Jump to content

కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
కొల్లూరు సత్యనారాయణశాస్త్రి

కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి (కె.ఎస్.శాస్త్రి) భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు. ఆయన "విశాఖ గాంధీ"గా సుపరిచితుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం లో 1922 నవంబరు న జన్మించాడు. పాఠశాల విద్యను రాజమండ్రిలోనూ, కళాశాల విద్యను విజయనగరం లోనూ పూర్తిచేసాడు. ఆయన తండ్రి బ్రహ్మాజీ రామశర్మ దేశభక్తుల కుటుంబానికి చెందినవాడు. బాల్యంలో శాస్త్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల ప్రభావానికి లోనయ్యాడు. బాల్యం నుండే స్వాతంత్ర్యోద్యమాలలో పాల్గొన్నాడు. ఆయన పోరాటంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఉద్యమాలలో బులుసు సాంబమూర్తి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, దువ్వూరి సుబ్బమ్మ వంటి వారితో కలసి పనిచేసాడు.

ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో చేసిన పోరాటానికి గానూ ఆలీపూర్ కాంప్ వద్ద నాలుగు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత జైలు నుండి విడుదలై 1944 జనవరిలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించాడు. దాని ఫలితంగా వారి గృహంపై పోలీసు రైడింగ్ జరిగి ఆ యూనియన్ నిషేధించబడింది. 1944 ఏప్రిల్ లో ఆయన స్టేట్ స్టూడెంట్స్ కాంగ్రెస్ ను స్థాపించాడు. ఆయన మహాత్మా గాంధీ కంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నే ఎక్కువగా అందరి యువకుల వలెనే యిష్టపడేవాడు. కాలానుగుణంగా ఆయన మహాత్మాగాంధీ అహింసా పోరాటానికి దగ్గరయ్యాడు. పట్టుదల కలిగిన కాంగ్రెస్ సభ్యుల ప్రభావంతో ఆయన మాక్క్సిజం పై దృష్టి సారించాడు. కాంగ్రెస్ లో సోషలిస్టుగా మారాడు. స్వాతంత్ర్యం తరువాత ఆయన జయప్రకాష్ నారాయణ యొక్క సోషలిస్టు ఉద్యమాలకు ప్రభావితుడైనాడు.[2]

సామ్యవాదిగా ఆయన ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఆయన ఆల్ ఇండియా NMDC వర్కర్స్ ఫెడరేషన్ కు 14 సంవత్సరాల పాటు జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. బొబ్బిలి సీతానగరం సుగర్ ఫాక్టరీ ఉదంతం మూలంగా ఆయన గ్రామీణ ప్రజానీకానికి దగ్గరయ్యాడు. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలోని నిజాం సుగర్స్ చే చడుపబడుతూ ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి వ్యతిరేకంగా 14 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు.

ఆయన 1985 లో గాంధీ సెంటర్ స్థాపించడంతో గుర్తింపు పొందాడు. ఈ సంస్థ పేదరిక నిర్మూలన, గ్రామ స్వరాజ్యం, మతసమరస్యం పై వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించేది.

ఈ సంస్థ ద్వారకా నగర్ లోని బాపూ భవన్ లో గాంధీజీ జీవితం, తత్వం పై అనేక పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని కూడా నిర్వహించింది.

గాంధీ, నెహ్రూ, సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. వారితో కలిసి పనిచేశారు. ముఖ్యంగా శాస్త్రిపై గాంధీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఏం సాధించాలన్నా గాంధేయ మార్గమే శరణ్యమని ఆయన గట్టిగా నమ్మేవారు. జీవితాంతం అదే మార్గాన్ని ఆయన అనుసరించారు. అదే మార్గంలో వెళ్లాలని అందరికీ చెప్పేవారు. ఆయన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్యకు స్వయానా బావమరిది. విశాఖనగరంలో గాంధీ సెంటర్‌ వ్యవస్ధాపక కార్యదర్శిగా 40 ఏళ్లుగా ఉన్నారు. వివిధ ట్రేడ్‌ యూనియన్లకు నాయకుడిగా వ్యవహరించారు.[1]

అస్తమయం

[మార్చు]

ఆయన డిసెంబరు 13 2016 న తన 95వ యేట మరణించారు. ఆయనకు భార్య రమణమ్మ, కొడుకు వెంకటరమణ, కోడలు ప్రభ, మనవరాలు శ్రావ్య ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "విశాఖ గాంధీ ఇకలేరు 14-12-2016 19:19:47". Archived from the original on 2016-12-16. Retrieved 2017-03-20.
  2. Gandhism - cure for economy's ills Monday, Aug 04, 2003, The HIndu

ఇతర లింకులు

[మార్చు]