అప్పికట్ల జోసఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అప్పికట్ల జోసఫ్ స్వాతంత్ర్య సమర యోధుడు.1949-52 వరకు రాజ్యసభ సభ్యుడు.కృష్ణాజిల్లా గుడివాడ మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1917లో అప్పికట్ల భూషణం, దుర్గమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జోసెఫ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడం వలన జోసెఫ్‌ తల్లి తమ స్వగ్రామమైన అంబాపురం వచ్చి, ఉయ్యూరు ‘క్రైస్తవ రెసిడెన్షియల్‌ పాఠశాల’లో కుమారుడిని చేర్పించారు. జోసెఫ్‌ చదువుకుంటూనే, సెలవు దినాలలో కూలీపనిచేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తూ, మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు. జోసెఫ్‌ చిన్నవయసులోనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు జాతి శ్రేయస్సు కోరి బ్రిటీష్‌ దొరలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలో సన్నిహితులైన మహమ్మద్‌ యాసిన్‌, సిరిపురం కోటేశ్వరరావులతో కలిసి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. 1940వ సం.లో కోస్తా ప్రాంతంలో ముసునూరు, ఆగిరిపల్లిని కేంద్రాలుగా చేసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన యువ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అప్పికట్ల జోసెఫ్‌ అని, చరిత్రకారుడు బిపిన్‌ చంద్ర తన ప్రఖ్యాత రచన ‘ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌, ద లాంగ్‌ టర్మ్‌ డైనమిక్స్‌’లో పేర్కొన్నారు.స్వాతంత్ర్యోద్యమంలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాకాని వెంకటరత్నం, ఘంటసాల వెంకటేశ్వరరావు, టంగుటూరి ప్రకాశంపంతులు, ఎన్‌.జి. రంగా, అయ్యదేవర కాళేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, గొట్టిపాటి బ్రహ్మయ్య, గౌతు లచ్చన్న లాంటి ఉద్దండులతో కలిసి ఆయన పనిచేశారు.జోసెఫ్‌ గారిని టంగుటూరు ప్రకాశం పంతులు గారు కన్న కొడుకుగాను, కాకాని వెంకటరత్నం గారు దత్త పుత్రునిగాను, అయ్యదేవర కాళేశ్వరరావు గారు ప్రియ శిష్యునిగాను కొనియాడేవారు. జోసెఫ్‌, శ్రీమతి మార్తమ్మ దంపతులు తమ ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.1996 ఆగస్టు 31వ తేదీన తుది శ్వాస విడిచారు.