అన్నా హజారే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నా హజారె
Anna Hazare on 2nd Oct.JPG
అన్నా హజారె
జననం
కిషన్ బాబూరావ్ హజారే

(1937-06-15) 1937 జూన్ 15 (వయస్సు 83)
భింగార్, బొంబాయి ప్రాంతం, బ్రిటిష్ భారతదేశం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడుజలవనరుల అభివృద్ధి కార్యక్రమం
సమాచార హక్కు పోరాటం
అవినీతి వ్యతిరేక పోరాటం
జీవిత భాగస్వాములుఅవివాహితుడు
తల్లిదండ్రులులక్ష్మీబాయి హజారె (తల్లి)
బాబూరావు హజారె (తండ్రి)
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (1990)
పద్మభూషణ్ పురస్కారం (1992)
వెబ్‌సైటుwww.annahazare.org

అన్నా హజారే (జూన్ 15,1937) గా సుప్రసిద్ధుడయిన కిషన్ బాబూరావ్ హజారే, ప్రముఖ సామాజిక కార్యకర్త. మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. దీనిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ అవార్డు తోనూ, 1992 లో పద్మ భూషణ్ అవార్డుతోను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. 5 ఏప్రిల్ 2011 న జనలోక్ పాల్ చట్టాన్ని పోలినట్లు లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతు లభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించిన తరువాత నిరాహారదీక్ష విరమించాడు. ప్రభుత్వం ఒక పౌరసమాజం ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్త సంఘాన్ని ఏర్పాటుచేసింది.[1][2] 2011 సంవత్సరానికి విదేశవిధానాల పత్రిక ప్రపంచంలో 100 మేధావులో ఒకరిగా ఆయనను నిర్ణయించింది.[3] అదే సంవత్సరంలో ముంబైలో అత్యంత ప్రభావశీలిగా డిఎన్ఎ పత్రిక గుర్తించింది.[4] అతని న్యాయ నిర్ణయంలో నియంతృత్వ ధోరణులు (ఉదా అవినీతి ఉద్యోగస్తులను ఉరితీయాలనడం, కుటుంబ సంక్షేమానికి బలవంతపు గర్భనిరోధక ఆపరేషన్ల అమలుపరచాలనటం) విమర్శలకు లోనయ్యాయి.[5][6]

బాల్య జీవితం, నేపథ్యం[మార్చు]

అన్నా హజారే ఒక నిరుపేద మరాఠీ యాదవ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి బాబూరావ్ హజారే ఒక సాధారణ కార్మికుడు, ఆయన తాత సైన్యంలో పనిచేశాడు. ఇతడి తాత ఉద్యోగ రీత్యా భింగర్ ప్రాంతానికి మార్చబడ్డాడు. దీనితో బాబూరావు, కుటుంబం భింగర్‌కు వెళ్లిపోయింది, ఇక్కడే అన్నా పుట్టాడు. అన్నా తాత 1945 లో చనిపోయాడు కాని కుటుంబం మాత్రం భింగర్‌లోనే 1952వరకు ఉండిపోయింది. తర్వాత అన్నా తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాలేగావ్ సిద్ధికి వెళ్లిపోయాడు. అన్నా నాలుగో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. ఆయనకు ఆరుగురు సోదరులు ఉండేవారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. బాబూరావ్ చెల్లెలికి పిల్లలు లేరు, ఈమె అన్నా సంరక్షణ బాధ్యత చేపట్టి ఆయనను ముంబై తీసుకుపోయింది.

అన్నా తండ్రి సమస్యలు పెరిగిపోవడంతో తన వ్యవసాయ భూమిని విక్రయించాడు. దీంతో కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబై లోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు. ఇతడు క్రమంగా తన స్వంత పూల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు ఆయన వ్యాపారంలో పాలు పంచుకోవడానికి ముంబై వచ్చారు. దీంతో కుటుంబ ఆదాయం నెలకు 700-800 రూపాయల వరకు పెరిగింది.

వృత్తి[మార్చు]

సైనిక జీవితం[మార్చు]

కొద్ది సంవత్సరాలలో అన్నా చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు అతడు వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా పాలు పంచుకోసాగాడు, ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. తన కుటుంబానికి క్రమంగా డబ్బు పంపించడం కూడా తగ్గిపోయింది. తన వ్యక్తిత్వాన్ని తనకు తానుగా పాడు చేసుకుంటున్నాడని రాలెగావ్ లో వార్తలు వ్యాపించాయి. అలాంటి ఒక పోరులో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా బాదేశాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960) అతడు సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలో చేరడానికి ఎంపికయ్యాడు.

తన మొదటి శిక్షణలో, అతడిని ఔరంగాబాద్ పంపించారు. శిక్షణ తర్వాత అతడు పంజాబ్‌ లో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నియమించబడ్డాడు. ఇంటికి చాలా దూరంలో ఉంటూ, స్నేహితులందరి నుంచి విడిపోవలసి రావడంతో అన్నా ఒంటరితనంతో బాధపడ్డాడు. అతడు నిరాశా నిస్పృహల బారిన కూడా పడ్డాడు, జీవితానికి అర్థంలేకుండా పోతోందనే అనుభూతిలో మునిగిపోయాడు. ఒక దశలో తన జీవితాన్ని ముగించుకోవాలని కూడా అతడు నిర్ణయించుకుని ఆత్మహత్య పత్రం కూడా రాశాడు. అయితే, మరింత తెలివితో అతడు తన ఆత్మహత్య, చిన్నారి చెల్లెలు వివాహ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని గుర్తించాడు. అందుచేత, తన సోదరి వివాహం పూర్తయేంతవరకు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈలోగా, కొన్ని సంఘటనలు ఆయన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చాయి. 1965 ఇండో-పాక్ యుద్ధకాలంలో, పశ్చిమ ప్రాంతంలో ఒకచోట సైనిక వాహనాన్ని నడుపుతున్నప్పుడు తమ నెత్తిమీద పాకిస్తాన్ విమానం ఎగురుతుండటం చూశాడు. తాను, తన సహోద్యోగులు వెంటనే వాహనం మీదనుంచి దూకి సమీపంలోని పొదలలో దాక్కుని భూమిపై పడుకుండిపోయారు. ట్రక్కు పేలిపోయి ఆయన స్నేహితులందరూ చనిపోయారు కాని అన్నా మాత్రం గాయపడకుండా తప్పించుకున్నాడు.

మరొక సంఘటనలో, అతడు నాగాల్యాండ్ లో పనిచేసేటప్పుడు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఒక రాత్రి, అజ్ఞాత నాగాలు సైనిక గస్తీ కేంద్రంపై దాడిచేసి ఆయన సహచరులందరినీ చంపేశారు. ఆ సమయంలో ప్రకృతి పిలుపుకోసం వెళ్లిన అన్నా చివరకు తానొక్కడే బతికిబట్టకట్టాడు. ఈ రెండు ఘటనలూ అన్నా మనసుపై బలమైన ముద్ర వేశాయి. తన జీవితాన్ని వృధా పర్చుకోరాదని అతడు గుర్తించాడు, దేవుడు తన జీవితాన్ని విలువైనదిగా భావిస్తున్నాడని ఆయన నమ్మసాగాడు. లేకుంటే, పై ఘటనలలో ఏదో ఒకదానిలో తన సహచరులతో పాటు తాను కూడా చనిపోయి ఉండేవాడినని అతడు భావించాడు.

ఈ ఆలోచనలు తన మనస్సులో చెలరేగుతున్న సమయంలోనే, అతడు న్యూఢిల్లీ స్టేషను లోని ఒక పుస్తక విక్రయకేంద్రంలో స్వామి వివేకానంద రాసిన జాతి నిర్మాణం కోసం యువతకు పిలుపు అనే పేరుగల చిన్న పుస్తకాన్ని చూశాడు.

వివేకానందుడి ఆలోచనలు ఆయన జీవితానికో అర్థం కల్పించాయి, తన శేష జీవితాన్ని సమాజం కోసం పనిచేయడానికి అంకితం చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. తర్వాత అతడు వివేకానంద, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే రచించిన పలు పుస్తకాలను చదివాడు. అతడిలో 1970 నుంచి ఆలోచనలు పెరగడం ప్రారంభించాయి. తాను పెళ్ళి చేసుకోవడం లేదనే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తన చిన్న తమ్ముళ్లకు వివాహాలు జరిపించమని అతడు తల్లిదండ్రులను ఒత్తిడి పెట్టసాగాడు. తన స్వార్థ ప్రయోజనానికి వెలుపల జీవితం గడపాలని తనలో కొత్తగా బయటపడిన ఆకాంక్షతో తాను సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ చేసి స్వంత గ్రామానికి సేవ చేయడానికి తిరిగొచ్చాడు.

తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిని మెరుగుపర్చాలని అతడు కోరుకున్నాడు కాని, ఎలా మెరుగుపర్చాలో, ఎక్కడ ప్రారంభించాలో అతడికి ఏమీ తెలీదు. సెలవుపై తన గ్రామానికి వస్తూ, గ్రామ శివార్లలోని శిలలపై కూర్చుని రోజుల తరబడి గడిపేవాడు. ముంబైలో, సైన్యంలో చాలావరకు జీవితాన్ని గడిపేసిన అన్నాకు గ్రామంలో పెద్దగా స్నేహితులు లేరు. పైగా, దాదర్ స్టేషను‌ వెలుపల పూలమ్ముకున్న రోజులలో అతడిని ఒక ఆగ్రహావేశపరుడిగా రాలెగావ్ ప్రజలు చూశారు కాని, అన్నా హజారే మూర్తిమత్వంలో పరివర్తను వారు ఊహించలేకపోయారు.

1971లో, అన్నాకు ముంబైకి బదిలీ అయ్యింది. ముంబై నుంచి అతడు గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించాడు. 1971 నుంచి 1974 మధ్య కాలంలో గ్రామీణ ప్రజలతో అతడికి సాన్నిహిత్యం పెరిగింది. పద్మావతీ ఆలయానికి తైల వర్ణంతో మెరుగులు దిద్దేందుకోసం ఇతడు రూ.3000 పైగా ఖర్చుచేశాడు. గ్రామీణ యువతతో అతడు మంచి సంబంధాలు పెట్టుకున్నాడు కూడా.


1974లో, అతడిని ఉద్యోగరీత్యా జమ్మూకు మార్చారు. 1975లో, అతడు సైన్యంలో పదిహేను సంవత్సరాల సేవను పూర్తి చేశాడు ఫించన్ రావాలంటే ప్రతి సైనికుడూ 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. అతడు పదవీ విరమణ కోరుకున్నాడు. చివరికి 1975 ఆగస్టు నెలలో అతడు సైన్యం నుంచి బయటపడ్డాడు, మంచి పనులకోసం అతడు తిరిగి రాలెగావ్ సిద్ధికి తిరిగి వచ్చేశాడు.

గాంధేయవాదం[మార్చు]

ప్రజలలో నైతిక బాధ్యతను పెంచడానికి వ్యక్తి కేంద్రక గాంధీవాద పద్ధతులను అన్నా ఉపయోగించాడు. రాలేగావ్ సిద్ధిలో ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు అనుమతి మంజూరు చేయడానికి సిద్ధపడలేదు. దీంతో అన్నా, జిల్లా పరిషత్ కార్యాలయం వెలుపల నిరాహార దీక్షను ప్ర్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు వందలాదిగా కదిలి ఆయన చెంత చేరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి కోరికకు తలొగ్గవలసి వచ్చింది. మరొక సందర్భంలో, కొన్ని కుటుంబాలు తమ పశువులను మేయడానికి ఆరుబయట వదిలేసినప్పుడు, ఆ అలవాటును మానివేయడంలోని ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేసి, వారితో భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అన్నా మరికొందరు యువ సభ్యులు రెండు రోజులపాటు నిరాహార దీక్ష పూనారు, ఆరుబయట పశువులను వదలివేయకుండా ఉండటంలోని ప్రాముఖ్యతను ప్రజలకు అర్థం చేయడానికి వారు ఈ చర్యకు పూనుకున్నారు.

రాలెగావ్ సిద్ధిని ఆదర్శ గ్రామంగా మార్చడం[మార్చు]

1975 కి ముందు రాలేగావ్ సిద్ధి అత్యంత ఘోరమైన గ్రామంగా ఉంటూ, నిస్సహాయ సామాజిక, ఆర్థిక పరిస్థితిని, బాధ్యతా రహిత గ్రామీణ నాయకత్వాన్ని కలిగి ఉండేది. భారతీయ సైన్యంలో సేవచేస్తూ అన్నా హజారే అని అభిమానంగా పిలుచుకున్న కిసాన్ బాబూరావ్ హజారే 1975లో స్వచ్ఛంద విరమణ చేసినంతవరకు ఇది కొనసాగింది. 1965 యుద్ధంలో చావుతో అతడు చేసిన సావాసం అతడి జీవిత గమ్యాన్నే మార్చివేసింది. ఇతరుల శ్రేయస్సుకోసం తనను తాను అంకితం చేసుకోవాలని అతడు నిర్ణయించుకుని, తన స్వంత గ్రామం ఉన్నతి కోసం అతడు తిరిగి వచ్చాడు, ఊరిలోని ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు.

మతం ప్రజలపై బలంగా ప్రభావం చూపుతుందని అన్నా హజారే విశ్వాసం. అతడు ఇలా చెప్పాడు: “దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు, కాని అతడిని నాకు మొట్టమొదటిసారి ఒక పిల్లవాడు దేవాలయంలో పరిచయం చేశాడు. ఇక్కడే అతడు ముఖ్యమైన విలువలకు సంబంధించిన విద్యను జీవితానికి సంబంధించిన నీతి సూత్రాలను గ్రహిస్తాడు. విస్తృతార్థంలో, గ్రామమే దేవాలయం, ఇక్కడ ప్రజలు సేవచేస్తారు, ప్రార్థిస్తారు, జీవితార్థాన్ని నేర్చుకుంటారు.”

ఆలయంలోని కలపను సారాయి బట్టీలకు ఇంధనంగా ఉపయోగించిన కారణంగా రాలెగావ్ సిద్ధిలోని శిథిలావస్థలో ఉన్న అది గ్రామ దుస్థితిని అన్నాకు స్పష్టం చేసింది. ఆలయం అనేది సమాజపు సాంస్కృతిక కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల, అన్నా తనలోని నిస్వార్థ ఉద్దేశ్యాలను ప్రదర్శించడానికి ఆలయ పునరుద్ధరణ ఉత్తమ మార్గంగా భావించాడు. తన చర్యల ద్వారా అతడు ఒక ఆసక్తిని రూపొందించాడు. తన రూ.20,000/- భవిష్యనిధితో అన్నా, ఆలయ పునరుద్ధరణను ప్రారంభించాడు. తన నిస్వార్థ భక్తిభావంతో ప్రభావితులై, మొదట యువత తర్వాత ఇతర గ్రామస్థులు క్రమక్రమంగా అతడి చుట్టూ చేరడం ప్రారంభించారు. గ్రామస్థులు, ప్రత్యేకించి యువ బృందం తమ సమస్యలను, గ్రామ సంక్షేమానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకోసం ఇక్కడ ప్రతిరోజూ సమావేశమయ్యేవారు.

జలవనరులు నిర్వహణ: ఆర్థిక పురోగతికి కీలకం[మార్చు]

ఆకలిగొన్న వ్యక్తినుంచి మీరు సూత్రబద్ధ జీవితాన్ని ఆశించలేరని అన్నా హజారే చెప్పేవారు. తనకు తన కుటుంబానికి తిండి సమకూర్చుకోవడమే అతడి తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. ప్రభుత్వం, సైన్యంలో ఉద్యోగాల ద్వారా, జనాభాలో కొద్ది మందికి ఆర్థిక బలాన్ని కల్పించినప్పటికీ, రాలేగావ్ సిద్ధిలోని జనాభాలో అత్యధిక భాగం ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటోంది. మంచి సాగునీటి వ్యవస్థను నిర్మించడం ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వీలవుతుందని అన్నా గుర్తించాడు. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న రాలెగావ్ భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్న అన్నా హజారే నీటిని అడ్డగించి మళ్లీ ప్రవహించేలా చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం నీటిగట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించాడు. స్వచ్ఛంద కృషి ద్వారా నిర్మించిన తొలి నీటిగట్టుకు చిల్లుపడగా ప్రభుత్వ నిధితో దాన్ని పునర్నిర్మించారు.

రెండవ పెద్ద సమస్య అయిన నేల కోతను నివారించేందుకోసం కూడా అన్నా చర్యలు చేపట్టాడు. వృధాగా వెళుతున్న నీటిని తనిఖీ చేయడం ద్వారా నేల, నీటిని ఆదా చేయడానికి, కొండవాగుల పొడవునా నిమ్నోన్నత కాలువలను, వాగు గసికలను నిర్మించాడు. కొండవాలు, గ్రామం పొడవునా పచ్చిక, పొదలు, 3 లక్షల చెట్లను నాటించాడు. ఈ ప్రక్రియకు అనుబంధంగా అటవీకరణ, నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యామ్‌లు, సిమెంట్ చప్టాలను కీలక ప్రాంతాల్లో నిర్మించారు. జలవనరులఅభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి, గ్రామంలోని అనేకమంది రైతులకు నీరు ప్రస్తుతం నమ్మకమైన వనరుగా ఉండడంతో చాలామంది అవకాశాలు పెరిగాయి. రాలేగావ్ గ్రామం బిందు, బై-వాల్వ్ సాగులో కూడా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసింది. బిందు సేద్య పద్ధతిలో సాగు జరిగే మొత్తం ప్రాంతంలో బొప్పాయి, నిమ్మ, మిరప మొక్కలు నాటించారు. చెరకు వంటి నీటిని అధికంగా ఉపయోగించే పంటల సాగును నిషేధించారు. తృణధాన్యాలు, నూనె గింజలు, నీటిని తక్కువగా ఉపయోగించే కొన్ని రకాల వాణిజ్య పంటలను పెంచారు. గ్రామస్థులు అధిగ దిగుబడి పంటలను పెంచడం ప్రారంభించారు, గ్రామంలో పంటల పద్ధతిలో కూడా మార్పు వచ్చింది.

ఖరీఫ్: 1975-76లో 240 ఎకరాలలో వాన నీటి ఆధారంగా సజ్జలను పండించగా, 20 ఎకరాలలో మాత్రమే సాగునీటి ద్వారా సజ్జలను పండించారు. 1985-86లో వర్షపు నీటితో పండించే సజ్జ సాగు అరవై ఎకరాలలో మాత్రమే సాగగా, కచ్చితమైన సాగునీటి కారణంగా 150 హెక్టార్లలో అధిగ దిగబడిని ఇచ్చే సజ్జలను పండించారు. 1975-76 లో కేవలం రెండు హెక్టార్లలో మాత్రమే ఆకుకూరలు పండించారు. అదే 1985-86 కాలంలో అరవై హెక్టార్లను ఆకుకూరలు పెంచడానికి ఉపయోగించారు. ఈ ఆకుకూరలకు పూణే, ముంబైలలో మార్కెట్లు సిద్ధంగా ఉండేవి. నూనె గింజల ఉత్పత్తి ప్రాంతంలో పెద్దగా తేడా కనిపించలేదు. అయితే 1985-86 లో, నూనె గింజలు పండించే భూమి మరో పదిహేను పైగా ఎకరాలకు పెరిగింది అందుచేత నూనెగింజల ఉత్పత్తి కూడా పెరిగింది.

రబీ: 1975-76 లో వర్షం ఆధారంగా పండే రాగిని 320 హెక్టార్లలో సాగుచేయగా, 50 హెక్టార్లలో రాగిని సాగునీటి సేద్యం ద్వారా పండించారు, అదే 1985-86 లో సాగునీటితో పండే రాగి సాగు 250 హెక్టార్లకు పెరగగా, వాన నీటితో పండే రాగి కేవలం 90 హెక్టార్లలో మాత్రమే సాగయింది. ఇదే కాలంలో వర్షపునీటి ద్వారా గోధుమ సాగు పన్నెండు హెక్టార్ల నుండి ఏడు హెక్టార్లకు తగ్గగా, సాగునీటి ద్వారా గోధుమ సాగు ఒకటి నుంచి ఇరవై మూడు హెక్టార్లకు పెరిగింది. నూనెగింజలకు సంబంధించి సాగునీటి ప్రాంతం సున్నా నుంచి పదిహేడు హెక్టార్లకు పెరగగా, వర్షపు నీటి ఆధారంగా పెరిగే ప్రాంతం 30 హెక్టార్ల నుంచి పది హెక్టార్లకు పడిపోయింది. రబీ కాలంలో కూరగాయల ఉత్పత్తి ప్రత్యేకించి పుంజుకుంది. మూడు హెక్టార్లనుంచి ఇరవై అయిదు హెక్టార్లకు పెరిగింది.

రాలెగావ్ సిద్ధి గ్రామం ఈరోజున రూ.80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. ఈ మార్పుల ఫలితంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 1975-76 లో 294.3 టన్నుల నుంచి 1985-86 లో 1386.2 టన్నులకు పెరిగింది. ప్రస్తుత ధరలలో ఇది రూ. 3.46 లక్షల నుంచి రూ. 31.73 లక్షలకు పెరిగినట్లు లెక్క అంటే పరిమాణంలో 4.7 రెట్ల పెరుగుదల, విలువ పరంగా 9 రెట్లు పెరిగింది.

ధాన్యం బ్యాంకు: గ్రామంలోని చాలా మంది వ్యవసాయదారులు గోధుమ ఉత్పత్తిని పెంచినందువల్ల, గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు, దీని ప్రకారం అదనపు గోధుమ పంట కలిగిన రైతులు 1983 లో ప్రారంభమైన ధాన్యం బ్యాంకుకు స్వచ్ఛందంగా ధాన్యం విరాళం ఇవ్వాలి. తగినంత ధాన్యం లేని గ్రామస్థులు ఈ బ్యాంకునుంచి ధాన్యాన్ని "అప్పు"గా తీసుకోవచ్చు. ఆహార అవసరాల కోసం ఏ గ్రామస్తుడూ డబ్బు అప్పుగా తీసుకోకుండా చెయ్యడమే దీని ఉద్దేశం. ధాన్యం బ్యాంకు నుంచి ధాన్యాన్ని రుణరూపంలో ఇస్తారు, దీన్ని యువ బృందాలు పర్యవేక్షిస్తాయి.

హరిత ఛత్రాన్ని పునరుద్ధరించడం[మార్చు]

మనిషి పొందవలసిన గొప్ప మిత్రులు చెట్లు, ఇవి పర్యావరణాన్ని శుభ్రపర్చి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఇవి గ్రామం యొక్క ఇంధనం , వంటచెరకు అవసరాలను నెరవేరుస్తాయి. దీన్ని గుర్తించి, గ్రామస్తులు భారీ స్థాయిలో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 3-4 లక్షల చెట్లు నాటి పెంచారు. "సామాజిక ఫెన్సింగ్" ప్రవేశపెట్టారు, దీంట్లో గ్రామస్థులు పశువులను, మేకలను, గొర్రెలను ఆరు బయట స్వేచ్ఛగా తిరుగకుండా స్వచ్ఛందంగా నిరోధించారు. పశువులు బయళ్లలో మేయడాన్ని పూర్తిగా నిషేధించారు దాని స్టాల్ ఫీడింగ్ (కురాద్ బిందీ) గురించి నొక్కి చెప్పారు. రాలెగావ్ సర్పంచ్ (గ్రామ సభ నేత) వర్ణిస్తున్నారు: "ఎండు కట్టెలు, వంట చెరకు అదనంగా ఉంటూ వచ్చింది. పొరుగు గ్రామస్తులకు అవసరమైనప్పుడు మేం ఇప్పుడు సహాయం చేయగలం." వంటచెరకు సమృద్ధిగా అందుబాటులోకి రావటంతో, పాలిచ్చే జంతువుల ఉత్పాదకత, సంఖ్య పెరిగింది.

మధ్యపానాన్ని నిర్మూలించడం[మార్చు]

సామాజిక, ఆర్థిక మార్పు వైపుగా తదుపరి దశలో భాగంగా అన్నా హజారే, యువ బృందం మద్యపాన సమస్యను చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణుల జీవితాలనుంచి మద్యపానాన్ని పూర్తిగా తొలగించనిదే గ్రామంలో అభివృద్ధి, సంతోషం నెలకొనవన్నది చాలా స్పష్టం. ఆలయంలో సమావేశం నిర్వహించిన తర్వాత, గ్రామంలో సారా కొట్టాలను మూసివేయాలని గ్రామంలో మద్యపాన అలవాటును నిషేధించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఈ తీర్మానాలన్నీ ఆలయంలో తీసుకున్నందువల్ల అవి మతపరమైన అంగీకారంగా మారిపోయాయి. దీంతో దాదాపు ముప్పై సారా తయారీ కేంద్రాలను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. సామాజిక ఒత్తిడికి తలొగ్గని వారిని తమ వ్యాపారం మూసుకునేలా ఒత్తిడి చేసి, యువ బృందం వారి సారా బట్టీలను కూల్చివేశారు. తమ వ్యాపారం కూడా అక్రమం కాబట్టి వాటి యజమానులు ఆరోపణ చేయలేకపోయారు.

సారా తయారీ కేంద్రాలను మూసివేయడంతో రాలెగాన్ సిద్ధిలో మద్యపానాన్ని తగ్గించినప్పటికీ, కొంతమంది గ్రామస్థులు మాత్రం తాగడాన్ని కొనసాగించారు. వారు సారాయిని పొరుగు గ్రామాలనుంచి తెచ్చుకొనేవారు. ఇలాంటి పురుషులను మూడు సార్లు హెచ్చరించాలని తర్వాత వారికి భౌతిక శిక్షలు విధించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ప్రారంభ హెచ్చరికలు ముగిసిన తర్వాత కూడా తాగిన స్థితిలో కనిపించిన పన్నెండుగురు పురుషులను యువబృందం సహాయంతో స్తంభానికి కట్టి వేలాడదీశారు. దీనిపై అన్నా హజారే ఇలా అన్నారు “వ్యాధిపాలయిన పిల్లాడిని మందులు కాపాడగలవని తెలిసినప్పుడు తల్లి తన పిల్లాడికి చేదుమాత్రలు ఇవ్వదా? పిల్లాడు మందులను ఇష్టపడకపోవచ్చు కాని, పిల్లలను సంరక్షించే తల్లి వాటిని పిల్లాడిచేత తినిపిస్తుంది. తాగినవారు శిక్షించబడ్డారు దీంతో వారి కుటుంబాలు నాశనం కాకుండా నిలబడ్డాయి.”

మద్యపాన మత్తులో మునిగిన గ్రామాన్ని రక్షించడానికి ఇలాంటి చర్యలు మొదలు పెట్టి ఇప్పటికి పాతికేళ్ళయింది. గ్రామం నుంచి మద్యపానం తొలగించడంతో పాటు, గ్రామంలో పొగాకు, సిగరెట్లు, బీడీల అమ్మకాన్ని నిషేధించాలని కూడా నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని అమలు చేయడానికి, యువ బృందం ఇరవై రెండేళ్ల క్రితమే విశిష్టరీతిలో "హోలీ"ని ప్రదర్శించారు. దుష్టత్వాన్ని తగులబెట్టడానికి సంకేతంగా హోలీ పండుగ నిర్వహించారు. యువ బృందం గ్రామంలోని అంగళ్లలో ఉండే అన్ని పొగాకు చుట్టలు, సిగరెట్లు, బీడీలను తీసుకొచ్చి వాటిని ‘హోలీ’ మంటల్లో కాల్చి వేశారు. ఆ రోజునుంచి రాలెగావ్ సిద్ధిలో ఏ షాపులో కూడా చుట్టలు, సిగరెట్లు, బీడీలు అమ్మడం లేదు.

పాల ఉత్పత్తి[మార్చు]

ప్రత్యామ్నాయ వృత్తిగా, రాలెగావ్ లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించారు. కొత్త పశువుల కొనుగోలు, కృత్రిమ సంతాన సాఫల్యం ద్వారా ప్రస్తుతం ఉన్న పశుసంతతిని మెరుగుపర్చడం, పశువైద్యుడి సకాల మార్గదర్శకత్వం, సహాయం కారణంగా గ్రామంలో పశు సంపద పెరిగింది. పాల ఉత్పత్తి కూడా పెరిగింది. తక్కువ పాల దిగుబడిని ఇస్తున్న దేశవాళీ ఆవుల స్థానంలో సంకరజాతి ఆవులను ప్రవేశపెట్టారు. పాడియావుల సంఖ్య కూడా పెరగసాగింది. దీని ఫలితంగా వంద లీటర్ల నుంచి (1975కి ముందు) రోజుకు 2500 లీటర్ల వరకు పెరుగుదల కలిగింది. ఈ పాలను అహ్మద్ నగర్‌లోని సహకార పాల పరిశ్రమకు (మంగళ డైరీ) పంపేవారు. కొన్ని పాలను బాలవాడి (రాలెగావ్ సిద్ధిలోని పాఠశాల) పిల్లలకు, పొరుగు గ్రామాల పిల్లలకు జిల్లా పరిషత్ నిర్వహించే బాలల పోషకాహార పథకం కింద ఇచ్చారు.

పోగుపడిన మిగులులోంచి, పాల సొసైటీ ఒక మినీ ట్రక్కును, క్రషర్‌ను కొనుగోలు చేసింది. మినీ ట్రక్కులో అహ్మద్ నగర్‌కు పాల రవాణా చేయడంతోపాటు కూరగాయలు ఇతర ఉత్పత్తులను నేరుగా అంగడికి తీసుకుపోవడానికి ఉపయోగించేవారు, ఆవిధంగా మధ్య దళారీలను తొలగించారు. పంటకోతల కాలంలో క్రషర్‌ను రైతులకు అద్దెకిచ్చేవారు. ఈరోజు రాలెగావ్ సిద్ధి పాల వ్యాపారంలో సంవత్సరానికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది.

విద్య[మార్చు]

1932 సంవత్సరంలో రాలెగావ్ సిద్ధిలో తొలి నియత పాఠశాల అంటే ఒకే తరగతి గది ఉన్న ప్రాథమిక పాఠశాల ఏర్పడింది. 1962లో సమాజం స్వచ్ఛంద కృషితో గ్రామస్థులు మరిన్ని తరగతి గదులను చేర్చుకున్నారు. 1971 నాటికి 1209 మందిగా అంచనా వేసిన జనాభాలో కేవలం 30.43% మంది మాత్రమే అక్షరాస్యులు (72 మంది మహిళలు, 290 మంది పురుషులు) బాలురు ఉన్నత విద్య కోసం సమీప పట్టణాలైన షిరూర్, పార్నర్‌ లకు వెళ్లేవారు. అయితే సామాజిక-ఆర్థిక పరిస్థితుల కారణంగా బాలికలు బయటి ఊళ్ల్ర్లకు వెళ్లలేక ప్రాథమిక విద్యతోటే సరిపెట్టుకునేవారు. అన్నా హజారే రాలెగావ్ యువతతో కలిసి అక్షరాస్యతా రేటు, విద్యా స్థాయిలను పెంచడానికి కృషి చేశారు. 1976 లో వారు ప్రాథమిక స్కూలుకు ముందటి ప్రీ స్కూల్‌ను ప్రారంభించారు, 1979 లో ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించారు. గ్రామస్థులు గ్రామ పాఠశాలపై క్రియాశీలక ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించి, సంత్ యాదవ్ బాబా శిక్షణ్ ప్రకాశక్ మండల్ (ట్రస్ట్) ‌ని నెలకొల్పారు. ఈ ట్రస్టు ప్రభుత్వ నిర్లక్ష్యం, టీచర్లలో ఆసక్తి కొరవడిన కారణంగా దుస్థితిలో ఉన్న గ్రామ పాఠశాల పనిని చేపట్టాలని నిర్ణయించింది.

NREPని ఉపయోగించడం ద్వారా పాఠశాల భవంతి నిర్మాణంకోసం నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ గ్రాంటును ట్రస్టు పొందింది. సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన 200 మంది విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ కూడా నిర్మించబడింది. గ్రామంలో పాఠశాలను ప్రారంభించిన తర్వాత, రాలెగావ్ సిద్ధి నుంచి తొలిసారిగా ఒక విద్యార్థిని 1982లో తన S.S.C ని పూర్తిచేసింది. అప్పటినుంచి పాఠశాల గ్రామంలో అనేక మార్పులకు ఉపకరణంలాగా నిలుస్తూ వచ్చింది.

అంటరానితనం తొలగింపు[మార్చు]

కులవ్యవస్థ కారణంగా ఉనికిలో ఉన్న సామాజిక అడ్డంకులను రాలెగావ్ సిద్ధి గ్రామస్థులు బద్దలుగొట్టారు, అన్ని కులాల ప్రజలు కలిసి సామాజిక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. కుల వ్యవస్థ ప్రాతిపదికన అమలవుతున్న సాంఘిక వివక్షతను నిర్మూలించడంలో రాలెగావ్ ప్రజలు బాగానే విజయం సాధించారు. గ్రామ సామాజిక, ఆర్థిక జీవితంలో దళితులు కూడా భాగమయ్యారు. గ్రామస్థులు హరిజనుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చారు. రుణభారం నుంచి వారిని తప్పించడానికి వారి రుణాల చెల్లింపులో కూడా సాయపడ్డారు.

సామూహిక వివాహాలు[మార్చు]

గ్రామీణ పేదలు తమ కొడుకులు, కూతుళ్ల పెళ్ళిళ్ల సందర్భంగా భారీ ఖర్చులు పెట్టడం వల్ల రుణాల ఊబిలో కూరుకుపోయేవారు. ఇది అవాంఛనీయ అలవాటే అయినప్పటికీ ఇది తప్పనిసరి సామాజిక విధిగా ఉండేది. రాలెగావ్ ప్రజలు వివాహాలను కూడా సామూహికంగా జరుపుకోవడం ప్రారంభించారు. పెళ్ళి విందు ఉమ్మడిగా జరిగేది. తరుణ మండలి పెళ్ళి వంటలు, వడ్డన బాధ్యత తీసుకోవడంతో ఖర్చులు మరింత తగ్గాయి. వంటపాత్రలు, లౌడ్ స్పీకర్ సిస్టమ్, కల్యాణ మండపం, అలంకరణ లను కూడా పీడిత కులాలకు చెందిన తరుణ మండలి సభ్యులే తీసుకువచ్చేవారు. 1976 నుంచి 1986 వరకు ఈ వ్యవస్థ కింద నూట ఇరవై నాలుగు వివాహాలు జరిగాయి.

గ్రామ సభ[మార్చు]

గ్రామాల్లో సామూహికంగా నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామ సభ కీలకమైన వేదిక. ప్రణాళిక, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో గ్రామస్థులు పాలుపంచుకున్నట్లయితే, గ్రామంలో జరిగే ఏ మార్పునైనా వారు మరింత బాహాటంగా స్వీకరిస్తారు. రాలెగావ్ సిద్ధిలో గ్రామ శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి గ్రామ సభా సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. జలవనరులఅభివృద్ధి కార్యక్రమాల వంటి ప్రాజెక్టులను గ్రామ సభలో చర్చించిన తర్వాతే చేపట్టేవారు. నస్బంది, కుర్హద్‌బంది, చారై బంధి, శ్రమదాన్ వంటి అన్ని నిర్ణయాలు గ్రామసభలోనే తీసుకునేవారు. సాధారణ మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. అభిప్రాయభేదాలు నెలకొన్న పక్షంలో అత్యధికుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. గ్రామ సభ నిర్ణయమే తుదినిర్ణయంగా ఉండేది.

పంచాయత్‌కు అదనంగా, గ్రామంలో పలు చట్టబద్దంగా నమోదైన సొసైటీలు ఉండి గ్రామానికి చెందిన పలు ప్రాజెక్టులు, కార్యకలాపాలను చేపట్టేవి. ప్రతి సొసైటీ ప్రతి సంవత్సరమూ గ్రామ సభలో తమ వార్షిక నివేదిక, లెక్కల ప్రకటనను సమర్పించేవి. సంత్ యాదవ్ బాబా శిక్షణ ప్రకాశక్ మండలి విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించేది. వివిధ్ కార్యకారి సొసైటి, రైతులకు ఎరువులు, విత్తనాలు, సేంద్రియ వ్యవసాయం, ఆర్థిక సహాయం వంటి వాటిలో సలహాలు ఇచ్చి సహకరించేది. శ్రీ సంత్ యాదవ్‌బాబా దూధ్ ఉత్పాదక్ సహకారి సంస్థ పాల వ్యాపారానికి సంబంధించి సలహాలు ఇచ్చేది. ఏడు సహకార వ్యవసాయ సొసైటీలు సహకార బావుల నుంచి రైతులకు నీటిని అందించేవి. మహిళా సర్వగే ఉత్కర్ష్ మండల్ మహిళల సంక్షేమ అవసరాలను తీర్చేది.

గ్రామ జన్మదినం[మార్చు]

గ్రామంలో ఐక్యతను ప్రతిబింబించడానికి గాను, రాలెగావ్ సిద్ధి కుటుంబాలు ప్రతి సంవత్సరం అక్టోబరు 2న వార్షిక జన్మదినాన్ని జరుపుకునేవి. ఆ రోజు:

 • గ్రామంలోని అత్యంత వయో వృద్ధుడిని గ్రామ పితగా గౌరవించేవారు.
 • అత్యంత వయో వృద్ధురాలిని గ్రామ మాతగా గౌరవించేవారు.
 • పిల్లల కుల మతాలతో నిమిత్తం లేకుండా గత సంవత్సరం గ్రామంలో జన్మించిన ప్రతి కొత్త శిశువుకు దుస్తులు కుట్టించి ఇచ్చేవారు.
 • గత సంవత్సరం గ్రామ కోడళ్లుగా గ్రామంలోకి అడుగుపెట్టిన నూతన వధువులకు కొబ్బరి కాయ ఇచ్చి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికేవారు.
 • విద్యలో విజయం సాధించిన విద్యార్థులను కూడా సత్కరించేవారు.
 • ఏదో ఒక అంశంలో ప్రత్యేకత సాధించిన యువతను కూడా సత్కరించేవారు.
 • ఈ కార్యక్రమం జరిగే రోజు సాయంత్రం వేళ గ్రామస్థులందరూ ఒక చోటికి చేరి కలిసి భుజించేవారు.

లోక్ పాల్ చట్ట పోరాటం[మార్చు]

జంతర్ మంతర్ దగ్గర నిరాహారదీక్షలో అన్నాహజారే.

2011 లో అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా, జన లోక్ పాల్ చట్టాన్ని లోక్ పాల్ చట్టంగా తేవాలని కోరాడు. దీనిని సంతోష్ హెగ్డే, ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రివాల్, అవినీతికి వ్యతిరేకించే భారత్ (India Against Corruption ) సహయోగులు రూపొందించారు. ముసాయిదాలో విస్తృతమైన అధికారాలు లోకపాల్ కు ఇవ్వబడ్డాయి.[7] వీటిలో ప్రధానమంత్రిని కూడా లోక పాల్ పరిధిలో ఉంచటం ఒకటి.[8]

ప్రస్తుతం[మార్చు]

గ్రామంలోని తన భూమిని ఆయన హాస్టల్ భవంతికి విరాళంగా ఇచ్చారు. తన ఫించన్ డబ్బులను గ్రామ నిధికి ఇచ్చేవారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన అన్నా కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులతో గ్రామ ఆలయంలో నివసిస్తున్నారు. ఆయన హాస్టల్ అబ్బాయిలకు వండిపెట్టే సాధారణ భోజనాన్ని స్వీకరిస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు, సోదరులు కూడా గ్రామంలోనే నివసిస్తుంటారు కాని గ్రామంలోని ఏ ఇతర కుటుంబం కంటే వారు భిన్నంగా ఉండరు. పరమ నిస్వార్థ జీవితం నుంచి పెంపొందుతూ వచ్చిన నైతిక అధికారం ఆయనను గ్రామంలో తిరుగులేని నేతగా మార్చింది.

అన్నా నైతిక నియమావళి కూడా చాలా కఠినంగా ఉంటుంది. సామాజిక నీతిని నిలబెట్టడానికి శిక్ష అనేది తప్పనిసరైన ప్రక్రియా భాగంగా అన్నా విశ్వసిస్తుంటారు. ఊరుమ్మడి భూముల నుంచి పిల్లవాడు పండును దొంగలించినప్పుడు, అతడిని స్తంభానికి కట్టివేసి అతడికి నీతి నేర్పడానికి పళ్లను అతడి ముందే ఉంచేవారు. గ్రామంలో పళ్లు కాసే చెట్లు కాపలాదారు పరిరక్షణలో ఉండేవి కాదు. ఏ ఒక్క పండు కూడా తస్కరించబడేది కాదు, పండిన పళ్లను బాలవాడి పిల్లలు, పాఠశాల పిల్లలకు పంచి పెట్టేవారు. తప్పుచేసిన వారిని బహిరంగంగా దండించేవారు, అయితే భయం పుట్టించడానికి కాకుండా తప్పుచేసిన వాడు పదిమందిలో సిగ్గుపడాలని, ఆలాగయితేనే వారు మరింత స్వయం నియంత్రణలో ఉంటారని విశ్వసించేవారు. రాలెగావ్ సాధించిన విజయాల పట్ల ప్రజలు పొంగిపోయేవారు. ఆ వైభవోజ్వల చరిత్రలో వారికి కూడా భాగముంది మరి. అందుకనే వారు అన్నాను నొప్పించే పని కాని, గ్రామానికి చెడ్డపేరు తెచ్చే పని కాని దేన్నీ చేయరు.

అరెస్టులు[మార్చు]

మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి బాబూరావ్ గోలాప్ పరువు నష్టం దాఖలు చేసిన సందర్భంగా అన్నా హజారేని 1998లో అరెస్ట్ చేశారు. ప్రజా నిరసనతో ఆయనను విడుదల చేశారు.

అవార్డులు[మార్చు]

 • 1990 సంవత్సరంలో భారత్ ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు
 • 1986 నవంబర్ 19న భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేతుల మీదుగా భారత ప్రభుత్వం వారి ఇందిరా ప్రియదర్శినీ వృక్షమిత్ర అవార్డు.
 • 1989లో మహారాష్ట్ర ప్రభుత్వంచే కృషి భూషణ అవార్డు.
 • 1987 జనవరి 15న అహ్మద్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌చే సన్మానం
 • పుణే మునిసిపల్ కార్పొరేషన్‌చే సన్మానం
 • కిసాన్ బాబూరావ్ హజారే అసాధారణ ప్రజాసేవకు గాను 2008 ఏప్రిల్ 15న, ప్రపంచ బ్యాంకు యొక్క 2008 జిత్ గిల్ స్మారక అవార్డును అందుకున్నారు: "మహారాష్ట్రలోని వెనుకబడిన అహ్మద్‌నగర్ ప్రాంతంలోని రాలెగావ్ సిద్ధిని హజారే ఒక అద్భుతమైన ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దారు, సమాచార హక్కు కోసం, అవినీతికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు."[9]

ఉల్లేఖనాలు[మార్చు]

అన్నా తత్వశాస్త్రం హిందూ ఆధ్యాత్మికవాదం, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, వినోబా భావే వంటి ఆధునిక హిందూ చింతనాపరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈ తత్వశాస్త్రానికి సంబంధించి అన్నా ఉపన్యాసాలనుంచి, తన ఆదర్శ గ్రామ భావన యొక్క పునాదికి సంబంధించిన పలు ఉల్లేఖనలు క్రింద ఇవ్వబడ్డాయి.[10]

 • నేలమీద మనం చూసే ప్రతి పెద్ద చెట్టు వెనకాల, నేల లోపల కలిసిపోయి ఉన్న గింజ తప్పక కనిపిస్తూంటుంది. .
 • గ్రామీణాభివృద్ధి అనేది సారాయి వినియోగం, అమ్మకాల తగ్గింపు మీదే అధారపడి ఉంటుంది .
 • వ్యక్తిని మార్చకుండా గ్రామాన్ని మార్చడం అసాధ్యం. అదేవిధంగా గ్రామాలను మార్చకుండా దేశాన్ని మార్చడం కూడా అసాధ్యం .
 • గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, రాజకీయాలను పక్కన బెట్టాలి .
 • ఆధ్యాత్మికత లేని విద్య అభివృద్ధికి సహకరించదు .
 • డబ్బు మాత్రమే అభివృద్ధిని తీసుకురాలేదు కాని, అది అవినీతిని కొనితెస్తుంది .
 • గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో, సామాజిక, ఆర్థికాభివృద్ధి పక్కపక్కనే కొనసాగాలి .
 • సామాజిక పరవర్తనా కృషి ఏమంత సులభం కాదు అలాగని అసాధ్యమూ కాదు .
 • అన్ని రాజకీయాలు, సామాజిక కృషి యొక్క అంతిమ లక్ష్యం సమాజం, జాతిని అభివృద్ధి పర్చే విధంగా ఉండాలి .
 • కేవలం పుస్తకాలు మాత్రమే భావి పౌరులను రూపొందించలేదు, దానికి సాంస్కృతిక పెట్టుబడులు అవసరం .
 • మంచి పౌరులను తయారు చేయడానికి విద్యాసంస్థలు మాత్రమే సరిపోవు, ప్రతి ఇల్లూ ఒక విద్యా కేంద్రంగా మారాలి .
 • లోలత్వం వ్యాధికారకం కాగా త్యాగం విజయసాధనవైపు పయనిస్తుంది .
 • అన్నీ ఉచితంగా కావాలని ఎవరూ కోరుకోకూడదు; ధర్మనిధులను ఆశించడం అనేది మనుషుల్ని సోమరిపోతులుగా, పరాధీనులుగా మారుస్తుంది .
 • స్వార్థ ప్రయోజనాన్ని పక్కనబెట్టి వ్యక్తి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, అతడు మానసిక శాంతిని పొందడం ప్రారంభిస్తాడు
 • ప్రపంచానికి సంబంధించిన అన్ని పనులనూ చేస్తూనే ప్రపంచ విషయాలనుంచి దూరంగా ఉంటున్నవాడే నిజమైన ఋషి .
 • స్వార్థం నుంచి విముక్తి అనేది ప్రజల విముక్తిలో భాగంగా ఉంటుంది .
 • అనుభవమే మార్గాన్ని బోధిస్తుంది కాని, ప్రతి పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువతే మార్గం .

బాహ్య లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

 1. "India activist Anna Hazare ends hunger strike". BBC News. 9 April 2011. Retrieved 9 April 2011. CS1 maint: discouraged parameter (link)
 2. "Govt issues notification on committee to draft Lokpal Bill". The Hindu. New Delhi. 9 April 2011. Retrieved 9 April 2011. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); CS1 maint: discouraged parameter (link)
 3. "Foreign Policy top 100 global thinkers". Foreign Policy. 30 November 2011. Archived from the original on 30 నవంబర్ 2011. Retrieved 30 November 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 4. "The DNA power list: Top 50 influentials". Mumbai: DNA. 29 July 2011. Retrieved 30 July 2011. CS1 maint: discouraged parameter (link)
 5. "Spare Us the Gandhian Halo", The Open Magazine, retrieved 18 August 2011 CS1 maint: discouraged parameter (link)
 6. Amit Varma, The Rorschach Effect in Indian Politics, Yahoo! News, retrieved 18 August 2011 CS1 maint: discouraged parameter (link)
 7. Deshpande, Vinaya (29 March 2011). "Anna Hazare faults Lokpal Bill". The Hindu. Chennai, India. Retrieved 5 April 2011. CS1 maint: discouraged parameter (link)
 8. "Anna sets pace for faltering govt". Hindustan Times. India. 20 August 2011.
 9. "timesofindia.indiatimes.com, అన్నా హజారే విన్స్ వరల్డ్ బ్యాంక్ అవార్డ్". Archived from the original on 2008-05-21. Retrieved 2008-05-21.
 10. "వరల్డ్ ప్రౌట్ అసెంబ్లీ: అన్నా హజారే: ది మ్యాన్ అండ్ హిస్ ఫిలాసఫీ". Archived from the original on 2011-04-10. Retrieved 2010-09-20.