మావో జెడాంగ్

వికీపీడియా నుండి

毛泽东
మావో జెడాంగ్
మావో జెడాంగ్

In office
1945 – 1976
Preceded by చెన్ దుక్షూ
Succeeded by హువా గ్వోఫెంగ్

In office
1954 – 1959
Preceded by లేరు
Succeeded by లియూ షావోకీ

జననం డిసెంబర్ 26 1893(1893-12-26)
China Qing Dynasty Flag 1889.svg హునాన్, క్వింగ్ వంశం
మరణం సెప్టెంబర్ 9 1976 (వయసు: 82)
Flag of the People's Republic of China.svg బీజింగ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
జాతీయత చైనీయుడు
రాజకీయ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ
భార్య/భర్త యాంగ్ కాయ్‌హూయ్ (1920–1930)
హెజిజేన్ (1930–1937)
జియాంగ్ క్వింగ్ (1939–1976)

మావో జెడాంగ్ (Mao Zedong) (జననం: డిసెంబర్ 26,1893-మరణం: సెప్టెంబర్ 9,1976) ను మావో సే టుంగ్ (Mao Tse-tung) అని కూడా పలుకుతుంటారు. 1949 లో చైనా లో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)స్థాపనకు మూలమైన సుధీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి 1976 లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యావసాయిక, మేధోపరమైన మరియు సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు.

కమ్యూనిష్టులు చైనా లో అధికారంలోకి వచ్చిన తరువాత మావో ప్రపంచమంతటా సుపరిచితుడు అయ్యాడు. చైనా లో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను మరియు ఆయన రచనలను అధ్యయనం చేసారు. గెరిల్లా యుద్ధం మరియు సామ్యవాద విప్లవాలలో రైతాంగం యొక్క పాత్ర మొదలైన అంశాల గురించి ఆయన రచనలు చైనా వెలుపల చాలా ప్రభావం చూపాయి. మావో ఒక కవి కూడా.

విషయ సూచిక

[మార్చు] బాల్యం మరియూ చదువు

మావో చైనాలో హూనాన్ రాష్ట్రంలోని షావోషాన్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబం లో జన్మించాడు. చైనాలో క్వింగ్ వంశస్థుల మంచూ సామ్రాజ్యం 1911-12 విప్లవంలో కూలిపోయి చైనా ఒక రిపబ్లిక్ గా అవతరించిన సమయంలో మావో ఇంకా విద్యార్థి దశ లోనే ఉన్నాడు. మావో కొద్దికాలం పాటు ఈ పోరాటంలో పాల్గొన్నాడు. 1918లో మావో పెకింగ్(నేటి బీజింగ్)లోని నేషనల్ యూనివర్శిటీలో లైబ్రరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నపుడు సామ్యవాద సిద్దాంతాల వైపు ఆకర్షింపబడ్డాడు. 1921 లో మావో మరో 11మంది తో కలసి షాంఘై లో చైనీస్ కమ్యూనిష్టు పార్టీని(CCP) స్థాపించాడు.

[మార్చు] యుద్ధం మరియూ తిరుగుబాటు

చైనా ఆ రోజులలో అనేక మంది ప్యూడల్ యుద్ద ప్రభువుల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేది. వీరందరినీ తుదముట్టించి చైనాను ఏకీకృతం చేయుటకు కమ్యూనిష్టులు మొదట సన్ యెట్ సెన్ నాయకత్వంలోని కొమింటాంగ్ అనబడే ఒక జాతీయ పార్టీతో కలసి కృషి చేశారు. కానీ 1925లో సన్ యెట్ సెన్ మరణించిన తరువాత కొమింటాంగ్ పార్టీకి చియాంగ్ కైషెక్ నాయకుడయ్యాడు. ఇతనితో కమ్యూనిష్టులకు సయోధ్య కుదరలేదు. వీరి మధ్య ఘర్షణ త్వరలోనే యుధ్దంగా మారింది. దీనితో మావో మరి కొంతమంది కమ్యూనిష్టు నాయకులతో కలసి తమ సైన్యాన్ని 1928 లో జియాంగ్జి రాష్టానికి తరలించాడు. 1931 నుండి చియాంగ్ ఈ సైన్యం మీద అనేకసార్లు దాడులు చేసి కమ్యూనిష్టులను తీవ్రంగా నష్టపరిచాడు. దానితో 1934 లో మావో కమ్యూనిష్టు సైన్యాన్ని షాంగ్జీ (షెన్సీ) రాష్ట్రానికి తరలించాడు. ఈ తరలింపు చరిత్రలో లాంగ్ మార్చ్ గా ప్రసిద్ది చెందినది. ఇది ఒక సంవత్సర కాలం పైగా పట్టిన 9,700 కిలో మీటర్ల సుధీర్ఘమైన నడక. మార్గమధ్యంలో అనేక మంది చనిపోయారు.

1931 లో జపాన్ చైనా లోని మంచూరియా ప్రాంతం మీద దండెత్తినది. 1937లో జపాన్ పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. కమ్యూనిష్టులు కొమింటాంగ్ పార్టీ జాతీయ సైన్యంతో మరలా కలసి జపాన్‌ను ఎదుర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొమింటాంగ్ సైన్యాలు దేశం లోపలి ప్రాంతాలకు తరిమి వేయబడటంతో మావో తన గెరిల్లా యుద్ధ తంత్రంతో 1945 కల్లా చైనా లోని అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. 1946 లో మంచూరియా ప్రాంతంలో కమ్యూనిష్టులకు జాతీయ సైన్యానికి యుద్ధం ప్రారంభమైనది. 1949 అక్టోబర్ కల్లా కమ్యూనిష్టులు చైనాను పూర్తిగా ఆక్రమించుకుని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను స్థాపించారు. కొమింటాంగ్ పార్టీ తైవాన్ వరకే తన అధికారాన్ని పరిమితం చేసుకున్నది.

అధికారంలోకి రాగానే మావో సోవియట్ యూనియన్ తో స్నేహం చేసి వారి సహాయంతో చైనా సైన్యాన్ని బలోపేతం చేసాడు. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్దం లో సామ్యవాద దేశమైన ఉత్తర కొరియా కు మావో సహాయం చేసాడు.

కొరియా యుద్దం తరువాత వ్యావసాయిక మరియు పారిశ్రామిక ఉత్పాదకతను పెంచటానికి మావో చర్యలు తీసుకున్నాడు. 1958 లో గొప్ప ముందడుగు (Great Leap Forward) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సోవియట్ యూనియన్ ను అనుసరించకుండా చైనా తనదైన పంథాలో నడవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం విజయ వంతం కాలేదు. 1960 వ దశకంలో సోవియట్ యూనియన్ చైనాల మధ్యన విభేదాలు పొడసూపాయి.

అణు పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించి 1960 వ దశకంలో మావో నాయకత్వంలో చైనా అణుపరీక్షలు జరిపినది.1959 లో మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క చైర్మన్ పదవి నుండి తప్పుకున్నాడు. కానీ దేశం మీద మరియు పార్టీ మీద నియంత్రణను మాత్రం వదులుకోలేదు. 1960వ దశకంలో చైనా,సోవియట్ విభేదాలు ముదిరి కమ్యూనిష్టు ప్రపంచ నాయకత్వం కొరకు పరస్పరం సంఘర్షించుకున్నారు. మార్క్స్, లెనిన్ మరియు స్టాలిన్ ల అసలైన వారసుడు తానేనని మావో భావించాడు. సోవియట్ కమ్యూనిష్టులు అమెరికా యెడల అనుసరిస్తున్న మెతక వైఖిరి మావోకు నచ్చలేదు.

[మార్చు] సాంస్కృతిక విప్లవం

1960వ దశకం మధ్యలో చైనా దౌత్యపరమైన అనేక అపజయాలను చవిచూసింది. మావో ఈ సమయంలోనే విప్లవ స్పూర్తిని నిలిపి ఉంచుటకొరకు సంస్కరణ వాదులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవానికి(1966-69)పిలుపునిచ్చాడు. పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సంస్కృతి మరియు పాత ఆలోచనా విధానాన్ని తుదముట్టించుట ఈ విప్లవ లక్ష్యంగా చెప్పబడింది.

1970 వ దశకం ప్రారంభంలో చైనా పశ్చిమ దేశాలతో తన సంబంధాలను మెరుగు పరచుకున్నది. మావో 1976 సెప్టెంబర్‌లో మరణించాడు.

మావో మరణం తరువాత చైనా నాయకులు అతని విధానాలను చాలావరకు వదులుకున్నారు. చైనా పరిశ్రమలను, వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞాన్ని మరియు సైన్యాన్ని ఆధునీకరించుటకు జపాన్, అమెరికా మరియు యూరప్ దేశాల సహాయాన్ని అర్థించారు.

[మార్చు] మూలాలు


పేజీకి సంభందించిన లింకులు