Jump to content

ప్యారడైజ్ హోటల్

వికీపీడియా నుండి
ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్
Restaurant information
నినాదముGood Food, Great Service, Happy Times.
ఆవిష్కరణ1953
ప్రస్తుతము owner(s)అలీ హమ్మతీ (Ali Hemmati)
ఆహార రకముMulticuisine
వీధి చిరునామాParadise Circle, MG Road, సికింద్రాబాద్ 500003
నగరముహైదరాబాదు
దేశముభారత్
సీట్ల సామర్ధ్యము500+
రిజర్వేషన్లుఅవును
శాఖలుమాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, ఎన్టీఆర్ గార్టెన్స్ , కూకట్‌పల్లి, బేగంపేట
Other informationబిర్యానీ, కబాబ్స్, హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి
వెబ్సైటుwww.paradisefoodcourt.com
ఫలూదా, ప్యారడైజ్ హోటల్ లో దొరికే ఒక రుచికరమైన పానీయము

ప్యారడైజ్ హూటల్ హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాలలో ఒక పేరెన్నికగల ఆహార కేంద్రము. ఇచ్చట లభించే బిరియాని, కబాబ్స్ ను రుచి చూడటం కోసం హైదరాబాదును సందర్శించే ఆహారప్రియులు ఇచ్చటికి విచ్చేయడము ఆనవాయితీ.[1][2]

నేపధ్యము

[మార్చు]

1953 సంవత్సరములో సికింద్రాబాద్‌లో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్‌కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు 2014 నాటికి 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే లా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి.

వంటల తయారీ

[మార్చు]

దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటారు. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే.

వీరు బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం ఎంత లేతదంటే.. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలుపెడతారు. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.

శాఖలు

[మార్చు]

2014 నాటికి సికింద్రాబాద్ ప్యారడైజ్‌తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటె క్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్‌పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న కూకట్‌పల్లి ప్యారడైజ్ హోటల్ నుంచి హోమ్ డెలివరీని కూడా ప్రారంభిస్తున్నారు..

ఇప్పటిదాకా హైదరాబాద్ వాసులు మాత్రమే రుచిచూసిన ప్యారడైజ్ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. 2015 ముగిసేలోగా రాష్ర్టంలోని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు.

సిబ్బంది

[మార్చు]

ఇప్పటివరకు ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు.

దీనిని సందర్శించిన ప్రముఖులు

[మార్చు]

హైదరాబాద్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వై.యస్. రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, చిత్రకారుడు ఎం.ఎఫ్. హుసేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చాలా మంది ఈ హోటల్ ను సందర్శించినవారే.

అగ్నిప్రమాదం

[మార్చు]

2014 జూన్ 8, ఆదివారం ఈ హోటల్ అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్లోని వంటగదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. వంటగదిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు.[3]

మూసివేత

[మార్చు]

ప్రమాణాలను పాటించలేదనే కారణంతో దేశవ్యాప్త గుర్తింపు ఉన్న ప్యారడైజ్ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు 2014 జూన్9, సోమవారం సాయంత్రం తాత్కాలికంగా మూసివేశారు.. ప్యారడైజ్ హోటల్ లో వినియోగదారుల భద్రతను పట్టించుకోవడలేదనే అంశం తాజా తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాద ప్రమాణాలు పాటించకపోవడం లేదనే కారణంతో హోటల్ ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. రోజువారి తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ ఆస్పత్రితోపాటు నగరంలోని పలు వ్యాపార సముదాయాలను పరిశీలించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Microfinance and biryani sans politics". DNA India. Retrieved 3 February 2012.
  2. "All Things Rice". Express India. Retrieved 3 February 2012.[permanent dead link]
  3. http://www.indtoday.com/fire-accident-సికింద్రాబాద్-paradise-hotel-dattatraya-visits-indtoday-com/[permanent dead link]
  4. http://www.indtoday.com/ghmc-seizure-paradise-hotel-సికింద్రాబాద్/[permanent dead link]