కోడూరి అచ్చయ్య చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోడురి అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు.

కోడూరి అచ్చయ్య

వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుండేవారు. ముదినేపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు.ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ క్లబ్బును స్థాపించి దాని ఆధ్వర్యాన మూడేండ్లపాటు చెడుగుడు, బ్యాడ్‌మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే గ్రామ రాజకీయాలతో విసుగు చెంది ఆయన ఆ రంగం నుండి తప్పుకుని తన దృష్టిని నాటకరంగంవైపు మళ్ళించారు[1].

నాటకరంగం[మార్చు]

1939 ప్రాంతాలలో ఎక్సెల్షియర్ నాట్యమండలిని స్థాపించి తెలుగుతల్లి, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం అనే సాంఘిక నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించి ఊరూరా ప్రదర్శింపచేశారు. అనేక షీల్డులు, ప్రశంసలు పొందారు. నిజానికి ఈయన బాల్యం నుండే నటునిగా పేరు పొందారు. తమ తొమ్మిదేళ్ల వయసులో వడాలి అగ్రహారం జగన్నాథస్వామి కళ్యాణోత్సవాలలో పెంజెండ్ర నాటక సమాజం వారు ప్రదర్శించిన కుశ లవ నాటకంలో రిహార్సల్ లేకనే లవుని పాత్రను అభినయించి సాటి నటబృందాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. నాటక రచనలోని ప్రత్యక్షరం పూర్వాపరార్థాలు తెలుసుకుని పాత్ర స్వభావాన్ని అవగాహన చేసుకుని నాటకీయతలో పాత్రను సజీవంగా నిలపడం ఈయన ప్రత్యేకత. తాను స్థాపించిన ఎక్సెల్షియర్ నాట్యమండలిలో స్త్రీ పాత్రలు ధరించే అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి వెళ్ళిపోవడంతో స్త్రీపాత్రలకు స్త్రీలను పెట్టుకుని నాటకాలాడడంలో వున్న సాధక బాధకాలను తట్టుకోలేమని భావించి ఆ నాట్యమండలినే రద్దు చేశారు. ఈయన కృష్ణాజిల్లా ప్రజా నాట్య మండలికి దర్శకుని బాధ్యతను నిర్వహించి మొదట సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత గుడివాడలో రావూరి రచించిన పరితాపం నాటకాన్ని తయారుచేసి ఆంధ్ర నాటక పరిషత్తులో ప్రదర్శించారు. ఈ సమయంలోనే మెరికల వంటి ఉత్తమ నటీనటులను ఈయన తీర్చిదిద్దారు. పెదపాలపర్రులో నవభారత నాట్యమండలి, గుడివాడలో శ్యామల నాట్యమండలులను వీరు స్థాపించారు. ఈ మండలులద్వారా అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించడమే కాక, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి "ఖూనీ" నాటకాన్ని రంగస్థలిపై ప్రదర్శించి రక్తి కట్టించిన ఖ్యాతి దక్కించుకున్నారు. వీరు పిల్లల కోసం కొన్ని నాటికలు, పెత్తందారు, ధర్మచక్రం, విజయభేరి మొదలైన నాటకాలను స్వయంగా రచించారు.

సినిమా రంగం[మార్చు]

వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, వయ్యారి భామ, లక్ష్మి, పరివర్తన, పిచ్చిపుల్లయ్య, బాల సన్యాసమ్మ కథ మొదలైన సినిమాలలో విభిన్నమైన పలు పాత్రలు ధరించారు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అన్ని అవకాశాలు వుండి కూడా, మిత్రులు బలవంతపెట్టినా ఆ రంగాన్ని విడిచిపెట్టి తిరిగి గుడివాడ వెళ్ళి అనేక నాటక సమాజాలకు దర్శకత్వం వహించారు.

మూలాలు[మార్చు]

  1. అడ్సుమిల్లి (11 December 1966). "నాటక కళా తపస్వి: శ్రీ కోడూరి అచ్చయ్య". ఆంధ్రజ్యోతి దినపత్రిక. No. 160. కె.ఎల్.ఎన్.ప్రసాద్. Retrieved 24 October 2017.[permanent dead link]