1962 భారత చైనా యుద్ధానికి దారితీసిన ఘటనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1962 లో జరిగిన భారత చైనా యుద్ధానికి వరసగా జరిగిన అనేక ఘటనలు కారణమయ్యాయి. జాన్ డబ్ల్యు గార్వర్ ప్రకారం, టిబెట్ విషయమై భారత్ వైఖరి పట్ల చైనాకున్న అపోహ, ఇరుదేశాల మధ్య సరిహద్దును కచ్చితంగా గుర్తించకపోవడం, (భారత దేశపు సరిహద్దు విధానంతో సహా) [1][2] భారత్‌తో యుద్ధం చెయ్యాలన్న చైనా నిర్ణయానికి ప్రధాన కారణాలు.

మైత్రీ సంబంధాలు

[మార్చు]

1947 లో భారత గణతంత్ర రాజ్యం, పాకిస్తాన్‌లు ఏర్పడడం, 1949 లో చైనా ప్రజా గణతంత్ర రాజ్య స్థాపన వంటి ప్రముఖమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చైనాతో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకోవడం భారత ప్రభుత్వ మౌలిక విధానాల్లో ఒకటి. ప్రాచీన కాలం నుండి చైనాతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించుకోవాలనేది భారత సంకల్పం. చైనా దేశం ఆవిర్భవించినపుడు దానికి గుర్తింపు ఇచ్చిన దేశాల్లో భారత్ మొదటిది.

ఆవిర్భావం కాగానే చైనా, తన సైన్యం టిబెట్‌ను ఆక్రమించుకుంటుందని ప్రకటించింది. భారత్ ఈ విషయమై తన అభ్యంతరాన్ని ఉత్తరం ద్వారా తెలిపి, టిబెట్‌పై చర్చలు జరుపుదామని ప్రతిపాదించింది.[3] కొత్తగా ఏర్పడిన చైనా దేశం, కొత్తగా ఏర్పడిన భారతదేశం కంటే ఎక్కువగా అక్సాయ్ చిన్ సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరించడంపై దృష్టి పెట్టింది. భారత చైనా సరిహద్దులో సుస్థిరత్వం కోసం చర్యలు చేపట్టాలని భారత్ నిర్ణయించింది.[4] ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నందుకు గాను 1950 ఆగస్టులో చైనా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.[4] సరిహద్దు విషయమై సందేహాలు, సందిగ్ధతలూ ఏమైనా ఉంటే నివారించేందుకు, ప్రధాని నెహ్రూ 1950 లో పార్లమెంటులో "మెక్‌మహాన్ రేఖ మన సరిహద్దు అని మన మ్యాపులు చూపుతున్నాయి, అదే మన సరిహద్దు.. ఆ సరిహద్దును మనం గౌరవిస్తాం. ఆ హద్దును మీరేందుకు ఎవరినీ మనం అనుమతించం." అని ప్రకటించాడు. చైనా ఈ ప్రకటన పట్ల ఏమీ స్పందించలేదు.[4]

1951 నాటికి, అక్సాయ్ చిన్‌లో అనేక స్థావరాలను నెలకొల్పింది. మరో వైపున భారత ప్రభుత్వం, లదాఖ్‌ను పాకిస్తాన్ ఆక్రమించుకోకుండా సైన్యాన్ని కేంద్రీకరించి, అక్సాయ్ చిన్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది.[5] అయితే, భారత్, చైనా, టిబెట్‌ల మధ్య సరిహద్దు వివాదమేమీ లేదని 1951, 1952 ల్లో అనేక సందర్భాల్లో చైనా ప్రకటించింది.

తరువాత 1951 సెప్టెంబరులో జపానుతో ఒక శాంతి ఒప్పందం చేసుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది. ఈ ఒప్పందానికి చైనా ఒక ప్రధానమైన భాగమని, ఒక అంటరాని దేశంగా భావించి చైనాను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం సరికాదానీ భావించిన భారత్, ఈ నిర్ణయం తీసుకుంది. చైనా అనేక విషయాల్లో అంతర్జాతీయంగా ఏకాకి కావడం చేత, తదుపరి సంవత్సరాల్లో భారత్ చైనాకు ప్రతినిధిగా వ్యవహరించేందుకు శ్రమించింది. 1950 ల తొలినాళ్ళ నుండి, చైనా ఐక్యరాజ్యసమితిలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

1950 లో చామ్‌దో వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ సైన్యాన్ని ఓడించింది. 1951 లో లాసా, టిబెట్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించింది. ఈ సమయంలో భారత్ తవాంగ్‌ లోని టిబెట్ పాలకులను వెళ్ళగొట్టి దాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంది.[6] 1954 లో భారత్‌ చైనాలు పంచశీల పై సంతకాలు చేసాయి. ఈ పంచశీలలో టిబెట్‌పై చైనా సార్వభౌమత్వాన్ని భారత్ గుర్తించింది. మెక్‌మహాన్ రేఖ తో కూడిన సరిహద్దు మ్యాపును భారత్, చైనాకు సమర్పించగా, చైనా దానికి అభ్యంతరం తెలుపలేదు. ప్రధాని నెహ్రూ ఈ సమయంలోనే హిందీ చీనీ భాయి భాయి అనే నినాదాన్ని చాటాడు.[మూలాలు తెలుపవలెను]

లాసాను అక్రమించుకోవడానికి చైనీయులను అనుమతించి, వారి సరిహద్దును భారత్ సరిహద్దు వరకూ తెచ్చేందుకు ప్రధాన మంత్రి సహకరించాడు… దురాక్రమణకు అలవాటు పడిన వారు దురాక్రమణ చేస్తూనే ఉంటారు.
రాజ్యసభలో బి. ఆర్. అంబేద్కర్, 1954[7]

గతంలో సరిగ్గా గుర్తించని సరిహద్దులను కచ్చితంగా గుర్తిస్తూ భారత మ్యాపులను సవరించాల్సిందిగా 1954 జూలై 1 న నెహ్రూ ఒక మెమో పంపించాడు.[8] కొత్త మ్యాపులు తూర్పు సరిహద్దులో హిమాలయ శిఖరాలను హద్దుగా చూపిస్తూ సవరించారు. కొన్ని ప్రదేశాల్లో ఈ రేఖ మెక్‌మహాన్ రేఖకు కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన ఉంది.[9] ఈ కొత్త మ్యాపులు, భూటాన్సిక్కింలను కూడా భారత్‌లో అంతర్భాగంగా చూపించాయి.

1956 లో అమెరికా వారి సీఐఏ, చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు గాను కలింపాంగ్ కేంద్రంగా టిబెటన్ గెరిల్లాలను రిక్రూటు చేసుకోవడం మొదలు పెట్టింది.[10] చైనా తన భూభాగంలోని జిన్‌జియాంగ్ నుండి అక్సాయ్ చిన్ ద్వారా టిబెట్ వరకూ రోడ్డు నిర్మించిందని 1958 లో తెలుసుకున్న భారత ప్రజలు కోపావేశాలకు లోనయ్యారు. (అక్సాయ్ చిన్ చారిత్రికంగా భారత భూభాగమైన లదాఖ్‌లో భాగంగా ఉంది).

1956 లో 1,20,000 చ.కి.మీ. భారత భూభాగాన్ని చైనా మ్యాపుల్లో తన భూభాగంగా చూపించిందని నెహ్రూ జౌ ఎన్‌లై వద్ద ఆరోపించాడు. ఆ మ్యాపుల్లో తప్పులున్నాయని, వాటికి పెద్దగా అర్థం లేదనీ జౌ వ్యాఖ్యానించాడు. ఎప్పటి నుండైతే ఆ సరిహద్దు భావనలు నిజమని భావిస్తూ వచ్చామో అప్పటి నుండి ఆ మ్యాపులను సవరించాలని జౌ చెప్పాడు. ఆ మ్యాపులు చూపించే విధంగా తమకు ఆయా భూభాగాలపై ఆశలేమీ లేవని 1956 నవంబరులో జౌ మళ్ళీ చెప్పాడు.

టిబెట్‌పై అభిప్రాయభేదాలు

[మార్చు]

గార్వర్ కథనం ప్రకారం, టిబెట్‌పై చైనా భారత్‌లు పరస్పర అంగీకారం, పట్టువిడుపుల ద్వారా ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలనేది టిబెట్‌పై నెహ్రూ విధానంగా ఉండేది..[2] నెహ్రూ, తాను గతంలో తీసుకున్న చర్యల కారణంగా (కొరియా యుద్ధం, ఐక్యరాజ్యసమితిలో చైనా సభ్యత్వం, జపాన్‌తో శాంతి ఒప్పందం, తైవాన్‌ను చైనాకు అప్పగించడం, ఇండోచైనా, వలసవాదాన్ని వ్యతిరేకించడం, ఆఫ్రో ఏషియన్ ఉద్యమం మొదలైన విషయాల్లో చైనాతో మైత్రి నెరపడం వంటివి) భారత్‌తో కలిసి ఒక ఆసియా అక్షాన్ని తయారుచేసేందుకు చైనా ముందుకొస్తుందని నమ్మేవాడని గార్వర్ భావన.[2] ఇరు దేశాల మధ్యన ఉన్న అపార్థాలు, టిబెట్‌పై దౌత్య యుద్ధానికు దారితీసింది. నెహ్రూ దలైలామాకు ఆశ్రయం ఇవ్వడం, టిబెట్‌లోని సాయుధ తిరుగుబాటు టిబెట్‌కు ఆత్మహత్యా సదృశం వంటి అతడి అభిప్రాయాలను, అతడు చేపట్టిన ఇతర చర్యలనూ పూర్వపక్షం చేసింది.[2] టిబెట్‌పై భారత కున్న ఆందోళలనను చైనా విస్తరణవాదంగా భావించగా, భారత్‌లో కొంతమంది మాత్రం టిబెట్‌తో తమకున్న సంబంధాన్ని చారిత్రిక సాంస్కృతిక నేపథ్యంలోంచి చూసారు.[2]

1959 లో దలైలామా భారత్‌కు పారిపోయి వచ్చినపుడు ఆయనకు అక్కడ లభించిన స్వాగతం చైనా ప్రముఖ నాయకుడైన మావో జెడోంగ్‌ కు తలవంపులుగా అనిపించింది. చైనా మాధ్యామాల్లో టిబెట్‌కు సంబంధించిన పరస్పర భేదాభిప్రాయాలకు ప్రాధాన్యత లభించింది. టిబెట్‌లో పనిచేస్తున్న గుర్తు తెలియని భారత శక్తుల గురించి వ్యాఖ్యానాలు రాయమని ఏప్రిల్ 19 న మావో స్వయంగా జిన్‌హువా వార్తా సంస్థను ఆదేశించాడు. నెహ్రూ యొక్క టిబెట్ విధానంపై ఆయనను బహిరంగంగా విమర్శించాలని మావో ఏప్రిల్ 25 న నిర్ణయించాడు:

"చురుగ్గా ఉండండి. అతణ్ణి రెచ్చగొట్టడానికి భయపడకండి [నెహ్రూ], అతడికి ఇబ్బంది కలిగించడానికి భయపడకండి. టిబెట్‌లో తిరుగుబాటును అణిచే శక్తి చైనాకు లేదని నెహ్రూ తప్పుగా అంచనా వేసాడు. భారత్‌ను సహాయం కోసం అడుక్కుంటామని అనుకున్నాడు. -- పోలిట్‌బ్యూరో కమిటీలో మాట్లాడుతూ మావో జెడోంగ్ [2]

టిబెట్‌లో జరిగిన లాసా తిరుగుబాటు భారత్‌ చేయించిందని మావో ఉద్దేశించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1959 మే 6 న మావో "టిబెట్ విప్లవం, నెహ్రూ తాత్వికత"ను ప్రచురించాడు. అందులో టిబెట్ తిరుగుబాటుదార్లకు నెహ్రూ బహిరంగంగా మద్దతు ఇచ్చాడని ఆరోపించాడు. టిబెట్‌లో తమ పాలనకు భారత్ ప్రతిబంధకమని చైనా భావిస్తున్నట్లు ఆ ప్రచురణ ద్వారా నిరూపితమైంది. భారత చైనా యుద్ధానికి ఇది అంతర్లీనమైన కారణం. 'భారత్ సామ్రాజ్యవాది అయిన శత్రువు. చైనా తన భూభాగమైన టిబెట్‌లో తన సార్వభౌమాధికారాన్ని స్థాపించుకోవడాన్ని అడ్డుకుని, ఒక తటస్థ ప్రాంతాన్ని నెలకొల్పుకోవాలని నెహ్రూ, అతడి బూర్జువా చూస్తున్నారు.' అదే రోజున జౌ ఎన్‌లై నెహ్రూ యొక్క "వర్గ తత్వాన్ని" చీల్చి చెండాడాడు.

"నెహ్రూ, ఉన్నత వర్గాల ప్రజలూ టిబెట్‌లో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. సంస్కరణలు అసంభవం అనేంతగా వ్యతిరేకిస్తున్నారు...[వాళ్లకు] టిబెట్ ఎప్పటికీ వెనకబడే ఉండాలి. చైనా భారత్‌ల మధ్య తటస్థ దేశంగా పడి ఉండాలి. ఇది వాళ్ళ మనస్తత్వం. ఇదే భారత చైనాల ఘర్షణలకు కేంద్రం. -- జౌ ఎన్‌లై[2]

భారత్ టిబెట్ గురించిన చర్చలను కొనసాగించింది. భారత అధికారిక చరిత్ర ప్రకారం, చైనా పట్ల సుహృద్భావాన్ని ప్రకటిస్తూ, టిబెట్ పట్ల వైరభావంతో ఉన్నట్లుగా చైనా చెప్పడం మానుకోవాలని ఆశించింది.

1959 ఆగస్టులో చైనా లాంగ్‌జు వద్ద భారత గస్తీ సైనికుణ్ణి బందీగా పట్టుకుంది. ఈ ప్రాంతం మెక్‌మహాన్ రేఖకు ఉత్తరాన ఉంది. అయితే ఇది సరిగ్గా మెక్‌మహాన్ రేఖపై ఉందని భారత్ చెప్పింది. అక్టోబరులో అక్సాయ్ చిన్ లో కోంగ్‌కా కనుమ వద్ద మరో ఘర్షణ జరిగి, 9 మంది భారత సైనికులు హతమయ్యారు తాము యుద్ధానికి సిద్ధంగా లేనట్లు గ్రహించిన భారత సైన్యం, వివాదాస్పద ప్రాంతాల నుండి గస్తీని ఉపసంహరించుకుంది.[11]

అక్టోబరు 2 న మావోతో జరిగిన ఒక సమావేశంలో నికిటా కృశ్చేవ్ నెహ్రూను సమర్ధించాడు. సోవియట్ యూనియన్ నెహ్రూకు ఇచ్చిన మద్దతు, ఈ ప్రాంతంలో అమెరికా యొక్క ప్రభావమూ కలిసి తమను శత్రుబలగాలు చుట్టుముట్టి ఉన్నట్లుగా చైనా భావించింది. అక్టోబరు 16 న జనరల్ లీ యింగ్‌ఫు, థాగ్ లా రిడ్జ్‌ వద్ద భారత్ చొచ్చుకు రావడం గురించి నివేదిక పంపాడు. అక్టోబరు 18 న టిబెట్‌లో భారత చర్యలకు స్పందనగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తయారుచేసిన "స్వీయరక్షణాత్మక ఎదురుదాడి" ప్రణాళికను చైనా ప్రభుత్వం ఆమోదించింది.

అయితే, ఇందుకు ప్రతిచర్యగా భారత్ తమ దేశంలో అమెరికా వారి యు-2 గస్తీ విమానాలను నియోగిస్తుందని భయపడిన మావో, ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా నివారించాడు.[12] జిన్‌జియాంగ్ లోని లాప్ నార్ వద్ద ఉన్న తమ అణు పరీక్షా కేంద్రాన్ని ఫోటో తీసుకునే వీలు దీనివలన సిఐఏ కు కలుగుతుంది. కోంగ్‌కా సంఘటన తరువాత కొద్ది రోజులకు చైనా ప్రధాని జౌ ఎన్‌లై, ఇరుపక్షాలూ ఓ "వాస్తవాధీన రేఖ" నుండి 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలని ప్రతిపాదించాడు. ఈ రేఖ "తూర్పున ఉన్న మెక్‌మహాన్ రేఖ, పశ్చిమాన ఇరు పక్షాలూ నియంత్రిస్తూ ఉన్న రేఖ వరకూ" అని వాస్తవాధీన రేఖను ఆయన నిర్వచించాడు. వివాదాస్పద ప్రాంతాన్ని ఎవరికీ చెందని ప్రాంతంగా గుర్తించాలని దీనికి ప్రతిగా నెహ్రూ ప్రతిపాదించాడు.[13]

1990 ల నాటి చైనా అధ్యయనాలు కూడా భారత్ టిబెట్‌ను ఆక్రమించబోయిందనే చెబుతూంటాయి. చైనా పండితులు ఎక్కువ మంది, యుద్ధానికి కారణం టిబెట్‌ను ఆక్రమించి తన సంరక్షణలో ఉంచుకోవాలనే భారత్  ప్రణాళికేనని నమ్ముతారు. చైనా అధికారిక యుద్ధ చరిత్ర, నెహ్రూ "భారత మహా సామ్రాజ్యాన్ని" ఏర్పాటు చెయ్యాలని తలపెట్టాడని చెబుతుంది. టిబెట్‌ను నియంత్రణలో ఉంచుకోవాలంటూ మితవాద జాతీయవాదులు నెహ్రూను ప్రభావితం చేసారని కూడా చెప్పింది. చైనా రక్షణ శాఖకు చెందిన ఝావో వేవెన్ నెహ్రూ యొక్క "నిగూఢ మనస్తత్వాన్ని" నొక్కి చెప్పాడు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడంలో చైనా యొక్క టిబెట్ విధానం ఎంతో దోహదం చేసింది.భారత్‌ను ఒక పెట్టుబడిదారీ విస్తరణవాద దేశంగా భావించడం, అది టిబెట్‌ స్వాతంత్ర్యం కోసం పనిచేసి, భారత్ చైనాల మధ్య దాన్ని తటస్థ ప్రాంతంగా మార్చే ఆలోచన చేస్తోందని భావించడం మౌలికంగా దోషం. ప్రతికూల ప్రచారం, స్వయంగా జౌ ఎన్‌లై చెప్పినట్లు భారత చైనా ఘర్షణకు దారితీసింది. ఈ తప్పుడు భయాల వల్లనే 1960 ల నాటి భారత ఫార్వర్డ్ పాలసీని (భారత్ దీన్ని మౌలికమైన పొరపాటుగా అంగీకరించింది), టిబెట్‌లోకి భారత విస్తరణకు తొలి అడుగుగా భావించింది.

సరిహద్దు చర్చలు

[మార్చు]

1958 నాటి చైనా మ్యాపులు జమ్మూ కాశ్మీరుకు ఈశాన్యాన ఉన్న పెద్ద భూభాగాన్ని (అక్సాయ్ చిన్) తమదిగా చూపించాయి. 1960 లో జౌ ఎన్‌లై, భారత్ అక్సాయ్ చిన్‌పై తన వాదనను వదులుకోవాలని, బదులుగా చైనా నేఫా పై తన దావాను ఉపసంహరించుకుంటుందనీ ప్రతిపాదించాడు. జాన్ గార్వర్ ప్రకారం, జౌ ప్రతిపాదనలు అనధికారికమైనవి, మోసపూరితమైనవీను. భూభాగాలపై భారత్ యొక్క దావాల చట్టబద్ధతను గుర్తించేందుకు అతడు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నాడు; చర్చలేవైనా సరే, క్షేత్ర వాస్తవాలను దృష్టిలో ఉంచుకునే జరగాలని అతడు ప్రతిపాదించాడు.[14] నెహ్రూ అక్సాయ్ చిన్‌ను వదులుకునేలా చేయాలని జౌ అనేక మార్లు ప్రయత్నించాడు. 1960 లో అతడు నాలుగు సార్లు భారత్‌లో పర్యటించాడు. ఆయితే, ఈ రెండు ప్రాంతాలపై చైనాకు న్యాయమైన హక్కు లేదని నెహ్రూ నమ్మాడు. అందుచేత ఈ రెంటినీ వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. సిమ్లా ఒప్పందపు చట్టబద్ధతపై ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నందువలన వారు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. నెహ్రూ పట్టుదలను, టిబెట్‌పై చైనా పరిపాలనకు వ్యతిరేకంగా చైనాలో భావించారు -టిబెట్‌పై చైనా నియంత్రణకు వీలుగా అక్సాయ్ చిన్‌ గుండా అక్కడికి వెళ్ళే రహదారి చైనాకు అవసరం కాబట్టి.

నెవిల్ మాక్స్‌వెల్ ప్రకారం, నెహ్రూకు ఆ ప్రాంతాన్ని వదిలేసుకుని, చర్చలను ఆపేద్దామనే ఆలోచన లేదు. చర్చలకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. తమవిగా దావా చేస్తున్న ప్రాంతాల నుండి తమ బలగాలను ఉపసంహరించడానికి ఆయన ఒప్పుకోలేదు. నెహ్రూ"మేము చివరి దాకా చర్చలు చేస్తూనే చేస్తూనే చేస్తూనే ఉంటాం. ఆ స్థాయిలోనూ చర్చలను ఆపడాన్ని నేను వ్యతిరేకిస్తాను" అని చెప్పాడు. చైనా బలగాలు అక్సాయ్ చిన్ నుండి, మెక్‌మహాన్ రేఖకు దక్షిణం నుండి ఉపసంహరించుకుంటే తప్ప సరిహద్దు చర్చలు మొదలుపెట్టేది లేదని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. చైనీయులు దీన్ని ఆమోదించలేదు; వాళ్ళు మెక్‌మహాన్ రేఖ చట్టబద్ధతను ఎప్పుడూ గుర్తించలేదు. నెహ్రూ, "మేం మా సరిహద్దులపై ఎన్నటికీ రాజీ పడబోం. అయితే మేం వాటి విషయంలో చిన్న చిన్న మార్పు చేర్పులను పరిశీలించేందుకు, ఆ విషయమై అవతలి పక్షంతో చర్చించేందుకూ సిద్ధంగా ఉన్నాం." అని అన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చర్చలు జరపడానికి చైనా ముందుకు రావడంలేదనే నెహ్రూ వాదనకు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలిచింది. నెహ్రూ మాటలు సందిగ్ధంగా ఉన్నాయని మాక్స్‌వెల్‌ అన్నాడు.

భారత అధికారిక చరిత్ర ప్రకారం:

“మెక్‌మహాన్ రేఖకు దక్షిణాన ఉన్న తమది కాని భూభాగం తమదంటూ చైనా అనుచితంగా చేస్తున్న వాదనను వదులుకోవడం కోసం, చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్‌ను వదలుకోవడం నెహ్రూకు అంగీకారం కాలేదు.”[2]

చర్చల తరువాత, భారత్ చర్చలపై తన అధికారిక నివేదికలను విడుదల చేసింది. చైనా నివేదికను చైనీసు నుండి ఇంగ్లీషులోకి అనువదించింది. ఈ చర్య రెండు దేశాల మధ్య అవగాహనా భావనను పెంచుతుందని భారత్ భావించింది. చైనా దీన్ని భారత వాదనకు బలం చేకూర్చుకునేందుకు చేసే అనుచిత ప్రయత్నంగా చూసింది. అక్సాయ్ చిన్ నుండి తొలగిపోయి, తద్వారా రహదారిని విడిచిపెట్టాలనడాన్ని టిబెట్‌లో చైనా ఉనికిని బలహీనపరచే ప్రయత్నంగా భావించారు. జాన్ గార్వర్ ప్రకారం, నెహ్రూ తన "టిబెట్‌పై విస్తృత ప్రణాళిక"ను కొనసాగిస్తున్నాడని తప్పుగా భావించారు.

ఫార్వర్డ్ పాలసీ

[మార్చు]

1961 తొలినాళ్ళలో నెహ్రూ, జనరల్ బి.ఎమ్‌.కౌల్‌ను QMG (క్వార్టర్ మాస్టర్ జనరల్) గా నియమించాడు. కానీ అతడు సైన్యానికి చెందిన అన్ని నిర్ణయాలనూ ప్రభావితం చేసేవాడు.[15] కౌల్ జనరల్ స్టాఫ్‌ను పునర్వ్యవస్థీకరించాడు. వివాదాస్పద ప్రదేశాల్లో గస్తీ నిర్వహించడాన్ని వ్యతిరేకించిన అధికారులను తొలగించాడు. సైన్యంపై ఖర్చును పెంచేందుకు, అంటే యుద్ధానికి సిద్ధమవడం కోసం నెహ్రూ ఇంకా వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ ఆయన ఈ పని చేసాడు.[15] 1961 వేసవిలో చైనా మెక్‌మహాన్ రేఖ వెంబడి గస్తీ కాయడం మొదలుపెట్టింది. వాళ్ళు భారత పాలిత భూభాగాల్లోకి ప్రవేశించారు. అది భారతీయులకు కోపం తెప్పించింది. 1961 మే తరువాత చైనా బలగాలు దేహ్రా కంపాస్‌ను ఆక్రమించి, చిప్ చాప్ నదిపై ఒక స్థావరాన్ని స్థాపించాయి.[16][17] చైనీయులు మాత్రం తాము భారత భూభాగంలోకి చొరబడినట్లు అనుకోలేదు. దీనికి స్పందనగా, భారత సైనికులు చైనా బలగాల వెనుక స్థావరాలను నెలకొల్పి, వాళ్ళ సరఫరాలను ఆపేసి, వాళ్ళు వెనక్కి వెళ్ళేలా చెయ్యాలని అనుకున్నారు.[14] 1962 ఫిబ్రవరి 4 న భారత గృహమంత్రి దిల్లీలో ఇలా అన్నాడు:

"చైనీయులు ఆక్రమైంచిన స్థలాలను విడిచిపెట్టకపోతే, భారత్ గోవాను విలీనం చేసినట్లుగా మళ్ళీ చెయ్యక తప్పడు. చైనా బలగాలను తరిమెయ్యడం ఖాయం."[14]

దీన్ని "ఫార్వర్డ్ పాలసీ" అని వ్యవహరిస్తారు.[18][19][20] మొత్తమ్మీద 60 అలాంటి స్థావరాలు ఏర్పరచారు. వాటిలో 43 మెక్‌మహాన్ రేఖకు ఉత్తరాన ఏర్పాటయ్యాయి.

గత దౌత్యానుభవాల ననుసరించి చైనా బలప్రయోగానికి దిగదని కౌల్ విశ్వసించాడు. భారత అధికారిక చరిత్ర ప్రకారం, భారత స్థావరాలు, చైనా స్థావరాలు ఒక సన్నటి భూభాగానికి చెరోవైపునా ఉన్నాయి. చైనా ఆ భూభాగంలోకి క్రమంగా విస్తరిస్తూ ఉంది. ఈ భాగాలు ఎవరి నియంత్రణలోనూ లేవని నిరూపించేందుకు, భారత్ తన ఫార్వర్డ్ పాలసీతో స్పందించింది. భారత్ తాను చైనా భూభాగంలోకి చొరబడుతున్నాని అనుకోలేదు. బ్రిటిషు రచయిత నెవిల్ మ్యాక్స్‌వెల్, ఈ ఆత్మవిశ్వాసానికి మూలం, దిల్లీలోని సిఐఏ ప్రతినిధితో ఎప్పుడూ సంప్రదిస్తూ ఉన్న మల్లిక్ అని చెప్పాడు. అందుచేత మల్లిక్‌కు యు-2 విమానాల పట్ల మావో కున్న భయం గురించి తెలిసి ఉండవచ్చు.

భారత ఔట్‌పోస్టులు తమవైపు వస్తూన్నపుడు చైనీయుల తొలి స్పందన వెనక్కి వెళ్ళాలనే. అయితే, దీని వలన భారత దళాలకు ఉత్సాహం హెచ్చి తమ ఫార్వర్డ్ పాలసీని మరింత వేగవంతం చేసేటట్లు వారికి కనిపించింది. దీనికి స్పందనగా చైనా కేంద్ర సైనిక కమిషను "సాయుధ సహజీవనం" అనే విధానాన్ని అనుసరించింది. తమను చుట్టుముట్టిన భారత బలగాల ఔట్‌పోస్టుల చుట్టూ తమ ఔట్‌పోస్టులను స్థాపించాలనేది ఈ వ్యూహం. రెండు సైన్యాల ఈ చుట్టుముట్టు వ్యూహాల కారణంగా ఒక దాని చుట్టూ మరొక సైనిక వరుసతో ఒక చదరంగపు బల్ల లాంటి ఆకృతి ఏర్పడింది. ఇలా ఒక బలగం చుట్టూ మరొక బలగం చుట్టుముట్టి ఉన్నప్పటికీ కాల్పులేమీ జరగలేదు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాలన్న రెండు సైన్యాధికారుల ఆదేశాలే ఇందుకు కారణం. ఈ పరిస్థితిపై మావో జెడోంగ్ ఇలా వ్యాఖ్యానించాడు,

నెహ్రూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ మనం వెళ్లనివ్వం. నిజానికి మనం దీన్ని ఎదుర్కొందామని అనుకున్నాం. కానీ మనం దీన్ని ఆపలేమనిపిస్తోంది. అతడు ముందుకు పోదలిస్తే మనం కూడా సాయుధ సహజీవనం సాగిద్దాం. నువ్వు తుపాకీ చూపిస్తే నేనూ తుపాకి చూపిస్తా. మనం ముఖాముఖీ నిలబడదాం, ఎవరి ధైర్యమెంతో తేల్చుకుందాం.[2]

ఇతర పరిణామాలు

[మార్చు]

1962 లో బీజింగ్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో, చైనా అధ్యక్షుడు లియు షావోగి దేశంలో విస్తరించిన కరువు కటకాలకు గ్రేట్ లీప్ ఫార్వర్డ్ విధానం కారణమని విమర్శించాడు.[12] మెజారిటీ ప్రతినిధులు ఈ వాదనతో ఏకీభవించారు. కానీ రక్షణ మంత్రి లిన్ బియావో మావోను గట్టిగా సమర్ధించాడు.[12] కొన్నాళ్ళ ఉదార విధానం తరువాత మళ్ళీ మావో, లిన్ బియావోలు వెలుగులోకి వచ్చే ప్రయత్నాలు చేసారు.[12] మే, జూన్‌లలో సరిహద్దు తగాదాల తరువాత చైనా యుద్ధానికి సిద్ధపడిందనీ, కానీ తైవాన్ నుండి జాతీయవాదుల నుండి ఎదురైన ముప్పు కారణంగా తమ బలగాలను అటు మళ్ళించాల్సి వచ్చిందనీ జంగ్ చాంగ్ రాసాడు.[12]

పూర్తిస్థాయి పోరుకు భారత్ సిద్ధంగా లేదు. అప్పుడే గోవాను విలీనం చేసుకుంది. కాశ్మీరులో పాకిస్తానుతో సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటోంది. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు భారత జాతీయ కాంగ్రెసు అహింసాయుత పరిష్కారాన్ని ప్రతిపాదించింది. పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధం కావాలని ప్రతిపాదించిన సైనికాధికారులను పట్టించుకోలేదు. లేదా వారిని తొలగించారు. 

తొలి ఘటనలు

[మార్చు]

1962 వేసవిలోను, శరత్తులోనూ అనేక సరిహద్దు తగాదాలు, సైనిక ఘర్షణలూ రెండు దేశాల మధ్య జరిగాయి. చైనా వర్గాల కథనం ప్రకారం, 1962 జూన్‌లో రెండు బలగాల మధ్య జరిగిన చిన్న ఘర్షణలో డజన్లకొద్దీ చైనా సైనికులు మరణించడంగానీ, గాయపడడంగానీ జరిగింది. 1962 సెప్టెంబరు నెలంతా ఇరు దేశాల సైనిక శిబిరాలూ పరస్పరం సంపర్కంలో ఉన్నాయి. అయినా, కాల్పులు జరుగుతూనే ఉండేవి.

1962 మే 2 న డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, నేఫా, లదాఖ్‌లలో వినియోగించేందుకు గాను భారతీయ వాయుసేనను సిద్ధం చెయ్యాలని సూచించింది.[21] భారత చైనా సైనిక సంఖ్యలో ఉన్న అసమతుల్యతను వాయుసేన ద్వారా సరిచేయవచ్చని భావించారు. చైనా వాయుసేన పరిమితమైన దాడులు చెయ్యగలిగే సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. ఆ దాడులను భారత వాయుసేన అడ్డుకోగలదు అని భావించారు. కొద్ది రోజుల్లోనే నేఫా సరిహద్దుపై వాయుసేన గస్తీ మొదలుపెట్టింది. 1962 మే 7 న చైనా సైనికులు గస్తీ కాస్తున్న భారతీయ డకోటా విమానాన్ని కూల్చివేసారు. బి.పి.తివారీ అనే పైలట్ అందులో మరణించాడు. ఈ సంఘటన తరువాత అతి దగ్గరగా ఎగరవద్దని వాయుసేనను ఆదేశించారు.

1962 జూన్‌లో సరిహద్దు వెంబడి చైనా సైన్యాన్ని సమీకరిస్తోందనీ, ఇది యుద్ధానికి దారితీయవచ్చనీ వర్తమాన మొచ్చినట్లు భారత్ ఇంటిలిజెన్స్ బ్యూరో తెలిపింది. పశ్చిమాన పాకిస్తాన్ కూడా అదే సమయంలో దాడి చేయవచ్చని కూడా సమాచారం అందింది. టిబెట్, యున్నాన్‌లలో ఉన్న చైనా ఎయిర్‌ఫీల్డుల నుండి చైనా వాయుసేన తమ సోవియట్ యుద్ధ విమానాల ద్వారా భారత నగరాలపై దాడి చేయవచ్చు కాబట్టి, అవి తమ భద్రతకు భంగమని భారత్ భావించింది.

గాల్వన్ లోయలో భారత్ చొరబడిందని అంటూ, అందుకు గాను దౌత్య వర్గాల ద్వారా చైనా జూలై 8 న నిరసన తెలియజేసింది. 2000 చదరపు మైళ్ళ చైనా భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టు భారత్ పత్రికా ప్రకటనలు విడుదల చేసిందని ఒక చైనా పత్రిక రాసింది. అయితే, భారత్ అటువంటి సంఘటన ఏదీ జరగలేదని తెలిపింది.[22]

1962 జూలై 10 న 350 మంది చైనా సైనికులు మెక్‌మహాన్ రేఖకు ఉత్తరాన ఉన్న గాల్వన్ లోయలోని భారత స్థావరాన్ని చుట్టుముట్టారు.[23] అక్కడ గూర్ఖా దళాలను మైకుల ద్వారా సంబోధించారు. గూర్ఖాలను, వాళ్ళు భారత్ తరపున పోరాడకూడదని, స్థావరాన్ని వదలిపెట్టిపోవాలనీ నచ్చజెప్పబోయారు. తీవ్ర వాదోపవాదాల తరువాత చైనా సైనికులు ఆ ప్రాంతాన్ని వీడివెళ్ళారు.

భారత అధికారిక చరిత్ర ప్రకారం,1962 జూలై 22 న ఫార్వర్డ్ పాలసీలో మార్పు వచ్చింది. తొలుత, ఖాళీ స్థలాల్లోకి చైనీయులు రాకుండా ముందే అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఫార్వర్డ్ పాలసీ లక్ష్యం కాగా, ఇప్పుడు "చైనీయులు ఈసరికే ఆక్రమించి ఉన్న స్థావరాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు."[4] గతంలో భారత దళాలకు ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాలని ఆదేశాలుండగా, బెదిరింపులు ఎదురైతే కాల్పులు జరపమని ఇపుడు స్థావర అధికారులకు ఆదేశాలిచ్చారు.

1962 అగస్టులో మెక్‌మహాన్ రేఖ వెంబడి, మరీ ముఖ్యంగా నేఫా, టిబెట్, జిన్‌జియాంగ్ లలో చైనా సైన్యం తమ యుద్ధ సన్నద్ధతను మెరుగుపరచుకుంది. టిబెట్‌లో ఆయుధాల డంపుల నిర్మాణం, ఆయుధాలు, ఇంధనాల సమీకరణ జరిగింది. బలగాల సమీకరణ జరిగినట్లుగా అనిపించలేదు. భారత సన్నద్ధత చైనాకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. 1950 ల్లో భారత్ తన సైన్యాన్ని విస్మరించింది. హిమాలయాలు చైనాకు వ్యతిరేకంగా బలమైన రక్షణ అని నెహ్రూ భావించాడు. అయితే, కొరియా యుద్ధంలో చైనాకు పర్వత ప్రాంత యుద్ధంలో బాగా అనుభవమొచ్చింది. భారత్ యొక్క ఈ విస్మరణ ఈ యుద్ధంలో కేవలం సరఫరాలు సరిగ్గా అందక, నాయకత్వ లోపం కారణంగా అనేక మార్లు ఓటమికి దారితీసింది.

థాగ్ లా వద్ద ఘర్షణ

[మార్చు]

1962 జూన్‌లో నమ్‌ఖా చు లోయలోని ధోలాలో భారత దళాలు ఒక ఔట్‌పోస్టును స్థాపించాయి. ఇది థాగ్ లాకు దక్షిణ వాలులో టిబెట్‌లోని లే గ్రామానికి కనుచూపుమేరలో ఉంటుంది. 1914 నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం మెక్‌మహాన్ రేఖ 27°45’40’’ ఉ అక్షాంశం వద్ద ఉంటుంది. అయితే, ధోలా పోస్టు మెక్‌మహాన్‌కు 6 కి.మీ. ఉత్తరాన ఉంది.[24] భారత్, మెక్‌మహాన్ రేఖ ఉద్దేశం, సరిహద్దును శిఖరాల మీదుగా గీయాలనీ ఈ ప్రాంతంలోని సరిహద్దు, మెక్‌మహాన్ రేఖకు ఉత్తరాన 4.8 నుండి 6.4 కి.మీ. దూరంలో థాగ్ లా లోని శిఖరాల మీద ఉంటుందనీ వాదించింది. భారత్ వాదన గురించి తరువాతి కాలంలో బ్రిగేడియర్ జాన్ దాల్వీ ఇలా రాసాడు: "థాగ్ లా వద్ద రేఖ స్థానం గురించి చైనీయులు వివాదం లేవదీసారు. అందుచేత థాగ్ లా-ధోలా మనదే అని భావించాల్సిన ప్రాంతం కాదు అని నెహ్రూ అన్నాడు. నెహ్రూ చెప్పిన ఈ హద్దులను ఎవరో అతిక్రమించారు."

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Alastair I. Johnston; Robert S. Ross (2006). New directions in the study of China's foreign policy. Stanford University Press. pp. 86–130. ISBN 978-0-8047-5363-0.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Garver, John W. "China's Decision for War with India in 1962" (PDF). Archived from the original (PDF) on 26 మార్చి 2009. Retrieved 9 ఆగస్టు 2017.
  3. Mohan Guruswamy, Mohan, "The Great India-China Game", Rediff, June 23, 2003.
  4. 4.0 4.1 4.2 4.3 History of the Conflict with China, 1962.
  5. VK Singh resolving the boundary dispute
  6. Maxwell, Neville (September 9, 2006). "Settlements and Disputes: China's Approach to Territorial Issues" (PDF). Economic and Political Weekly. 41 (36): 3876. Archived from the original (PDF) on 2006-10-01. Retrieved 2006-09-29.
  7. Untouchable's Warning Archived 2013-08-27 at the Wayback Machine, టైమ్ (పత్రిక), September 06, 1954
  8. A.G. Noorani, "Fact of History" Archived 2007-10-13 at the Wayback Machine, India's National Magazine, September 30, 2003.
  9. A.G. Noorani, "Perseverance in peace process" Archived 2005-03-26 at the Wayback Machine, India's National Magazine, August 29, 2003.
  10. Kenneth Conboy and James Morrison, "The CIA's Secret War in Tibet", University Press of Kansas, 2002, pp. 96-97
  11. Vivek Ahuja. "Unforgiveable Mistakes, The Kongka-La Incident, 21st October 1959" (PDF). Archived from the original (PDF) on 2011-09-30. Retrieved 2010-11-17.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 Chang, Jung and Jon Halliday, Mao: The Unknown Story (2006), pp. 568, 579.
  13. "The Shade of the Big Banyan" Archived 2007-10-13 at the Wayback Machine Time, Dec. 14, 1959.
  14. 14.0 14.1 14.2 Calvin, James Barnard (April 1984). "The China-India Border War". Marine Corps Command and Staff College. Retrieved 2011-10-15.
  15. 15.0 15.1 Maxwell, Neville (April 2001). "Henderson Brooks Report: An Introduction". stratmag.com. Archived from the original on 2006-12-09. Retrieved 2006-08-18.
  16. Smith, Chris (1994). India's Ad Hoc Arsenal. Oxford University Press. p. 75.
  17. Kavic, Lorne J. (1967). India's Quest for Security. University of California Press. p. 169.
  18. India's Forward Policy, Review author[s]: A. G. Noorani, The China Quarterly © 1970 School of Oriental and African Studies
  19. Gregory Clark, "Remembering a War - The 1962 India-China Conflict", Rediff, [1] Archived 2016-08-20 at the Wayback Machine [2]
  20. "Hindustan Times". Archived from the original on 2007-09-27. Retrieved 2017-08-09.
  21. CIA Journals[permanent dead link] 1962 India-China War and Kargil 1999: Restrictions on Air Power by R. Sukumaran
  22. SOAS (1962). "Quarterly Chronicle and Documentation". The China Quarterly. 12 (Oct. - Dec., 1962) (12). London, England: Cambridge University Press on behalf of the School of Oriental and African Studies: 252–258. ISSN 0305-7410. JSTOR 651833.
  23. "Battle of Chushul". Archived from the original on 2001-02-09. Retrieved 2017-08-09.
  24. "Line of Defense", by Manoj Joshi, Times of India, October 21, 2000