Jump to content

కోలాచలం శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
(కోలాచలము శ్రీనివాసరావు నుండి దారిమార్పు చెందింది)
కోలాచలం శ్రీనివాసరావు
జననంమార్చి 13, 1854
కామలాపురం, బళ్లారి జిల్లా
మరణంజూన్ 20, 1919
వృత్తిన్యాయవాది, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రామరాజుచరిత్రము నాటకం
జీవిత భాగస్వామిలక్ష్మమ్మ
భాగస్వామిలక్ష్మమ్మ
పిల్లలుశత్రుఘ్నరావు, శ్రీరామరావు,జయరత్నం,ప్రతాపరావు(కుమారులు) సునందనమ్మ(కూతురు)
తల్లిదండ్రులు
  • సేతుపతిశాస్త్రి (తండ్రి)
  • అచ్చమ్మ (తల్లి)

కోలాచలం శ్రీనివాసరావు (మార్చి 13, 1854 - జూన్ 20, 1919) బళ్ళారికి చెందిన నాటక రచయిత, న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన రచన.

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

శ్రీనివాసరావు మల్లినాథ సూరి వంశీయుడు. ఇతడి పూర్వీకులు విజయనగర సంస్థాన పండితులు. నాటక సాహిత్యాన్ని స్వాధ్యయనం చేశాడు. జ్యోతిష్యము తెలుసుకున్నాడు. వీరు మార్చి 13, 1854 సంవత్సరంలో బళ్ళారి జిల్లాలోని హంపి వద్ద కామలాపురం గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే తెలుగు, కన్నడ, సంస్కృత, ఆంగ్ల భాషలలో పట్టు సాధించాడు. 1876లో ఎఫ్.ఏ పరీక్ష రాసి నెగ్గాడు. తరువాత కొన్ని సంవత్సరాలు అనంతపురం జిల్లా గుత్తిలో రెవెన్యూ ఇన్స్పెక్టరుగా పనిచేశాడు. 1881లో అనంతపుర మండలం డిప్యూటికలెక్టరు దగ్గర దివానుగా ఉద్యోగం చేశాడు. 1888లో జాతీయోద్యమ పిలుపునందుకొని ముందు చేస్తున్న ఉద్యోగం మానేసి రెండవతరగతి ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణుడై బళ్ళారిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.[1] అప్పటినుండి వారి సాహితీ వ్యాసంగం ఊపందుకుంది. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రముఖులు. బళ్లారిలో సుమనోరమసభ అనే నాటకసమాజాన్ని స్ధాపించాడు.

1917లో కడపలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్ సభకు శ్రీనివాసరావు అధ్యక్షత వహించాడు. మండపాక పార్వతీశ్వరశాస్త్రి లాంటి వారు ఆయన కవిత్వాన్ని ప్రశంసించారు.

శైలి

[మార్చు]

ఈయన వ్యవహారిక భాషోద్యమానికి వ్యతిరేకుడు. నాటకములను విషాదాంతం చేయడం ఇష్టం ఉండేది కాదు. చారిత్రక రచనలు, సంఘానికి సంబంధించిన రచనలు సమాజానికి అత్యావశ్యకములని ఆయన భావన.

తెలుగుకు ఆయనిచ్చిన సందేశ సారాంశం

భాషను జెఱచుట తప్పు. అశ్లీలములుంట తప్పు. దుర్నీతికర ములుగ నుంట తప్పు. బండుబూతుమాటల నీతి జెప్పుట తప్పు. పేరు పెట్టి దూషించి యెత్తి వేయుట తప్పు. గ్రంథమునందు ఇత్యాదులు తప్పులగును కాని మిగతావి తప్పులుగావు. విషయవైశద్యము కొంతవఱకు నుండినజాలు. లోహములన్నియు స్వర్ణమయములు కాకపోయినను బనికిమాలినవి యెవ్వియుగావు. పూర్వకాలమునుండియు బుద్ధకుశలులని పేరొందిన పండితుల గ్రంథముల చదివి తమ బుద్ధిబలిమిని వానికిచేర్చి ఇప్పటివారు వ్రాయు గ్రంథములు చెడెనని చెప్పుట యసమంజసంబు.

ఆయన రచించిన ప్రతాపాక్బరీయం నుంచి ఒక పద్యం

మూరెడు మీసముల్బెనిచి ముప్పిరిగా బలుమారుదువ్వుచున్
నీరుపుమీఱ దుస్తులను నీటుగగట్టుచు వాలు బట్టుచున్
ధీరులమంచు నోటికసిదీఱగ బ్రల్లదమాడునట్టి యీ
భీరుల బోలకీవి రణభీకరవైతివి తక్కెగీర్తియున్

రచనలు

[మార్చు]

ఆయన రాసిన రామరాజుచరిత్ర చారిత్రక రచన. తళ్ళికోట యుద్ధంలో కీర్తిశేషుడైన రామరాజు కథ ఇందులో వర్ణించబడుతుంది. అలాగే మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము కూడా చారిత్రక రచనలే. ఆయన భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల నాటకాల చరిత్రలను పరిశోధించి ప్రపంచ నాటక చరిత్ర (ది డ్రమాటిక్ హిస్టరీ ఆఫ్ ది వల్డ్) అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశారు. తెలుగులో వీరు సునందినీ పరిణయము, సుఖమంజరీ పరిణయము మొదలైన నాటకాలు రాశాడు. తెలుగులో మొదటి చారిత్రక నాటకం రాసింది కూడా ఆయనే. భగవద్గీత 18 అధ్యాయాలు సవిమర్శగా పఠించి ప్రతి అధ్యాయాన్ని వచనంగా ప్రకటించారు.

  • సునందినీపరిణయము
  • మదాలసాపరిణయము
  • శ్రీరామజననము
  • పాదుకాపట్టాభిషేకము
  • లంకాదహనము
  • ద్రౌపదీవస్త్రాపహరణము
  • కీచకవధ
  • బభ్రువాహన
  • హరిశ్చంద్ర
  • రుక్మాంగద
  • చంద్రహాస
  • శిలాదిత్య
  • ప్రతాపాగ్బరీయము
  • కాళిదాసు
  • ప్రహ్లాద
  • రామరాజుచరిత్ర
  • మైసూరు రాజ్యము
  • చాందుబీబీ
  • కుశలవ
  • హాస్యమంజూష
  • బాలభారత శతకము
  • ఆంధ్రీకృతాగస్త్య బాలభారతము
  • సీమంతిని
  • సుఖమంజరీ పరిణయము
  • యువతీ వివాహం
  • మానవ పిశాచం
  • రాక్షసీమహత్వాకాంక్షి
  • మానావమాన
  • అన్యాయ ధర్మపురి మహిమ
  • నాచిపార్టి
  • ఆచారమ్మ కథే (కన్నడ)
  • సమయమునకు భార్య
  • మైసూరు రాజ్యం
  • చంద్రగిర్యభ్యుదయము
  • సీతాకళ్యాణం
  • భారతధర్మయుద్ధం
  • శిరోమణి
  • గిరికాకళ్యాణం
  • వేదము చరిత్రయా?[2] (1928)

బిరుదము

[మార్చు]

ఆంధ్రచరిత్రనాటకపితామహుడు

మరణం

[మార్చు]

వీరు 23 జూన్, 1919 సంవత్సరంలో పరమపదించాడు.

మూలాలు

[మార్చు]