అన్నాప్రగడ కామేశ్వరరావు
అన్నాప్రగడ కామేశ్వరరావు | |
---|---|
కామేశ్వరరావు | |
జననం | 1902 అక్టోబరు 21 |
మరణం | 1987 జనవరి 30 |
స్మారక చిహ్నం | స్వాతంత్ర్య సమరయోధుడు |
పౌరసత్వం | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత విప్లవాత్మక భావాలు గల వ్యక్తి |
జీవిత భాగస్వామి | సరళాదేవి |
తల్లిదండ్రులు | రోశయ్య, లక్ష్మీదేవి |
అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. గుంటూరు పన్నుల సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. చిన్నతనంలోనే బ్రిటీష్ సైన్యంలోచేరాడు. అతని జీవింతంలో 18 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపాడు. తెనాలి శాసనసభ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై, గుంటూరు జిల్లా మొదటి శాసనసభ సభ్యుల బృందంలో సభ్యుడయ్యాడు.[1][2][3]
ప్రారంభ జీవితం
[మార్చు]అన్నాప్రగడ గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం, కనుపర్రు గ్రామంలో 1902 అక్టోబరు 21న రోశయ్య, లక్ష్మీదేవి దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. అతని వయస్సును ఎక్కువ చూపించి 15 ఏళ్ల వయసులో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు. సైన్యపు విధులలో భాగంగా 1917లో మెసపుటేమియాలోని బానరలో ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు వెళ్లాడు. అక్కడ ‘బద్దు’ జాతి తిరుగుబాటుదారుల ఉపదేశంతో దేశభక్తిలో ప్రభావితుడయ్యాడు. దాని ఫలితంగా సైన్యంలో ఉంటూనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అతని చర్యలు నచ్చక అతనిని ఖైదు చేశారు. విడుదలయ్యాక 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అక్కడా జైలుపాలై 1922లో విడుదలై గుంటూరు వచ్చాడు.[3]
జీవితగమనం
[మార్చు]నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టాడు.1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు తొలిసారిగా నరసరావుపేటలో నిర్బందించారు. కోర్టు అతనికి ఏడాది జైలుశిక్ష విధించింది. రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా వేలాది ప్రజలు అడ్డుకున్నారు. ‘నా బిడ్డతోపాటు స్వాతంత్య్రం కోసం నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను’ అని అన్నాప్రగడ తల్లి లక్ష్మీదేవి చేసిన ఉపన్యాసం ప్రజల్ని ఉత్తేజపరచింది. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు.1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, పాఠశాలను మూసివేయించింది.క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు.1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసనసభ్యుడు.[3]
విప్లవయోధులతో స్నేహం, వివాహం
[మార్చు]రాజమండ్రి జైల్లో గదర్ పార్టీ నాయకులు పండిత్ జగం రామ్, గణేష్ రఘరామ్, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్ సభలకు వెళ్లాడు. 1924లో సావర్కరు, అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్ చేరాడు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర్ దత్, సురేంద్రనాథ్ పాండే, రాజగురుతో స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నాడు.[3]
భగత్‌సింగ్‌ను జైలునుంచి తప్పించాలని
[మార్చు]కొంతకాలం మాచర్ల వద్ద గల ఎత్తిపోతల జలపాతం వద్ద అన్నాప్రగడ రహస్య జీవితం గడిపాడు. భగత్‌సింగ్‌ను జైలు నుంచి తప్పించి విదేశాలకు పంపించాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ఎ.కె.రావు పేరుతో 1931 సెప్టెంబరు 22న నకిలీ పాస్‌పోర్టు సంపాదించినా ఆ ప్రతిపాదనను భగత్‌సింగ్‌ను తిరస్కరించాడు. 1931 మార్చి 23న భగత్‌సింగ్ బృందాన్ని ఉరితీశారు.అన్నాప్రగడ తన భార్యాపిల్లలను అదే నకిలీ పాస్‌పోర్టుతో దక్షిణాఫ్రికా తీసుకెళ్లి బంధువుల ఇంట్లో వదిలేశాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఆర్మీ గెరిల్లా యుద్ధరీతిలో శిక్షణ పొందాడు.[3]
చివరిదశ
[మార్చు]రాజకీయాలపై ఏవగింపు కలిగిన అన్నాప్రగడ 1956లో పూనేలో స్థిరపడ్డాడు.అన్నాప్రగడ 1987 జనవరి 30న తుదిశ్వాస విడిచారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113
- ↑ "విప్లవోద్యమ అగ్నికెరటం !". Sakshi. 2019-04-02. Retrieved 2021-09-25.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Annapragada Kameswara Rao Is Great Freedom Fighter Is First MLA From Tenali - Sakshi". web.archive.org. 2021-09-25. Archived from the original on 2021-09-25. Retrieved 2021-09-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
వెలుపలి లంకెలు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- 1902 జననాలు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- గుంటూరు జిల్లా వ్యక్తులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులు
- విప్లవోద్యమ నాయకులు
- స్వాతంత్ర్య సమర యోధులు
- గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- 1987 మరణాలు