జముకుల కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుడబుక్కల పాట
జముకుల కథ (బోనేల పాట) ఉత్తరాంధ్రకు చెందిన అతి ప్రాచీనమైన జానపద కళారూపం. జముకుల కథలుగా అనాదిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందాయి. ఇది బుడబుడక్కమని మ్రోగే మనోహరమైన వాయిద్యం. శ్రీకాకుళం జిల్లా సోంపేట, పలాస, మందస మండలాలలో దీనిని బోనెల పాట, బుడబుక్కల పాట అనికూడా అంటరు. ఈ జముకుల కథలో వీర, కరుణ, శృంగార రసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ నాటికీ ఈ కళ ఉత్తరాంధ్రలో సజీవంగానే ఉన్నప్పటికీ మరికొద్ది రోజులలో కనుమరుగవ్వడం ఖాయం. వృత్తిగా ఈ కళారూపాన్ని స్వీకరించిన అనేక మంది కళాకారులుగా జీవనం సాగిస్తున్నారు. దీనిని వృత్తిగా భావించిన వారు జముకుల కథను పవిత్రంగా భావిస్తారు. ఈ కళారూపంలో జముక వాయిద్యం గూర్చి కళాకారులు ఒక కథ చెబుతారు.

జముక కథ

[మార్చు]

సుకేతుడు అనే రాక్షసుని సంహారం అనంతరం ఎల్లమ్మ దేవి ఆ రాక్షసుడి వెన్నుమీద చర్మాన్ని వలిపించి ఒక డబ్బాను మూతగా అమరింపజేసిందని, వెన్నునరం ఏక నరంగా తాడును తయారుచేయించిందని, కాలి మూలుగు దుమ్ము బిళ్ళగా తయారుచేయించిందని, ఇలా తయారయ్యిందే జముకని పురాణ గాథ. అంతే గాదు జానపదుల్లో ఈ జముకుల కథకు సంబంధించి మరో నమ్మకం కూడా ఉంది. ఈ జముకుధ్వని వినిపించినంత మెరా గాలి, దెయ్యం, పిశాచం లాంటివి ఏమీ రావని వాటి ప్రభావం ఉండదని నమ్ముతుంటారు.

జముక

[మార్చు]

కుంచం ఆకారంలో ఉన్న ఒక డొక్కుకు ఒక ప్రక్క కప్ప చర్మంతో మూస్తారు. ఆ చర్మానికి మధ్య చిన్న రంధ్రం చేసి ఒక నరాన్ని దారం చెవరి ముడివేసి అందులోకి దూర్చి ఆనరానికి చిన్న కర్ర ముక్క కడతారు. ఆ కర్రకు నివర మువ్వలు కడతారు. కర్రతో దారాన్ని బిగుతుగా లాగి వదులుతుంటే ఒకరకమైన ధ్వని వస్తుంది. వీరు ఉపయోగించే సాధనం జముకు. అందుకే దీని పేరు జముకల కథ, దీనినే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో బోనెల కుండ అని కూడా అంటారు. దీనిని రబ్బరు, కర్ర, రేకు, కంచు, ఇత్తడితో కూడా తయారుచేస్తారు.

జనం మెచ్చిన జముకుల కథలు

[మార్చు]

జముకుల కథలను జక్కుల కథలని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల కాలంలో బహుశ ప్రచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో వీటికి బోనేల ఆట లేదా బుడికి పాట అని కూడా అంటారు. ఉత్తరాంధ్రలో హరిజన (మాల-మాదిగ) కులానికి చెందిన వారు కొద్దిపాటి అక్షరజ్ఞానంతో పాడుఊ ఎన్నో తరాల నుండి వీటిని జీవింపజేస్తున్నారు. కాని నేటి కాలానికి ఈ కళ ఇంచుమించు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. పది, పదిహేనేళ్ళ క్రితం వరకు ఈ పాటకు గొప్ప గిరాకీ ఉండేది. సామాన్య గ్రామీణ ప్రజలకు ప్రాంతానికి తగ్గట్లు భాష, యాస, మాండలికాలతో పాడుతూ ప్రజలను రంజింప జేసేవారు. అణగారిన వర్గాల, అక్షరజ్ఞానం లేని ప్రజలకు అణగారిన కులాల కళాకారులచే పాటలు పాడి భారత, రామాయణ, గాథలను సామాన్యులకు వినిపించేవారు. నిజంగా ఆ రోజులలో గ్రామీణ ప్రజలకు రామాయణ, భారత గాథలన్నీ ఇటువంటి జానపద కళారూపాల ద్వారానే సామాన్యులకు తెలిసేవి. నేటి తరానికి అవి లభించడం లేదు. సినిమా, టి.వి ల విజృంభణతో ఈ కళనన్నీ కనుమరుగయి పోతున్నవి.

ఎల్లమ్మ కథ

[మార్చు]

ఓరుగల్లులో ఆనాడు ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చుపుతూ వుండేవారనీ, వారుపయోగించే జవనిక..... జుకజుం, జుకజుం జుమ్మంటూ వీనుల విందుగా నాదం సాగేదనీ, క్రీడాభిరామంలో ఈ విధంగా ఉదహరింప బడి ఉంది.

వాద్య వైఖరి కడు నెరవాది యనగ
ఏక వీరా దేవి ఎదుట నిల్చి
పరశురాముని కథ లెల్ల ప్రౌఢి పాడె
చాతుర కీర్తి బవనల చక్రవర్తి.

నగ్న నృత్యాలు

[మార్చు]

రేణుకా దేవి జమదగ్ని మహ్యాముని భార్య, పరశురాముని తల్లి, తండ్రి ఆజ్ఞను అనుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా తలకాయ మాదిగ వాడలో పడిందట. శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు నగ్న నృత్యంతో పూజిస్తూ వుండేవారట. నగ్నంగా వున్న ఈ విగ్రహాల ముందు స్త్రీలు కూడా నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట. ఈ నృత్యాలలో జవనికల వాయిద్యం వుత్తేజాన్ని కలిగించేదట.

నాడూ, నేడూ

[మార్చు]

చారిత్రాత్మక మైన ఈ జముకుల కథలే, ఆనాటి జక్కుల కథలు, ఈ కథలు ఈ నాటికీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోనూ, తెలంగాణా లోనూ, విశేష ప్రచారంలో ఉన్నాయి. ఈ కథలు శృంగార లాలిత్యం తోనూ కరుణ రసాన్ని ప్రతిబింబించేవి గానూ వుంటాయి. ఈ కథల్లో అనేక రకాలైన సంగీత పట్టులున్నాయి. మట్టులకు తగినట్లు వాయిద్యాలు మలుపు తిరుగుతాయి. ఈ ప్రదర్శనం మూడు గంటల కాలం నడుస్తుంది.

బుడికి పాట

[మార్చు]

శ్రీకాకుళం జిల్లాలో నేటి జముకుల కథ పూర్వ నామం బుడికి, లేక బుణికి పాట అనీ, బోనుల పాట అనీ టమకటమా అనీ, బుడబుక్కల పాటనీ నామాంతరాలని ( ప్రజాసాహితి ప్రజాకళా రూపాల ప్రత్యేక సంచికలో ) ఛాయారాజు గారు ఉదహరించారు. బుడికి వాయిద్యాన్నే బోను అని కూడా అంటారు. అందుకే అది బోనుల పాట అయింది. బుడికి చేసే శబ్దం ........ బుడుక్కు, బుడుక్కు కాబట్టి బుడబుక్కల పాట అని కూడా అంటారు. మొత్తంమీద ఇది వాద్య ప్రధానమైన కళారూపం.

జముకుల, వన్నె చిన్నెలు

[మార్చు]

జముకులంటే ఈ తరానికి చాల మందికి తెలియదు, దీనినే ........ జమిలిక, జమిడిక, బుడికి, అని కూడా పిలుస్తారు. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో వుంటుంది. కొన్ని ఇత్తడి తోనూ, మరి కొన్ని కొయ్యవి కూడా వుంటాయి. దానిని ఒక ప్రక్క భాగం సన్నని పొరలాంటి గేదెల బక్కీ చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్న రంద్రం చేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుంచి రెండవ ప్రక్క ఒక కర్ర ముక్కకు కట్టి చేతితో దానిని లాగి పట్టి లోపలి భాగంలో ఆ నరాన్ని మోగించి నట్లయితే శ్రావ్యమైన మోతలు వస్తాయి.

రంగస్థల వేషాలు, విశేషాలు

[మార్చు]

జముకుల కథా ప్రదర్శనానికి ఏ విధమైన రంగస్థలమూ అవసరంలేదు. గ్రామం మద్యలో చిన్న పందిరి వేసి, రెండు లఈట్లు కడితే సరిపోతుంది. ప్రదర్శన కారులు ముగ్గురు. అందులో మధ్య వ్వక్తి కఠకుడు, వంత దారుల్లో ఒకరు హాస్యం, రెండవారు వ్వాఖ్యానం, వేషధారణలో కథకుడు నల్ల కోటు, తెల్లకట్టు పంచ, తల గుడ్డ చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ దిరుగుతాడు. స్త్రీ పాత్రలు, కథా విధానంలో వచ్చినప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్నే కథకుడు చేస్తూ వుంటాడు. వంత దారులు రెండు జముకలను శ్రావ్వంగా వాయిస్తూ వుంటారు.

బుడికి కథా ప్రదర్శనం

[మార్చు]

శ్రీకాకుళం జిల్లాలో ప్రచారంలో వున్న, జముకుల కథకు ప్రత్యామ్నాయ మైన బుడికి కథా రూపంలో పాల్కొనే వారు ముగ్గురుంటారు. రెండు బుడికెలు (అవే జముకులు) కాళ్ళకు గజ్జెలు తప్ప మరే ఇతర వాయిదాలూ వుండవు. ఈ ముగ్గురులో మధ్యనుండే పాట గాడు స్త్రీ పాత్రలో, అంటే భామాకలాపంలో సత్య భామ వేషం మాదిరి వుంటుంది. వంత పాట దారులకు ప్రత్యేక వేష ధారణేమీ వుండదు. వీరిద్దరూ బుడికెలను చంకలకు తగిలించుకుని లయ బద్ధంగా, పాటల ననుసరించి వరుసలు మారుస్తూ వాయిద్యాన్ని సాగిస్తారు.

చేతిలో రుమాలు

[మార్చు]

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కథకుని చేతిలో వుండే పట్టు రుమాలు. కథకు ప్రాణం కథకుడైతే, కథకుని ప్రాణం చేతిలోని పట్టు సెల్లాయే. అది ఎంత ముఖ్యమైనదో చాయి రాజ్ గారు ఈ క్రింది ఉదాహరణను ఉదహరించారు. ఒకసారి ప్రదర్శన జరుగుతూ వుండగా కథకుని చేతిలో రుమాలు తీసుకుని కథను సాగించ మన్నారట. వాళ్ళు బొమ్మల్లా నిలుచుండి పోయారట. అడుగు కదల లేదట. రాగం రాలేదట, రుమాలు లేకుండా కథ చెప్పలేమన్నారట.

రుమాలు తమాషా

[మార్చు]

బుడి కథలో కథకునికి రుమాలు ఒక అవయవం లాంటిది. అది చేతిలో లేక పోతే చెయ్యి విరిగి పోయినట్లే. ఆ యా సన్నివేశాల్లో అది ఒక పాత్రగానే వ్వవహరిస్తుంది. ఒకోసారి కర్పూరం వెలిగించిన పళ్ళె మవుతుండట, వాయినం అందించే పాత్రగా మారుతుందట. ఒకోసారి ఆకాశంలో చంద మామగా, మరోసారి సిగ్గును దాచుకోడానికి. మరోసారి గుర్ఱాలను అదిలించే చర్నా కోలలా రూపొందుతుంది. ఇంకోసారి రాయబారాన్ని పంపే హంసగా.. పావురంగా, చివరకు ఉత్తరంగా దుఃఖ రసంలో కళ్ళు అద్దు కోవడానికి శృంగారంలో వయ్యారంగా ఊగించడానికీ, ఇలా ఎన్నోవిధాల ఆయా రసాల, అభినయాల, సన్నివేశాల కనుగుణంగా చేతిలోని రుమాలు ప్రముఖ పాత్ర వహిస్తుంది.

బుడికి రంగస్థలం

[మార్చు]

ఈ కళారూపాన్ని గూడేలలోనూ, గ్రామాలలో కూడలి వద్దా, నలుగురూ కూర్చుండే రచ్చ బండల వద్దా ప్రదర్శిస్తారు. కథ ప్రారంభమై తెల్ల వార్లూ నడుస్తుంది. ప్రదర్శనా రంగ స్థలంలో ఒక దీపపు స్తంభాన్ని పాతుతారు. దీనిని గిరడ అని పిలుస్తారు. ఈ గిరడ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ, పాడుతూ*, కథకుడు నృత్యం చేస్తూ కథ చెపుతాడు. ఇప్పుడిప్పుడు గిరడకు బదులు, పెట్రొమాక్స్ లైట్లు స్తూలు మీద వుంచి దానినే గిరడగా భావించి చుట్టు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నట్లు ఛాయారాజ్ గారు చెపుతున్నారు.

గిరడ ముందు ప్రార్థన

[మార్చు]

ముందుగా కథకుడు గిరడకు ఎదురుగా నిలబడి ప్రార్థన చేసి నెమ్మదిగా నాట్యం ప్రారంబించి అప్పటి వరకూ కప్పుకున్న మేలి ముసుగును తొలగించి ఆనంతరం సంభాషణ ద్వారా ఏయే కథలు తాము చెప్పగలరో సభా ముఖాన వివరించి ఏ కథ కావాలో ప్రేక్షకుల్నే ప్రశించి వారు చెప్పమన్న కథను ప్రారంభిస్తారు. కథలన్నీ పౌరాణికాలే. కథంతా పూర్తి అయిన తరువాత ప్రేక్షకులు కోరిన మీదట సుదీర్ఘ మైన పాటలు పాడతారు. వీటిల్లో చెప్పుకో తగినవి మందులాడి పాట, కామమ్మ కథ మొదలైనవే కాక, ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘర్షణలను కూడా పాటలు కట్టి పాడుతారు.

ఇరవై బాణీలు , ఇరవై రాగాలూ

[మార్చు]

ప్రతి కథలోనూ, కథకుడు సుమారు ఇరవై బాణీల్లో పాటలు పాడుతాడు. పాటకూ, పాటకూ మధ్య కాథనాన్ని రాగ యుక్త మైన వచనంలో రాగ రంజితంగా చదువుతాడు. ప్రతి పాటకూ బాణీ మారుతూ వుంటుండి. వాద్య నృత్యగాన సమ్మేళనంతో కథ హృద్యమంగా నడుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వంతదారులు కథలో వచ్చే పాత్రలుగా మారిపోతాడు. ఉదాహరణకు కథకుడు సుభద్రగా నటిస్తే వంత పాటకాళ్ళు ఒకడు అర్జునుడు గానూ మరొకడు మన్మథుడుగానూ, మారి పోతాడు. జముకుల కథా ప్రదర్శనలో ఇలా ఒక విచిత్రమైన డ్రామా నడుస్తుంది.

అంట రాని వాళ్ళూ, అన్నం లేని వాళ్ళూ

[మార్చు]

పైన వివరించిన బుడికి లేదా జముకుల పాట గాళ్ళు నిరుపేదలైన అంటరాని కులాలకు చెందిన వాళ్ళు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు. ఒక వేళ వున్నా అది అంతంత మాత్రమే. అదీ శ్రీకాకుళం మాండలిక యాసలో వుంటుంది. యాసతో కూడిన వారి భాష నవ్వు పుట్టిస్తూ వుంటుంది. అక్షరాలను వె వే లుగా పలుకుతారట, అలాగే ఎన్నీ' - వెన్ని - ఏనుగు - వేనుగు వచనం చెప్పే టప్పుడు వాక్యంలో ముఖ్యమైన పదాలు ఏవైతే వుంటాయో వాటిని ఈ విధంగా వత్తి పలుకుతారట.

ఖోట కెలపల ఉధ్వేన వనంలో హర్జనుడు తపస్సు
లున్నాడు, అతగాడి ధెగ్గరికి సుబద్ర భంగారు
బగుకలో సప్పలాం పట్టుకొనె లగెల్తందందే

ఇలా సాగుతుంది వారి భాష. ఇది యాస కాదు గంభీరంగా వాచికం చెప్పడంలో వచ్చే దుశ్శబ్ధాలు.

సంచార జీవితాలు

[మార్చు]

ఈ కథలు చెప్పే కళాకారులు దాదాపు అందరూ సంచార జీవనులో ఒక గ్రామంలో కథ చెప్పి మరో గ్రామం పోయి నెలల తరబడి గ్రామాలలో కథ చెప్పి కొంత సొమ్ము కూడా బెట్టుకుని స్వగ్రామం చేరుకుంటారు. పైన వివరిం

పీసా లక్ష్మణరావు, కన్యక

జముకుల కథ కళారూపాన్ని దేశ ప్రయోజనాలకు ప్రప్రథమంగా మార్చిన వ్వక్తి విజయ వాడ కమ్య్హూనిస్థు కార్యకర్త, ప్రజానాట్య మండలి సభ్యుడు కీ: శే: పీసా లక్ష్మణ రావు. మహారాజుల వ్వస్థలో ప్రబలిన ధారుణ హింసా కాండనూ, సాంఘిక దురాచారాలనూ ఉదహరిస్తూ గురుజాడ వ్రాసిన 'కన్యక ' గేయాన్ని ఇతి వృత్తంగా తీసుకుని, కన్యక జీవిత గాథను కథగా మార్తి దానిని జముకుల కథగ వ్రాసి మంచి మంచి బాణీలను ఏర్చి కూర్చి రసవత్తరంగా కథా గానం చేసేవారు ఆయన పంత దారుగా రాజకీయ వ్యాఖ్యాతగా వ్వవహారిస్తే నరసింహా రావు కథకుడుగా, తొత్తడి సింహాచలం హాస్యాన్ని అందించే వాడు. అది అద్భుతమైన కథగా నాటి సాంఘిక రాజకీయ పరిస్థితులన్నిటికీ అద్దం పట్టింది.

కథాగాన సరళి

[మార్చు]
కన్యకాన చరితం, కర్ణానందం
నిను స్మరియించెడు జనుల కెల్ల నిత్యానందం.
అని ప్రార్థనతో ప్రారంభించి
కళింగ దేశ మీ తెలుగు గడ్డపైన
విష్టువర్థను డనుచు వెలయుచెండేనుగా.
అని వివరిస్తూ
పండిన తన కేమి, మండిన తన కేమి
పన్నులె కావాలి ప్రభువు వారలకు
పన్ను లివ్వలేని పేద రైతుల నెల్ల
రచ్చ చావడి కీడ్చి రువ్వలతో బాధించు
వన్నెగల స్త్రీ ఒకతె కన్ను కగుపించిన
కామాంధుడై ఒళ్ళు కాన డారాజు.

అలాంటి విష్ణువర్థన మహారాజు కన్యకను కోరటం, కన్యక నిరాకరిస్తూ రాజును ఇలా సంబోధిస్తుంది.

రావయ్య రారాజ రాణి ఇచ టున్నాది
నీ దుష్ట చర్యలను దునుమాడు కొరకు
కన్ను గోరిన కన్నియ గడ్డపై నున్నాది
పట్టుమోయ్ శక్తుంటే పటుతరము మీర
నను బట్ట నీఛుడా - నీచేత గాకుంటే
నిండు సభలో అగ్ని గుండాన చావు.

అని కన్యక రాజును సవాల్ చేసి, ప్రజలకు రాజు దారుణాలను వివరిస్తుంది. కానీ రాజుకు భయపడిన ప్రజలలో స్పందన కనిపించదు. అంతట కన్యక ....

మండెడు గుండముకు - ముందు దండము పెట్టి
గుప్పించి యా తల్లి గుండాన దూకింది.
అగ్నిలో అ తల్లి ఆహుతై పోయింది.

ప్రజలు క్రోధాగ్నితో లేచారు.

కాడెలు, మేడేలూ,
కత్తులూ, సుత్తూలు,
బాకులా బల్లెములా,
పట్టియా రాజును
ప్రాణాలే తీసిరా
అంతటితో,
రాలిపోయేను రాజూ
కూలిపోయేను కోటలూ
రాణు వల్లు, రాణియలు

రాలిపోయేరు నాడే

మిక్కిలి నేని దళం

[మార్చు]

ఇలా నవరాలసను ప్రతిబింబించే ఈ జముకుల కథను రసవత్తరమైన ఈ జముకుల కథను నాటి ప్రజానాట్య మండలి స్థాపకుల్లో ముఖ్యులైన మిక్కిలి నేని రాధాకృష్ణమూర్తి, మాచనేని వెంకటేశ్వర రావు, పట్టం శేట్టి ఉమామహేశ్వరా రావు మొదలైన వారు లక్ష్మణా రావుగారి వద్ద నేర్చుకుని దానిని ప్రజానాట్య మండలిలో ముఖ్య కళారూపంగా తీర్చి దిద్దారు. ఈ దళంలో కథకుడు మిక్కిలి నేని రాజకీయం, ఉమామహేశ్వర రావు హాస్యం, మాచినేని తరువాత కర్నాటి లక్ష్మీ నరసయ్య హాస్యం చెప్పారు. రసవత్తరమైన ఈ కథ ఆంధ్ర దేశంఓ 1944 - 1950 మధ్య ఆంధ్ర ప్రజలను ఉర్రూత లూగించింది. మద్రాసు రేడియోలో మూడు సార్లు, విజయవాడ రేడియోలో రెండు సార్లు, డిల్లీ రేడియోలో ఒక సారీ ప్రసారం చేయ బడింది. ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంతో పాటు మద్రాసు, షోలాపూర, పూనా, బొంబాయి, అహమదాబాదు మొదలైన రాష్ట్రేతర ప్రాంతాల్లో చెప్పబడి అధిక ప్రశంసలను అందుకుంది.

సుబ్బారావు పాణిగ్రాహి - జముకుల కథ

[మార్చు]

ఈ జముకుల కథను శ్రీకాకుళం జిల్లా లోని ఏజంసీ ప్రాంతంలో గిరిజనోత్సవం, భూస్వాముల దోపిడీకి వ్వతిరేకంగా సాగిన రోజుల్లో కామ్రేడ్స్ వెంపటావు సత్యం - అరికె సోములు, దుప్పల గోవింద రావులు ఆ వుద్యమాన్ని చిత్రిస్తూ తమకు చేతనైన పద్ధతుల్లో జముకుల కథగా చెప్పేవారు. దానిని వుత్తమంగా తీర్చి దిద్ది సుబ్బారావు పాణిగ్రాహ, నిమ్మల కృష్ణమూర్తి మొదలైన వారు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి మద్దత్తుగా కథలు చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. ఇది ఏనాటికీ వర్థిల్ల వలసిన వుత్తమ కళారూపం.

;నూలు సూర్వారావు దళం

[మార్చు]

పీసా లక్ష్మణరావు వ్రాసిన కన్యక జముకుల కథను మిక్కిలి నేని దళం రేడియోలోనూ ఆంధ్ర దేశంలో అనేక ప్రదేశాల్లో చెప్పేకథలు విని ప్రభావితు లైన సామర్ల కోటకు చెందిన నూలు సూర్యారావు, గొంతంసెట్టి సూర్య నారాయణ, నూలు భాను మూర్తి మొదన వారు ఒక దళంగా సారంగధర కథను ఆరు వందల కథల దాకా చెప్పారు. రెండు వందల లవకుశ కథలనూ అలాగే కృష్ణ లీలలు, బకాసుర వధ - సీతా కళ్యాణం మొదలైన అనేక కథలను ఉత్తరాంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శనాలను ఇస్తున్నారు. పద్దెనిమిది పర్యాయాలు రేడియోలో జముకుల కథా కార్యక్రమాల నిచ్చారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ బృంధం వారు జముకుల కథల ప్రదర్శనాల నిస్తున్నారు.

;జముకుల కథా రచనలు

[మార్చు]

జముకుల కథ ల రచనా విధానం హరిహరీ పదాల వలె జంపె వరుసల్లోనే వుంటాయని తంగిరాల వారు జానపద ప్రత్యేక సంచికలో (నాట్యకళ) వివరించారు. తెలుగు సంప్రదాయ వీర గాథల్లో ఎల్లమ్మ కథలు (పరశురాముని కథలు) హరి హరీ పదాలను కూడా జముకులతో పాడటం కూడా జరుగుతూ ఉంది. వీటి ననుసరించే ఆధునిక జముకుల కథలు బయలుదేరాయి.

అనేక బుర్రకథలు వ్రాసిన జాతీయ కవి భూషణ బిరుదాంకితులు, శ్రీ వారణాసి సత్య నారాయణ శాస్త్రి గారు జముకుల కథలను వేశేషంగా రచించారు. 1947 నాటికే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే జముకుల కథని రచించారు. క్రీ:.శే: పుట్టా సుబ్బారావు గారు పశిచిమ గోదావరి జిల్లా, కృష్ణాయ పాలెంవారు ఈ కథను తమ దళంతో ప్రచారం చేశారు.

శాస్త్రిగారు రచించిన జముకుల కథలు ఇవి. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అంతర్థాన గాథనూ, (1947 ) 1950 లో రాణీసంయుక్తనూ, 1950 లో ఆజామీళోపాఖ్యానం, 1951 లో భక్త ప్రహ్లద గాంధీజీ నిర్యాణం మొదలైనవి రచించారు. కానీ ఇవి అన్నీ అముద్రితాలుగానే వుండి పోయాయి.

జముకుల కథలలో పీసాలక్ష్మణ రావు కన్యక జముకుల కథ, ప్రజానాట్య మండలి దళమైన మిక్కిలి నేని, మాచినేని, ఉమామాహేశ్వరా రావు గార్లు రేడియోలోనూ, ఆంధ్ర దేశమంతటాను విశేషంగా ప్రదర్శించారు. (మరోచోట వివరంగా వ్రాయబడింది) అలాగే శ్రీ ప్రయాగ నర్సింహ శాస్త్రి గారు, నేతాజీ సుబాస్ చంద్ర బోసు వీరా గాథనూ, మహాత్ముని జీవిత గాథనూ రచించారు. నేడు నూరి గంగాధరం గారు ఆంధ్ర రాష్ట్ర ప్రబోధాన్ని రచించారు. పౌరాణిక గాథలను ప్రచారం చేసిన జముకుల కథలనూ, హరిహరీ పదాలను, జాతీయ ప్రబోధానికీ, సాంఘిక ప్రయోజనానికి కూడా ప్రయోగించారు.

మూలం:

[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.