ఎ.ఆర్.కృష్ణ

వికీపీడియా నుండి
(అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి (ఎ.ఆర్.కృష్ణ) (నవంబర్ 13, 1926 - నవంబర్ 10, 1992) ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1] 1954లో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘంను స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు.[2] ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఎ.ఆర్.కృష్ణ, 1926 నవంబర్ 13న గుంటూరు జిల్లా పెరవలి గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం శ్రీకాకుళం, బెజవాడ, చల్లపల్లి, మచిలీపట్నం హైదరాబాదు లలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే హైదరాబాదు విమోచనోద్యమంలో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి సోషలిస్ట్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

1948నాటికి రాజకీయరంగం మీద వ్యామోహం విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. యునెస్కో ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా కమలాదేవి ఛటోపాధ్యాయ భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో ఇండియన్ నేషనల్ థియేటర్ నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు.[3]

1954 అక్టోబరు 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘంలో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1957లో కుందుర్తి ఆంజనేయులు రాసిన వచన కవిత్వ నాటకం "ఆశ" ప్రదర్శించాడు. 1959లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పదవీ బాధ్యతలు చేపట్టాడు. అబ్బూరి రామకృష్ణారావు పరిచయం, సహచర్యం కృష్ణకు ఎంతగానో ఉపకరించాయి. "రంగస్థల శాస్త్రం" అనే మహోన్నత గ్రంథాన్ని వెలువరించాడు. కృష్ణ ఆధ్వర్యంలో నాట్యసంఘం అపూర్వమైన సేవలు చేసింది. పరభాషలలో పేరొందిన నాటకాలను అనువదింపచేసి ప్రదర్శించేవాడు. నాటకాలను జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రదర్శించి అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటకాన్ని ఢిల్లీ ఉత్సవాలలో ప్రవేశం కల్పించేవాడు. నాటకరంగానికి సంబంధించిన వివిధ అంశాలలో కళాకారులకు శిక్షణ ఇప్పించేవాడు. నాట్యసంఘం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు నిర్వహించేది. చర్చలు, గోష్టులు నిర్వహించేది. రాష్ట్రేతర ప్రాంతాలనుండి ప్రముఖ నాటకసమాజాలను ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించేది. నాట్యసంఘం 15వ వార్షికోత్సవాన్ని 33 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిపించాడు. నాటకాలమీద వినోదపు పన్ను రద్దు చేయించాడు. ఈర్ష్య, అసూయల కారణంగా నాట్యసంఘం 1973లో పతమనమయ్యింది.

1974లో కృష్ణ పట్టుదలతో ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లిని, వందమంది కళాకారులు, సహజమైన సెట్టింగులతో నాటకంగా రూపుదిద్ది, ఒకే వేదికపై వరుసగా ముప్పదిసార్లు, భారతదేశమంతటా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తెలుగువారి జానపద కళా స్వరూపమైన తోలుబొమ్మలాటను పునరుద్ధరించి ఆ కళా ఔన్నత్యాన్ని విదేశాలలో చాటాడు. నాట్యకళపట్ల ప్రేక్షకులలో అభిమానం పెంచడానికి, వారి ఆదరణ, పోషణ కల్పించడానికి "నాట్యమిత్ర పధకం" ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్పించాడు. వృత్తికళాకారుల సంక్షేమానికి 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించాడు. ఔత్సాహిక కళాకారుల శ్రేయస్సుకై వారి సంఘమూ ఏర్పాటుచేయించాడు. యక్షగానానికి రంగస్థలముపై ప్రాణప్రతిష్ఠ చేసాడు.[4]

తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

మరణం

[మార్చు]

కృష్ణ 1992 నవంబర్ 10 వ తేదీ మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.262.
  2. "Telugu Theatre: Politics Of Representation" (PDF). Archived from the original (PDF) on 2010-10-09. Retrieved 2010-06-23.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-01. Retrieved 2010-07-03.
  4. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట.147