల్లో ప్రభుత్వ బలగాల కదలికలు, వారి రక్షణ వ్యూహాలు గమనిస్తూండడం కూడా ఉంటాయి. అలానే తరుణ దాల్ కు రిజర్వ్ బలగంగా కూడా పనికి వస్తుంది.[7]

నవాబ్ కపూర్ సింగ్ చేపట్టిన చర్యలు ఇలా ఉన్నాయి:[11]

  • ఎక్కడ నుంచి, ఏ జాతా ద్వారా లభించిన సొమ్మునైనా ఉమ్మడి ఖల్సా మూలధనంలో చేర్చాలి.
  • రెండు దాల్ లకు ఉమ్మడిగా ఖల్సాకు లాంగర్ ఉండాలి.
  • ప్రతీ సిక్ఖు కూడా అతని జాతేదార్ ఆదేశాలను గౌరవించాలి. ఎక్కడి నుంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ముందు ఆయన జాతేదార్ అనుమతి తీసుకుని, తిరిగి వచ్చాకా వచ్చినట్టు తెలియజేయాలి.

దాల్ ఖల్సా పునర్వ్యవస్థీకరణ[మార్చు]

తరుణ దాల్లో వేగంగా 12 వేలమంది చేరారు, క్రమంగా అంతమందికి ఒకే ప్రదేశంలో ఉంచి నివాస, ఆహార అవసరాలు చూసుకోవడం కష్టమైపోయింది.[11] దాంతో దాల్ ను ఐదుగా విభజించేందుకు నిశ్చితమైంది, దాల్ కు చెందిన ఐదు విభాగాలు ఒకే ప్రధాన నిల్వలోంచి పదార్థాలు తీసుకుని, స్వంత లాంగర్లలో వండుకునేవారు.[12] అమృత్ సర్ లోని ఐదు పవిత్ర సరోవరాలైన రాంసర్, బిబేక్ సర్, లచ్మన్ సర్, కౌల్ సర్, సంతోఖ్ సర్ ల చుట్టుపక్కల ఈ ఐదు విభాగాలు నిలిచివుండేవి.[13] ఈ విభాగాలు తర్వాతి కాలంలో మిస్ల్ లు అయి సంఖ్య పదకొండుకు పెరిగింది. ఒక్కోటీ పంజాబ్ లో ఒక్కో ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. వారంతా కలిసి సర్బత్ ఖల్సాగా ఏర్పడ్డారు. ఆ మిస్ల్ లు క్రమేణా 19వ శతాబ్దిలో విలసిల్లిన సిక్ఖు సామ్రాజ్యానికి పునాదులు వేశాయి.

ప్రభుత్వ అణచివేత[మార్చు]

1735లో లాహోర్ పాలకులు సిక్ఖులకు అంతకు రెండేళ్ళ మునుపే ఇచ్చిన జాగీరుపై దాడిచేసి తిరిగి తీసుకున్నారు.[14] ఐతే నవాబ్ కపూర్ సింగ్ దానికి ప్రతిస్పందనగా పంజాబ్ మొత్తాన్ని సిక్ఖులు తీసుకోవాలని నిర్ణయించారు.[15] ఈ నిర్ణయాన్ని ఎన్నో ప్రమాదాలు ముందుంటాయని తెలిసీ తీసుకున్నారు, ఖల్సా దాన్ని సమర్థించింది, సిక్ఖులు స్వయంపాలనకు అవసరమైన త్యాగాలు, కృషి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. జకారియా ఖాన్ సంచార బృందం ఏర్పరిచి సిక్ఖులను వేటాడి చంపమని ఉత్తర్వులు ఇచ్చారు. పరిపాలనాధికారుల నుంచి గ్రామస్థాయి అధికారులకు సిక్ఖులను వెతికించమని, చంపమని, లేదా నిర్బంధించమని, వారి ఆనుపానులు ప్రభుత్వానికి నివేదించమన్న ఆదేశాలు చేరిపోయాయి. సిక్ఖులను హత్యచేసిన, తలను ఠాణాకు చేర్చినవారికి సాలుసరి జీతాన్ని ఇస్తామని ప్రకటించారు.[16] పట్టి బంధించినవారికీ రివార్డులను ఇస్తామని వాగ్దానం చేశారు. సిక్ఖులకు ఆహారం కానీ, తలదాచుకునే చోటు కానీ ఇచ్చి సహకరించినవారిని తీవ్రంగా శిక్షిస్తామని నిర్ణయించారు.[17]

ఈ దశలో సిక్ఖులను చాలా రకాల హింసలు అనుభవించారు.[18][19][20] పెద్దలు, పిల్లలు అని లేకుండా చంపిన ఘటనలు ఉన్నాయి.[21] తమ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పై స్థాయిలో ఉంచుకునేందుకు వారు గొప్పగా వినిపించే పదజాలం, నినాదాలు రూపొందించుకున్నారు.[20] ఉదాహరణకు చెట్ల ఆకులు ఉడికించి తినేప్పుడు వాటిని పచ్చని విందు అని, వేయించిన శనగలను బాదంపప్పు అనీ, నల్ల తుమ్మ చెట్టును గులాబీగా, కళ్ళు కనిపించని వారిని ధైర్యవంతులుగా, గేదెపై కూర్చోవడాన్నే గజారోహణంగా పిలుచుకుంటూండేవారు.

సైన్యం కొండల వద్ద దాక్కుంటున్న సిక్ఖులను వెంబడించి, వారు నది దాటేలా చేసి మాళ్వా ప్రాంతాన్ని సుభద్రం చేశారు.[22] కపూర్ సింగ్ పటియాలా చేరుకుని అప్పటికే అమృత సంస్కారం పొంది ఖల్సా సిక్ఖు అయిన మహారాజా బాబా అలా సింగ్ ను కలిశారు.[23] కపూర్ సింగ్ తన నాయకత్వ, సైనిక నైపుణ్యాలతో ఆయన రాజ్య సరిహద్దులను విస్తరించారు. 1736లో ఖల్సా గతంలో జరిగిన ఓ యుద్ధంలో గురు గోబింద్ సింగ్ ఇద్దరు కుమారులు అమరులైన సిర్హింద్ పై దాడిచేసింది. ఖల్సా నగరాన్ని స్వాధీనపరుచుకుని, ఖజానాలోని సొమ్ము తీసేసుకుని, చారిత్రిక ప్రదేశాల్లో గురుద్వారాలు నెలకొల్పి నగరాన్ని విడిచిపెట్టి వ్యూహాత్మకంగా వెనుతిరిగి వెళ్ళిపోయారు.[20]

లాహోర్ ప్రభుత్వం సిక్ఖులపై దాడిచేసేందకు అమృత్ సర్ వద్దకు సైన్యాన్ని పంపింది. కపూర్ సింగ్ తగిన సైన్యాన్ని తనవద్ద ఉంచుకుని జస్సా సింగ్ అహ్లూవాలియాకు ఖజానాను కాపాడే బాధ్యతలు అప్పగించారు. జస్సా సింగ్ ఖజానా దిశగా తగినంత దూరం ప్రయాణించగానే ఖల్సా భద్రంగా తర్ణ్ తరణ్ సాహిబ్ కు తప్పించుకుంది. కపూర్ సింగ్ తవునా దాల్ కు పోరాటంలో సాయం చేయమని సందేశాలు పంపారు. కపూర్ సింగ్ కొద్ది రోజుల పోరాటం అనంతరం ఖల్సా తవ్విన కందకం గుండా కమాండింగ్ పోస్టుపై హఠాత్తుగా మెరుపుదాడి చేయడంతో మొఘల్ సైన్యంలోని కీలకమైన ముగ్గురు సైన్యాధ్యక్షులు, అనేకమంది మొఘల్ అధికారులు చనిపోయారు. మొఘల్ సైన్యం లాహోర్ కు వెనుతిరిగింది.

జకారియా ఖాన్ తన సలహాదారులతో సిక్ఖులను ఎదుర్కొనేందుకు మరో వ్యూహం పన్నారు. సిక్ఖులకు వారి జీవం ఉప్పొంగించేది, శక్తికి మూలమైన ఆకరం అని విశ్వసించే అమృత్ సరోవరాన్ని[24] సందర్శించనివ్వకూడదనేది ఆ ప్రణాళిక. నగరం అంతటా గట్టి కార్యకర్తలను నియమించి, హర్మందిర్ సాహిబ్ కు చేరుకునేవారందరినీ పరిశీలించేవారు. ఇదెలా ఉన్నా చాలామంది సిక్ఖులు ప్రాణాలకు తెగించి మరీ రాత్రిపూట చీకట్లో తమ పవిత్ర స్థలాన్ని సందర్శించడం, సరోవరంలో పవిత్ర స్నానం చేయడం వంటివి చేసేవారు.కపూర్ సింగ్ అమృత్ సర్ వెళ్ళి ఖాదీ అబ్దుల్ రహ్మాన్ తో పోరాటం చేశారు. అబ్దుల్ రహ్మాన్ అంతకుముందే సిక్ఖులు అమృత్ సర్ వచ్చి తనను ఎదుర్కొనేందుకు సాహసించరని ప్రకటించారు. ఆ పోరాటంలో అబ్దుల్ రహ్మాన్ మరణించారు.[25] రహ్మాన్ కుమారుడు తండ్రిని కాపాడడానికి ప్రయత్నించగా ఆయన కూడా ప్రాణం కోల్పోయారు. 1738లో భాయ్ మణి సింగ్ కు మరణశిక్ష అమలుచేశారు.

నాదిర్షాపై మెరుపు దాడులు[మార్చు]

1739లో నాదిర్షా భారత ఉపఖండంపై దండయాత్ర చేసి, ఖజానాను దోపిడీ చేశారు. నాదిర్షా ఢిల్లీలో లక్షకు పైగా ప్రజలను చంపి, మొత్తం బంగారం, విలువైన వస్తువులు అన్నిటినీ దోచుకుపోయారు.[26] తన బిడారుకు వందలాది ఏనుగులు, గుర్రాలు, వేలమంది యువతులు, భారతీయ కళాకారులను బంధించి చేర్చుకుని తిరిగి బయలుదేరారు.[27] కపూర్ సింగ్ కు మొఘల్ సామ్రాజ్య పాలకులు, స్థానిక పాలకులు చేయకపోయినా అమాయకులైన ముస్లిం, హిందూ యువతులను బానిసలుగా అమ్మకుండా అడ్డుకోవడం సిక్ఖుల విధి అని భావించారు. చీనాబ్ నది దాటుతూండగా సిక్ఖులు నాదిర్షా బిడారు చివరి భాగంపై దాడిచేసి చాలామంది స్త్రీలు, కళాకారులు, నిపుణులు మొదలైన వారిని బంధ విముక్తుల్ని చేసి, దోపిడీ సొమ్ములో కొంత భాగాన్ని లూటీ చేసి తీసుకున్నారు.[28] ఇలాంటి దాడులను నాదిర్షా పంజాబ్ దాటేవరకూ సిక్ఖులు కొనసాగిస్తూ, చీకాకు పరుస్తూ, దోపిడీ సొమ్ములో కొంత కొంత తిరిగి తీసుకుంటూ పోయారు.

సమద్ ఖాన్ ఆయుధాగారం దోపిడీ[మార్చు]

సీనియర్ ముఘల్ సైన్యాధ్యక్షుడైన అబ్దుస్ సమద్ ఖాన్ ని సిక్ఖులను అణచివేసేందుకు ఢిల్లీ నుంచి పంపారు.[29] కపూర్ సింగ్ ఈ విషయాన్ని తెలుసుకుని ఓ పథకం పన్నారు. దాన్ని అనుసరించి సైన్యం సిక్ఖులను వేటాడేందుకు బయలుదేరగానే సిక్ఖు కమాండోలు ఖాన్ దూతగా వచ్చి నమ్మించారు. దూతల రూపంలో వచ్చినవారు అబ్దుస్ సమద్ ఖాన్ సిక్ఖులను పట్టుకున్నారని, మిగిలిన సైన్యం కూడా వచ్చి సాయపడి బంధించాలని పిలుస్తున్నట్టు సందేశం అందించేవారు. దాంతో దళమంతా బయలుదేరి కొద్దిమంది సైనికులు మిగలడంతో వారి కన్నా ఎన్నో రెట్లు పెద్ద సంఖ్యలో వచ్చిపడిన సిక్ఖు సైన్యం దాడిచేసి ఆయుధాలు, మందుగుండు దోపిడీ చేసి సిక్ఖు శిబిరానికి తీసుకుపోయారు.[30]

యుద్ధంలో సమద్ ఖాన్ ను చంపడం[మార్చు]

అబ్దుస్ సమద్ ఖాన్ సిక్ఖులను వెతికి చంపేందుకు అనేక సంచార దళాలను పంపారు. హర్మందిర్ సాహిబ్ ప్రధాన గ్రంథిగా వ్యవహరించిన భాయ్ మణి సింగ్ చిత్రహింసలకు, హత్యకు ఆయనే బాధ్యుడు.[31] సిక్ఖులు తనను లక్ష్యంగా చేసుకుని చంపుతారన్న భయంతో సమద్ ఖాన్ పోరాట ప్రాంతానికి చాలా దూరంలో ఉండేవారు.[32] ఐతే సమద్ ఖాన్ ను బయటకు లాగేందుకు కపూర్ సింగ్ పథకం పన్నారు. యుద్ధ సమయంలో కపూర్ సింగ్ తన సైన్యాన్ని వెనదిరగమని ఆజ్ఞ జారీచేయడంతో వారిని వెంబడిస్తూ సైన్యం దూరం వచ్చేసింది. ఆయన హఠాత్తుగా దిశమార్చుకుని శత్రు బలగాన్ని తప్పుకుంటూ యుద్ధరంగం వైపుకు, ఆపైన యుద్ధరంగంలోపలి భాగానికి దూసుకుపోయారు.[33] కొద్ది గంటల వ్యవధిలోనే సమద్ ఖాన్, అతని అంగరక్షకులు శవాలుగా కనిపించారు. పంజాబ్ గవర్నర్ సిక్ఖుల నుంచి కాపాడుకునేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ కోటలోనే నివసించసాగారు. ప్రార్థన చేసుకునేందుకు కూడా కోట దాటేవారు కాదు.

అమృత్ సర్ ముట్టడిపై విజయవంతమైన దాడి[మార్చు]

బుధ దాల్ సభ్యుల కోరిక మేరకు కపూర్ సింగ్ పటియాలా సందర్శించారు. పటియాలా రాజ్య స్థాపకుడు, మహారాజు అయిన సర్దార్ అలా సింగ్ కుమారులు ఆయనకు రాచ మర్యాదలతో స్వాగతం పలికారు. కపూర్ సింగ్ ప్రజాకంటకులుగా మారిన స్థానిక పరిపాలకులందిరినీ అణచివేశారు. జకారియా ఖాన్ 1745లో మరణించారు. ఆయన వారసుడు అమృత్ సర్ రక్షణను విపరీతంగా పెంచేశారు. కపూర్ సింగ్ అమృత్ సర్ ముట్టడిని బద్దలుకొట్టాలని ప్రణాళిక వేశారు. దాడిచేసే సిక్ఖు దళాలకు జస్సా సింగ్ అహ్లూవాలియాను సైన్యాధ్యక్షునిగా నియమించారు. 1748లో సిక్ఖులు దాడిచేశారు. జస్సా సింగ్ అహ్లూవాలియా, తన సైనికులు వెనుక ఉండగా తానే ముందుకు ఉరికి శత్రు సైన్యాల నాయకుణ్ణి రెండుగా నరికేశారు. సైన్యాధ్యక్షుని మేనల్లుడు కూడా దాడిలో మరణించారు.

సైనిక అభివృద్ధి, మరణం[మార్చు]

సిక్ఖులు వారి మొదటి కోట అయిన రాంరౌనీ కోటను అమృత్ సర్ వద్ద 1748లో నిర్మించారు.[34] 1748 డిసెంబరులో ఆఫ్ఘాన్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రను అడ్డుకునేందుకు గవర్నర్ మీర్ మన్ను తన బలగాలను తీసుకుని లాహోర్ వెలుపలికి వచ్చారు. సిక్ఖులు వెనువెంటనే లాహోర్ లో నిలిపివుంచిన రక్షక భటుల బలగానికి అనేక రెట్లుగా వచ్చిపడి ఆయుధాలను జప్తుచేసుకుని, అందరు ఖైదీలను విడుదల చేసేశారు.[35] నవాబ్ కపూర్ సింగ్ షరీఫ్ ద్వారా గవర్నర్ కు - భగవంతుని సేవకుడైన నిజమైన బాద్షా వచ్చి తాను తనకు అందిన ఆజ్ఞలు నెరవేర్చాడని సందేశం పంపించారు. పోలీసులు ఈ విషయాన్ని నివేదించడానికి, సైన్యంలో కొంత భాగం వెనుతిరగడానికి ముందే సిక్ఖులు అడవుల్లోకి గుర్రాలను దౌడు తీయించారు.[36] 1753లో నవాబ్ కపూర్ సింగ్ మరణించారు.

విధానాలు[మార్చు]

నవాబ్ కపూర్ సింగ్ మొఘల్ సామ్రాజ్యంతో ముఖాముఖీ పోరాటం కాకుండా గెరిల్లా యుద్ధనీతిని అనుసరించి లొంగదీశారు. సిక్ఖు ఖల్సాలో పునర్వ్యవస్థీకరణ చేసి, తర్వాత తరుణ్ దాల్ లో మరో పునర్వ్యవస్థీకరణ తలపెట్టి సిక్ఖు బలగాన్ని క్రమశిక్షణాయుతమైన సైనిక శక్తిగా మలిచారు. ఖజానాలు, ఆయుధాగారాలు, బిడారులు వంటివి కొల్లగొట్టి బలగాన్ని నిలపడానికి పోరాటాన్ని కొనసాగించడానికి, ధనాన్ని, ఆయుధాలని సేకరించారు.

యుద్ధ కాలాన్నే కాకుండా శాంతికాలాన్ని కూడా సమర్థంగా వినియోగించుకోవడం, ప్రభుత్వంతో ఒప్పందాలను అనువుగా ఉపయోగించుకోవడంతో ఖల్సాను విస్తరించారు. అంతేగాక యుద్ధంలో అవసరమైన సమయాల్లో తప్పుకుని, అనువైన పరిస్థితుల్లో పోరాటం చేస్తూ గట్టి విజయాలను సాధించారు. తన తర్వాత రాజకీయ, సైనిక నాయకత్వం కొనసాగించేందుకు జస్సా సింగ్ అహ్లూవాలియాను మంచి నాయకునిగా తీర్చిదిద్దారు. మొత్తంగా అన్ని యుద్ధాలను దాటుకుని పోరాటాల్లో బతికి చివరకు సహజ మరణాన్ని పొందారు.

ప్రాచుర్యం, గొప్పదనం[మార్చు]

నవాబ్ కపూర్ సింగ్ సిక్ఖు చరిత్రలో సుప్రసిద్ధునిగా నిలిచారు. మొఘల్ సామ్రాజ్యం సిక్ఖులను తీవ్రంగా అణచివేసిన కాలంలో ఆయన సిక్ఖు నాయకునిగా వ్యవహరించారు. మొత్తం ప్రభుత్వం అంతా సిక్ఖులను తీవ్రంగా అణచివేయాలని నిర్ణయించుకున్నప్పుడు కపూర్ సింగ్ తన రణనీతితో నిలబెట్టారు.

మూలాలు[మార్చు]

  1. Singha, H.S. (2005). Sikh Studies, Book 7. Hemkunt Press. p. 35. ISBN 9788170102458.
  2. McLeod, W. H. (2009). The A to Z of Sikhism. Scarecrow Press. p. 107. ISBN 9780810863446.
  3. 3.0 3.1 3.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 14. ISBN 0969409249.
  4. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 27. ISBN 9788170102588.
  5. Johar, Surinder (2002). The Sikh Sword to Power. the University of Michigan: Arsee Publishers. p. 48.
  6. McLeod, W. H. (2009). My library My History Books on Google Play The A to Z of Sikhism. Scarecrow Press. p. 107. ISBN 9780810863446.
  7. 7.0 7.1 7.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 16. ISBN 0969409249.
  8. Jawandha, Nahar (2010). Glimpses of Sikhism. Sanbun Publishers. p. 221. ISBN 9789380213255.
  9. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 117. ISBN 9788173800078.
  10. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 39. ISBN 9788170103011.
  11. 11.0 11.1 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 17. ISBN 0969409249.
  12. Chhabra, G. S. (1968). Advanced History of the Punjab, Volume 1. he University of Virginia: New Academic Publishing Company. p. 358.
  13. Nijjar, Bakhshish (1972). Panjab Under the Later Mughals, 1707-1759. New Academic Publishing Company. p. 107.
  14. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 30. ISBN 9788170102588.
  15. Singh, Sangat (1995). The Sikhs in History. New York: S. Singh. p. 99.
  16. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 18. ISBN 0969409249.
  17. Singh, Teja (1999). A Short History of the Sikhs: 1469-1765. Patiala: Publication Bureau, Punjabi University. p. 119. ISBN 9788173800078.
  18. Sethi, Amarjit (1972). Universal Sikhism. The University of California: Hemkunt Press. p. 144.
  19. "The Sikh Review". 53 (7–12, 619–624). 2005: 52. Retrieved 2013-09-18. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: url-status (link)
  20. 20.0 20.1 20.2 Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 19. ISBN 0969409249.
  21. Randhawa, Ajit (2009). Evolution of Faith and Religion: An Exploration. AuthorHouse. p. 238. ISBN 9781449000806.
  22. Singh, Harbans (1983). The Heritage of the Sikh. Manohar Publications. p. 127.
  23. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism. Hemkunt Press. p. 15. ISBN 9788170103011.
  24. Singha, H.S. (2005). Sikh Studies, Book 6. Hemkunt Press. p. 31. ISBN 9788170102588.
  25. Surjit, Gandhi (1980). Struggle of the Sikhs for sovereignty. Gur Das Kapur. p. 74.
  26. Mitchell, Augustus (1840). An accompaniment to Mitchell's map of the world. Harvard University: R.L. Barnes. p. 510.
  27. "The Sikh Review". 53 (1–6, 613–618). 2005: 40. Retrieved 2013-09-18. {{cite journal}}: Cite journal requires |journal= (help)CS1 maint: url-status (link)
  28. Chhabra, G. S. (2005). Advance Study in the History of Modern India (Volume-1: 1707-1803). India: Lotus Press. p. 10. ISBN 9788189093068.
  29. Singh, Harbans (1964). The Heritage of the Sikhs. Asia Publishing House. p. 56.
  30. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 21. ISBN 0969409249.
  31. Jawandha, Nahar (2010). Glimpses of Sikhism. New Delhi: Sanbun Publishers. p. 58. ISBN 9789380213255.
  32. Chhabra, G. S. (1968). Advanced History of the Punjab, Volume 1. The University of Virginia: New Academic Publishing Company. p. 363.
  33. The Panjab Past and Present, Volume 11. The University of California: Department of Punjab Historical Studies, Punjabi University. 1977. p. 85.
  34. Kaur, Madanjit (1983). The Golden Temple: Past and Present. The University of Michigan: Department of Guru Nanak Studies, Guru Nanak Dev University Press. p. 43.
  35. Gill, Tarlochan (1996). History of the Sikhs. Canada Centre Publications. p. 24.
  36. Singh, Gurbaksh (1927). The Khalsa Generals. Canadian Sikh Study & Teaching Society. p. 24. ISBN 0969409249.