Jump to content

కాకసస్ పర్వతాలు

అక్షాంశ రేఖాంశాలు: 42°30′N 45°00′E / 42.5°N 45°E / 42.5; 45
వికీపీడియా నుండి
కాకసస్ పర్వతాలు
కాకసస్ పర్వతాల విహంగ దృశ్యం
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంఎల్బ్రస్ పర్వతం
ఎత్తు5,642 మీ. (18,510 అ.)[1]
నిర్దేశాంకాలు43°21′18″N 42°26′31″E / 43.35500°N 42.44194°E / 43.35500; 42.44194
కొలతలు
పొడవు1,200 కి.మీ. (750 మై.)
వెడల్పు160 కి.మీ. (99 మై.)
భౌగోళికం
టోపో మ్యాపు
దేశాలుArmenia, Azerbaijan, Georgia and Russia
ఖండంయూరేషియా
Range coordinates42°30′N 45°00′E / 42.5°N 45°E / 42.5; 45

కాకసస్ పర్వతాలు ఆసియా, ఐరోపా ఖండాల కూడలిలో ఉన్న పర్వత శ్రేణి. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న ఈ పర్వతాల చుట్టూ కాకసస్ ప్రాంతం విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి 5,642 మీటర్లు (18,510 అ.) ) ఎత్తుతో ఐరోపాలో ఎత్తైన శిఖరం అయిన ఎల్బ్రస్ పర్వతం ఈ శ్రేణి లోనే ఉంది. .

కాకసస్ పర్వతాలలో ఉత్తరాన గ్రేటర్ కాకసస్, దక్షిణాన లెస్సర్ కాకసస్ భాగం. గ్రేటర్ కాకసస్ నల్ల సముద్రపు ఈశాన్య ఒడ్డున, రష్యాలోని సోచి సమీపంలోని కాకేసియన్ నేచురల్ రిజర్వ్ నుండి కాస్పియన్ సముద్రంలోని బాకు, అజర్‌బైజాన్ వరకు పశ్చిమ-వాయువ్య నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా విస్తరించి ఉన్నాయి. లెస్సర్ కాకసస్ పర్వతాలు గ్రేటర్ శ్రేణికి సమాంతరంగా సుమారు 100 కి.మీ. (62 మై.) దక్షిణాన సమాంతరంగా ఉంటాయి. గ్రేటర్, లెస్సర్ కాకసస్ శ్రేణులను లిఖి శ్రేణి కలుపుతుంది. లిఖి శ్రేణికి పశ్చిమాన కొల్చిస్ మైదానం, తూర్పున కుర్-అరాజ్ లోలాండ్ లు ఉన్నాయి. లెస్సర్ కాకసస్ వ్యవస్థలో మెస్ఖెటి శ్రేణి ఒక భాగం. ఆగ్నేయంలో, గ్రేటర్ అజర్‌బైజాన్ ప్రాంతంలో ఉన్న తాలిష్ పర్వతాల నుండి లెస్సర్ కాకసస్‌ను వేరు చేస్తూ అరస్ నది ప్రవహిస్తోంది. లెస్సర్ కాకసస్, అర్మేనియన్ హైలాండ్ ట్రాన్స్‌కాకేసియన్ హైలాండ్‌ లో భాగం. ట్రాన్స్‌కాకేసియన్ హైలాండ్‌ వాటి పశ్చిమ చివరలో టర్కీకి ఈశాన్య తూర్పున తూర్పు అనటోలియా పీఠభూమితో కలుస్తుంది. కాకస పర్వతాలు సిల్క్ రోడ్డులో భాగం.

భూగర్భ శాస్త్ర విశేషాలు

[మార్చు]

భౌగోళికంగా, కాకసస్ పర్వతాలు ఆగ్నేయ ఐరోపా నుండి ఆసియా వరకు విస్తరించి ఉన్న ఆల్పైడ్ బెల్ట్ వ్యవస్థకు చెందినవి. ఈ శ్రేణిని రెండు ఖండాల మధ్య సరిహద్దుగా పరిగణిస్తారు. [2] గ్రేటర్ కాకసస్ పర్వతాలు ప్రధానంగా క్రెటేషియస్, జురాసిక్ శిలలతో పాటు ఎత్తైన ప్రాంతాలలో పాలిజోయిక్, ప్రీకాంబ్రియన్ శిలలతో కూడుకుని ఉంటాయి. కొన్ని అగ్నిపర్వత నిర్మాణాలు శ్రేణి అంతటా కనిపిస్తాయి. మరోవైపు, లెస్సర్ కాకసస్ పర్వతాలు ప్రధానంగా పాలియోజీన్ శిలలతోను, అతి కొద్ది భాగం జురాసిక్, క్రెటేషియస్ శిలల తోనూ ఏర్పడ్డాయి. కాకసస్ పర్వతాల ఉద్భవం, లేట్ ట్రయాసిక్ నుండి లేట్ జురాసిక్ వరకు టెథిస్ మహాసముద్రపు క్రియాశీలపు అంచు వద్ద సిమ్మెరియన్ ఒరోజెని సమయంలో ప్రారంభమైంది. అయితే గ్రేటర్ కాకసస్ పర్వతాలు పెరగడం మయోసీన్ కాలానికి చెందిన ఆల్పైన్ ఒరోజెనీ సమయంలో జరిగింది

ఉత్తరం వైపు కదులుతున్న అరేబియా ప్లేట్, యురేషియన్ ప్లేట్‌ తో ఢీకొనడంతో కాకసస్ పర్వతాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. టెథిస్ సముద్రం మూసుకుపోవడాం, అరేబియా ప్లేట్ ఇరానియన్ ప్లేట్‌తో ఢీకొనడం, యురేషియన్ ప్లేట్ సవ్యదిశలో ఇరానియన్ ప్లేట్ వైపు కదలడం, అంతిమంగా అవి ఢీకొనడం, వీటితో ఇరానియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌తో నొక్కుకుపోయింది. దీంతో, జురాసిక్ నుండి మియోసిన్ కాలం వరకు ఈ బేసిన్‌లో నిక్షిప్తమైన శిలలన్నీ గ్రేటర్ కాకసస్ పర్వతాలుగా ఏర్పడ్డాయి. ఈ ఘర్షణ లెస్సర్ కాకసస్ పర్వతాలు పైకి లెగవడానికి, సెనోజోయిక్ అగ్నిపర్వత కార్యకలాపాలకు కూడా కారణమైంది.

కాకసస్ పర్వతాల ఉపగ్రహ దృశ్యం

ఈ చర్యలతో మొత్తం ఈ ప్రాంతమంతా క్రమం తప్పకుండా బలమైన భూకంపాలకు గురవుతూ వచ్చింది. గ్రేటర్ కాకసస్ పర్వతాలకు ప్రధానంగా ముడుచుకున్న అవక్షేప నిర్మాణం ఉండగా, లెస్సర్ కాకసస్ పర్వతాలు ఎక్కువగా అగ్నిపర్వత మూలం కలిగి ఉన్నాయి.

జార్జియాలోని జావఖేటి అగ్నిపర్వత పీఠభూమి, మధ్య అర్మేనియా వరకు విస్తరించి ఉన్న చుట్టుపక్కల అగ్నిపర్వత శ్రేణులు ఈ ప్రాంతంలోని అంశాల్లో అతి చిన్న వయస్సు కలిగినవి. కాకసస్‌లో తీవ్రమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగింది ఇటీవలి కాలం లోనే: అర్మేనియన్ హైలాండ్ ప్లియోసీన్‌లోని కాల్క్-ఆల్కలీన్ బసాల్ట్‌లు ఆండెసైట్‌లతో నిండిపోయింది. కాకసస్ లోని ఎల్బ్రస్, కజ్బెక్ వంటి ఎత్తైన శిఖరాలు ప్లీస్టోసీన్ - ప్లియోసిన్ లలో అగ్నిపర్వతాలుగా ఏర్పడ్డాయి. కజ్బెక్ ఇప్పుడు చురుకుగా లేదు గానీ, ఎల్బ్రస్ మాత్రం హిమనదీయ అనంతర కాలంలో విస్ఫోటనం చెందింది. దాని శిఖరాగ్రానికి సమీపంలో ఫ్యూమరోల్ కార్యకలాపాలను గమనించారు. సమకాలీన భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతపు ప్రముఖ లక్షణం. ఇది యాక్టివ్ ఫాల్టింగ్, క్రస్టల్ షార్ట్నింగ్‌ను ప్రతిబింబిస్తుంది. డాగేస్తాన్, ఉత్తర ఆర్మేనియాలో భూకంప చర్యలు సంభవిస్తాయి. 1988 డిసెంబరులో ఆర్మేనియాలోని గ్యుమ్రీ - వనాడ్జోర్ ప్రాంతాన్ని నాశనం చేసిన స్పిటాక్ భూకంపంతో సహా అనేక వినాశకరమైన భూకంపాలు చారిత్రక కాలంలో జరిగాయి.

గుర్తించదగిన శిఖరాలు

[మార్చు]

కాకసస్ పర్వతాలలో 5,642 మీ. (18,510 అ.) ఎత్తున ఉన్న ఎల్బ్రస్ పర్వతాన్ని ఐరోపాలో కెల్లా ఎత్తైన శిఖరంగా పేర్కొంటారు. ఎల్బ్రస్ పర్వతం మోంట్ బ్లాంక్ కంటే 832 మీ. (2,730 అ.) ఎత్తు. 4,810 మీ. (15,780 అ.) ఎత్తు ఉండే మోంట్ బ్లాంక్, ఆల్ప్స్లో కెల్లా ఎత్తైన శిఖరం. అయితే, ఎల్బ్రస్ పర్వతం ఐరోపాలోనిదేనా అనే దానిపై కొన్ని సాంకేతిక విబేధాలు ఉన్నాయి.[3] గ్రేటర్ కాకసస్ పర్వతాల శిఖరం సాధారణంగా గ్రేటర్ కాకసస్ వాటర్‌షెడ్‌ను నిర్వచించడానికి తీసుకోబడుతుంది, ఇది నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ప్రాంతానికి ఆసియా, ఐరోపాల మధ్య ఖండాంతర సరిహద్దును సూచిస్తుంది. ఈ వర్గీకరణతో, ఎల్బ్రస్ పర్వతం ఆసియాతో కూడలి వద్ద ఉంటుంది. [2]

కాకసస్‌లోని కొన్ని ఎత్తైన శిఖరాలను దిగువ పట్టికలో చూడవచ్చు. ష్ఖారా మినహా, మిగతావాటి ఎత్తులు సోవియట్ 1:50,000 మ్యాపింగ్ నుండి తీసుకోబడ్డాయి. ఈ జాబితాలో పది అల్ట్రాలు (1,500 మీ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పర్వతాలు), 300 మీ. ప్రామినెన్స్ కలిగిన 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అన్ని పర్వతాలు ఉన్నాయి. టర్కీలోని అరారత్ పర్వతం (5,137 మీ) లెస్సర్ కాకసస్‌కు దక్షిణంగా ఉంది.

శిఖరం పేరు ఎత్తు (మీటర్లు) ప్రామినెన్స్ (మీటర్లు) దేశం
ఎల్బ్రస్
5,642
4,741  
రష్యా
డైఖ్-టౌ
5,205
2,002  
రష్యా
ష్ఖర
 5,193[a]
1,365  
జార్జియా / రష్యా
కోష్టన్-టౌ
5,152
822  
రష్యా
పుష్కిన్ శిఖరం
5,100
110  
రష్యా
జంగా
5,085
300  
జార్జియా / రష్యా
(ధంగి-టౌ)
5,047
10  
రష్యా
మిజిర్గి
5,034
2,353  
జార్జియా / రష్యా
కజ్బెక్
4,979
240  
జార్జియా / రష్యా
కాటిన్-టౌ
4,978
18  
రష్యా
కుకుర్ట్లు గోపురం
4,860
320  
జార్జియా / రష్యా
గిస్టోలా
4,860
సుమారు 50
జార్జియా / రష్యా
షోటా రుస్తావేలీ
4,858
672  
జార్జియా
టెట్నుల్డి
4,780
840  
జార్జియా / రష్యా
డిజిమారా
4,710
1,143  
జార్జియా
(జిమారి)
4,682
332  
రష్యా
ఉష్బ
4,649
1300  
రష్యా
దుమాల-టౌ
4,618
768  
జార్జియా / రష్యా
గోరా ఉయిల్పాట
4,547
1,067  
జార్జియా / రష్యా
టిఖ్టెంజెన్
4,540
380  
రష్యా
ఐలమ
4,533
926  
రష్యా
టియుటియున్-టౌ
4,508
621  
రష్యా
జైలిక్
4,499
2,145  
జార్జియా / రష్యా
సాలినాన్
4,466
2,454  
అజర్‌బైజాన్ / రష్యా
టెబులోస్మ్టా
4,451
1,775  
జార్జియా / రష్యా
మౌంట్ బజార్డుజు
4,431
1,144  
రష్యా
షాన్ పర్వతం
4,285
843  
జార్జియా / రష్యా
తెప్లి
4,243
1,102  
అజర్‌బైజాన్
డిక్లో
4,152
1,792  
రష్యా
షహదాగ్ పర్వతం
4,127
1,834  
రష్యా
గోరా అడ్డాల శుక్గెల్మెజర్
4,090
2,143  
ఆర్మేనియా
గోరా డ్యుల్ట్యాగ్
4,016
1,251  
రష్యా
అరగట్స్
దేవ్‌గే

శీతోష్ణస్థితి

[మార్చు]

కాకసస్ వాతావరణం నిలువుగాను (ఎత్తును బట్టి), అడ్డంగానూ (అక్షాంశం, స్థానం ద్వారా) మారుతూ ఉంటుంది. ఎత్తు పెరిగేకొద్దీ ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. సముద్ర మట్టం వద్ద సుఖుమి, అబ్ఖాజియాలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 15 °C (59 °F) ఉండగా, 3,700 మీటర్లు (12,100 అ.) ఎత్తున ఉన్న కజ్బెక్ పర్వతం వాలులపై సగటు వార్షిక ఉష్ణోగ్రత −6.1 °C (21.0 °F) కి పడిపోతుంది. గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణి ఉత్తర వాలుల్లో ఉష్ణోగ్రత 3 °C (5.4 °F) ఉండి, దక్షిణ వాలుల కంటే చల్లగా ఉంటుంది. ఆర్మేనియా, అజర్‌బైజాన్,జార్జియాల్లోని లెస్సర్ కాకసస్ పర్వతాల ఎత్తైన ప్రాంతాలు ఖండాంతర వాతావరణం కారణంగా వేసవి, శీతాకాల నెలల మధ్య ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన వ్యత్యాసాలుంటాయి.

కాకసస్ పర్వతాలు పెద్ద మొత్తంలో జరిగే హిమపాతానికి ప్రసిద్ధి చెందాయి. అయితే గాలి వాలుల వెంట లేని అనేక ప్రాంతాల్లో అంత మంచు కురవదు. నల్ల సముద్రం నుండి వచ్చే తేమ నుండి కొంత దూరంగా ఉన్నందున, గ్రేటర్ కాకసస్ పర్వతాల కంటే లెస్సర్ కాకసస్ పర్వతాలకు తక్కువ మంచు కురుస్తుంది. లెస్సర్ కాకసస్ పర్వతాల సగటు శీతాకాలపు మంచు 10 నుండి 30 cమీ. (3.94–11.81 అం.) నుండి ఉంటుంది. గ్రేటర్ కాకసస్ పర్వతాల్లో (ముఖ్యంగా నైరుతి వాలుల్లో) భారీగా మంచు కురుస్తుంది. నవంబరు నుండి ఏప్రిల్ వరకు హిమపాతాలు సాధారణం.

అనేక ప్రాంతాలలో (స్వనేటి, ఉత్తర అబ్ఖాజియా) మంచు కవచం 5 మీటర్లు (16 అ.) వరకు ఉంటుంది. మౌంట్ అచిష్‌ఖో ప్రాంతం, కాకసస్‌లో అత్యంత మంచుతో కూడిన ప్రదేశం. ఇక్కడ తరచుగా 7 మీ. (23 అ.) మందాన మంచు ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

సిల్క్ రోడ్డు ఉత్తర భాగంలో కాకసస్ పర్వత శ్రేణిని దాటడం ఒక ముఖ్యమైన భాగం. జార్జియాలోని తుషెటి గొర్రెల కాపరులు 10,000 సంవత్సరాలకు పైగా కాలానుగుణంగా మేత కోసం గొర్రెలను మైదానాలకు తోలుకెళ్తూ ఉన్నారు. ఈ పద్ధతిని ట్రాన్స్‌హ్యూమెన్స్ [4] అని పిలుస్తారు. డెర్బెంట్‌లో ఆగ్నేయ చివరలో ఒక కనుమ దారి ఉంది దీన్ని కాస్పియన్ గేట్స్ లేదా గేట్స్ ఆఫ్ అలెగ్జాండర్ అని పిలుస్తారు. ఇదేకాక, శ్రేణి అంతటా అనేక కనుమ దారులున్నాయి: 2379 మీ ఎత్తు వద్ద జ్వారి పాస్, దానికి పైన్ జార్జియన్ మిలిటరీ రోడ్‌లో డారియల్ గార్జ్, 2911 మీ ఎత్తు వద్ద ఒస్సేటియన్ మిలిటరీ రోడ్‌లో మామిసన్ పాస్, 2310 మీ. ఎత్తు వద్ద రోకీ టన్నెల్ ఉన్నాయి.

గమనికలు

[మార్చు]
  1. The elevation and coordinates given here are taken from a DGPS survey by Peter Schoen and Boris Avdeev, in association with "GeoAT".. It was carried out in July 2010 and "made available". November 2010. in November 2010.
    Some sources, including the Great Soviet Encyclopedia, give the estimation of only 5,068 metres (16,627 feet), but this is the correct height of the lower western summit. Soviet era 1:50,000 mapping shows a 5,158 metre spot height to the east, and this can be verified using a "panoramic photograph". taken from Elbrus. The true [maximum] elevation is on higher ground, still further east along the Shkhara ridge.

మూలాలు

[మార్చు]
  1. మూస:Cite opentopomap
  2. 2.0 2.1 National Geographic Maps (Firm) (2011), Atlas of the world, Washington, D.C.: National Geographic Society, ISBN 978-1-4262-0632-0, OCLC 671359683, retrieved 2021-01-09
  3. "Mt. Elbrus". NASA Earth Observatory. NASA. 7 July 2003. Archived from the original on 15 December 2018. Retrieved 16 February 2015.
  4. Durn, Sarah (2023-03-02). "The Stark Beauty of Tushetian Shepherds' Journey Across Georgia's Caucasus Mountains". Atlas Obscura (in ఇంగ్లీష్). Retrieved 2023-03-08.