మూఢ నమ్మకాలు

వికీపీడియా నుండి
(మూఢనమ్మకాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఒక నిమ్మకాయలో తుప్పుపట్టిన శిలను గుచ్చి పారేస్తారు ఇది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు

మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని "మూఢ నమ్మకాలు" అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.

మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు,మనిషిని మూర్ఖం గా మారుస్తుంది ఈ మూఢ నమ్మకం.

శాస్త్ర విషయాలు

[మార్చు]

ఒత్తిడి కారణంగా మనలో మూఢ నమ్మకాలు ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌లోని నార్త్‌ వెస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ గాలిన్స్కీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు సాగించారు. జీవితం మీద అదుపు లేనట్లు భావిస్తే.. వారు ప్రపంచంపైన కొన్ని అభిప్రాయాల్ని రుద్దుతారని ఈ బృందం తేల్చింది. తమ జీవితాల మీద నియంత్రణ కోల్పోయే కొద్దీ 'మానసిక జిమ్నాస్టిక్స్' ద్వారా దాన్ని పొందేందుకు వారు అంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు అని ఆడమ్ వివరించారు. నియంత్రణ అనేది ప్రజలకు చాలా ముఖ్యమని తెలిపారు. ఇది లేకపోవడాన్ని వారు ముప్పుగా పరిగణిస్తారని చెప్పారు. దీన్ని దూరం చేసుకొనేందుకు.. అపోహలను పెంచుకొని ఆత్మ సంతృప్తి పొందుతారని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కొంతమంది వాలంటీర్లను ఎంచుకున్నారు. వీరిలో సగం మందిని.. నియంత్రణ కోల్పోయిన సందర్భాన్ని (కారు ప్రమాదం, సమీప బంధువు జబ్బున పడడం వంటివి) గుర్తుకు తెచ్చుకోమన్నారు. ఆ తరువాత వారిపై అనేక ప్రయోగాలు నిర్వహించారు. అస్పష్టంగా ఉన్న చిత్రాలను చూపి అందులో ఏమైనా బొమ్మలు కనపడుతున్నాయా? అని ప్రశ్నించారు. నిజానికి ఈ చిత్రాల్లో సగం మేర చుక్కలు, మిగతా సగంలో అస్పష్టంగా ఉన్న చిత్రాలు (కుర్చీ, పడవ, గ్రహం వంటివి) ఉన్నాయి. మసకమసకగా ఉన్న చిత్రాల్లో 95 శాతాన్ని వాలంటీర్లు గుర్తుపట్టగలిగారు. అయితే ఒత్తిడితో ఉన్న బృందం మాత్రం చుక్కల్లో కూడా చిత్రాలను 'చూశారు'. 'అదృష్ట మేజోళ్లు' వంటివి వీరికి ఇందులో కనిపించాయి. ఈ చుక్కల్లో వారికి భిన్నరకాలైన అంశాలు.. స్టాక్ మార్కెట్లు, ముఖాలు, కుట్రలు వంటివి కనిపించాయి. దీన్నిబట్టి నియంత్రణ కోల్పోవడం వల్ల వీరి మదిలోని భావనలను ఈ చుక్కల్లో ఊహించుకుంటున్నారు అని ఆడమ్ పేర్కొన్నారు.

చదువుకున్న వారిలో కూడా మూఢనమ్మకాలు వుండడానికి చిన్న తనంలో పెద్దలు చెప్పిందే వేదంలో పిల్లలు భావించడం, శాస్త్రీయపద్ధతి అంతగా ప్రబలకపోవడం, ఆదర్శవ్యక్తులుగా వుండవలసిన శాస్త్రవేత్తలు కొంతమంది అతీంద్రియ శక్తులు కనబరచే బాబాలకు శిష్యులవడం కొన్ని కారణాలు. [1]

కొన్ని పద్యాలు

[మార్చు]
మర్మమెరుగకలేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖమొందుచుండ్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!

కొన్ని మూఢ నమ్మకాలు

మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

[మార్చు]
  • పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం
  • పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
  • బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
  • జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
  • అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
  • చిత్తూరు జిల్లాలొ పిల్లలకు వచ్చిన కోరింత దగ్గుకు కుక్కను వేలాడ దీసిన కానుక (గానుగ) చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దానికి మధ్యలో రంధ్రం చేసిపిల్లవాని మొల త్రాడుకు కడతారు.
  • చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
  • చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
  • కొందరు గ్రహణం రోజు భోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
  • బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
  • తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
  • కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
  • నాగమణి, నల్ల పసుపు కొమ్ము, ఎర్ర కలబంద, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము, వెదురు మణి (ఒక రకమైన పురుగు) లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
  • కొందరు కాకి తలమీద తన్నితే అది శని వాహనం కనుక శని పడుతుందనీ, యముడి రూపం కనుక మరణిస్తామని భయపడతారు
  • చిత్తూరు జిల్లాలో చాల పల్లెల్లో.... ప్రజలు తమకు పట్టుకొన్న శనిని వదిలించు కోడానికి (దయ్యాన్ని) ఎవరు చూడ కుండ రాత్రులందు కుంకుం కలిపిన ఎర్రటి అన్నాన్ని, కొశిన నిమ్మకాయలను, బొగ్గులను మూడు దారులు కలిసే చోట వేస్తారు. దానిని తొక్కిన వారికి ఆ దెయ్యం పట్టుకుంటుందని నమ్ముతారు.
  • బల్లి తన శరీరం పై పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కాని బల్లి పడినవారు స్నానం చేసి కంచి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి కాళ్లకు మొక్కితే దాని వలన కలిగే అరిష్టము కలగదని నమ్ముతారు.
  • చిత్తూరు జిల్లాలో ఎవరైనా ప్రయాణమై బయలుదేరి వెళ్లే టప్పుడు ముండ మోపి, పిల్లి (ముఖ్యంగా నల్లపిల్లి),గొడ్రాలు,బ్రహ్మచారి, ఎదురొస్తే వెళ్ళే పని కాదని నమ్ముతారు.అలాగే వారు వెళ్లె టప్పుడు మంగలి, చాకలి, పిచ్చిది, పిల్లల తల్లి, ముత్తైదువ , దంపతులు, ఎదురైతే మంచిదని నమ్ముతారు.
  • భక్తరపల్లి భ్రహ్మోత్సవాలలో భూతప్ప లు భక్తులను కాళ్ళతో తొక్కినా,దాసప్పలు పొంజుతో తలపై కొట్టినా శుభం కలుగుతుందనే నమ్మకంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి జాతరలో భక్తులు తొక్కించుకుంటారు.

దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

[మార్చు]
  • ఒడిషా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
  • కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
  • నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
  • గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

విదేశాలలో కొన్ని మూఢ నమ్మకాలు

[మార్చు]
  • జపాన్ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట. మరణించిన వారి తలలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారు. నాలుగు అంకెను అశుభ సూచకంగా పరిగణిస్తారు.
  • ఇండోనేసియా-జకార్తా-తొమ్మిది అంకెను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు, సునామీ భూకంపానికి దేశ అధ్యక్షుని 'దురదృష్ట' జాతకమే కారణమని అంటున్నారు
  • గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును ధరించేవారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. తెల్లగా ఉండి సప్త వర్ణాలను ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవచ్చని నమ్మేవారు.

బాణామతి లాంటి మూఢనమ్మకాలకు విరుగుడు చర్యలు

[మార్చు]
  • గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం, సంచార వైద్య బృందాలను పంపించడం, బాణామతి రోగులను ఆస్పత్రులో చేర్చుకుని సత్వర వైద్యసదుపాయాన్ని అందించడం. బాణామతిపై సరైన అవగాహన కల్పించడం, మానసిక వైద్య నిపుణులను, మానసిక శాస్త్రవేత్తలను, వైద్య, సామాజిక కార్యకర్తలను నియమించడం.
  • సామాజికంగా , ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకు రావడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం
  • సమాచార ప్రసార సంబంధాలను, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం, విజ్ఞాన యాత్రలను, మాయాజల ప్రదర్శనలను వృద్ధిపరచడం
  • స్వచ్చంద సంస్థలకు ప్రోత్సాహమివ్వడం, మీడియా (పత్రికా ఎలక్ట్రనిక్‌ ప్రసార మాద్యమాల) పాత్ర బాగా ఉండడం
  • గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ పాఠశాలలను ప్రారంభించడం, నియత/అనియత విద్యను అందించడం, బాణామతికి వ్యతిరేకమైన పాఠ్యాంశాలను పాఠశాల విద్యాప్రణాళికలో చేర్చడం
  • బాణమతికి వ్యతిరేకమైన కఠిన చట్టాలను చేయడం, నేరస్తులకు కఠినమైన దండన విధించడం
  • బాణమతి నమ్మకాన్నిప్రోదిచేసే టివి సీరియళ్లను, సినిమాలను నిషేధించడం
  • బాణమతి బాధితులకు రక్షణ కల్పించడం, మూఢనమ్మకాలపై ఉండే భీతిని పారద్రోలడం, వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొదించడం

మూలాలు

[మార్చు]
  1. నరిశెట్టి, ఇన్నయ్య (2011). "Wikisource link to చదువుకున్నవారిలోనూ మూఢనమ్మకాలెందుకుంటాయి?". Wikisource link to అబద్ధాల వేట - నిజాల బాట. వికీసోర్స్. 

మూస:మూలా హాజాబితా

వెలుపలి లంకెలు

[మార్చు]
  • ఈనాడు పత్రికలో 10.10.2023 తేదీన ప్రచురించబడిన వ్యాసం ఆధారంగా...