కె. పెంటారెడ్డి
కె. పెంటారెడ్డి | |
---|---|
జననం | కేరెల్లి, ధరూర్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ |
నివాసం | హైదరాబాదు |
జాతీయత | భారతీయుడు |
రంగములు | హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ |
చదువుకున్న సంస్థలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాదు) |
కె. పెంటారెడ్డి తెలంగాణకు చెందిన హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజినీర్. ఎలిమినేటి మాధవరెడ్డి, ఆలీసాగర్, గుత్ప, కాళేశ్వరం, దేవాదుల, సంగమేశ్వర, బసవేశ్వర, భక్తరామదాసు, తుమ్మిళ్ల, సీతారామ, గూడెం, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి, మంథని, ఎల్లంపల్లి, ఎసారెస్పీ పునరుజ్జీవన పథకం, చనాక- కొరాట, పాలమూరు వంటి అనేక ఎత్తిపోతల ప్రాజెక్టులలో పంపులు అమర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తన 45 ఏళ్ళ వృత్తి జీవితంలో పాలమూరు ప్రాజెక్టులోని 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను ప్రారంభించడంతోపాటు[1] 251 భారీ పంపులను విజయవంతంగా అమర్చి ‘లిఫ్ట్’ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరొందాడు.[2] 2018లో రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారుడిగా నియమించబడ్డాడు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]పెంటారెడ్డి తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలంలోని కేరెల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడ. ఐదుగురు అన్నదమ్ముల్లో ఇతను మూడోవాడు. వికారాబాద్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. హైదరాబాద్ సిటీ సైన్స్ కళాశాలలో పీయూసీ చదివాడు. 1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ నుంచి బీఎస్సీ (ఎస్‌పీఎల్) పూర్తిచేశాడు. ఉస్మానియా ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ గ్రూప్‌లో డిగ్రీ కోర్సులో చేరి 1970లో పూర్తిచేశాడు. 1969 తెలంగాణ ఆందోళనల కారణంగా ఒక సంవత్సరం చదువును కోల్పోయాడు.[2]
వృత్తి జీవితం
[మార్చు]డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్‌ఈబీ)లో జేఈగా ఉద్యోగంలో చేరాడు. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం విజయవంతమయ్యాక వివక్షకు గురయ్యాడు. అయినా తెలంగాణకు ప్రాజెక్టులు రావాలనే ఆశయంతో పనిచేశాడు. 2002లో విరమణ పొందిన అనంతరం రెండు సంవత్సరాల సర్వీస్‌ను పొడిగించారు. 2004 తరువాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లందరితో కలిసి ‘బై ది తెలంగాణ.. ఆఫ్ ది తెలంగాణ’ అనే కాన్సెప్ట్‌తో ఈఎంసీ కన్సల్టెన్సీలో ఏర్పాటు చేసి సేవలు అందించాడు. అక్కడ కూడా వివక్ష ఎదుర్కొన్నాడు.[2]
నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రంలో 108 మెగావాట్ల రేటింగ్ కలిగిన 7, శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో 150 మెగావాట్ల రేటింగ్ కలిగిన 6 రివర్సెబుల్ టర్బైన్స్‌ను ఏర్పాటు చేయడంలో పనిచేశాడు. దానికిముందు బీహెచ్‌ఈఎల్ నుంచి ఇద్దరు, విద్యుత్తు బోర్డు నుంచి ఇద్దరు ఇంజినీర్లతో కలిసి జపాన్‌కు వెళ్ళి హిటాచి కంపెనీలో శిక్షణ పొందాడు. ఆ శిక్షణలో భారీ పంపులు, మోటార్ల డిజైన్, తయారీ, వాటి అనుబంధ సాంకేతిక అంశాలను నేర్చుకున్నాడు. ఆ అనుభవంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, లోయర్ సీలేరు జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో సేవలు అందించాడు.[2]
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లలో పనిచేశాడు. విద్యుత్తు ఉత్పాదక స్టేషన్లు, పంపింగ్ స్టేషన్లలో సుమారు 35 సంవత్సరాలపాటు పనిచేశాడు. అందులో 25 సంవత్సరాలపాటు ఔట్‌డోర్‌లోనే పనిచేశాడు. ఫారం ఫార్ములేషన్, డిజైన్, మెటీరియల్ సేకరణ, ఎరక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ కార్యకలాపాలు, 250 కేవీ చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ల నుంచి 2023లో పాలమూరు పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 145 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను విజయవంతంగా ప్రారంభించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Bureau, The Hindu (2023-09-03). "Dry run of first PRLIS pump taken up successfully". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-09-04. Retrieved 2023-11-21.
- ↑ 2.0 2.1 2.2 2.3 telugu, NT News (2023-09-23). "Penta Reddy | కేసీఆర్‌తోనే 'పాలమూరు'కు జీవం: 'లిఫ్ట్' మ్యాన్ ఆఫ్ తెలంగాణ పెంటారెడ్డి". www.ntnews.com. Archived from the original on 2023-09-23. Retrieved 2023-11-21.
- ↑ dishadaily (2020-05-26). "ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి పదవీకాలం పొడిగింపు". www.dishadaily.com. Archived from the original on 2020-06-09. Retrieved 2023-11-21.
- ↑ telugu, NT News (2023-09-03). "Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం.. నేడే పాలమూరు డ్రైరన్". www.ntnews.com. Archived from the original on 2023-09-03. Retrieved 2023-11-21.