Jump to content

ఈమని శివనాగిరెడ్డి

వికీపీడియా నుండి
ఈమని శివనాగిరెడ్డి
ఈమని శివనాగిరెడ్డి
జననం(1955-04-15)1955 ఏప్రిల్ 15
వృత్తిసాంప్రదాయ వాస్తుశిల్పి,చరిత్ర కారుడు,పురాతత్వవేత్త
క్రియాశీల సంవత్సరాలు1978 - Present
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందూ దేవాలయ వాస్తుశిల్పం, చరిత్ర పరిశోధన
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
పిల్లలుప్రియంవద, హర్షవర్థని
తల్లిదండ్రులుఈమని అన్నపూర్ణ, భూషిరెడ్డి

ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త,[1] రచయిత. అనేక స్థలాల్లో పురావస్తు తవ్వకాల్లో పాల్గొన్నారు. ఎన్నో పురాతన ముంపు ఆలయాలను విడదీసి, ఎగువన పునర్నిర్మించే బాధ్యతలు నిర్వహించారు. చరిత్ర గురించి అనేక పుస్తకాలు గ్రంథాలు రాశారు. భారతదేశపు గొప్ప స్థపతి అయిన గణపతి స్థపతి గారి ద్వారా ‘వాస్తు శిల్ప వాచస్పతి’ అనే బిరుదును పొందారు.

బాల్యం

[మార్చు]

శివనాగిరెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోగల వలివేరులో 1955, ఏప్రిల్ 15న జన్మించారు.[2] తల్లిదండ్రులు ఈమని అన్నపూర్ణ, భూషిరెడ్డి. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. ఎలాగోలా కష్టపడుతూ తమ కుమారునికి చదువు చెప్పించారు. ఎడ్లపల్లి హైస్కూలులో పదో తరగతి పాసయ్యాక తెనాలిలోని విఎస్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్లో చేరారు శివనాగిరెడ్డి. అయితే ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు మాత్రమే చదివి, ఫీజులు చెల్లించడానికి ఆర్థిక స్థోమతలేక చదువుని ఆపేశారు. ఈ క్రమంలో శివనాగిరెడ్డికి 7,8 తరగతుల్లో తెలుగు బోధించిన రంగాచార్యులు అనే ఉపాధ్యాయుడు చొరవ చూపించి, తిరుపతిలోని శిల్ప కళాశాలలో ఉచిత వసతితో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అక్కడే 1973-77 వరకూ డిప్లమో పూర్తిచేస్తూ, మరోవైపు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని దూరవిద్య ద్వారా బికామ్‌ డిగ్రీ పాసయ్యారు. 1977-78లో జీవనభృతి కోసం టిటిడిలో ఆరు రూపాయల వేతనానికి దినసరి కార్మికుడిగా చేరారు.

ఉద్యోగం

[మార్చు]

శిల్పకళాశాలలో డిప్లమో చేస్తున్న సమయంలోనే శిల్పాలు చెక్కడం, ఆలయ నిర్మాణ శిక్షణ పొందడం వంటివాటిలో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. శిల్పకళలపై డిప్లమోలోని అన్ని విభాగాల్లోనూ ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యారు. ఆయన ప్రతిభని గుర్తించిన రాష్ట్ర దేవాదాయశాఖ శ్రీశైలం నీటిముంపు ప్రాంత దేవాలయాల తరలింపు కార్యక్రమంలో సహాయ స్థపతిగా ఉద్యోగాన్నిచ్చింది. అలా 1978లో మహబూబ్‌గనర్‌ జిల్లా అలంపూర్‌ నుంచి శివనాగిరెడ్డి ఉద్యోగప్రస్థానం మొదలైంది. పురాతన నిర్మాణాలకి పునరుజ్జీవనాన్నిస్తూ తాను చదువుకున్నది ఆలయనిర్మాణం ప్రధానవృత్తిగా అవకాశం రావడం ఎంతగానో మేలు చేసింది. మునిగిపోతున్న ప్రాంతాల్లో పురాతన నిర్మాణాలు, వాటిపై శిల్పకళ, ఆలయాలని విడదీయడం, ప్లాన్లు తయారీ, తరలింపు వంటి కార్యాచరణలో శివనాగిరెడ్డి నిమగ్నమైపోయారు. పదుల సంఖ్యలో ఇలాంటి పనులు చేయించారు. అలంపూర్‌లో కృష్ణా-తుంగభద్రల సంగమంలోని కూడలి సంగమేశ్వరం, బుగ్గ రామేశ్వరాలయం, పాపనాశ ఆలయం, కొల్లాపూర్‌ తాలూకాలోని మల్లేశ్వరం, మంచాల కట్ట, రామతీర్థం, జటప్రోలు, సోమశిల ప్రాంతాల్లో చాళుక్య, కందూరి చోళ, కళ్యాణి చాళుక్య, కాకతీయ, విజయనగర రాజులు కట్టించిన ఆలయాలను విడదీసి, ఎగువన పునర్నిర్మించే పథకానికి గణపతి స్థపతి పర్యవేక్షణలో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణం, హుస్సేన్ సాగర్ లోని జిబ్రాల్టర్ రాక్పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపనాలతో ఎంతో పేరు తెచ్చుకున్న పద్మశ్రీ ఎస్.ఎం. గణపతి స్థపతికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.[3] శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపులో భాగంగా కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 108 దేవాలయాలను ఊడదీసి ఎగువన పునర్నిర్మించిన ఘనతను దక్కించుకొన్న గణపతి స్థపతికి చేదోడువాదోడుగా పనిచేయడమే కాకుండా, అదే గణపతి స్థపతి ద్వారా ‘వాస్తు శిల్ప వాచస్పతి’బిరుదు పొందారు.[2]

పురావస్తు శాఖ

[మార్చు]

స్థపతిగా దేవాదాయశాఖలో పనిచేస్తున్న శివనాగిరెడ్డి 1981లో రాష్ట్ర పురావస్తుశాఖలో ఉద్యోగిగా చేరారు. ఒక పక్క పురాతన స్థలాల్లో తవ్వకాల్లో పాల్గొంటూ, మరోపక్క పురావస్తుశాస్త్రం, భారతీయ సంస్కృతి, లిపి అధ్యయన శాస్త్రాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ డిగ్రీ పొందారు. 1989-94 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 'ప్రాచీనాంధ్ర దేశంలో కట్టడకళ-సాంకేతికాంశాలు' అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. ఇలా ఉన్నత విద్యని సొంతం చేసుకుంటూనే పురావస్తుశాఖలో తన గురుతర బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి పురావస్తుశాఖ సంచాలకుడు డాక్టర్‌ వివి కృష్ణశాస్త్రి చేపట్టిన తెలంగాణ ప్రాంతంలోని కాకతీయ హెరిటేజ్‌ ప్రాజెక్టులో కీలకంగా మారారు. జాకారం, నిడికొండ, గొడిశాల, రామానుజపురం, ఘన్‌పూర్‌లలోని ఆలయాలను విడదీసి, పునర్నిర్మించారు. ఇనుప యుగపు స్థలాలైన శెరుపల్లి, పిన్నాపురంతో పాటు, చాగటూరు, ఉప్పలపాడు తదితర చారిత్రక తొలియుగపు స్థలాల్లో పురావస్తు తవ్వకాల్లో పాల్గొన్నారు.[2]

సంస్థలు

[మార్చు]

వృత్తి, ప్రవృత్తి ఒకటే కావడం శివనాగిరెడ్డికి తగిన గుర్తింపుని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌, ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌, పలు విశ్వవిద్యాలయాలు నిర్వహించిన చరిత్ర, పురావస్తు శాస్త్ర సంబంధిత సదస్సుల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1996 నుంచి ఇగ్నోలో పర్యాటక అధ్యయన కోర్స్‌కు అకడమిక్‌ కౌన్సెలర్‌గా పనిచేస్తూ ఆ అనుభవంతో 'ఏపీలో పర్యాటకం-వనరులు- అవకాశాలు' అనే పుస్తకాన్ని రాశారు. ఇప్పటికీ దేశంలో ఎక్కడ ఏ సంస్థ అయినా చరిత్ర, పురావస్తుశాస్త్ర సదస్సులు నిర్వహిస్తే అక్కడ శివనాగిరెడ్డి ఉండి తీరాల్సిందే. హైదరాబాద్‌లో స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో మాలక్ష్మి సంస్థల అధినేత వై హరిశ్చంద్రప్రసాద్‌ ఆహ్వానంపై విజయవాడ మొఘల్రాజపురంలోని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌ అమరావతికి సిఇఓగా శివనాగిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ను స్థాపించి దేశ వారసత్వ సంపద రక్షణకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి ఎన్నో అవార్డులు, బిరుదులు పొందాడు.[2]

బౌద్ధ స్థలాల వెలికితీత

[మార్చు]

శ్రీకాకుళం జిల్లా దంతపురి, విశాఖ జిల్లా తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఇటీవలికాలంలో మోటుపల్లి, వట్లూరు, చందలూరు, మణికేశ్వరం, ఏటూరు తదితర ప్రాంతాలు బౌద్ధ క్షేత్రాలను మొదటిసారిగా కనుగొన్నారు. గుణదల, మొగల్రాజపురం ధనంకొండ, ముస్తాబాదు బౌద్ధ గుహల్ని వెలికితీశారు. అనంతపురం జిల్లా కదిరి దగ్గర శిలాయుగపు చిత్రకళా ప్రదేశాలను కనుగొన్నారు. త్రిపురాంతకం ఒకనాటి బౌద్ధక్షేత్రమని నిర్ధారించారు.

రచనలు

[మార్చు]
మహా మేఘవాహన కళింగ ఖారవేల,ఈమని శివనాగిరెడ్డి

చారిత్రక తవ్వకాలు, పరిశోధనలు, సదస్సులకే ఆయన కృషి పరిమితం కాలేదు. ఇప్పటివరకూ 110 పుస్తకాలు రాసి చారిత్రక వారసత్వంపై ప్రజల్లో చైతన్య తీసుకొస్తున్నారు.[4] కేవలం తెలుగులోనే కాదు, అంగ్లంలో కూడా 'ఎవల్యూషన్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ టెక్నాలజీ ఇన్‌ ఆంధ్రా, ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ టెంపుల్‌ ఆర్కిటెక్చర్‌, టెంపుల్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌...' తదితర ప్రామాణికమైన రీసెర్చ్‌ అండ్‌ రిఫరెన్స్‌ గ్రంథాలు రాశారు. బౌద్ధంపై పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు. పురావస్తు తవ్వకాలలో లభించిన శాసనాలను వర్గీకరించి, ఆయా కాలానుగుణంగా పుస్తకాలు రూపొందించిన శివనాగిరెడ్డి ప్రస్తుతం 'శాసనభారతి' అనే సమగ్ర సంపుటి నిర్మించారు. భారతి మాసపత్రికలలో ప్రచురించిన 155 శాసనాలను, వాటిపై వ్యాసాలను ఒకచోట చేర్చి, ఈ బృహత్సంపుటాన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు 'ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు, అశోకుని శాసనాలు' సంపుటాలు వచ్చాయి.[2]

పురస్కారాలు

[మార్చు]
  1. 2023: శిల్పకళ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - ప్రతిభా పురస్కారం (2021)[5]

మూలాలు

[మార్చు]
  1. "'పాలమూరు'కు 800 ఏళ్ల చరిత్ర". Sakshi. 2021-07-18. Archived from the original on 2021-07-17. Retrieved 2023-08-22.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 కొచ్చెర్లకోట, డాక్టర్ శ్రీలేఖ (2018-06-30). "వాస్తు శిల్ప వాచస్పతి". andhrabhoomi.net. Archived from the original on 2020-08-12. Retrieved 2023-08-22.
  3. "ఆయన లేడు... బుద్ధుడున్నాడు! - ఈమని శివనాగిరెడ్డి". www.andhrajyothy.com. 2017-04-08. Archived from the original on 2017-04-09. Retrieved 2023-08-22.
  4. "Books authored by Emani Sivanagi Reddy". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
  5. Velugu, V6 (2023-08-31). "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". V6 Velugu. Archived from the original on 2023-08-31. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లంకెలు

[మార్చు]