ఈమని శంకరశాస్త్రి
ఈమని శంకరశాస్త్రి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ద్రాక్షారామం,ఆంధ్ర ప్రదేశ్ | 1922 సెప్టెంబరు 23
మరణం | 1987 (aged 65) |
వృత్తి | వీణ player |
వాయిద్యాలు | వీణ |
ఈమని శంకరశాస్త్రి (సెప్టెంబర్ 23, 1922 - డిసెంబర్ 23, 1987) ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన ద్రాక్షారామంలో జన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవాడు. (మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నాడు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.
నేపధ్యము
[మార్చు]వీరు తమ తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గభీరంగాను... రెండువిధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరువాతఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.
ప్రత్యేకత
[మార్చు]కేవలం తాను నేర్చుకున్న కర్ణాటక సంగీతంలోని కీర్తనలను మాత్రమే వాయించకుడా, లౌకిక ప్రపంచంతో కూడా తన సంగీతాన్ని అనుసంధానించారు. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహించిన వార్తను విన్న శంకరశాస్త్రిగారు, ‘ఆదర్శ శిఖరారోహణం’ అని ఒక సంగీత కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలు, తాము ఎవరెస్టును అధిరోహిస్తున్న అనుభూతిని పొందినట్లు చెప్పారు.. ఇటువంటిదే ‘భ్రమరవిన్యాసం’ అనే మరొక సంగీత రూపకం. ఈ కార్యక్రమాన్ని విన్నవారు, వారి పక్కనే తుమ్మెద ఝంకారం ఉన్న అనుభూతిని పొందారట. ఈనాడు వాద్యవిద్వాంసులు చేస్తున్న ప్రయోగాలకు ఆద్యులు శంకరశాస్త్రిగారే. గమకాలు వేయడంలో, స్వర కంపనంలో, రాగాలాపనలో, స్వరప్రస్తారంలో, తానం వేయటంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు స్వరాలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దం వచ్చేలా చేయడంలో, స్వరనాదంలో హెచ్చుతగ్గులు ప్రదర్శించడంలో... సంగీతంలోని అన్నివిభాగాలలో ఎన్నో కొత్త మార్గాలను సృష్టించారు. సంగీతంలో ఉన్న గమకరీతులకు తోడు, మరో ఏడు రీతులను సృష్టించిన స్రష్ట శాస్త్రిగారు.
సినీ ప్రస్థానము
[మార్చు]ఆయన 1942-50 మధ్యలో మద్రాసులోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశాడు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయాడు. 1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకుడుగా పరిచయం చేసాడు. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. ‘సీతారామకల్యాణం’ చిత్రంలో రావణుడు వీణవాయించే ఘట్టంలో, ప్లేబ్యాక్‌లో శంకరశాస్త్రి వీణ వాయించారు. ‘వెంకటేశ్వర మహాత్యం’ సినిమాలో వాచస్పతి రాగంలో వీణ వాయించారు.
గాత్రము
[మార్చు]తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ, వీణ మీద అవే సంగతులు పలికించేవారు. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు, ‘ప్రజా’ వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా రెండు తీగెల మీద డబుల్ మీటు వేసేవారు. ఇక సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన తీగెలను కుడిచేత్తో మీటే పద్ధతి గొప్పగా ఉండేది. చేతి పొజిషన్‌ను నాలుగైదు రకాలుగా మార్చేవారు. అది అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ, మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో వాయించేవారు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. తాను పూర్తిగా సంగీతంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని కూడా సంగీతంలో ఓలలాడించేవారు.
ఇతర వాద్యాలు, జుగల్ బందీ
[మార్చు]హిందుస్తానీ కళాకారులతో జుగల్‌బందీ చేయడం ఆయనకు సులభసాధ్యం. కచేరీలో వీణ బుర్ర మీద జాజ్ శబ్దం వాయిస్తూ స్వరరచనలు చేసేవారు. మంద్రస్థాయిలో అచ్చు గిటార్ లాగే వినపడేది. కదనకుతూహల రాగంలో ‘రఘువంశ సుధాంబుధి చంద్ర’ కీర్తనను ద్వారం వెంకటస్వామినాయుడు గారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్స్ ఉపయోగించేవారు. వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు చేయవచ్చో సంపూర్ణంగా అర్థం చేసుకున్న కళాకారుడు శాస్త్రిగారు.
కచేరీలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీతసాధన చేసేవారు. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇచ్చేవారు కాదు. అమలాపురం కోనసీమ బ్యాంక్ ఆవరణలో ఒకసారి చిట్టిబాబు, ఈమనిగారు కలిసి ఒక చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేశారు.
సంగీతబ్రహ్మ త్యాగయ్య తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్ఛికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు.
ఈమని శంకరశాస్త్రి 1987, డిసెంబరు 23న మరణించారు.
రేడియో కార్యక్రమాలు
[మార్చు]1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చారు. ఆకాశవాణి డైరక్టరేట్ లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్ఠులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు.ఆకాశవాణిలో శంకరశాస్త్రి 1959లో సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా మదరాసు కేంద్రంలో చేరారు. ఆకాశవాణి వాద్యబృంద నిర్దేశకులుగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆదర్శ శిఖరారోహణం, భ్రమరగీతం వంటి సంగీత రూపకాలు, వీణపై వేదమంత్రాలు పలికించాడు.ఆకాశవాణిలో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యుసర్ గా ఆయన రిటైరయ్యాడు.[1]
విదేశీయానము, సత్కారములు
[మార్చు]విమానం ఎక్కడమంటే ఆయనకు చాలా భయము. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు. ‘కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ’ అని పత్రికలు ప్రశంసించాయి. ఇతనికి "ఆసియన్ రోస్ట్రం అవార్డు" అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది
మూలాలు
[మార్చు]- ↑ "All India Radio | PDF | Entertainment (General) | Languages". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1922 జననాలు
- 1987 మరణాలు
- తెలుగువారిలో వైణికులు
- సంగీతకారులు
- సంగీతం
- రేడియో ప్రముఖులు
- తెలుగు లలిత సంగీత ప్రముఖులు
- తూర్పు గోదావరి జిల్లా సంగీత విద్వాంసులు
- తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి కళాకారులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు