గడపరాకు
Jump to navigation
Jump to search
గడపరాకు యొక్క వృక్ష శాస్త్రీయ నామం Aristolochia bracteolata. గడపరాకును గాడిదగడప అని కూడా అంటారు. ఇది దాదాపు ఒక మీటరు వరకు పెరిగే, నేలపై పాకే బహువార్షిక మొక్క. ముఖ్యంగా రేగడి భూములలో, పొలం గట్ల మీద విస్తారంగా కనిపిస్తుంది. ఆకులు కొంచెం వెడల్పుగా హృదయాకారంగా ఉండి బూడిదవర్ణం కలిసిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చెట్టంతా మదపు వాసన కలిగి కాడ గట్టిగా ఉంటుంది. పుష్పాలు కోలగా ముదురు ఊదా రంగులోను, కాయలు తిరగబడిన గొడుగు ఆకారంలోను ఉంటాయి. ఈ మూలిక చేదు రుచి కల్గి వెగటుగా ఉంటుంది. దీని అన్ని భాగాలు ఔషధ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
ఔషధగుణాలు
[మార్చు]- ఇది విరేచనకారి. వాతాన్ని హరిస్తుంది. పచ్చి ఆకును మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి లేపనం చేస్తే గజ్జి, దురద లాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.
- దీని ఆకు పసరుగాని, ఆకుల్ని మెత్తగా నూరిన ముద్దనుగాని పుండ్లు, గాయాలపై వేసి కట్టుకడితే వాటిలోని పురుగులు, క్రిములు నశించి, దుర్వాసన తగ్గి, అవి త్వరగా మానిపోతాయి.
- గాడిదగడపాకు ఉప్పు కలిపి ఒక కుండలో వేసి పైన మూకుడు బోర్లించి పొయ్యి పై పెట్టి ఉప్పు బాగా చిటపటమనే వరకు ఉంచి దించి చల్లార్చాక మొత్తం మెత్తగా నూరి అరస్పూను ప్రమాణం వేడి నీటిలో కలిపి తీసుకుంటే బహిష్టు నొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి.
- పది గాడిదగడపాకులు, ఇరవై మిరియాలు కలిపి మెత్తగా నూరి సెనగగింజ ప్రరిమాణం మాత్రలు చేసి ఉదయం, సాయంత్రం ఒక్కోమాత్ర చొప్పున తీసుకుంటే ఉదరంలోని క్రిములు, నులిపురుగులు, ఏలికపాములు మొదలగునవి విరేచనంలో పడిపోతాయి.
- మూడు నాలుగు గాడిదగడపాకుల్ని నూరి ఉండలా చేసి గంజి లేదా బియ్యం కడుగునీళ్లతో సేవిస్తే స్త్రీలకు రుతుదోషాలు తొలగి బహిష్టు సక్రమంగా అవుతుంది.
- ఈ మొక్క వేర్లు ఎండించి, పొడి చేసి 1 నుంచి 3 గ్రాముల వరకు బియ్యం కడుగునీళ్ళు లేదా గంజి అనుపానంతో సేవించినా రుతుదోషాలు పోతాయి. అయితే పొడి తయారు చేశాక రెండు నెలలకిమించితే అంత గుణవంతం కాజాలదు.
- గర్భిణులకు ప్రసవ సమయంలో ఒక తులం ఆకురసంలో ఒక తులం ఆముదం కలిపి తాగిస్తే సుఖప్రసవమవుతుంది.
- పసిపిల్లలు అజీర్ణంతో బాధపడుతున్నప్పుడు ఆకులకు ఆముదం పూసి వెచ్చజేసి బొడ్డుకు కట్టాలి. దీనివల్ల కడుపులోని క్రిములు పోవటమేకాక మలబద్ధం తగ్గుతుంది. గాడిదగడప, కానుగ, మోదుగ, ఊదుగ, వేప, సరస్వతి ఆకు, పిప్పి ఆకు, ఫిరంగి చెక్క మొదలగు ఔషధాలు నువ్వులనూనెలో కలిపి తయారు చేసిన మేఘనాధ తైలం అనే ఔషధం శరీరంలోని అత్యుష్ణాన్ని తొలగించటంతో పాటు చర్మవ్యాధులు, కీళ్ళ జబ్బులు, తెల్ల బట్ట వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది.
- గాడిదగడపాకును తమలపాకులో పెట్టి తినిపిస్తే గర్భస్రావమవుతుందని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం.
- పాము విషానికి ప్రథమ చికిత్సగా దీని ఆకుల్ని నూరిన ముద్ద పది గ్రాములు లోనికిచ్చి ఆ ముద్దను పాము కాటుపై కడితే విషం హరిస్తుంది.
- వాము, ఇంగువ, వస, వెల్లుల్లి, వాయుమిరియాలు, పిప్పళ్లు, మోడి చూర్ణాలలో తగినంత గాడిదగడపాకును వేసి మర్దించి రేగుగింజంత మాత్రలు చేసి నీడన ఆరబెట్టి ఉంచుకొని రెండు మూడు రోజులకోసారి రెండు నుంచి నాల్గు మాత్రలవరకు కొద్దిగా ఆముదం కలిపి రంగరించి పశువులకు తాపితే పశువుల్లో అజీర్ణం, కడుపుబ్బరం, మలబద్ధం తగ్గి జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా హుషారుగా ఉంటాయి.
- గాడిదగడపాకు రసాన్ని దూడలకు తగిస్తే, వాటి కడుపులోని పురుగులు బయటికి వచ్చేస్తాయి.
- గడపరాకు రసంతో మర్దించి తయారు చేసిన కాసీస భస్మాన్ని ఉసిరిక రసం అనుపానంతో అనేక రకాలైన ఉబ్బురోగాల్లోను, పాండు రోగాల్లోను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.