Jump to content

ఎరుకల సాధికారత పథకం

వికీపీడియా నుండి
ఎరుకల సాధికారత పథకం
పథకం రకంఎరుకల సాధికారత
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రారంభం2023, అక్టోబరు 5
మెదక్, తెలంగాణ
స్థితిప్రణాళికలోవున్నది

ఎరుకల సాధికారత పథకం (వైఈఎస్‌) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్టీల్లో మరింత వెనుకబడిన వర్గమైన ఎరుకల సామాజిక వర్గానికి సాధికారిత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రవేశపెట్టబడింది.[1]

రూపకల్పన

[మార్చు]

రాష్ట్రంలోని ఎస్టీ జనాభాలో 4.54 శాతం (1.44 లక్షలు)గా ఎరుకలు ఉన్నారు. రాష్ట్రంలో 5 వేలు అంతకంటే ఎకువ ఎరుకుల జనాభా రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌, సూర్యాపేట, హైదరాబాద్‌, మహబూబాబాద్‌, జనగామ, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి తదితర 13 జిల్లాల్లో ఉన్నారు. ఎరుకుల తెగ సంప్రదాయ వృత్తి పందుల పెంపకం, బుట్టలు అల్లడం, ఎరుక చెప్పడం, చీపుర్ల తయారీ జీవనోపాధిగా ఉన్నది.

స్థల పరిమితులు, శాస్త్రీయ పద్ధతులను సరిగా ఉపయోగించకపోవడం, మున్సిపాలిటీల్లో చట్టపరమైన అసమ్మతి కారణంగా పందుల పెంపకం అనేది సమస్యగా మారింది. దానికోసం పందుల పెంపకం, ప్రాసెసింగ్‌, అదనపు విలువ జోడింపు, మారెటింగ్‌ సమగ్ర అభివృద్ధి కోసం కొత్త పందుల పెంపకం విధానాన్ని అమలు చేయటానికి 2022లో పశుసంవర్ధకశాఖ, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్‌ (నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌) సంయుక్త ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ అధ్యయన నివేదిక ఆధారంగా ఈ పథకం రూపకల్పన జరిగింది.

ప్రారంభం

[మార్చు]

2023, అక్టోబరు 5న మెదక్‌ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ క్యాక్రమంలో ట్రైకా చైర్మన్‌ ఇస్లావత్ రామ్‌చందర్ నాయక్, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.[2]

పథకం వివరాలు

[మార్చు]

ఈ పథకానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. పథకానికి సంబంధించిన విధివిధానాలను 2023, అక్టోబరు 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.[3]

ఈ పథకం ద్వారా పందుల పెంపకం, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, ప్యాకేజింగ్‌, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఒక్కో యూనిట్‌కు 50 శాతం (గరిష్ఠంగా రూ.30 లక్షలు) రాయితీగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా 50 శాతం వ్యయంలో 40 శాతం బ్యాంకు రుణంగా, 10 శాతం లబ్ధిదారుడి వాటా ఉంటుంది.[4]

పందుల పెంపకం, కబేలాల ఏర్పాటు, మాంసం ప్రాసెసింగ్‌, మారెటింగ్‌, అదనపు విలువజోడింపు కోసం మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు 6,359 మంది ఎరుకల సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 137 ప్రాథమిక పందుల పెంపకం సంఘాలు ఏర్పాటుచేయబడింది.

అర్హతలు, ఎంపిక

[మార్చు]

స్వయం సహాయ సంఘాలు, ప్రాథమిక పందుల పెంపకం సంఘాలు ఈ పథకానికి అర్హులు. భూకొనుగోలు, అద్దె, లీజు, మూలధన వ్యయం, వ్యక్తిగత వాహనాలకు ప్రభుత్వ సబ్సీడీ వర్తించదు. సొసైటీ లేదా యూనిట్‌కు 2 ఎకరాల సొంతభూమి ఉండాలి. లీజు భూమి అయితే కనీసం 7 సంవత్సరాల లీజు ఒప్పందం ఉండాలి. పందుల పెంపకం యూనిట్‌ మానవ సమూహాలకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ప్రాథమిక పందుల పెంపకం సంఘం కార్యవర్గ తీర్మానం జతచేయాలి.

కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ (జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌/ పంచాయతీ అధికారి, జిల్లా పశుసంవర్దక, పరిశ్రమల శాఖ అధికారులు, లీడ్‌ బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ మేనేజర్లు) యూనిట్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "ఎరుకల సాధికారతకు 'ఎస్‌' పథకం". EENADU. 2023-10-08. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-31.
  2. "పనిచేసే వారికే పట్టం కట్టండి". Sakshi. 2023-10-06. Archived from the original on 2023-10-31. Retrieved 2023-10-31.
  3. telugu, NT News (2023-10-08). "YES Scheme | ఎరుకల సాధికారణతకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. విధివిధానాలు ఇవే!". www.ntnews.com. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-31.
  4. Chary, Maheshwaram Mahendra. "Telangana Govt : తెలంగాణలో మరో కొత్త పథకం... సబ్సిడీతో యూనిట్‌కు రూ. 30 లక్షలు, విధివిధానాలు ఇవే". Hindustantimes Telugu. Archived from the original on 2023-10-15. Retrieved 2023-10-31.
  5. "కేసీఆర్ సర్కార్ మరో సరికొత్త పథకం.. ఈసారి ఏకంగా రూ.30 లక్షలు..!". Samayam Telugu. Archived from the original on 2023-10-18. Retrieved 2023-10-31.