లూయీ పాశ్చర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లూయీ పాశ్చర్
జననం(1822-12-27)1822 డిసెంబరు 27
మరణం1895 సెప్టెంబరు 28(1895-09-28) (వయసు 72)
సంతకం

లూయీ పాశ్చర్ (ఆంగ్లం Louis Pasteur) (డిసెంబరు 27, 1822సెప్టెంబరు 28, 1895) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు పాశ్చరైజేషన్ అంటారు.

ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు; మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్, ఫెర్డినాండ్ కాన్.

ఇతని మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో ఇతడొకడు.

జీవితచరిత్ర[మార్చు]

పాశ్చర్ 1822 సంవత్సరం డిసెంబరు 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో జన్మించాడు. నెపోలియన్ సైన్యంలో పనిచేసిన తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్మెడ్స్నేh హితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు; టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒక పిల్లల్ని పోగొట్టుకొన్నాడు.

శాస్త్ర పరిశోధన[మార్చు]

పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను పులియడం (ఫెర్మెంటేషన్ ) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. ద్రక్షసారా (వైన్) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.

కోళ్ళకు వచ్చే కలరా వంటి పారుడు వ్యాధిపై పరిశోధన జరిపి వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చారు.

పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం లూయిస్ పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.

1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.

ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.

పాశ్చర్ సుక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.[1]

మరణం[మార్చు]

పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు. లూయిస్ పాశ్చర్ జ్ఞాపకర్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. "Microbe Magazine: Awards: Leeuwenhoek Medal". Archived from the original on 2009-02-04. Retrieved 2008-11-14.