కృష్ణా పుష్కరాలు - 2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గద్వాలలో కృష్ణవేణి విగ్రహం

దేవగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. 2016 ఆగష్టు 12 నుంచి 2016 ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరిగాయి.

కృష్ణా నది[మార్చు]

కృష్ణానది దేశంలో పెద్ద నదులలో ఒకటి. పడమటి కనుమలలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు[మార్చు]

రేకులపల్లి (దిగువ జూరాల)ఘాట్ వద్ద కృష్ణా ప్రవాహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజైన ఆగస్టు 12 (శుక్రవారం) ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించాడు.

పుష్కర ఘాట్లలో సౌకర్యాలు[మార్చు]

యాత్రికులకోసం స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటుచేశారు. పిండ ప్రదానాలు, గంగా పూజ, మూసివాయనం, సాధారణ పూజ, మహా సంకల్పం, అష్టోత్తరం, సరిగంగస్నానం, స్వయం పాకం, పోతర్లు, ప్రాయశ్చిత్తం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను సిద్ధంచేసి, పూజలకు 10 వేలకు పైగా పురోహితులను నియమించారు.

పుష్కర నగర్ల ఏర్పాటు[మార్చు]

నందిమళ్ళ ఘాట్ సమీపంలోని శ్రీభమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం

జిల్లావ్యాప్తంగా 26, విజయవాడలోనే 24 నగర్లను ఏర్పాటు చేశారు. వాటిలో బ్యారికేడింగ్‌, స్టాల్స్‌ తదితర సౌకర్యాలు, రిసెప్షన్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ మొదలు యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ కల్పించి, ఎల్‌ఈడీ వంటి స్ర్కీన్లను కూడా ఏర్పాటు చేశారు.

తాత్కాలిక బస్‌స్టేషన్లు, శాటిలైట్‌ స్టేషన్ల ఏర్పాటు[మార్చు]

నగరంలో 16 ప్రాంతాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్లు, ఆరు శాటిలైట్‌ రైల్వే స్టేషన్లను ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ రైల్వే శాఖ 621 ప్రత్యేక రైళ్ళను, ఆర్టీసీ ఐదు వేల బస్సులను నడిపింది. విజయవాడ నగరంలో 440 ఉచిత బస్సులను ఆర్టీసీ నడిపింది.

63 వేల మంది ఉద్యోగులు - నిఘా వ్యవస్థ[మార్చు]

పుష్కర విధుల్లో 63 వేల మంది ఉద్యోగులు పనిచేశారు. వీరందరికి ఘాట్లు, పుష్కర నగర్లు, సాధారణ ఇతర ప్రాంతాలలో డ్యూటీలు వేశారు. 1400 సీసీ కెమెరాలు, 18 డ్రోన్లతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 600 వాకీటాకీలు, 12 కమ్యూనికేషన్‌ క్యారియర్‌ ఆన్‌ వీల్స్‌ వాహనాలు, 27 ప్రత్యేక సెల్‌ టవర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు.

స్వచ్చంద సైన్యం[మార్చు]

పుష్కరాలకు సేవలందించేందుకు 2312 మంది ముందుకు వచ్చారు. ప్రతి రోజూ దాదాపు 6.50 లక్షల మందికి భోజనాలు ఏర్పాటుచేశారు. ఇవికాక సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు, అల్పాహారం, వీల్‌ చైర్స్‌ వంటివి ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర ఘాట్లు[మార్చు]

కృష్ణా జిల్లాలో పుష్కర ఘాట్లు[మార్చు]

  1. భవాని ఘాట్: భవానీపురం, విజయవాడ.
  2. పున్నమి ఘాట్: భవానీపురం, విజయవాడ.
  3. దుర్గా ఘాట్: కనక దుర్గా దేవాలయం దగ్గర, విజయవాడ
  4. పద్మావతి ఘాట్‌: పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌, కృష్ణలంక
  5. గొల్లపూడి ఘాట్:
  6. అవనిగడ్డ ఘాట్:
  7. నాగాయలంక ఘాట్:
  8. టి కొత్తపాలెం ఘాట్:
  9. శ్రీ రామపాద క్షేత్రం ఘాట్:
  10. నాగాయలంక 7వ వార్డు ఘాట్:
  11. బ్రహ్మానందపురం ఘాట్:
  12. పోపురు ఘాట్: జగ్గయ్యపేట మండలం
  13. వేదాద్రి ఘాట్: జగ్గయ్యపేట మండలం
  14. రావిరాల ఘాట్: జగ్గయ్యపేట మండలం
  15. ముకుటేశ్వరపురం ఘాట్: జగ్గయ్యపేట మండలం
  16. వాడపాలెం ఘాట్:
  17. చిన యాదర ఘాట్:
  18. భోగిరెడ్డిపల్లె ఘాట్:
  19. ఘంటసాల ఘాట్:
  20. రాముడుపాలెం ఘాట్:

గుంటూరు జిల్లాలో పుష్కర ఘాట్లు[మార్చు]

గుంటూరు జిల్లాలో దాదాపు 69 ఘాట్లను ఏర్పాటుచేశారు. వీటిలో 10 ఘాట్లను గురజాల సబ్‌ డివిజన్‌లో 23 ఘాట్లను సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌, తెనాలి సబ్‌ డివిజన్‌లో 25 ఉండగా బాపట్ల సబ్‌ డివిజన్‌లో 11 ఘాట్లను ఏర్పాటుచేశారు. వీఐపీలకోసం అమరావతి, నాగార్జున సాగర్‌లలో ఘాట్లు ఏర్పాటుచేశారు.

  1. అమరావతి ఘాట్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఏర్పాటయిన ఘాట్‌ ఇది.
  2. బోరుపాలెం ఘాట్: తుళ్ళూరు మండలం
  3. రాయపూడి ఘాట్: తుళ్ళూరు మండలం
  4. తాళ్లయాపాలెం ఘాట్: తుళ్ళూరు మండలం
  5. హరిశ్చంద్రపురం ఘాట్: తుళ్ళూరు మండలం
  6. ప్రతూరు ఘాట్: తాడేపల్లి మండలం,
  7. గుండిమెడ ఘాట్: తాడేపల్లి మండలం
  8. చిర్రావూరు ఘాట్: తాడేపల్లి మండలం
  9. పెనుముడి ఘాట్: రేపల్లె మండలం. ఈ ఘాట్‌కు సమీపంలోనే శివ, హనుమాన్‌ దేవాలయాలు ఉంటాయి.
  10. వీర్లపాలెం ఘాట్: దుగ్గిరాల మండలం
  11. పెదకొండూరు ఘాట్: దుగ్గిరాల మండలం

కర్నూలు జిల్లాలో పుష్కర ఘాట్లు[మార్చు]

  1. పాతాళగంగ ఘాట్: శ్రీశైలం
  2. లింగాలగట్టు ఘాట్: శ్రీశైలం
  3. సంగమేశ్వర ఘాట్ , కొత్తెపల్లె మండలం

తెలంగాణలో కృష్ణా పుష్కరాలు[మార్చు]

కృష్ణానది పుష్కరాల్లో కెసీఆర్ స్నానం

మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్ మండలంలోని గొందిమళ్ళ లోని జోగుళాంబ ఘాట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలకోసం రూ.828.16 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహిస్తున్న తీర ప్రాంతాల్లోనున్న పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.[1]

నల్లగొండ తీరంలో 28 స్నానఘట్టాలు, మహబూబ్‌ నగర్‌ తీరంలో 52 స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 14 శాఖలు ఈ పుష్కరాల నిర్వహణలో నిమగ్నమయ్యాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతున్న జోగులాంబ దేవస్థానాన్ని ఈ పుష్కరాల సందర్భంగా వైభవోపేతంగా తీర్చిదిద్దారు. కర్ణాటక - తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కృష్ణ గ్రామంలోని శైవక్షేత్రంలో మరమ్మతులు చేశారు. వాడపల్లి సంగమస్థానంలోని నరసింహస్వామి, శైవక్షేత్రాలు, మట్టపల్లి నరసింహస్వామి దేవాలయాన్ని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేశారు.

కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్లకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో తొమ్మిది చోట్ల (కృష్ణా బ్రిడ్జి, పసుపుల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, వాడపల్లి, మటంపల్లి, నాగార్జునసాగర్) సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

తెలంగాణలో పుష్కర ఘాట్లు[మార్చు]

అలంపూర్ జోగులాంబ గుడి

మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కర ఘాట్లు[మార్చు]

జోగుళాంబ ఆలయంలో కెసీఆర్ పూజలు
  • పుష్కర స్నాన ఘట్టాలు
క్ర.సం. పుష్కర స్నానఘట్టం మండలం/పోలీస్ స్టేషన్ పరిధి సమీప సందర్శనా స్థలాలు
1 కృష్ణా రైల్వే వంతెన కృష్ణ దత్తాత్రేయ దేవాలయం
2 పస్పుల మక్తల్ దత్తాత్రేయ దేవాలయం
3 నందిమల్ల(జూరాలా ఎడమ గట్టు) ప్రముఖుల స్నానఘట్టం ఆత్మకూరు శివాలయం, జూరాల డ్యాం, చంద్రఘడ్ కోట
4 పెద్ద చింతరేవుల ధరూర్ ఆంజనేయస్వామి దేవాలయం
5 రేకులపల్లి(దిగువ జూరాల) ధరూర్ దిగువ జూరాల ప్రాజెక్టు, గుండాల జలపాతం
6 నదీ అగ్రహారం గద్వాల శివాలయం
7 తెలుగోనిపల్లి గద్వాల శివాలయం
8 బీరోలు గద్వాల శివాలయం
9 బీచుపల్లి-II (రంగాపురం) ప్రముఖుల స్నానఘట్టం పెబ్బేరు భక్తాంజనేయస్వామి దేవాలయం
10 బీచుపల్లి-III ప్రముఖుల స్నానఘట్టం ఇటిక్యాల ఆంజనేయస్వామి దేవాలయం, సీతారామస్వామి దేవాలయం, నిజాంకొండ
11 మారమునగాల అలంపూర్
12 క్యాతూరు అలంపూర్
13 గొందిమళ్ళ: జోగులాంబదేవి ఘాట్, ప్రముఖుల స్నానఘట్టం అలంపూర్
14 సోమశిల కొల్లాపూర్ శివాలయం
15 సోమశిల ప్రముఖుల స్నానఘట్టం కొల్లాపూర్ శివాలయం
16 పాతాళగంగ , ప్రముఖుల స్నానఘట్టం ఈగలపెంట మల్లికార్జునస్వామి దేవాలయం
గొందిమళ్ళ వద్ద కృష్ణానది

నల్లగొండ జిల్లాలో పుష్కర ఘాట్లు[మార్చు]

  1. వాడపల్లి ఘాట్: నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘాట్‌ వాడపల్లి. మూసీ, కృష్ణా నదుల సంగమ క్షేత్రమైన వాడపల్లిలో మీనాక్షి అగస్తేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి శివలింగం ఎంతో ప్రాశస్త్యం కలిగింది.
  2. మట్టపల్లి ఘాట్: నల్లగొండ జిల్లాలోని కృష్ణానది తీరంలో వెలసిన జగక్షేత్ర రాజమందలి మహా తీర్థాలలో శ్రీ మట్టపల్లి నృసింహా క్షేత్రం విశిష్టమైనది. అదేవిధంగా స్వామి పరిసర ప్రాంతం ప్రకృతి జారవిడిచే సుగంధ, సుమాల జల్లుల ఆనంద తోరణాలకు నిలయాలు. ఇదిలా ఉంటే ప్రహ్లాద ఘాట్‌ ఎదురుగా దేవాలయం ఉంటుంది.
  3. నాగార్జునసాగర్ ఘాట్: నల్లగొండ జిల్లాలో ప్రధాన ఘాట్లలో సాగర్‌ ఫైలాన్‌కాలనీలోని శివాలయం ఘాట్‌ ఒకటి. ఈ ఘాట్‌ వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం 1960లో నిర్మించారు.

కృష్ణా పుష్కర చిత్రావళి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ (2016-04-29). "ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు". Archived from the original on 2016-04-30. Retrieved 11 August 2016.